Skip to main content

తెలంగాణ కవులు - సాహిత్యం

తెలంగాణ ప్రాంతానికి చెందిన పాల్కురికి సోమన తెలుగు సాహిత్యంలో ఆదికవి. ఈయనరాసిన ‘బసవపురాణం’ తొలి సాంఘిక కావ్యం. తెలుగులో తొలి ద్విపద కావ్యం కూడా ఇదే. ఇది ఏడు అశ్వాసాల ద్విపదం. సి.పి. బ్రౌన్ ప్రకారం ఇందులో 6288 ద్విపదలు ఉన్నాయి. పాల్కురికి తన రచనల్లో నాటి తెలంగాణా సాంఘిక జీవితాన్ని, శూద్రకులాలకు చెందిన వారి ఆచార వ్యవహారాలను కళ్లకు కట్టినట్లు చిత్రీకరించాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ కంటే ముందే ఈయన తన సాహిత్యంలో దళితుల గురించి వివరించాడు.
శాతవాహన పూర్వ యుగం
పాతరాతి యుగం నుంచి తెలంగాణ ప్రాంతం నివాసయోగ్యంగా ఉండి క్రమంగా ఇక్కడ గ్రామాలు, పట్టణాలు, జనపదాలు ఏర్పడ్డాయి. క్రీ.పూ. 6వ శతాబ్దంలో భారతదేశంలో 16 మహాజనపదాలు ఉండేవి. అవి:
1) కాశీ - వారణాసి
2) అంగ - చెంప (బెంగాల్)
3) మగధ - పాటలీపుత్రం (బిహార్)
4) అవంతి - ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
5) ఛేది - శుక్తిమతి
6) వత్స - కౌశాంబి
7) పాంచాల - అహిచ్చిత్ర
8) శూరసేన - మధుర
9) మత్స్య - విరాటనగరం
10) అస్మక - పోతన(నేటి బోధన్)
11) గాంధార - తక్షశిల
12) కాంభోజ - రాజపురం
13) కోసల - శ్రావస్తి
14) మల్ల - పావాపురి
15) వజ్జి - వైశాలి
16) కురు - ఇంద్రప్రస్త (ఢిల్లీ).
వీటిలో అస్మక (పాళీ భాషలో అశ్మక, అస్సక, అసక అనే పేర్లతో పిలిచేవారు) జనపదం గోదావరి, మంజీరా తీరాల వెంట కొంత మహారాష్ట్ర, కొంత తెలంగాణాలో ఉండేది. ఈ జనపదంలో, ముళక జనపదంలోని నేటి కొన్ని తెలంగాణా ప్రాంతాల్లో, కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో దొరికిన నాణేల ఆధారంగా శాతవాహనుల కంటే ముందే ఇక్కడ రాజ్యం ఏర్పడిందని తెలుస్తోంది.

మరిన్ని ఆధారాలు:
 1. అశోకుడి 13వ శిలాశాసనంలో తెలంగాణ ప్రాంతంలోని అటవీ జాతుల గురించి వివరించారు.
 2. సంగం (ప్రాచీన తమిళ కవుల సభ) సాహిత్యంలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజల ఆహార, సామాజిక విషయాల గురించి ప్రస్తావించారు. శాతవాహనులు మొదట తమ రాజ్యాన్ని తెలంగాణ (కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలు)లో స్థాపించారు.
శాతవాహన యుగానికి చెందిన కవులు - గ్రంథాలు:
గుణాడ్యుడు: ఇతడు పైశాచీ ప్రాకృత భాషలో ‘బృహత్‌కథ’ రచించాడు. పైశాచీ అంటే వాడుక భాష. ఇతడు తెలంగాణ వాడుక భాషలో ఈ గ్రంథాన్ని రచించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. పైశాచీ భాషపై ప్రాకృతం, ప్రాకృతంపై సంస్కృతం ఆధిపత్యం చూపాయి. ప్రాచీన తెలుగు భాషనే దేశీ భాష అని డాక్టర్ దినేశ్ చంద్ర సర్కార్ అనే పండితుడి అభిప్రాయం.
గుణాడ్యుడిని తెలంగాణ మొదటి లిఖిత కవిగా పేర్కొంటారు. ఇతడు ‘బృహత్‌కథ’ గ్రంథాన్ని మెదక్ జిల్లాలోని కొండాపురంలో రచించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. బృహత్‌కథను మూలకథగా తీసుకొని క్షేమేంద్రుడు ‘బృహత్‌కథామంజరి’, సోమదేవసూరి ‘కథా సరిత్సాగరం’ రచించారు.
హాలుడు: శాతవాహన వంశానికి చెందిన 17వ రాజైన హాలుడు స్వయంగా కవి. ఇతడు ‘గాథా సప్తశతి’ గ్రంథాన్ని ప్రాకృత భాషలో రాశాడు. ఇందులో సుమారు 700 గ్రామీణ శృంగార కథలను సంకలనం చేశాడు. ఈ గ్రంథాన్ని శివస్తుతితో ప్రారంభించాడు. తెలంగాణలోని 350 కవుల గురించి కూడా వివరించాడు. తెలంగాణ శాసనాల్లో లభించిన తొలి కంద పద్యాలకు, గాథాసప్తశతిలోని పద్యాల చంధస్సుకు దగ్గరి పోలికలు ఉన్నాయి.

