Skip to main content

సామాజిక అభివృద్ధి

ప్రజలకు నికరంగా, నాణ్యమైన, మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడమే ఏ సంక్షేమ రాజ్యానికైనా ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. సామాజిక అభివృద్ధిని వ్యవస్థీకృతం చేయడం ద్వారానే ఆర్థికాభివృద్ధికి సంబంధించిన మొత్తం ప్రక్రియను పటిష్టపరచవచ్చు. విద్య, ఆరోగ్యం, పోషణ, పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా లాంటివి సామాజిక మౌలిక సదుపాయాల్లో భాగంగా ఉంటాయి. వీటిలో విద్య అత్యంత కీలకమైంది.

అక్షరాస్యత

రాష్ట్రంలో అక్షరాస్యత 2001లో 58 శాతం ఉండగా, 2011 నాటికి ఇది 66.46 శాతానికి పెరిగింది. ఇది జాతీయ అక్షరాస్యతా రేటు (72.99) కంటే తక్కువ. గడచిన దశాబ్దంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అక్షరాస్యతా వృద్ధి మందగించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్లు అంతకుపైగా వయసున్న బాలల్లో సాధారణ అక్షరాస్యతా స్థాయి తక్కువగా ఉంది. మూడో వంతు నిరక్షరాస్యులతో రాష్ట్రం 2011లో దేశంలో 25వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో వయోజన అక్షరాస్యతా రేటు 73.7 శాతం. ఈ విషయంలో 2011-12లో తెలంగాణ జాతీయ స్థాయిలో 21వ స్థానంలో ఉంది. ఒక్క వయోజన అక్షరాస్యుడూ లేని కుటుంబాలు జాతీయ స్థాయిలో 18.7 శాతం ఉండగా, గ్రామీణ తెలంగాణలో 29 శాతం ఉన్నాయి. పట్టణ విభాగంలోనూ ఒక్క వయోజన అక్షరాస్యుడూ లేని కుటుంబాలు నేటికీ 6 శాతం ఉన్నాయి.
రాష్ట్ర జనాభాలో అక్షరాస్యుల సంఖ్య 207.84 లక్షల మంది. వీరిలో 117.49 లక్షల మంది పురుషులు, 90.35 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. అక్షరాస్యతా రేటు పురుషుల్లో 74.95 శాతం, స్త్రీలలో 57.92 శాతం.

పాఠశాల విద్య
యు.ఎన్.డి.పి. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల (ఎం.డి.జి.) ప్రకారం ‘అందరికీ విద్య’ అంశాన్ని మానవాభివృద్ధి ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటిగా గుర్తించారు. దీన్నే భారత రాజ్యాంగంలో ‘అధికరణం-21ఎ’లో పొందుపరిచారు. 2009లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. ఈ లక్ష్య సాధనలోభాగంగా.. విద్య అందుబాటు, విద్యాలయ ప్రవేశంలో లైంగిక సమానత, పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్యను మెరుగుపరచడం, విద్యార్థులు మధ్యలోనే బడి మానేయకుండా, పూర్తికాలం చదువును కొనసాగించడానికి చర్యలు తీసుకోవడం, నాణ్యమైన విద్య అందించడం లాంటి అవసరాలను గుర్తించారు. ఈ రాజ్యాంగ శాసనాన్ని సమర్థంగా అమలు చేయడానికి భారతదేశంలో ప్రాథమికోన్నత (ఎలిమెంటరీ) స్థాయి విద్యను ‘సర్వశిక్షా అభియాన్ (ఎస్.ఎస్.ఎ)’ పరిధిలోకి తెచ్చారు. ఇది ప్రాథమికోన్నత విద్యను సార్వత్రికం చేయడానికి ఉద్దేశించింది. దీంతోపాటు సెకండరీ స్థాయి విద్యను ‘రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్.ఎం.ఎస్.ఎ.)’ కార్యక్రమం కిందకు తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలను, విద్యాహక్కు చట్టాన్ని విస్పష్టమైన నిబంధనల ద్వారా అమలుచేసి విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

అందరికీ విద్య
పాఠశాల సదుపాయాలను నెలకొల్పడంలో కింద పేర్కొన్న సూత్రాలు పాటించాలని విద్యాహక్కు చట్టం నిర్దేశిస్తోంది. అవి:
  • జనావాసాల నుంచి కిలోమీటరు దూరానికి మించకుండా ప్రాథమిక స్థాయి (ప్రైమరీ) విద్యాలయాలు అందుబాటులో ఉండాలి.
  • అన్ని జనావాసాల నుంచి 3 కిలోమీటర్ల లోపు ఎలిమెంటరీ (ప్రాథమికోన్నత) స్థాయి విద్యాలయాలు ఉండాలి.
  • అన్ని జనావాసాల నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ (మాధ్యమిక) స్థాయి విద్యాలయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
విద్యార్థులు నడిచి వెళ్లి రావడానికి వీలుగా ఈ నియమాలను నిర్దేశించారు.
విద్యాహక్కు చట్టం సూత్రాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఎలిమెంటరీ విద్యాస్థాయిలో 99 శాతం, సెకండరీ స్థాయిలో 91.5 శాతం అందుబాటును సాధించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాలయాలు లేని ప్రాంతాల్లో కొత్తగా విద్యాలయాలను ప్రారంభించారు.
పాఠశాల వయసు జనాభాకు సంబంధించి రాష్ట్రంలో 61.78 లక్షల మంది బాలురున్నారు. వీరికి విద్యాశాఖ పాఠశాల విద్యా సదుపాయాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలో వివిధ యాజమాన్యాలకు చెందిన 43208 పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్రం ప్రాథమిక విద్య సార్వత్రీకరణ లక్ష్యాన్ని సాధించడానికి చేరువలో ఉంది. ప్రాథమిక స్థాయి విద్యాసంస్థల్లో భౌతికమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడానికి గణనీయమైన ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా విద్యాబోధనలో నాణ్యత; అధ్యాపకుడు, విద్యార్థుల నిష్పత్తి మెరుగుపడ్డాయి. 2014-15లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యా స్థాయిల్లో అధ్యాపకుడు, విద్యార్థుల నిష్పత్తి వరసగా 27, 23, 24గా ఉంది.
ఎలిమెంటరీ విద్య సార్వత్రీకరణ లక్ష్య సాధనలో భాగంగా.. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను పటిష్టం చేయడం; కొత్తగా ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించడం; మారుమూల ప్రాంతాలు, నేటివరకూ పాఠశాల సదుపాయం లేని జనావాస ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ విద్యాలయాలు, ఇతర రకాల విద్యా సదుపాయాలను నెలకొల్పడం లాంటి చర్యలు ఉన్నాయి. బడిలో చేరని పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి, వారిని ప్రోత్సహించి, బడిలో చేర్పించే కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. పాఠశాలల్లో పిల్లల చేరిక పెరగడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో 2014-15లో అన్ని రకాల పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 60.76 లక్షలు.
ప్రాథమిక స్థాయిలో బాలలు పాఠశాలల్లో చేరడం గుర్తించదగిన స్థాయిలోనే ఉండగా.. వారు ఒక్కో తరగతి పూర్తిచేసి ముందుకు వెళుతున్నకొద్దీ విద్యార్థుల సంఖ్య తీవ్రంగా పడిపోతుంది. 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల్లో మధ్యలోనే చదువు మానేస్తున్నవారు తెలంగాణలో 22.32 శాతం ఉన్నారు. 1 నుంచి పదోతరగతి వరకు విద్యార్థుల్లో చదువు అర్ధంతరంగా ఆపేస్తున్న విద్యార్థుల శాతం 38.21. గ్రామీణ ప్రాంతాల్లో బాలలను వ్యవసాయ, ఇతర అనుబంధ కార్యకలాపాల్లో పని చేయించడం, ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే రోజుల్లో వారిని తీసుకెళ్లిపోవడం లాంటి కారణాల వల్ల వారి చదువు అర్ధంతరంగా ఆగిపోతోందని ‘ప్రథమ్’ నిర్వహించిన ఎ.ఎస్.ఇ.ఆర్.-2014లో పేర్కొన్నారు. బడి వయసు బాలలందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, బాలికలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లాంటి ప్రయత్నాలను పటిష్టపరచాలి. పరీక్షా వ్యవస్థలోనూ సంస్కరణలు చేయాలి.

