Science and Technology for Groups Exams : జాతీయ సైన్స్ విధానాన్ని మొదటిసారి ఎప్పుడు ప్రకటించారు?
హోమి జహంగీర్ బాబా, విక్రం సారాబాయ్, ఎం.ఎస్.స్వామినాథన్ వంటి వారిని నెహ్రూ ప్రోత్సహించారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో దిక్సూచిగా వ్యవహరిస్తూ భారత శాస్త్ర, సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేశారు. అణుశక్తి రంగానికి హోమి బాబా పునాది వేయగా, అంతరిక్ష రంగానికి విక్రం సారాబాయ్, వ్యవసాయ రంగానికి ఎం.ఎస్. స్వామినాథన్ మూలస్తంభాలుగా నిలిచారు. వీరికి అదనంగా భారత శాస్త్ర, సాంకేతిక రంగ ప్రాధాన్యతను ప్రపంచవ్యాప్తంగా చాటిన వారిలో శ్రీనివాస రామానుజన్, జగదీశ్ చంద్ర బోస్, సత్యేంద్రనాథ్ బోస్, పి.సి.రే, మేçఘానంద్ సాహా, సర్ సి.వి. రామన్, బీర్బల్ సహానీ, హర్ గోబింద్ ఖురానా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రాజా రామన్న, ఏపీజే అబ్దుల్‌కలాం, పి.ఎం.భార్గవ, పి.మహేశ్వరి, వెంకట రామకృష్ణన్ ప్రముఖులు. అయితే ప్రాచీన కాలంలోనే భారతదేశ శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అంతరిక్షం, గణితం, వైద్య, లోహ సంగ్రహణ శాస్త్రంలో భారతీయులు అద్భుతవిజయాలను సాధించారు. ఆర్యభట్ట, భాస్కర, బ్రహ్మగుప్త, ధన్వంతరి, ఆచార్య నాగార్జునుడు వంటి వారి కృషి అద్వితీయం. ప్రస్తుత కాలంలో భారత్‌లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చెప్పుకోదగ్గ విజయాలు నమోదు కావట్లేదు. గత మూడు దశాబ్దాలుగా శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిపై భారత్ పెట్టుబడులు చాలా తక్కువ. 2010 నాటికి భారత్ శాస్త్ర, సాంకేతిక రంగంలో 13 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, చైనా 135 బిలియన్ డాలర్లకుపైగా ఖర్చు చేసింది. టెక్నాలజీలో అభివృద్ధి ద్వారా మాత్రమే దేశం వివిధ రంగాల్లో ముఖ్యంగా శక్తి, ఆహార పోషణ, పర్యావరణ, తాగునీరు, ఆరోగ్య రంగాల్లో భద్రత సాధించడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా దేశంలో జీవ వైవిధ్యాన్ని మానవాళి శ్రేయస్సుకు ఉపయోగించవచ్చు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో త్వరితగతిన అభివృద్ధి సాధించేందుకు అన్ని సంబంధిత అంశాలను ప్రతిబింబించే ఒక జాతీయ విధానం అవసరం. దీన్ని గుర్తించి 1958లో మొదటిసారిగా జాతీయ సైన్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది. ఆ తర్వాత అవసరాలు, సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా 1983లో ఒకసారి, 2003లో మరోసారి కొత్త టెక్నాలజీ పాలసీని ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని మరింత ప్రోత్సహించడానికి 2013లో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (ఎస్‌టీఐ) అనే సరికొత్త విధానాన్ని ప్రభుత్వం 100వ జాతీయ సైన్స్ సదస్సు (కోల్‌కతా) సందర్భంగా ప్రవేశపెట్టింది.
భారతదేశ శాస్త్ర, సాంకేతిక రంగ వ్యవస్థలో ప్రధానమైనవి కేంద్ర ప్రభుత్వ ఎస్ అండ్ టీ విభాగాలు. ఈ రంగంలో ప్రధానంగా కృషి చేసే విభాగాలివి. వీటికి తోడుగా ఈ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నవి – రాష్ట్ర ఎస్ అండ్ టీ విభాగాలు, ప్రైవేటు పరిశ్రమలు, ఎన్‌జీవోలు, కొన్ని ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు (వ్యవసాయ, ఆరోగ్య కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు)
☛Follow our YouTube Channel (Click Here)
దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగ పురోగతికి కృషి చేస్తున్నవి.. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ), అంతరిక్ష విభాగం (డీఎస్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డీఎస్‌ఐఆర్), అణుశక్తి విభాగం (డీఏఈ), బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ (డీవోడీ).
శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ)
ఇది 1971 మేలో ఏర్పాటైంది. జాతీయ సైన్స్ విధానాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) రూపోందిస్తుంది. ఈ రంగంలోని నూతన పరిశోధనలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణకు ఇది కృషి చేస్తుంది. జాతీయ సమాచార వ్యవస్థను నిర్వహిస్తుంది. ఈ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. రాష్ట్ర ఎస్ అండ్ టీ మండళ్ల ద్వారా రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో ఎస్ అండ్ టీ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. స్వయం ప్రతిపత్తి సంస్థలకు కావాల్సిన నిధులను కూడా ఇది సమకూరుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో శాస్త్ర, సాంకేతిక రంగంలో సహకారం, అభివృద్ధికి కూడా డీఎస్‌టీ కృషి చేస్తుంది. ఆధునికీకరణను ప్రోత్సహిస్తూ జాతీయ అవసరాలకు తగ్గట్టుగా ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలనేది డీఎస్‌టీ మరో లక్ష్యం. దీని ఆధ్వర్యంలో ఎస్ అండ్ టీ అభివృద్ధికి కృషి చేసే కొన్ని ముఖ్యమైన సంస్థలు..
టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్‌కాస్టింగ్ అండ్ అసెస్‌మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్‌ఏసీ)
ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (భారత వాతావరణ విభాగం)
సర్వే ఆఫ్ ఇండియా
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్
నేషనల్ అట్లాస్ అండ్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్
నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌క్యాస్టింగ్
అంతరిక్ష విభాగం
అంతరిక్ష సంఘం, అంతరిక్ష విభాగాలను మనదేశంలో 1972లో ఏర్పాటు చేశారు. అంతరిక్ష సంఘం రూపోందించే అంతరిక్ష విధానాన్ని అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలోని ఇస్రో నిర్వహిస్తుంది. దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించిన ఇన్సాట్, ఐఆర్‌ఎస్, నావిగేషనల్ ఉపగ్రహ వ్యవస్థలను అభివృద్ధి చేసి ప్రయోగించడం ఈ విభాగం ప్రధాన లక్ష్యం. వీటిని ప్రయోగించే లక్ష్యంతో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ వ్యవస్థలను ఇస్రో అభివృద్ధి చేసింది. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి. ఇప్పటివరకు నిర్వహించిన 28 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో 27 ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి. దేశీయ క్రయోజెనిక్ ఇంజన్, జీఎస్‌ఎల్‌వీ–మార్క్–3 అభివృద్ధి, పరీక్ష ప్రయోగం, మంగళయాన్ వంటివి ఇటీవల అంతరిక్ష విభాగం సాధించిన విజయాలు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డీఎస్‌ఐఆర్)
డీఎస్‌ఐఆర్ ఆధ్వర్యంలో పని చేస్తున్న ప్రధాన విభాగం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్). దీని ఆధ్వర్యంలో దేశంలో అనేక సంస్థలు వివిధ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి కార్యకలా΄ాలను నిర్వహిస్తున్నాయి. పరిశ్రమల్లో పరిశోధన – అభివృద్ధిని ప్రోత్సహించడం, టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం, టెక్నాలజీ బదిలీ, నేషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌ఐఎస్‌ఏటీ)ని అభివృద్ధి చేయడం డీఎస్‌ఐఆర్ ప్రధాన లక్ష్యాలు.
అణుశక్తి విభాగం
శాంతియుత ప్రయోజనాలకు అణుశక్తిని అభివృద్ధి చేయడం, భద్రతతో కూడిన లాభదాయకమైన అణుశక్తిని ఉత్పత్తి చేయడం అణుశక్తి విభాగం ముఖ్య లక్ష్యాలు. అణుశక్తి విధానాన్ని రూపోందించే అణుశక్తి సంఘం 1948లో, దాన్ని అమలు చేసే అణుశక్తి విభాగం 1954లో ఏర్పాటైంది. మూడు దశల అణుశక్తి కార్యక్రమాన్ని వేగంగా అభివృద్ధి చేసి స్థాపిత శక్తి సామర్థ్యంలో అణుశక్తి వాటాను పెంచడం, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ, సామాజిక రంగాల్లో ఉపయోగపడే రేడియో ఐసోటోపులను, రేడియో ధార్మిక టెక్నాలజీలను అభివృద్ధి చేయడం ఈ విభాగం లక్ష్యాలు.
☛☛ Follow our Instagram Page (Click Here)
బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ)
విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాల్లో బయోటెక్నాలజీని ప్రోత్సహించే విభాగం డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ.