ఇక్ష్వాకులు (క్రీ.శ. 225-300)
శాతవాహన సామంత రాజుల్లో ఇక్ష్వాకులు ఒకరు. ఇక్ష్వాక వంశానికి చెందిన వాసిష్టిపుత్ర శాంతామూలుడు మరికొంత మంది సామంతరాజులతో కలిసి శాతవాహన చివరి రాజైన మూడో పులోమావిని ఓడించి స్వతంత్ర రాజ్య స్థాపన చేశాడు. ఈ రాజ్యాన్ని విజయపురి (నాగార్జునసాగర్)లో స్థాపించాడు. వీరి రాజ్యభాగాల విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లాలు వీరి పాలనా కేంద్రాలని డాక్టర్ కృష్ణారావు పేర్కొన్నారు.

ఇక్ష్వాకుల ప్రాధాన్యం
 • అశోకుడి 13వ శిలాశాసనంలో తెలంగాణ ప్రాంతంలోని అటవీ జాతుల గురించి వివరించారు.
 • సంగం (ప్రాచీన తమిళ కవుల సభ) సాహిత్యంలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజల ఆహార, సామాజిక విషయాల గురించి ప్రస్తావించారు. శాతవాహనులు మొదట తమ రాజ్యాన్ని తెలంగాణ (కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలు)లో స్థాపించారు.
వాకాటకులు (క్రీ.శ. 250-550)
వాకాటకుల తొలి రాజ్యం బీరార్ (విదర్భ). వీరు ఉత్తర తెలంగాణ జిల్లాలను పాలించారు. ఈ రాజ్యస్థాపకుడు వింధ్యశక్తి. వాకాటక పాలకులు పండిత పోషకులే కాకుండా స్వయంగా గొప్ప కవులు. గుప్తుల్లో ఏకైక రాణి ప్రభావతి గుప్త (రెండో చంద్రగుప్తుడి కుమార్తె) ఈ ప్రాంతాన్ని పాలించారు.
కాళిదాసు: ఇతడు నవరత్నాల్లో ఒకడు. కాళిదాసు మొదట వాకాటక రాజ్యంలో నివసించాడు. ఇతడు మేఘదూతం (మేఘ సందేశం) నాటకాన్ని వాకాటక రాజ్యంలో రాంటెక్ (కరీంనగర్ జిల్లా రామగిరి)లో రచించాడు.
రెండో ప్రవరసేనుడు: ఇతడు ‘సేతుబంధం’ (సంస్కృతం) రచించాడు. ఇది శ్రీరాముడు లంకానగరంపై చేసిన దాడిని ఇతివృత్తంగా చేసుకొని రచించిన గ్రంథం. గాథాసప్తశతిలో ఉన్న అనేక గాథల్ని ఇందులో రచించాడు.
వాకాటకుల అజంతా, ఎల్లోరా గుహాల్లో 16వ, 17వ నంబరు విహార గుహలను, 19వ నంబరు చైత్య గుహను నిర్మించారు. వీరి రాజధాని వత్సగుల్మ గొప్ప సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లింది.

విష్ణుకుండినులు (358-575)
ఈ రాజ్యస్థాపకుడు ఇంద్రవర్మ. ఏలేశ్వరం, మిర్యాలగూడ, నల్లగొండ, భువనగిరి, కీసర, ఇంద్రపాలనగరం ప్రాంతాలను ఆక్రమించి ఇంద్రపాలనగరం రాజధానిగా క్రీ.శ. 358లో రాజ్యం స్థాపించాడు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోని రామన్నపేట సమీపంలో ఉన్న తుమ్మలగూడెమే నాటి ఇంద్రపాలనగరం.
మాదవ వర్మ: ‘జనాశ్రయ చంధో విచ్ఛిత్తి’ గ్రంథం రచించాడు. ఇందులో ద్విపద, త్రిపద పద్యాలతో పాటు వివిధ జాతుల పద్యాలు ఉన్నాయి.