మధ్యాహ్న భోజన పథకం
కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సరఫరా పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. విద్యార్థుల పోషణ స్థాయిలను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండుసార్లు గుడ్లు లేదా అరటిపండ్లను కూడా సమకూరుస్తోంది. రాష్ట్రంలో విద్యార్థులందరికీ సన్నబియ్యం (సూపర్ ఫైన్ రకం)తో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 2014-15లో 30.44 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ప్రయోజనాన్ని పొందారు.

సర్వశిక్షా అభియాన్
6 నుంచి 14 ఏళ్ల వయసు బాలలందరికీ ఉపయోగకరమైన, కాలానికి తగిన ఎలిమెంటరీ విద్యను అందించాలన్నది సర్వశిక్షా అభియాన్ (ఎస్.ఎస్.ఎ.) లక్ష్యం. ఇందులో భాగంగా పాఠశాలల యాజమాన్యంలో సమాజాన్ని చురుగ్గా నిమగ్నం చేయడం ద్వారా సామాజిక, ప్రాంతీయ, లింగపరమైన తారతమ్యాలను తొలగించే చర్యలు చేపడుతున్నారు. దీని కోసం 2014-15లో 65:35 నిష్పత్తిలో నిధులు సమకూర్చారు.
లక్ష్యాలు
  • 6 నుంచి 14 సంవత్సరాల వయసు బాలలందరినీ పాఠశాలల్లో చేర్పించడం.
  • ఎలిమెంటరీ విద్య ఎనిమిదేళ్లూ పూర్తిచేసేవరకు విద్యార్థులు పాఠశాలలో కొనసాగేలా చూడటం.
  • జీవితానికి పనికొచ్చే విద్య అనే అంశానికి ప్రాధాన్యమిచ్చేలా సంతృప్తికరమైన నాణ్యతతో ఎలిమెంటరీ విద్యను తీర్చిదిద్దడంపై దృష్టి సారించడం.
  • స్త్రీ, పురుష; సామాజిక అంశాల వారీగా ఉన్న వ్యత్యాసాలను ఎలిమెంటరీ విద్యాస్థాయిలోనే తొలగించే చర్యలు చేపట్టడం.
కొత్తగా చేపట్టిన చర్యలు
  • నూతన ప్రైమరీ పాఠశాలలను తెరవడం.
  • ప్రైమరీ పాఠశాలలను అప్పర్ ప్రైమరీ స్కూళ్ల స్థాయికి పెంచడం.
  • కొత్త పాఠశాలలకు నిరంతర అధ్యాపకులను మంజూరు చేయడం.
  • ప్రస్తుతం ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అదనపు అధ్యాపకులను మంజూరు చేయడం.
  • మండల్ రిసోర్స్ సెంటర్లు, స్కూలు సముదాయాలను పటిష్టపరచడం.
  • సర్వీసులో ఉన్న అధ్యాపకులకు ఏటా 5 రోజులపాటు శిక్షణ ఇవ్వడం.
  • పాఠశాలకు దూరమైన విద్యార్థులకు చదువు, ప్రత్యేక శిక్షణ అందించడం.
  • స్కూల్ యూనిఫాం సరఫరా చేయడం.
  • నూతన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు టీచింగ్, లెర్నింగ్ ఎక్విప్‌మెంట్ గ్రాంటు విడుదల చేయడం.
  • స్కూలు గ్రాంటు, టీచర్ గ్రాంటు, నిర్వహణ గ్రాంటు విడుదల చేయడం.
  • కొత్త చర్యలపై పరిశోధన, మదింపు అధ్యయనాలు, కార్యకలాపాల పర్యవేక్షణ, నిఘా.
  • యాజమాన్యం నాణ్యత, సమాజ సమీకరణ.
  • సృజనాత్మక ఆవిష్కరణలు-బాలికల విద్య నిమిత్తం సృజనాత్మకమైన కార్యకలాపాల నిర్వహణ; మొగ్గదశలో విద్య; ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పట్టణాల్లో నిర్లక్ష్యానికి గురైన బాలలకు చదువు; ప్రాథమికోన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య.
  • సమాజ నాయకులకు శిక్షణ, సమాజ సమీకరణ.
  • రవాణా/భద్రతకు సంబంధించిన చర్యలు.
  • పట్టణాల్లో నిర్లక్ష్యానికి గురైన బాలలకు ప్రత్యేక ఆవాస విద్యాలయాలు, వసతి గృహాల నిర్వహణ.
2014-15లో సాధించిన విజయాలు
  • పాఠశాల లేని జనావాస ప్రాంతాల్లో 2014-15లో సుమారు 38 కొత్త ప్రాథమిక పాఠశాలల ప్రారంభం.
  • సుమారు 22,41,785 మంది బాలలకు రెండు జతల యూనిఫాం పంపిణీ.
  • సుమారు 99.4 శాతం విద్యాలయాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉంది. అధ్యాపకుడు, విద్యార్థుల నిష్పత్తి (టి.పి.ఆర్.) మెరుగుపడింది. ఈ నిష్పత్తి 1-5 తరగతుల స్థాయిలో 1:29గా, 1-8/9 తరగతుల స్థాయిలో 1:24గా, 1-12 తరగతుల స్థాయిలో 1:39 వంతున నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఉంది.
  • రాష్ట్రంలో సుమారు 98.4 శాతం పాఠశాలలకు క్రియాశీలక పాఠశాల యాజమాన్య కమిటీలు ఉన్నాయి.
  • పాఠశాలలకు దూరంగా ఉన్న బాలలను క్రమపద్ధతిలో నడిచే విద్యాలయాల్లో చేర్పించడానికి సుమారు 52,947 మందికి ప్రత్యేక శిక్షణ అందించారు.
 