కణజాల వర్థనం, సూక్ష్మవ్యాప్తి టీకాల అభివృద్ధి, క్యాన్సర్ మందుల ఉత్పాదన, డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, ఎయిడ్స్ మందుల ఉత్పాదన, నిర్ధారణ పద్ధతుల అభివృద్ధిలో ఇప్పటికే బయోటెక్నాలజీ రంగం ఎన్నో విజయాలను సాధించింది. అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం తర్వాత హెపటైటిస్–బీ టీకాను ఉత్పత్తి చేసిన నాలుగో దేశం భారత్. మూలకణాల రంగంలో ఇప్పటికే ముఖ్యంగా ప్రౌఢ మూలకణాల ద్వారా సరికొత్త చికిత్స పద్ధతులు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్
సముద్ర రంగ వనరుల సర్వే, అభివృద్ధి వాటి వెలికితీత కోసం కృషి చేస్తుంది డీవోడి. జీవ, నిర్జీవ వనరుల గుర్తింపు, సముద్ర లోతులో డీప్ సీ బెడ్ మైనింగ్, సముద్ర తరంగ శక్తి ఉత్పాదన, అంటార్కిటికాపై పరిశోధన ఈ విభాగం ముఖ్య లక్ష్యాలు.
వివిధ మంత్రిత్వ శాఖల్లోని విభాగాలు కూడా దేశ ఎస్ అండ్ టీ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. ఉదా: వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పనిచేస్తున్నాయి.
మాదిరి ప్రశ్నలు
1. భారత అంతరిక్ష విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్) ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
1) 1969 2) 1972 3) 1975 4) 1979
2. ఎవరి ఆధ్వర్యంలో అణుశక్తి విభాగం పనిచేస్తుంది?
1) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
2) రక్షణ మంత్రిత్వ శాఖ
3) మానవ వనరుల అభివృద్ధి శాఖ
4) ప్రధానమంత్రి
3. నీటి నుంచి ఫ్లోరిన్‌ను తొలగించే నల్లగొండ టెక్నిక్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
1) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)
2) నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ)
3) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
4) నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
4. ‘గరీమ’ అనే గేదె పిల్ల (దూడ)ను క్లోనింగ్ ద్వారా సృష్టించిన కేంద్రం?
1) నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రిసోర్సెస్
2) నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
3) సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ
4) నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్
5. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) కాసరగోడ్ 2) తిరువనంతపురం
3) కోచి 4) హైదరాబాద్
6. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ శాఖా మంత్రి?
1) పీయూష్ చావ్లా 2) డా‘‘ జితేంద్ర సింగ్
3) స్మృతి ఇరానీ 4) అనంతకుమార్
☛ Join our WhatsApp Channel (Click Here)
7. బోల్ క్యూర్ పేరుతో సరికొత్త జీవ క్రిమి సంహారకాన్ని అభివృద్ధి చేసిన సంస్థ?
1) ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్
2) ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
3) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్
4) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్
8. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో సిన్‌రియం అనే మలేరియా నివారణ మందును అభివృద్ధి చేసిన సంస్థ?
1) భారత్ బయోటిక్ 2) రాన్‌బ్యాక్సీ
3) బయోకాన్ 4) డా.రెడ్డీస్ లేబొరేటరీ
9. అణు వ్యర్థాన్ని గాజు మాత్రికలో భద్రపర్చే విధానాన్ని అణుశక్తి విభాగం అభివృద్ధి చేసింది. ఈ విధానాన్ని ఏమంటారు?
1) విట్రిఫికేషన్ 2) ట్రాన్స్‌మ్యుటేషన్
3) అన్నీలింగ్ 4) ఎన్‌రిచ్‌మెంట్
10. మొదటి జాతీయ సైన్స్ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు?
1) 1952 2) 1958 3) 1962 4) 1965
11. అణుశక్తి సంఘం చైర్మన్?
1) శ్రీకుమార్ బెనర్జీ 2) అనిల్ కకోద్కర్
3) డా‘‘ అజిత్ మహంతీ 4) యు.ఆర్.రావు
12. ప్రతి ఏటా దేశంలో శాస్త్రవేత్తలకు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను ప్రదానం చేసేది?
1) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)
2) డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ)
3) అంతరిక్ష విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్)
4) అణుశక్తి విభాగం (డి΄ార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ)
13. కలరా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంట్రిక్ డిíసీజెస్ సంస్థ ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) బెంగళూరు
3) ముంబై 4) కోల్‌కతా
☛ Join our Telegram Channel (Click Here)
సమాధానాలు
1) 2; 2) 4; 3) 4; 4) 2; 5) 1; 6) 2; 7) 1; 8) 2; 9) 1; 10) 2; 11) 3; 12) 1; 13) 4.
Tags
- appsc and tspsc groups exams
- science and technology material
- competitive exams study material
- model questions
- preparatory and previous questions for groups exams
- science and technology model questions
- appsc and tspsc
- appsc and tspsc science and technology
- model and preparatory questions in groups exams
- science and technology material for groups exams
- Government Jobs
- groups exams for govt jobs
- police jobs preparation exams
- Education News
- Sakshi Education News