బాదామి చాళుక్యులు (546-755)
జయసింహవల్లభుడు:
ఇతడు బాదామి లేదా వాతాపి చాళుక్య వంశ స్థాపకుడు. చాళుక్యులు కృష్ణా - తుంగభద్ర నదుల అంతర్వేదికి చెందినవారని భావిస్తున్నారు. వీరు మొదట ఇక్ష్వాకుల వద్ద అధికారులుగా, సామంతులుగా ఉన్నారు. తర్వాత వాకాటక రాజ్యంలో ఉండి, ఆ రాజ్యం విష్ణుకుండినుల రాజ్యంలో విలీనమైన తర్వాత విష్ణుకుండినులకు సామంతులుగా వ్యవహరించారు. అనంతరం పశ్చిమ దిశలో బాదామి వైపు పయనించి అక్కడ స్వంతంత్ర రాజ్యం స్థాపించారు.
భవభూతి: ఇతడు ‘మాలతీమాధవం’ అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. భవభూతి నాడు తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధ కవి. ఇతడు కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో నివసించాడు. ఇతడు కాళప్రియనాథుడి భక్తుడు. కృష్ణయజుర్వేద తైత్తరీయశాఖకు చెందినవాడు. ఇతడి కీర్తి ప్రతిష్టలను విని యశోవర్మ తన ఆస్థానకవిగా నియమించుకున్నాడు. కాళిదాసు, భారవి లాంటి మహాకవులకు సమానంగా ప్రశంసలు పొందిన గొప్ప వ్యక్తి. ఇతడు ఉత్తర రామ చరిత, మహావీర చరిత్ర అనే నాటకాలు కూడా రచించాడు.

రాష్ట్రకూటులు
ఈ రాజ్యస్థాపకుడు దంతిదుర్గుడు. వీరు బాదామి చాళుక్యులకు సామంతులుగా ఉండి ఆ తర్వాత స్వతంత్య్ర రాజ్య స్థాపన చేశారు. తెలంగాణ ప్రాంతం కూడా రాష్ట్రకూటుల పాలనలోకి వచ్చింది. వీరి రాజధాని మాన్యఖేటం. ఈ వంశంలో చివరి రాజైన రెండో కర్కరాజు (1972-73)ను కల్యాణి చాళుక్య రాజైన రెండో తైలపుడు ఓడించడంతో రాష్ట్రకూట రాజ్యం అంతమైంది.
రాష్ట్రకూటుల సాహిత్యం: అమోఘవర్షుడు కన్నడ భాషలో ‘కవిరాజ మార్గం’ గ్రంథాన్ని రచించాడు. ఇతడు ‘రత్నమాలిక’ అనే చంధోవిచ్ఛిత్తి గ్రంథాన్ని కూడా రచించాడు.

ముదిగొండ చాళుక్యులు
మూడో కుసుమాయుధుడు:
ఇతడికి ‘వినేత జనాశ్రయుడు’ అనే బిరుదు ఉంది. కొరివి శాసనం నిర్మాత ఇతడే. ఇది తెలుగులో తొలి గద్య శాసనం. ఇందులో వచన రచన మృదుమధురంగా ఉంది.

వేములవాడ చాళుక్యులు
మొదటి హరికేసరి
: ఇతడు వేములవాడ శాసనం నిర్మాత. రాష్ట్రకూట రాజైన ధ్రువుడికి సామంతుడు.
రెండో హరికేసరి: ఇతడు కన్నడ భాషను పోషించిన వేములవాడ చాళుక్యరాజు. ఇతడి ఆస్థానంలో పంప మహాకవి ఉన్నాడు. పంపకవి ‘విక్రమార్జున విజయం’ రచించాడు. ఇతడు ఆదిపురాణం, తెలుగులో జినేంద్రపురాణం కూడా రచించాడు. రెండో హరికేసరి ఇతడికి ‘ధర్మపురం’ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చి సత్కరించాడు.
సోమదేవసూరి: ఇతడు ‘కథా సరిత్సాగరం’ గ్రంథం రచించాడు. ఇతడు మూడో హరికేసరి ఆస్థానంలో ఉన్నాడు. సోమదేవసూరికి ‘శద్వాదచల సింహ’ అనే బిరుదు ఉంది. ఇతడు మూడు తరాల జైనగురువుగా ఉన్నాడు. ఇతడు ‘యశస్తిలక చంపువు’ అనే సంస్కృత కథా కావ్యం రచించాడు.
బద్దెన: ‘నీతిశాస్త్ర ముక్తావళి’ గ్రంథకర్త.
రేచన: ‘కవిజనాశ్రయం’ గ్రంథ రచయిత.

కల్యాణి చాళుక్యులు
నల్లగొండ జిల్లాలోని కొలనుపాక వీరి సైనిక కేంద్రం. వీరు వీరశైవాన్ని ఆదరించారు. వీరి కాలంలో సంస్కృతం స్థానంలో దేశభాషలు క్రమంగా గౌరవం, రాజాదరణ పొందాయి.