ఇంటర్మీడియెట్ విద్య
ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డెరైక్టరేట్ నియంత్రణలో 397 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 4 ప్రభుత్వ వృత్తివిద్యా జూనియర్ కళాశాలలు ఉన్నాయి. గ్రాంట్-ఇన్-ఎయిడ్, సర్వీస్ పరిస్థితులు, విద్యా బోధనాంశాల పరంగా అన్ని వాస్తవిక ప్రయోజనాల రీత్యా మరో 43 ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల కార్యకలాపాలను కూడా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డెరైక్టరేట్ పర్యవేక్షిస్తోంది. ఇంటర్ విద్య (12వ తరగతి) పూర్తి చేసిన తర్వాత సైన్‌‌స, ఆర్‌‌ట్స, కామర్స్, వృత్తివిద్యా కోర్సుల్లో అభ్యర్థులకు విద్యను బోధిస్తున్నారు. 588 జూనియర్ కళాశాలల్లో ఇంజనీరింగ్-టెక్నాలజీ, వ్యవసాయం, హోమ్‌సైన్‌‌స, వైద్య సహాయక రంగం, వ్యాపార-వాణిజ్యం, మానవీయ శాస్త్రం తదితర అంశాల్లో 29 వృత్తివిద్యా కోర్సులను అందిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఉన్నత విద్యకు సంబంధించి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఉన్నత విద్యను అర్హులందరికీ చేరువ చేయడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంది. యువ జనాభా ఎక్కువగా గ్రామాల్లోనే ఉండగా.. ఉన్నత విద్యాసంస్థల్లో అధిక భాగం హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఎక్కువ మంది యువతీయువకులకు ఉన్నతవిద్య అందించడానికి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది.

కళాశాల విద్య
కళాశాల విద్యాశాఖ నాణ్యమైన, సమానత్వంతో కూడిన ఉన్నత విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తేవడంలో శ్రద్ధ వహిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 126 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 69 ఎయిడెడ్ కళాశాలున్నాయి. వీటిలో చదువు నాణ్యతకు సంబంధించిన అంశాలను ఈ శాఖ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ కళాశాలల అభివృద్ధి అవసరాలను కూడా కళాశాల విద్యాశాఖ చూస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లో 87,339 మంది, ఎయిడెడ్ కళాశాలల్లో 58,785 మంది (మొత్తం 1,46,124 మంది) విద్యార్థులు చదువుకుంటున్నారు.

సామర్థ్య నిర్మాణం

నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (ఎన్.ఎ.ఎ.సి.) ఉన్నత విద్యలో నాణ్యతను పరిరక్షిస్తుంది. 2015 జనవరి 31 నాటికి మొదటి ఆవృత్తం (సైకిల్ 1)లో 55 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, రెండో ఆవృత్తంలో 31 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అక్రెడిటేషన్ పొందాయి. కాలేజీ విద్యా కమిషనరేట్‌లో ఎస్.ఎల్.క్యు.ఎ.సి.సి. క్రియాత్మక విభాగంగా రాష్ట్ర నాణ్యతా పూచీ విభాగాన్ని నెలకొల్పారు. ఇది విద్యాసంస్థల్లో అక్రెడిటేషన్ అనంతర కార్యకలాపాలకు ప్రణాళిక వేయడం, నిర్వహించడం; రాష్ట్రంలో విద్యాసంస్థల నాక్ అక్రెడిటేషన్‌ను వేగవంతం చేయడానికి దోహదపడే కార్యకలాపాలు, కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ, నాణ్యతను పెంచే చర్యలు చేపట్టడం లాంటి విధులు నిర్వహిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలలు, సి.సి.ఇ. కార్యాలయాల్లో నాణ్యతా అవగాహన కోసం ఎస్.క్యు.ఎ.సి. అనేక కార్యగోష్ఠులు, సదస్సులను నిర్వహించింది.

సాంకేతిక విద్య
రాష్ట్రంలో సాంకేతిక విద్యను పెంపొందించే బాధ్యత సాంకేతిక విద్యాశాఖపై ఉంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు, పరిజ్ఞానంతో కూడిన ఇంజనీర్లు, నిపుణులను సిద్ధం చేయడం ఈ శాఖ ఆశయం. రాష్ట్రంలో 1356 డిప్లొమా, డిగ్రీ స్థాయి వృత్తి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో మొత్తం సీట్ల సంఖ్య 3,47,950.

నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు
పాలిటెక్నిక్ విద్యార్థుల ఉపాధికల్పన కోసం వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, సాంకేతిక విద్యలో నాణ్యతను పెంచడానికి 27 నాణ్యతా అభివృద్ధి కేంద్రాలను (ఎస్.డి.సి.) ఏర్పాటు చేశారు. ప్రతి ఎస్.డి.సి.ని రూ. 30 లక్షల ఖర్చుతో నెలకొల్పారు. వీటిలో ఇప్పటివరకూ 10,028 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
ఎస్.వి.ఇ.క్యు.ఎఫ్. పైలట్ ప్రాజెక్టు: ఉన్నత విద్యను వృత్తివిద్యగా మలచడానికి సంబంధించి రాష్ట్రంలో అమలు చేయడానికి భారత ప్రభుత్వం నేషనల్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్.వి.ఇ.క్యు.ఎఫ్.) కింద ఒక పైలట్ ప్రాజెక్టును ఆమోదించింది. దీని ద్వారా విద్యకు వృత్తి విద్యా రూపం కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదించిన ఖర్చు రూ. 1247. 73 లక్షలు. ఇందులో కేంద్రం రూ. 1,066.73 లక్షలు, రాష్ట్రం రూ.181 లక్షలు భరిస్తాయి.
స్వల్పకాలిక వృత్తివిద్యా కోర్సులు: ఇంజనీరింగ్, ఐ.టి., హోమ్ సెన్సైస్, పశుగణాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించి ఎంపిక చేసిన స్వల్పకాలిక వృత్తి విద్యాకోర్సులు 24 ఉన్నాయి. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ రాష్ట్రవ్యాప్తంగా చదువు అర్ధంతరంగా ఆపేసిన, పదో తరగతి లేదా ఇంటర్ విఫలమైన/ఉత్తీర్ణులై చదువు ఆపేసిన విద్యార్థులకు ప్రయోజనం కల్పించడానికి మూడు నెలలు, ఏడాది కాలం బోధించే సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తోంది.

