Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌కు ఉన్న అధికారాలు - విధులు ఇవే..
రాజీనామా: పార్లమెంటు సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని సంబంధిత సభాధ్యక్షులకు సమర్పించాలి. ఉదాహరణకు లోక్‌సభ సభ్యులైతే స్పీకర్‌కు, రాజ్యసభ సభ్యులైతే రాజ్యసభ చైర్మన్‌కు స్వదస్తూరీతో తమ రాజీనామా పత్రాలను వ్యక్తిగతంగా ఇవ్వాలి. ఆ రాజీనామాను స్వచ్ఛందంగా చేశారా? లేదా? అని విచారించిన తర్వాతే సభాధ్యక్షులు ఆమోదిస్తారు.
గైర్హాజరు: పార్లమెంటు సభ్యులు సభాధ్యక్షుల అనుమతి లేకుండా నిరవధికంగా 60 రోజులు గైర్హాజరైతే సభ్యత్వం కోల్పోతారు.
ద్వంద్వ సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు: సభ్యులు ఏక కాలంలో రెండు సభల్లో సభ్యత్వం కలిగి ఉంటే ఏదైనా ఒక సభలో సభ్యత్వం కోల్పోతారు. అది ఎలాగంటే..
రాజ్యసభ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికైతే.. ఎన్నికైన పదిరోజుల్లోపు తన అభీష్టాన్ని తెలియజేయాలి. లేదంటే రాజ్యసభలో సభ్యత్వం రద్దవుతుంది.
అప్పటికే ఒక సభలో సభ్యునిగా ఉండి మరో సభకు ఎన్నికైతే మొదట సభ్యునిగా ఉన్న సభలో సభ్యత్వం రద్దవుతుంది. ఉదాహరణకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి రాజ్యసభకు ఎంపికైతే తన ఐచ్ఛికాన్ని తెలియజేయని పక్షంలో లోక్‌సభ సభ్యత్వం రద్దవుతుంది. ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీచేసి.. రెండిటిలోనూ గెలిచి నిర్ణీత గడువులో (10 రోజులు) తన ఐచ్ఛికాన్ని తెలపకపోతే రెండు స్థానాల్లోనూ తన సభ్యత్వం కోల్పోతాడు.
రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికైతే 14 రోజుల్లో రాష్ట్ర శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో పార్లమెంటు సభ్యత్వం రద్దవుతంది.
ఇతర కారణాలు: పార్లమెంటు సభ్యుని ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పినప్పుడు, సభ్యుడు ఆ సభతో బహిష్కరణకు గురైనప్పుడు, పార్లమెంటు సభ్యులు.. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు, గవర్నర్‌గా నియమితులైనప్పుడు. ఇతర కారణాల వల్ల అనర్హుడిగా ప్రకటించినప్పుడు పార్లమెంట్‌లో ఖాళీలు ఏర్పడతాయి.
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
పార్లమెంటు-చర్చలు-అధికార భాష (ప్రకరణ 120) :
పార్లమెంటు చర్చలు హిందీ లేదా ఇంగ్లిష్‌లో జరుగుతాయి. సభాధ్యక్షుల అనుమతితో మాతృభాషల్లో కూడా సభ్యులు మాట్లాడొచ్చు.
సభాధ్యక్షులు - లోక్‌సభ స్పీకర్,డిప్యూటీ స్పీకర్ (Presiding Officers) (ప్రకరణ 93 నుంచి 96)
పార్లమెంటు ప్రతి సభలోనూ సభాధ్యక్షులు, ఉప సభాధ్యక్షులు ఉంటారు. లోక్‌సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్; రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. వీరు ఆయా సభలకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రకరణ 93లో స్పీకర్ పదవిని ప్రస్తావించారు. భారతదేశంలో మొదటిసారిగా 1921లో ఈ సభాపతి పదవిని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్పీకర్‌ను అధ్యక్షుడిగా పిలిచేవారు. 1935లో అధ్యక్షుడనే పదాన్ని స్పీకర్‌గా మార్చారు.