కందూరి చోళులు
వీరి కాలంలో తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేది. వీరి శాసనాలు తెలుగు, కన్నడ లిపుల్లో ఉన్నాయి. వీరు గొప్ప కవి పోషకులు.
ఒకటో గోకర్ణుడు: ‘గోకర్ణ చంధస్సు’ అనే లక్షణ గ్రంథం రచించాడు.
ఉదయాదిత్యుడు: ‘ఉదయాదిత్యాలంకారం’ అనే లక్షణ గ్రంథం రచించాడు.
విరియాల కామసాని: గూడూరి శాసనం వేయించారు. నన్నయకు ముందే వృత్త పద్యాలు వాడిన తొలి శాసనం ఇదే.
నరహరి: ప్రసిద్ధ లాక్షణికుడు మమ్మటుడు రచించిన కావ్య ప్రణాళికకు ఇతడు ‘బాల చిత్తానురంజన’ పేరుతో వ్యాఖ్యానం చేశాడు. ‘స్మృతి దర్పణం’, ‘తర్కరత్నం’ ఇతడి రచనలు.

కాకతీయులు
కాకతీయులు రాష్ట్రకూట వంశానికి చెందినవారు. వీరు మొదట తూర్పు చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. తెలంగాణా ప్రాంతానికి వచ్చి స్వతంత్ర రాజ్య స్థాపన చేశారు. ఆ తర్వాత యావదాంధ్రకు విస్తరించారు.
రెండో ప్రోలరాజు: మాటేడు శాసనం రచించాడు. కాకతీయుల మొదటి తెలుగు గద్య, పద్యాత్మక శాసనం ఇదే.
రుద్రదేవుడు లేదా ప్రతాపరుద్రుడు: ఇతడు తెలుగులో ‘నీతిసారం’ గ్రంథాన్ని రచించాడు. మానవల్లి రామకృష్ణ సంస్కృతంలో ‘నీతిసారం’ రచించాడు. ఇందులోని 111 పద్యాలను మడికి సింగన ‘సకల నీతి సమ్మతం’లో ఉదహరించాడు.
అచింతేంద్రయతి: వేయి స్తంభాల గుడిలోని శాసనం (హన్మకొండ శాసనం) నిర్మాత ఇతడే. 1163లో ప్రతాపరుద్రుడు హన్మకొండలో వేయి స్తంభాల గుడి నిర్మించి, రుద్రేశ్వరాలయంగా పిలిచాడు. ఇందులో త్రికూఠశైలి ప్రవేశపెట్టాడు. ఈ గుడి 2013లో 850 ఏళ్లు పూర్తి చేసుకుంది.
పాల్కురికి సోమనాథుడు (1160-1240): ఈయన ‘పండితారాధ్య చరిత్ర’ రచించాడు. ఏ సంస్కృత పురాణంలో లేని స్వతంత్ర ఇతి వృత్తాన్ని తీసుకొని, పూర్తిగా దేశీయమైన భాషను ఉపయోగించాడు.
 
పాల్కురికి రాసిన గ్రంథాలు:
1) అనుభవసారం
2) చతుర్వేద సార సూక్తులు
3) సోమనాథభాష్యం
4) రుద్రభాష్యం
5) బసవరగడ
6) గంగోత్పత్తి రగడ
7) శ్రీ బసవాద్య రగడ
8) సద్గురు రగడ
9) చెన్నమల్లు సీసములు
10) మల్లమదేవి పురాణం (అలభ్యం)
11) శీల సంపాదన (కన్నడ)
12) బసవపురాణం
13) బెజ్జమహాదేవికథ

జాయపసేనాని (1199-1259):
ఇతడు నృత్త రత్నావళి, గీత రత్నావళి, నాట్య రత్నావళి గ్రంథాలను సంస్కృతంలో రచించాడు. పాకాల చెరువు శాసనం, కలువ కొలను శాసనం రచించాడే. నృత్యానికి సంబంధించిన లక్షణ గ్రంథం రాసిన తెలుగువారిలో మొదటివాడు ఇతడే. కవి పోషకుడైన కాకతి గణపతిదేవుడికి ఇతడు బావమరిది. జాయపసేనాని గజ సైన్యాధ్యక్షుడిగా కూడా పని చేశాడు. గణపతి దేవుడు ఇతడి సోదరిని వివాహం చేసుకొని చిన్నతనంలోనే ఇతడిని తీసుకెళ్లి గుండమాత్యుని దగ్గర చేర్పించాడు. గుండమాత్యుడు ఇతడిని గొప్ప సాహిత్య, సంగీత విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. జాయపసేనాని.. భరతుడి నాట్య శాస్త్రం మొదలుకొని తన కాలం దాకా వచ్చిన అనేక నాట్య, నృత్య, శాస్త్ర గ్రంథాలను కూలంకషంగా పరిశీలించి స్వతంత్ర ప్రతిపత్తితో ప్రామాణిక గ్రంథాన్ని రచించాడు. ఇతడు తన గ్రంథాల్లో పేరిణి నాట్యం గురించి కూడా వివరించాడు. ఇతడు ‘కవి చక్రవర్తి’గా ప్రసిద్ధి చెందాడు.