ఆరోగ్య రంగం

పౌరులందరికీ మౌలిక ఆరోగ్య సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం అనేక ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో 4863 సబ్-సెంటర్లు, 661 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 114 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 42 ప్రాంతీయ ఆస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులు, 5 మాతా శిశు సంరక్షణ ఆస్పత్రులు, 5 బోధన ఆస్పత్రులతో పాటు 55 పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రాలు, హైదరాబాద్‌లో 11 పట్టణ ఆరోగ్యపోస్టులు, 87 పట్టణ ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా మాతా శిశు ఆరోగ్య సంరక్షణ, బాలల ఆరోగ్య సంరక్షణ, ప్రజలకు కుటుంబ సంక్షేమ సేవలను అందిస్తున్నారు. మాతృ ఆరోగ్య సంరక్షణ సేవల కింద గర్భిణులకు కింద పేర్కొన్న సేవలను సమకూరుస్తున్నారు.

అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా): సామాజిక ఆరోగ్య సాధన క్రమంలో ఆశా కార్యక్రమం కీలకమైంది. మాతా, శిశు ఆరోగ్య కార్యకలాపాలపై సమాజంలోకి ఇది అనేక చర్యలను తీసుకువెళుతుంది. పోషణ, మౌలిక పారిశుద్ధ్యం, ఆరోగ్యకర జీవన విధానాలు, నడవడికలు, పని పరిస్థితులు, అందుబాటులో ఆరోగ్య సేవల సమాచారం, ఆరోగ్య సేవలను సకాలంలో వినియోగించుకోవాల్సిన అవసరాలపై సమాజంలో ‘ఆశా’ జాగృతిని కలిగిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకుగాను మంజూరు చేసిన ఆషా కార్యకర్తల మొత్తం సంఖ్య 28019. ప్రస్తుతం 25818 మంది పని చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు 2660 ఆశా కార్యకర్తలను మంజూరు చేయగా 2502 మంది ఉనికిలో ఉన్నారు.

సమగ్ర అత్యవసర పురుళ్లు, పురిటికందుల సంరక్షణ (సెమాంక్) సేవలు: రాష్ట్రంలో 68 సెమాంక్ కేంద్రాలున్నాయి. ఆస్పత్రి పురుళ్లను పెంపొందించడం; గర్భిణుల అత్యవసర సమస్యలను చూడటం; కాన్పులు, శిశు జననాలకు సంబంధించిన కేసులను చూడటం కోసం 35 నుంచి 40 కిలోమీటర్లకు మించకుండా జిల్లాల్లో ఎంపికచేసిన 4-9 వరకు మొదటి సిఫార్సు యూనిట్లుగా ఈ కేంద్రాలను నెలకొల్పారు. ప్రసూతి వైద్యురాలు, మత్తు నిపుణుల సేవలు, అత్యవసరంగా రక్తం ఎక్కించే సదుపాయాలు ఈ కేంద్రాల్లో 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి.

24 గంటల మాతా, శిశు ఆరోగ్య కేంద్రాలు: రాష్ట్రంలో 24 గంటల మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలైన ప్రజారోగ్య కేంద్రాలు 340 ఉన్నాయి. కాన్పు సమయంలో తల్లుల మరణం 50 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిని నివారించడంతో పాటు నవజాత శిశువులు, పసిబిడ్డల మరణాలకు కళ్లెం వేయడానికి ఈ సంరక్షణ కేంద్రాలు ఆస్పత్రి పురుళ్లను పెంపొందిస్తాయి. ఈ కేంద్రాల్లో 2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 14480 పురుళ్లు పోశారు.

గ్రామ ఆరోగ్య, పోషణ కేంద్రాలు

గ్రామ ఆరోగ్య, పోషణ కేంద్రాలను 32,143 గ్రామాల్లో నిర్వహిస్తూ పెళ్లి వయసుపై అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణుల నమోదు, వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఏడో నెలలో జనన ప్రణాళిక, ప్రసవానంతర సంరక్షణ, మాతృ స్తన్య విధానం విశిష్టతపై చైతన్యం, టీకాల సేవలు, గర్భానికి, గర్భానికి మధ్య వ్యవధి పెంపుపై ప్రచారం, వేసక్టమీ ఆపరేషన్లు, చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు ఈ కేంద్రాల ద్వారా చేపడుతున్నారు.

జననీ సురక్షా యోజన (జేఎస్‌వై): ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ప్రసవం జరిగిన పేదలకు నగదు ప్రోత్సాహకాన్ని ఇచ్చే పథకమే జననీ సురక్షా యోజన. 2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 99,674 మంది ఈ పథకం కింద ప్రయోజనం పొందారు.

జననీ శిశు సురక్షా కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కే): ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ఉచితంగా పురుడు పోయడానికి, శిశువుకు ఏడాదిపాటు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం జననీ శిశు సురక్షా.
2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 75,402 మంది గర్భిణులు ఈ సేవలు పొందారు.

రాష్ట్రీయ కిశోర్ స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కే): కౌమార వయసు వారికి ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ, కౌన్సెలింగ్ కోసం రాష్ర్టంలో భారత ప్రభుత్వం రాష్ట్రీయ కిశోర్ స్వస్థ్యను ప్రారంభించింది. 2014-15లో 165 కౌమార మిత్ర ఆరోగ్య చికిత్స కేంద్రాలు, యువ క్లినిక్‌లను రాష్ర్టంలో నెలకొల్పారు.

శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు

18 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగాలు (ఎస్‌ఎన్‌సీయూ), 61 నవజాత ఆరోగ్య స్థిరీకరణ విభాగాలు (ఎన్‌బీఎస్‌యూ), 581 నవజాత శిశు సంరక్షణ కార్నర్ (ఎన్‌బీసీసీ) లను రాష్ర్టంలో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నవజాత శిశు సంరక్షణ సేవలను పటిష్టం చేసి శిశు మరణాలను తగ్గించడానికి కృషి చేస్తున్నారు.
టీకాలు: కోరింత దగ్గు, డిఫ్తీరియా (కంఠసర్పి), టిటానస్(ధనుర్వాతం), పోలియో, టీబీ(క్షయ),పొంగు (మీజల్స్), హెపటైటిస్-బి(కామెర్లు) రాకుండా ఏడాదిలోపు చిన్నారులకు టీకాలు వేస్తున్నారు. 16 నుంచి 24 నెలల వయసులో డీపీటీ, ఓపీవీ, మీజల్స్ నిరోధానికి తదుపరి మోతాదును ఇస్తున్నారు.
అయిదేళ్లలో డీపీటీ, పదహారేళ్లలో బూస్టర్ డోసులు ఇస్తున్నారు. 2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వేసిన టీకాల వివరాలు.. బీసీజీ 467923, డీపీటీ 466349, పోలియో 465974, మీజల్స్ 464543, పూర్తిస్థాయి టీకాలు 466580, హెపటైటిస్-బి 466571, విటమిన్-ఎ 466691.