1946లో డిసెంబర్ 9 నుంచి 1947 నవంబర్ 16 వరకు స్పీకర్ పదవిని రాజ్యాంగ సభ రద్దు చేసింది. 1946 నుంచి 1949 వరకు రాజ్యాంగ పరిషత్తే శాసనసభగా వ్యవహరించింది. జి.వి.మౌలాంకర్ మొట్టమొదటి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
ఎన్నిక: స్పీకర్‌ను లోక్‌సభ ప్రారంభ సమావేశంలో సభ్యులు మెజారిటీ ప్రాతిపదికపై నేరుగా ఎన్నుకుంటారు. స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు లోక్‌సభలో సభ్యత్వం కలిగి ఉండాలి.
కాలపరిమితి: లోక్‌సభ స్పీకర్ పదవీ కాలం ఐదేళ్లు. కానీ, నూతన స్పీకర్ ఎన్నికయ్యేంతవరకు పదవిలో కొనసాగుతారు. లోక్‌సభ రద్దయినా, తన కాలవ్యవధి పూర్తయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. కొత్త లోక్‌సభ ఏర్పడి స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు పదవిలో ఉంటారు.
తొలగింపు పద్ధతి (ప్రకరణ 94 (c)): ప్రకరణ 94 ప్రకారం స్పీకర్‌ను లోక్ సభ తొలగిస్తుంది. పదవిని దుర్వినియోగపరచడం, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణాలపై స్పీకర్‌ను తొలగించవచ్చు. సభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందస్తు నోటీసును స్పీకర్‌కు ఇవ్వాలి.సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ తన పదవి నుంచి దిగిపోతాడు.
స్పీకర్‌ను తొలగించే తీర్మానం సభా పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు. కానీ, సమావేశానికి హాజరుకావొచ్చు. తీర్మానంపై తన అభిప్రాయాన్ని వెల్లడించొచ్చు. తీర్మానంపై సాధారణ సభ్యుడిగానే ఓటు వేయొచ్చు. కానీ, నిర్ణయాత్మక ఓటు ఉండదు.
జీతభత్యాలు: స్పీకర్ జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటిని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం స్పీకర్‌కు వేతనం రూ.1,25,000. పదవీ విరమణ తర్వాత పెన్షన్, ఇతర అన్ని సౌకర్యాలుంటాయి. వీరి జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పదవీకాలంలో వీరికి నష్టం వచ్చే విధంగా వేతనాలను సవరించరాదు.
రాజీనామా: స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు సమర్పిస్తారు.
స్పీకర్ అధికారాలు - విధులు :
స్పీకర్ అధికారాలు, విధులను రాజ్యాంగంలోని పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణా చట్టంలోనూ పేర్కొన్నారు. వాటిని కింది విధంగా పేర్కొనవచ్చు.
☛ స్పీకర్ లోక్‌సభకు అధ్యక్షత వహించి సభా కార్యకలాపాలు నిర్వహిస్తారు.
సభలో జరిగే చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ తదితర అంశాలను నియంత్రిస్తారు.
☛ లోక్‌సభ తరఫున ముఖ్య ప్రతినిధిగా వ్యవహరిస్తారు.
☛ సభాహక్కులు, సభ గౌరవాన్ని, సభా ప్రతిష్టను కాపాడేందుకు చర్యలు తీసుకొంటారు. సభలో గందరగోళం ఏర్పడితే తగిన ఆదేశాల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతారు.
☛ ఏదైనా బిల్లు విషయంలో అనుకూల, వ్యతిరేక ఓట్లు సమానమై ప్రతిష్టంభన ఏర్పడితే నిర్ణయాత్మక ఓటును (Casting Vote) వినియోగిస్తారు.
☛ సభలో జరిగే చర్చల సమయం, సభ్యులు లేవనెత్తే ఆక్షేపణలు, సభలో కోరం (Quorum) తదితర అంశాలపై స్పీకర్ నియంత్రణ ఉంటుంది.
☛ అనుచితంగా ప్రవర్తిస్తున్న సభ్యులను హెచ్చరించడం, అది మితిమీరినప్పుడు సభ నుంచి వెళ్లమనడం, ఆ ఆదేశాన్ని ఖాతరు చేయనప్పుడు సంబంధిత అధికారుల (Marshal)తో బలవంతంగా బయటకు పంపిస్తారు.
☛ కొన్ని పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా కూడా స్పీకర్ ఉంటారు. ఉదాహరణకు సభా వ్యవహారాల కమిటీ, రూల్స్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ. అలాగే కొన్ని కమిటీల చైర్మన్లను కూడా నియమిస్తారు.