కాకతీయుల కాలం
విశ్వేశ్వర దేశికుడు (1200-1290): ఈయన్ని శివదేవుడు అని కూడా అంటారు. ఇతడు ‘శివతత్వ రసాయనం’ రచించాడు. శివదేవుడు కేరళ ప్రాంతానికి చెందిన కీర్తి శంభుని శిష్యుడు. ఇతడు తెలంగాణకు వచ్చి స్థిర పడ్డాడు. ఇక్కడ అనేక మఠాలు (కాళేశ్వరం, ఏలేశ్వరం), దేవాలయాలు (మంథెన, వెల్లాల, గోళగి) నిర్మించాడు. ఇతడు కాకతీయ గణపతి దేవుడి దీక్షా గురువు. ఇతడు రుద్రమదేవి పాలనను, ప్రతాపరుద్రుడి యువరాజత్వాన్ని ప్రశంసించాడు. గణపతి దేవుడి నుంచి ‘మందిరం’, రుద్రమదేవి నుంచి ‘వెలగపూడి’ అనే గ్రామాలను పొందాడు. ఈ రెండింటినీ కలిపి ‘గోళగి’ అనే అగ్రహారంగా మార్చాడు. అక్కడ శివాలయం, ప్రసూతి వైద్యశాల నిర్మించాడు.
గోన బుద్ధారెడ్డి (1210-1240): రంగనాథ రామాయణం రాశాడు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులో.. ఇంద్రుడు కోడై కూయడం, లక్ష్మణుడు ఏడుగీతలు గీయడం, ఊర్మిళ నిద్ర, లక్ష్మణ దేవుడి నవ్వు లాంటి కథలు కూడా రాశాడు. దీన్ని ద్విపద కావ్యంలో రచించాడు.
శివదేవయ్య: ‘పురుషార్థసారం’ గ్రంథాన్ని రచించాడు. ఇతడు గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి వద్ద మంత్రిగా పనిచేసి మన్ననలు పొందాడు. సంస్కృతాంధ్ర కవితా పితామహుడిగా కీర్తి పొందాడు.
ఈశ్వర భట్టోపాధ్యాయుడు (1262): ఇతడు మయూరసూరి పుత్రుడు. తన తల్లి పేరుతో, భార్య పేరుతో బూదపురంలో రెండు చెరువులు తవ్వించాడు. అక్కడ దేవాలయాలు నిర్మించాడు. ఇతడు బూదపుర శాసనాన్ని నిర్మించాడు. ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది.
కుప్పాంబిక (1230-1300): ఈమె తొలి తెలుగు/ తెలంగాణ కవయిత్రి. మొల్ల కంటే ముందే అనేక కవిత్వాలు రచించారు.
చక్రపాణి రంగనాథుడు: శివభక్తి దీపిక, గిరిజాది నాయక శతకం, చంద్రాభరణ శతకం, శ్రీగిరినాథ విక్రయం, వీరభద్ర విజయం (సంస్కృతం) రచించాడు. (‘వీరభద్ర విజయం’ తెలుగులో పోతన రాశాడు)
కపర్డి: అపస్తంభ శ్రౌత సూత్ర భాష్యం, భరద్వాజ గృహ్యాసూత్ర భాష్యం, అపస్తంభ గృహ్యాపరిశిష్ట భాష్యం, శ్రౌత కల్పకావృత్తి, దివ్య పూర్ణభాష్యం ఇతడి ప్రసిద్ధ గ్రంథాలు. ఇతడు ప్రఖ్యాత వ్యాఖ్యాత మల్లినాథసూరి తండ్రి. మెదక్ జిల్లా కొలిచెలిమివాసి. ఇతడు గొప్ప భాష్యకారుడు.
గంగాధర కవి: మహాభారతాన్ని నాటక రూపంలో రచించాడు.
అప్పయార్యుడు: జినేంద్రకల్యాణాభ్యుదయం రాశాడు.
మంచన: కేయూర బాహు చరిత్ర రాశాడు.
శేషాద్రి రమణ: ఇతడు సంస్కృతంలో యయాతి చరిత్ర, ఉషా రాగోదయం (నాటకం) రచించాడు. యయాతి చరిత్రను తెలుగులో పొన్నెగంటి తెనగానచార్యుడు గోల్కొండ రాజు ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో రాశాడు.
మారన (1289-1323): ఇతడు తెలుగులో తొలి పురాణమైన ‘మార్కండేయ పురాణం’ తెలుగులో తొలి వ్యాకరణ గ్రంథమైన ‘ఆంధ్రభాషాభూషణం’ రాశాడు.
కేతన: ఇతడు ‘విజ్ఞానేశ్వరీయం’ రాశాడు. ఇది తెలుగులో తొలి శిక్షాస్మృతి. ఇది యజ్ఞవల్కుడి స్మృతికి అనువాదం.
విద్యానాథుడు (1289-1323): ప్రతాపరుద్ర యశోభూషణం, ప్రతాపరుద్ర కల్యాణం గ్రంథాలను రాశాడు. వీటిలో ప్రతాపరుద్రుడి యశోగానం కనిపిస్తుంది.
కుమారస్వామి: ‘సోమిపథి రత్నాపణ’ గ్రంథాన్ని రాశాడు.
చిలకమర్రి తిరుమలాచార్యులు: ‘రత్నశాణ’ రచించాడు. భట్టుమూర్తి ‘నరసభూపాతియం’ దీని అనువాదమే.
అగస్త్యుడు (1289-1323): బాల భారతం, కృష్ణచరిత్ర (గద్య కావ్యం), నలకీర్తి కౌముది (పద్య కావ్యం), మణిపరీక్ష (లక్ష్మీ స్తోత్రం), లలిత సహస్రనామం, శివ సంహిత, శివస్తవం తదితర 74 గ్రంథాలు రచించాడు.
గంగాదేవి అగస్త్యుడి శిష్యురాలు. ఈమె విజయనగర రాజైన కుమార కంపరాయలను వివాహం చేసుకుంది. ‘మధుర విజయం’ గ్రంథంలో భర్త ఘన విజయాలను వివరించింది.
తిక్కన: ఈయన భారతాన్ని తెలుగులోకి అనువదించారు.
 • ‘నన్నయ’ రాజరాజనరేంద్రుడి, ‘తిక్కన’ గణపతిదేవుడి, ‘ఎర్రన’ ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురిని ‘కవిత్రయం’గా పేర్కొంటారు.
 • మల్లికార్జునుడు, హుళక్కి భాస్కరుడు, రుద్రదేవుడు.. ఈ ముగ్గురు కలిసి ‘భాస్కర రామాయణం’ రచించారు.