కుటుంబ సంక్షేమ సేవలు

కుటుంబ సంక్షేమ కార్యక్రమం కింద సేవల నాణ్యతను మెరుగుపరచడానికి, జనాభాకు అనుగుణంగా కుటుంబ సంక్షేమ సేవలను చేపడుతున్నారు.
సంతాన నిరోధ విధానాలు: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రోత్సహించడానికి పేద ఎస్సీ, ఎస్టీ మహిళలకు వేతన నష్టం భర్తీ కింద రూ.600 (సీఎస్‌ఎస్), రాష్ర్ట సహాయ భృతిగా రూ.280 అందిస్తున్నారు. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న పురుషులకు రూ. 1100 చెల్లిస్తారు. 2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 141616 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.
వైద్య అవసరపరంగా గర్భం తొలగింపు (ఎంటీపీ): అవాంఛిత గర్భాన్ని తొలగించడానికి అర్హులైన వారికి ఈ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంటీపీ సేవలు అందిస్తున్నారు. 2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ర్టంలో 2919 ఎంటీపీలు జరిగాయి.
కుటుంబ నియంత్రణ బీమా పథకం: సంతాన నిరోధానికి అంగీకరించిన వారికి బీమా సౌకర్యం కల్పిస్తారు.

గిరిజన ఆరోగ్య సేవలు

గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ఐటీడీఏల ద్వారా పలు సేవలు అందిస్తున్నారు. దీని కింద 86 పీహెచ్‌సీలు,10 సీహెచ్‌సీలు, 6 ఏరియా ఆస్పత్రులు, 10 శిశు జనన నిరీక్షణ గృహాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడానికి 2987 సీహెచ్‌డబ్ల్యూఎస్‌లను అద్దెకు తీసుకున్నారు.
మాతా, శిశు ఆరోగ్య పథకం, ఎపిడెమిక్ టీమ్స్ అవుట్ రీచ్ సర్వీసెస్: నాణ్యమైన సేవలను అందించడానికి మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు వైద్య నిపుణులను రప్పిస్తున్నారు. 2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు నిపుణుల శిబిరాల ద్వారా 9840 మంది రోగులను పరీక్షించారు.
ప్రసవ నిరీక్షణ గృహాల నిర్వహణ: గిరిజనుల్లో ఆస్ప్రత్రి ప్రసవాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించినవే శిశు జనన నిరీక్షణ గృహలు (బీడబ్ల్యూహెచ్). 2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 932మంది మహిళలకు ఈ గృహాల ద్వారా సేవలు అందాయి. ఆరోగ్య పరీక్షలకు రాలేని మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను గుర్తించేందుకు 25 ఎంసీహెచ్ బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక చొరవ: అత్యవసర సమయాల్లో రోగులకు రవాణా సౌకర్యాన్ని సమకూరుస్తారు. అలాగే ప్రతి గ్రామంలోనూ వివిధ ఆరోగ్య సేవలు అందించడానికి నిర్ణీత రోజున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో గుర్తింపు, నిర్ధారణ, చికిత్స, వివరాల నమోదు, సీరియస్ కేసులను తగిన ఆస్పత్రులకు సిఫారసు, ఆరోగ్య సమాచార హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లోని రోగులను రోడ్డు వరకు చేరవేయడానికి 278 పల్లకీలను ప్రభుత్వం సరఫరా చేసింది.
అత్యవసర ఆరోగ్య రవాణా పథకం: సుశిక్షితులైన సాంకేతిక సిబ్బందితో 319 అంబులెన్‌‌సలను 108 హెల్ప్‌లైన్ నంబర్‌తో ఏర్పాటు చేశారు. 2014 ఏప్రిల్, డిసెంబర్ మధ్య 355084 అత్యవసర కేసుల్లో రవాణా సేవలు అందిచారు.
నిర్ణీత రోజు ఆరోగ్య సేవలు (ఎఫ్‌డీహెచ్‌ఎస్): పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు 3 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న గ్రామాల్లో నెలకోసారి ఆరోగ్య సేవలను అందించడానికి హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో 200 సంచార ఆరోగ్య వాహనాలను సిద్ధం చేశారు. 2014 ఏప్రిల్, డిసెంబర్‌ల మధ్య 26,93,120 మంది ఈ పథకం కింద సేవలు పొందారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమం: ప్రభుత్వం అందిస్తున్న వివిధ ఆరోగ్య సేవలకు చేయూతనందించడమే జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌హెచ్‌ఎం) ప్రధాన ఆశయం. ఎన్‌హెచ్‌ఎం కింద భారత ప్రభుత్వం 75 శాతం, 25శాతం వాటా రాష్ర్ట ప్రభుత్వం భరిస్తున్నాయి.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)

తీవ్ర గాయాల చికిత్స కేంద్రాలు: మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి, కామారెడ్డి ఏరియా ఆస్పత్రి, తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్లను నెలకొల్పడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.
రక్తాంశ విభజన విభాగాలు: అనేక వ్యాధుల్లో రోగులకు రక్తం ఎక్కించాల్సి వస్తుంది. అయితే డెంగీ లాంటి కొన్ని వ్యాధుల్లో మొత్తం రక్తానికి బదులు రక్తంలోని కొన్ని అంశాలను అందిస్తే సరిపోతుంది. అలాంటప్పుడు మిగిలిన రక్తంలోని అంశాలు ఇతర రోగులకు ఉపయోగపడతాయి. అయితే ఇలా రక్తాన్ని వేర్వేరు రోగులకు ఉపయోగపడేలా చేయాలంటే దానిలోని అంశాలను వేరు చేయాలి. టీవీవీపీ కింద 12 ఆస్పత్రుల కోసం రక్తాంశాలను వేరుచేసే విభాగాల కొనుగోలు ప్రక్రియను రాష్ర్ట ప్రభుత్వం చేపట్టింది.
స్వైన్‌ఫ్లూ చికిత్స: రాష్ర్టంలోని అన్ని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ చికిత్స, మేనేజ్‌మెంట్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్వైన్‌ఫ్లూ సోకిన రోగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలను హైదరాబాద్, నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్(ఐపీఎం), నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ మందులు, సిరప్‌లను అన్ని జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచారు. స్వైన్‌ఫ్లూ చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.
ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ: హ్యూమన్ ఇమ్యునో డెఫిిషియన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) కాలక్రమంలో ఎయిడ్స్ ను కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మూడుకోట్ల యాభైలక్షల మందికి హెచ్‌ఐవీ సోకినట్లు అంచనా. భారతదేశంలో 25 లక్షల మంది, తెలంగాణలో రెండు లక్షల మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులున్నారు.