☛ లోక్‌సభకు చెందిన అన్ని కమిటీలు స్పీకర్ పర్యవేక్షణలోనే పనిచేస్తాయి.
Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!
పరిపాలన సంబంధిత అధికారాలు.. :
☛ లోక్‌సభ సచివాలయానికి అధిపతిగా ఉంటూ సిబ్బందిపై పరిపాలన నియంత్రణ కలిగి ఉంటారు.
☛ బిల్లులకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేస్తారు.
☛ సభ్యులకు సంబంధించిన వసతులు, సౌకర్యాలు తదితర అంశాల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
ప్రత్యేక అధికారాలు ఇలా.. :
☛ ద్రవ్య బిల్లులను ధ్రువీకరిస్తారు. స్పీకర్ ధ్రువీకరణే అంతిమం.
☛ లోక్‌సభకు సంరక్షకుడిగా వ్యవహరిస్తారు.
☛ సాధారణ బిల్లు విషయంలో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఏర్పాటుచేసే సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
☛ అఖిల భారత స్పీకర్‌ల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
☛ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్‌నకు హోదా రీత్యా అధ్యక్షునిగా ఉంటారు.
Groups Guidance: మొదటిసారిగా గ్రూప్ 2 రాస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..
స్పీకర్ - స్థానం :
➤ పార్లమెంటరీ ప్రభుత్వంలో స్పీకర్ అత్యంత ప్రధాన స్థానాన్ని కలిగి ఉంటారు. లోక్‌సభలో స్పీకర్ మొదటి సభ్యుడు. లోక్‌సభకు స్వరంగా వ్యవహరిస్తారు. జవహర్‌లాల్ నెహ్రూ మాటల్లో ‘స్పీకర్.. లోక్‌సభకు ప్రతినిధి, జాతి స్వేచ్ఛకు చిహ్నం. ఆయన గౌరవ ప్రతిపత్తి గొప్పది’. అందువల్ల విశేష సామర్థ్యం, నిష్పాక్షికత ఉన్న వ్యక్తులు ఆ స్థానంలో ఉంటే స్పీకర్ పదవిని సమర్థవంతంగా నిర్వహించగలరు.
➤ భారత అధికార హోదాలో ఏడోస్థానం కలిగి ఉండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా గౌరవ హోదాను పొందుతారు.
➤ స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత తన పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండి, ఏ పార్టీకి చెందని సభ్యునిగా వ్యవహరిస్తారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. స్పీకర్ స్థానం గురించి మొట్టమొదటి స్పీకర్ జి.వి.మౌలాంకర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.. ‘స్పీకర్ స్థానం అసమానమైంది. దేశ పరిపాలన, విదేశాంగ విధానంలో ప్రత్యక్షంగా అధికారాన్ని వినియోగిస్తున్నట్లు కనిపించకపోయినా, పరోక్షంగా కొంత ప్రభావాన్ని ఆ రెండింటిపై చూపుతారు’.
➤ స్పీకర్ పదవి గౌరవప్రతిష్టలు.. ఆ పదవి చేపట్టిన వ్యక్తి గొప్పతనంపై ఆధారపడి ఉంటాయి.
➤ స్పీకర్ ఎన్నికయ్యే ముందు, ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందినప్పటికీ, ఎన్నికైన తర్వాత సంబంధిత రాజకీయ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం, నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకోవడం తదితర అంశాలపై స్పీకర్ పదవి గొప్పతనం ఆధారపడి ఉంటుంది.
➤ భారత రాజకీయ వ్యవస్థలో ఇంతవరకు స్పీకర్‌గా పనిచేసినవారు నిష్పక్షపాతంగానే వ్యవహరించారు. ఇంగ్లండ్ రాజకీయ వ్యవస్థలో మాదిరిగా స్పీకర్లు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండటం లేదు. ఇంగ్లండ్‌లో ఒకసారి స్పీకర్ పదవికి ఎన్నికైతే సాధారణంగా తనకు ఇష్టమున్నంత కాలం స్పీకర్‌గా కొనసాగవచ్చు అనేది సంప్రదాయంగా కొనసాగుతుంది. కానీ, భారతదేశంలో మంత్రిపదవులను ఆశించినవారికి ఒక ప్రత్యామ్నాయ పదవిగా స్పీకర్ పదవిని ఇస్తున్నారనే విమర్శ ఉంది.