రేచర్ల పద్మనాయకులు
విద్యారణ్య స్వామి:
ఈయన శృంగేరి పీఠాధిపతి. ‘సంగీతసారం’ గ్రంథాన్ని రచించారు. విద్యారణ్య స్వామి మహామేధావి, కవి, తాత్వికుడు. హరిహర రాయలు, బుక్కరాయలకు విజయనగర రాజ్యాన్ని స్థాపించడానికి ప్రేరణ ఇచ్చారు. విద్యారణ్యుడు ఏకశిలానగరవాసి అని 21వ శృంగేరి పిఠాధిపతి సచ్చిదానంద భారతి ఆస్థాన విద్వాంసుడైన కాశీ లక్ష్మణ శాస్త్రి ‘గురువంశ కావ్యం’లో పేర్కొన్నాడు.
సాయనుడు: ఇతడు చతుర్వేదాలకు భాష్యం రాశాడు. పురుషార్థ సుధానిధి, ఆయుర్వేద సుధానిధి, యజ్ఞతంత్ర సుధానిధి తదితర రచనలు చేశాడు.
పద్మనాయక భూపాలుడు: ఇతడు సారంగధర చరిత్ర రాశాడు. ఇతడికి ‘సర్వజ్ఞ’ అనే బిరుదు ఉంది.
విశ్వేశ్వరుడు: చమత్కార చంద్రిక, వీరభద్ర విజృంభణ గ్రంథాలను రాశాడు.
కవిభల్లటుడు: గుణమంజరి, పదమంజరి, శూద్రక రాజచరిత్రం, బేతాళ పంచవింశతి ఇతడి ప్రసిద్ధ రచనలు.
మడికి సింగన: సకలనీతి సమ్మతం, పద్మపురోణోత్తర ఖండం, భాగవత దశమ స్కంధం (ద్విపదం), జ్ఞాన వాశిష్ట రామాయణం మొదలైనవి రచించాడు.
సర్వజ్ఞ సింగభూపాలుడు: రసావర్ణ సుధాకరం, సంగీత సుధాకరం, కందర్ప సంభవం, కువలయావళి (రత్నపాంచాలిక) లాంటి రచనలు చేశాడు. ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీత నాట్య మర్మజ్ఞుడు. కవి, నాటకకారుడు. ఇతడు అనేక మంది కవి, పండితులను పోషించాడు. సారంగదేవుడు రచించిన ‘సంగీత రత్నాకరం’ గ్రంథానికి ‘సంగీత సుధాకరం’ పేరుతో వ్యాఖ్యానం చేశాడు. రసావర్ణ సుధాకరం అనేది అలంకార శాస్త్రం.
గౌరన: నవనాథ చరిత్ర (దీన్నే శ్రీగిరి పండితుడు చంపువుగా రాశాడు), లక్ష్మణ దీపిక, హరిశ్చంద్రోపాఖ్యానం లాంటి అనేక గ్రంథాలు రచించాడు. ఇతడికి ‘సరస సాహిత్య లక్షణ చక్రవర్తి’, ‘ప్రతివాద మదగజ వంచాననుడు’ అనే బిరుదులు ఉన్నాయి. మార్కండేయ, స్కంధ పురాణాల్లో ఉన్న హరిశ్చంద్ర మహారాజు కథే హరిశ్చంద్రోపాఖ్యానం మూలకథ. శ్రీగిరి పండితుడు రెడ్డిరాజుల కాలంలో నవనాథ చరిత్రను చంపువుగా రాశాడు.
బమ్మెర పోతన: పోతన ‘వీరభద్ర విజయం’, ‘భోగినీ దండకం’, ‘మహాభాగవతం’ (తెలుగులో) రచించాడు. ఈయన కొంతకాలం మూడో సింగభూపాలుని ఆస్థానంలో ఉన్నారు. పోతన భాగవతంలో పేర్కొన్న ఏకశిలానగరం నేటి ఓరుగల్లే (వరంగల్). పోతన జన్మస్థలమైన బమ్మెర ఈ జిల్లాలోనే ఉంది. అంతకుముందు ఇది నల్లగొండ జిల్లాలోని గ్రామం. వీరభద్ర విజయంలోని మూలకథ.. శివుడిని ఆహ్వానించకుండా దక్షుడు యజ్ఞం నిర్వహించడం, శివుడి కోప సంకల్పంతో పుట్టిన వీరభద్రుడు దాన్ని ధ్వంసం చేయడం, దక్షుడి శిరస్సు ఖండించడం. భోగినీ దండకంలో నాటి పాలకుల భోగ లాలసత్వాన్ని వర్ణించారు. పోతన భాగవతం తెలుగులో భక్తికి మారుపేరుగా నిలిచింది. ఇందులో ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, వామనావతార ఘట్టం, శ్రీకృష్ణ చరిత్ర మొదలైనవాటిని పోతన రమ్యంగా వర్ణించారు.
కొరవి గోపరాజు: ‘సింహాసన ద్వాత్రింశిక’ రచించాడు. ఇది కథాకావ్యం. ఈ గ్రంథానికి మూలం విక్రమార్క చరిత్ర అనే సంస్కృత కావ్యం. పాల్కురికి తర్వాత తెలంగాణ సాంఘిక జీవితాన్ని విస్తృతంగా వర్ణించిన కావ్యం ఇదే.