ఆరోగ్య శ్రీ పథకం

రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం ఇది. ‘అందరికీ ఆరోగ్యం’ అనే లక్ష్యాన్ని సాధించడం ఈ పథకం ఆశయం. ఆరోగ్య బీమా రంగంలో ఒక అరుదైన పీపీపీ నమూనా ఈ పథకం.
ఆశయం, పరిమితి: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలను విపత్కర ఆరోగ్య ఖర్చుల నుంచి కాపాడటం ఈ పథకం ఆశయం. 29 విభాగాల్లో గుర్తించిన వ్యాధులకు జాబితాలోని 944 చికిత్సలను ఈ పథకం అందిస్తోంది. కుటుంబానికి ఏడాదికి లక్షా యాభైవేల రూపాయల వరకు ఖరీదైన సేవలు ఫ్లోటర్ ప్రాతిపదికన అందుతాయి. మరో రూ. 50 వేలు బఫర్ ప్రాతిపదికన అందుతాయి.
104 కాల్ సెంటర్: ఈ పథకానికి సంబంధించిన సమస్యల నివృత్తి కోసం ఫోన్‌కాల్ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ పథకం కిందకు వచ్చే వ్యాధులు, నెట్‌వర్క్ ఆస్పత్రులు తదితర వివరాలు ఈ కాల్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఆరోగ్యశ్రీ పథకం కృషి:
  • 2015 జనవరి 31వరకు ఉన్న వివరాల ప్రకారం 2014-15లో జరిగిన చికిత్సలు 1,96,671, వ్యయం రూ.516.58కోట్లు.
  • 2014-15లో అడిగిన పరిహారాలు రూ.964.89 కోట్లు, చెల్లించిన పరిహారాలు రూ. 406.76కోట్లు.
  • పథక ప్రారంభం నుంచి నిర్వహించిన ఆరోగ్య శిబిరాలు 17,080. పరీక్షలు చేయించుకున్న రోగులు 38,34,538.
  • ఆరోగ్య శిబిరాల నుంచి ఆస్పత్రులకు సిఫారసు చేసిన రోగుల సంఖ్య 123785.
 
గ్రామీణాభివృద్ధి
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గ్రామీణ జనాభా 215.85 లక్షలు. ఇది మొత్తం జనాభాలో 61.3 శాతం. రాష్ర్ట స్థూల అభివృద్ధికి.. గ్రామీణుల అభివృద్ధి, వారి జీవనోపాధి కీలకావసరమని తెలుస్తోంది. వాటర్‌షెడ్ అభివృద్ధి, స్వయం సహాయబృందాలు, మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలైన కార్యక్రమాలను రాష్ర్టంలో గ్రామీణాభివృద్ధి శాఖ అమలుచేస్తోంది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎస్‌ఆర్‌ఈజీఎస్):
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005 సెప్టెంబర్‌లో నోటిఫై చేశారు. గ్రామీణ పేద కుటుంబానికి 100 రోజులపాటు వేతనంతో కూడిన పనిని విధిగా కల్పించాలని ఈ చట్టం చెబుతోంది.
తెలంగాణలో ఎంజీఎస్‌ఆర్‌ఈజీఎస్ అమలు: రాష్ర్టంలో తొమ్మిది జిల్లాల్లోని 8,880 గ్రామ పంచాయతీల్లో ఈ పథకం అమలవుతోంది. ఇప్పటి వరకు 55 లక్షల జాబ్ కార్డులు జారీ చేశారు. ఉపాధి కోరిన 1.3 కోట్ల మందికి పని కల్పించారు.
కీలక చర్యలు: ఎంజీఎస్‌ఆర్‌ఈజీఎస్‌ను సమర్థంగా అమలు చేయడానికి కొన్ని చర్యలు చేపట్టారు. అవి..
  • రాష్ట్రీయ గ్రామీణ అభివృద్ధి సమాచారం (రాగాస్): క్షేత్ర సిబ్బందికి సదుపాయం కలిగించేలా లావాదేవీలను నిర్వర్తించే అప్లికేషన్‌ను సమకూర్చడం. దీంతో పాలనాధికారుల పని సులువవుతుంది.
  • వెబ్ పోర్టల్ (ఎంఐఎస్ రిపోర్ట్స్): ఉపాధి కల్పన, పనుల వివరాలు, ఖర్చు, పనుల నివేదికలు మొదలైన సమాచారాన్ని వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ సిస్టం: ఆన్‌లైన్ నగదు బదిలీ ద్వారా నిధులు అందిం చేందుకు (ఇ-ఎఫ్‌ఎంఎస్)అనే నగదు బదిలీ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు.
  • ఎలక్ట్రానిక్ మస్టర్ అండ్ మెజర్‌మెంట్ సిస్టం (ఈఎంఎంఎస్): ఇది మొబైల్ ఫోన్ ఆధారంగా ఏర్పాటైన పరిజ్ఞానం. క్షేత్ర సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించారు. గిరాకీని గ్రహించడం, పని కేటాయింపు, ఇ-మస్టర్, ఇ-మేనేజ్‌మెంట్, ఇ-తనిఖీ మెజర్‌మెంట్, ఇ-మస్టర్ తనిఖీ మొదలైన వాటిని కేవలం మొబైల్‌ని ఉపయోగించి పూర్తి చేయవచ్చు.
బయోమెట్రిక్ విధానంతో చెల్లింపులు: బ్యాంకు నియమించిన సీఎస్‌పీ ద్వారా వేతనాలు పంపిణీ చేస్తారు. బ్యాంకు తోనూ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ సర్వర్‌తోనూ అనుసంధానం చేసిన బయోమెట్రిక్ రీడర్ సీఎస్‌పీ వద్ద ఉంటుంది. దీంతో లావాదేవీలన్నీ సమాచార నిధికి వెంటనే చేరుతాయి. ఈ బయోమెట్రిక్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను తపాలా శాఖ, బ్యాంకుల ద్వారా, ఆధార్ ఆధారిత చెల్లింపుల పద్ధతికి మార్చనున్నారు.
హెచ్‌ఆర్‌ఎంఎస్: వ్యవస్థాగత ఏర్పాటు (ఇన్‌స్టిట్యూషనల్ అరేంజ్‌మెంట్)కి తోడు ఒక హెచ్‌ఆర్ విధానం అమలులో ఉంది. ఉద్యోగుల ప్రయోజనాల సంరక్షణకు ఈ హెచ్‌ఆర్ విధానం పరిపూరకంగా పనిచేస్తుంది.

ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. అమలు
గ్రామీణాభివృద్ధిలో భాగంగా చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.)ను తెలంగాణాలో సమర్థంగా అమలు చేయడానికి కీలక చర్యలు తీసుకుంటున్నారు. శ్రద్ధగా ముందుకు వచ్చిన శ్రామికులందరినీ శ్రమ శక్తి సంఘాలు (ఎస్.ఎస్.ఎస్. గ్రూపులు)గా వర్గీకరించారు. ఒక్కో గ్రూపులో 10 నుంచి 30 మంది వరకు సభ్యులు ఉండవచ్చు. గ్రూపులోని ప్రతి సభ్యుడికి వేతనంతో కూడిన 150 రోజుల పని కల్పించడంతోపాటు పూర్తి పారదర్శకత సాధించడానికి ఈ బృందాల ఏర్పాటు దోహదపడుతుంది.
నాణ్యతా నియంత్రణ విభాగం: చేపట్టిన పనుల నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేకంగా నాణ్యతా నియంత్రణ విభాగాన్ని నెలకొల్పారు. ఈ విభాగం క్రమం తప్పకుండా పనులను తనిఖీ చేస్తుంది. నాణ్యతా నియంత్రణ అధికారులు సాంకేతిక సిబ్బంది సామర్థ్య నిర్మాణాన్ని పెంపొందించడానికి కూడా మద్దతిస్తారు.
అన్ని ప్రతిపాదిత పనులకు సంబంధించిన పనులు, తీర్మాన అధ్యయనాలను సి.ఆర్.డి. చేపడుతుంది. ఏటా ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. కింద చేపట్టిన పనులకు సంబంధించి ప్రత్యేకమైన గ్రామీణ ప్రామాణిక షెడ్యూల్‌ను ఇది వెలికితీస్తుంది.
సమస్యల పరిష్కార విభాగం/ కాల్ సెంటర్: ఈ పథకం అమలుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులనైనా నమోదు చేయడానికి టోల్ ఫ్రీ 1800-200-1001 నంబరుతో కాల్ సెంటర్‌ను నెలకొల్పారు.
పి.డబ్ల్యు.డి.లకు ప్రత్యేక ఏర్పాట్లు: వైకల్యం ఉన్న వ్యక్తులకు ‘వికలాంగుల ఎస్.ఎస్.ఎస్.’ అనే ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారు. 30 శాతం అదనపు వేతనం, ఎంపికలో పి.డబ్ల్యు.డి.లకు ప్రాధాన్యం, వీటికి ప్రత్యేక షెడ్యూలు రేట్లు, గుర్తించిన పి.డబ్ల్యు.డి.లకు ప్రత్యేక పనుల కేటాయింపు మొదలైనవి చేపడుతున్నారు.

ఏడాదిలో తీసుకున్న కీలక నిర్ణయాలు
  • వేతనాన్ని రూ.149 నుంచి రూ.169కి పెంచారు.
  • ఆధార్‌తో అనుసంధానం: మొత్తం 75 లక్షల మంది లబ్ధిదారులను ఆధార్‌తో నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 56.9 లక్షల మందికి యూనిక్ ఐడెంటిఫికేషన్ (యు.ఐ.డి.) లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్ (ఇ.ఐ.డి.)తో గుర్తించారు. 47.8 లక్షల మంది (76 శాతం) లబ్ధిదారుల డెమో వివరాలను ప్రోగ్రాం ఆఫీసర్లు అధీకృతం చేశారు.
  • ప్రక్షాళన చేసిన ఇ.ఎఫ్.ఎం.ఎస్.లు: అన్ని వేతన చెల్లింపులు నేరుగా ఉపాధి కల్పితుల ఖాతాలో జమ అవుతాయి. బయోమెట్రిక్ తనిఖీ ఆధారంగా వీటిని చెల్లిస్తున్నారు.
  • మొక్కల పెంపకాన్ని చేపట్టడం ద్వారా రాష్ర్టంలో పచ్చదనాన్ని అధికం చేయడానికి తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రకటించారు.

సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ఫ్)
గ్రామీణ పేదరికాన్ని తొలగించడానికి ఉద్దేశించిన వ్యవస్థ సెర్‌‌ప. ప్రపంచ బ్యాంకు సహాయంతో 2000 సహస్రాబ్ది ప్రారంభంలో ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు మహిళలను ప్రోత్సహించింది. కమ్యూనిటీ ఆధారిత సంస్థ (సి.బి.ఒ.)ల కోవలోకి వచ్చే యంత్రాంగం ఆర్థిక ప్రగతిలో మారుమూల వర్గాలను చేర్చడానికి ఊతమిచ్చింది. అవకాశాలను పెంచింది. తర్వాత భూమి ఆధారిత జీవనోపాధి పెంచడానికి, నైపుణ్యాలను అధికం చేయడానికి, జీవనోపాధికి అండగా నిలవడానికి, ప్రభుత్వ కార్యక్రమాలను అందిపుచ్చుకోవడానికి, ఆరోగ్య, విద్యా ప్రయోజనాలను మెరుగుపరచుకోవడానికి కూడా వీటిని విస్తరించారు. రాష్ర్టంలో దాదాపు 90 శాతం పేద కుటుంబాలకు ఈ కమ్యూనిటీ సంస్థల్లో సభ్యత్వం ఉంది. 47,41,891 మంది మహిళలు గ్రామ/జనావాస స్థాయిలో 4,16,811 స్వయం సేవా బృందా (ఎస్.హెచ్.జి.)లను ఏర్పాటు చేసుకున్నారు. ఎస్.హెచ్.జి.లు గ్రామస్థాయిలో సమాఖ్యగా ఏర్పడి విలేజ్ ఆర్గనైజేషన్స్ (వి.ఒ.)లుగా, వి.ఒ.లు మండల స్థాయిలో సమాఖ్యగా ఏర్పడి మండల మహిళా సమాఖ్య (ఎం.ఎం.ఎస్.)గా ఏర్పడ్డాయి. ప్రస్తుతం 17,811 వి.ఒ.లు, 438 ఎం.ఎం.ఎస్.లు ఉన్నాయి. ఈ మండల మహిళా సమాఖ్యలు జిల్లా స్థాయిలో సమాఖ్యగా ఏర్పడి 9 జిల్లా సమాఖ్యలుగా ఆవిర్భవించాయి.
కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పర్యటించి బీడీ కార్మికుల కష్టాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బీడీ కార్మికులకు పింఛన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం సముచిత మార్గదర్శక సూత్రాలను సిద్ధం చేస్తోంది.

తెలంగాణ పల్లె ప్రగతి ప్రాజెక్టు
పేదల ‘సమ్మిళిత అభివృద్ధి’ సాధనకు వీలుగా వ్యవస్థాగత వేదికలను పటిష్టం చేయడంపై తెలంగాణ పల్లె ప్రగతి ప్రాజెక్టు (తెలంగాణ రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు- టి.ఆర్.ఐ.జి.పి.) దృష్టి సారిస్తుంది. ఇందుకుగాను జీవనోపాధి అవకాశాలను పెంచుతుంది. నూతన మార్గాల్లోకి విస్తరిస్తుంది. వీటితో పాటు మానవాభివృద్ధి చర్యలు, చట్టం, ప్రభుత్వ పథకాల ద్వారా లభిస్తున్న ప్రయోజనాలను అందిపుచ్చుకునేలా.. ముఖ్యంగా నిరుపేద గ్రామీణ కుటుంబాలు అవకాశాలను వినియోగించుకునేలా చేయడానికి కృషి చేస్తుంది. ప్రతిపాదిత ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 642 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వ వాటా రూ. 192 కోట్లు కాగా, ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి రూ. 450 కోట్లు సమకూరుస్తున్నారు. ప్రాజెక్టు అమలుకు నిర్దేశించిన కాలవ్యవధి అయిదేళ్లు (2015 ఫిబ్రవరి నుంచి 2020 ఫిబ్రవరి వరకు). లక్ష్యంగా పెట్టుకున్న లబ్ధిదారులు చిన్నకారు, సన్నకారు రైతులు, రాష్ర్టంలో అత్యంత వెనుకబడిన 150 మండలాల్లో సుమారు 6,000 గ్రామాల్లో వివిధ సమాజాల నుంచి తీసుకున్న ఎస్.సి./ఎస్.టి. కుటుంబాలు. ఈ ప్రాజెక్టులో అయిదు భాగాలుంటాయి. అవి.. విలువ శ్రేణి అభివృద్ధి; మానవాభివృద్ధి; పల్లె ప్రగతి సేవా కేంద్రం; ఐ.సి.టి., భాగస్వాములు; ప్రాజెక్టు అమలుకు అండదండ.