కుతుబ్‌షాహీల యుగం (1518-1687)
సుల్తాన్ కులీ
: ఇతడికి బడే మాలిక్ (దొడ్డ ప్రభువు) అనే బిరుదు ఉంది.
జంషీద్: కూచిపూడి భాగవతులకు ‘కూచిపూడి’ గ్రామాన్ని దానం చేశాడు.
ఇబ్రహీం కుతుబ్‌షా: ఇతడిని మల్కిభరాముడిగా పేర్కొన్నారు. ఇతడి ఆస్థానంలో అనేకమంది కవులు ఉండేవారు. వీరిలో ముఖ్యమైనవారు..
అద్దంకి గంగాధరుడు: ఇతడు 1565లో తపతీ సుందరోపాఖ్యానం (తపతీ సంవరణోపాఖ్యానం) రచించి ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితం చేశాడు. ‘వసుచరిత్ర’ను దీని ఆధారంగానే రాశారు (1570). అద్దంకి గంగాధరుడు రామరాజ భూషణుడితో పోల్చదగిన ప్రతిభావంతుడైన కవి.
కందుకూరి రుద్రకవి: సుగ్రీవ విజయం (తొలి యక్షగానం), నిరంకుశోపాఖ్యానం, జనార్దనాష్టకస్తోత్రం, గువ్వల చెన్నని శతకం మొదలైనవాటిని రచించాడు. అగ్రశ్రేణి కవుల్లో ఒకరైన రుద్రకవి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ సమీపంలో ఉన్న కందుకూరు గ్రామ నివాసి. నిరంకుశోపాఖ్యానం శృంగార ప్రధానమైన సాంఘిక కావ్యం.
పొన్నెగంటి తెలగన: ఇతడు ‘యయాతి చరిత్ర’ రాశాడు. ఇది అచ్చ తెలుగులో రచించిన తొలి గ్రంథం.
మహమ్మద్ కులీకుతుబ్‌షా: ఇతడు తన ప్రేయసి భాగమతి పేరుపై భాగ్యనగరం నిర్మించాడు. బాగ్ అంటే ‘ఉద్యానం’ అని అర్థం. చార్మినార్ (1591), హైదరాబాద్ (1593)ను కూడా ఇతడే నిర్మించాడు. ఇతడు మీర్జా మహమ్మద్ అమిన్, వజిహీ, గవాసీ తదితర ప్రముఖ కవులను ఆదరించాడు. మహమ్మద్ కులీకుతుబ్‌షా ఉర్దూ కవితల సంకలనాన్ని దివాన్ పేరుతో అతడి అల్లుడు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా వెలువరించాడు.
సారంగు తమ్మయ్య: హరిభక్తి సుదోదయం, వైజయంతీ విలాసం రచించాడు. సారంగు తమ్మయ్య కుతుబ్‌షాకు ఆప్తుడిగా వ్యవహరిస్తూనే.. కలంపట్టి కమనీయమైన కావ్యరచనలు చేశాడు. వైజయంతీ విలాసం గ్రంథం తెలుగు శృంగార కావ్యాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. నాటి పాలకుల భోగలాలసతను మరో కోణం నుంచి చిత్రించిన కావ్యం ఇది.
నేబతి కృష్ణమంత్రి: ‘రాజనీతి రత్నాకరం’ అనే గ్రంథం రాశాడు.
ఎల్లారెడ్డి: బాలభారతం (ఆగస్త్యుడి రచనకు అనువాదం), కిరాతార్జునీయం (భారవి రచనకు అనువాదం) రాశాడు.
మల్లారెడ్డి: షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తరం, పద్మపురాణం తదితర రచనలు చేశాడు.
అబ్దుల్లా కుతుబ్‌షా: సంస్కృత ‘శుకసప్తతి’ని ‘యతినామా’ పేరుతో పర్షియన్ భాషలోకి అనువాదం చేశాడు. ఇతడి పాలనా కాలం ఉర్దూ భాషకు స్వర్ణయుగంగా ఉంది. ఇతడు కవి, పండిత పోషకుడే కాకుండా స్వయంగా గొప్ప కవి. అబ్దుల్లా పేరుతో కవితలు రాశాడు. ఇతడి ఆస్థానంలో అనేక మంది పండితులు ఉండేవారు. వారిలో ప్రధాన కవులు-వారి రచనలు..
 • గవాసి ఇబిన్ నిషాత్ - తోతినామా.
 • తబియా - బహురావగుల్.
 • తులసీమూర్తి - సంగీత విద్వాంసుడు.
 • క్షేత్రయ్య - రాజుపై 12 వేల కృతులు రాశారు.
 • మరింగంటి వేంకట నరసింహాచార్యులు - హరివాసర మాహాత్మ్యం.
 • చరిగొండ నరసింహ - శశిబిందు చరిత్ర.
 • రాజలింగ కవి - కూర్మపురాణం.
 • కోన నారాయణ - వజ్రాభ్యుదయం.
 • పిల్లలమర్రి వేంకటపతి - రాజేశ్వర విలాసం.
 • గోపతి లింగ కవి - చెన్నబసవ పురాణం.
సురభి మాధవరాయలు: చంద్రికా పరిణయం అనే ప్రౌఢ కావ్యాన్ని శ్లేష అనుప్రాసాది శబ్ద చిత్ర నిపుణత్వంతో రచించాడు.
ఎలకూచి బాలసరస్వతి: సుభాషిత రత్నావళి, మాధవ రాఘవ పాండవీయం రాశాడు. ఇతడు భర్తృహరి సంస్కృతంలో రాసిన శృంగార, నీతి, వైరాగ్య శతకాలను సుభాషిత రత్నావళి పేరుతో అనువాదం చేసి మాధవ రాయల తండ్రి మల్లభూపాలుడికి అంకితం చేశాడు.
అప్పకవి: సాధ్వీజన ధర్మం (ద్విపద కావ్యం), అనంతవ్రతకల్పం (కావ్యం), అంబికావాదం (యక్షగానం), కవి కల్పకం (లక్షణ గ్రంథం) రాశాడు.
పోనుగోటి జగన్నాథాచార్యులు: కుముదవల్లి విలాసం (ఇది భక్తరామదాసు జీవితానికి దగ్గరగా ఉండటం గమనార్హం)
కంచర్ల గోపన్న: దాశరథీ శతకం రాశారు. ఈయనను భక్తరామదాసుగా పేర్కొంటారు. ఈయన అక్కన్న, మాదన్న మేనల్లుడు. 1650లో భద్రాచలం తహశీల్దార్‌గా నియమితులయ్యారు.
భద్రాచలంలో రామాలయం నిర్మించారు. అబుల్‌హసన్ తానీషా ఈయనను గోల్కొండలో బంధించాడు. గోపన్న భక్తికి మెచ్చి చివరకు విడుదల చేశారు.
పెన్గలూరి వెంకటాద్రి: భువన మోహిని విలాసం రాశారు.
విశ్వనాదయ్య: సిద్ధేశ్వర పురాణం (ద్విపదం) రచించారు.
అన్నంభట్టు: తర్క సంగ్రహం రాశారు.
కృష్ణమాచార్యులు: భగవద్గీత (ద్విపద) రాశారు.
Published date : 23 Nov 2015 12:22PM

Photo Stories