ఆర్థిక సదుపాయం - బ్యాంకుతో అనుసంధానం
ఎస్.హెచ్.జి. ఉద్యమం ద్వారా మహిళలతో భారీ ఎత్తున పొదుపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్.హెచ్.జి.లు పొదుపు చేయడమే కాకుండా బృందం వద్ద ఏర్పడిన మూలనిధి నుంచి చిన్న చిన్న రుణాలు కూడా తీసుకుంటారు. ఎస్.హెచ్.జి.ల వద్ద పోగుపడిన సంచిత పొదుపు నిధి రూ.1845 కోట్లుగా ఉంది. ఏటా దాదాపు రూ. 378 కోట్లు జమ అవుతున్నాయి. కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మొత్తం రూ.435 కోట్లు. బ్యాంకు అనుసంధానం/ నగదు పరపతి సంచిత పరిమితి రూ.22657 కోట్లు కాగా ఏటా పూర్తిగా సాధించగలిగిన అవకాశం రూ.4000 కోట్ల వరకు ఉంటుంది.
స్త్రీ నిధి: పేదలకు సకాలంలో, సముచిత రీతిలో రుణాలను అందించడంలో స్త్రీ నిధి ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. దీని నుంచి ఒక కొలతను తీసుకొని, ఆ భాగాన్ని జీవనోపాధి అభివృద్ధి వ్యవస్థగా పరిగణించి, తద్వారా నిరుపేదల ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు. 2015-16లో రూ. 1100 కోట్లు రుణంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్.ఎస్.జి.లకు చెందిన 436 మండల మహిళా సమాఖ్య (ఎం.ఎం.ఎస్.)లు తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపి ‘స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్’ను నెలకొల్పాయి. అరకొర రుణ సదుపాయ సమస్యను పరిష్కరించుకోవడం, సకాలంలో రుణ సదుపాయం పొందడం, ప్రత్యేకించి అవసరమైన 48 గంటల్లో రుణం పొందడానికి, నిరుపేదలు తమ అత్యవసరాలను ఆలస్యం లేకుండా తీర్చుకోవడానికి ఈ సహకార పరపతి సమాఖ్యను నెలకొల్పుకున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 2014 జనవరి వరకు 423 మండలాలకు, 7,432 వి.ఒ.లలో 60,797 ఎస్.హెచ్.జి.లకు చెందిన 2,24,902 మంది సభ్యులకు రూ.481.80 కోట్లను రుణాలుగా పంపిణీ చేశారు.

మానవాభివృద్ధి
వికలాంగుల సమ్మిళిత అభివృద్ధి
: సమాన అవకాశాలు, హక్కుల సంరక్షణ సి.బి.ఒ.ల ద్వారా సంపూర్ణ భాగస్వామ్య సాధన వికలాంగుల సమ్మిళిత అభివృద్ధిలో భాగాలు. వికలాంగులకు సహాయం చేసే ఐ.కె.పి. ప్రయత్నాల ద్వారా 4.1 లక్షల మందికి పైగా గ్రామీణ వికలాంగులకు ప్రయోజనం పొందారు. వారు సంఘటితమై సొంత సి.బి.ఒ.లను అభివృద్ధి చేసుకోవడానికి ఇవి సహాయపడ్డాయి.
438 మండలాల్లో 436 మండల వికలాంగుల సమాఖ్య (ఎం.వి.ఎస్.)లు, 9 జిల్లా వికలాంగుల సమాఖ్య (జడ్.వి.ఎస్.)లు, పి.డబ్ల్యు.డి. కార్యకలాపాలు అమలవుతున్నాయి. వీటి ద్వారా 198207 మంది వైకల్యం ఉన్న వ్యక్తులు లబ్ధి పొందుతున్నారు. వీరంతా తెలంగాణ రాష్ర్టంలో 20,368 ప్రత్యేక పి.డబ్ల్యు.డి.ఎస్.హెచ్.జి.లుగా ఏర్పడ్డారు. జీవనోపాధిని పెంచుకోవడానికి సి.ఐ.ఎఫ్. ద్వారా రూ.18.32 కోట్లు, బ్యాంకుల్లో ముడిపెట్టిన రుణాల ద్వారా రూ. 214 కోట్లు, స్త్రీ నిధి, రివాల్వింగ్ ఫండ్ ద్వారా రూ.9.9 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు.
సమాజ నిర్వహణలో ఆరోగ్యం, పోషకాహారం: గర్భిణులు, పసిబిడ్డలకు పాలిస్తున్న స్త్రీలకు మూడు పోషకాహార భరితమైన భోజనాలు, ఆరోగ్యవిద్యను అందించడానికి దాదాపు 1800 పోషకాహార, డే కేర్ సెంటర్ (ఎన్.డి.సి.సి.)లను నెలకొల్పారు.
స్త్రీ -పురుష సమానత్వ ప్రబోధం: స్త్రీ- పురుష సమానత్వానికి సంబంధించి సామాజిక, మానవ అభివృద్ధిలో భాగంగా, 436 మండల స్థాయి సామాజిక కార్యాచరణ సంఘాలను ఏర్పాటు చేశారు. హింస, అన్యాయాన్ని పరిహరించడం, నివారించడం ధ్యేయంగా 340 కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తున్న కింద పేర్కొన్న సామాజిక సమస్యలను తగ్గించడానికి ఇవి కృషి చేస్తున్నాయి.
  • మహిళలపై జరిగే నేరాలు (అత్యాచారం, లైంగికపరమైన వేధింపులు, ఏడిపించడం, యాసిడ్ దాడులు)
  • గృహహింస
  • వరకట్నం కోసం వేధించడం
  • గర్భస్థ శిశువు ఆడపిల్ల అని తెలిసి గర్భవిచ్ఛేదం చేయించడం/ ఆడ శిశువులను హతమార్చడం (దీనివల్ల మగ, ఆడనిష్పత్తి దెబ్బతింటోంది)
  • బాలలను పనిలో పెట్టడం
  • బాల్య వివాహాలు
  • మద్యపాన వ్యసనం (మగవారిలో మద్యపాన వ్యసనం పెరగడం వల్ల మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి)
  • ఎస్.సి./ఎస్.టి. అత్యాచార కేసులు
  • జోగిని/బసివిని/ మాతంగి వ్యవస్థలు
  • ఆడపిల్లల విక్రయం, వ్యభిచారం చేయించడం.
  • క్షుద్ర ప్రతీకారాలు (క్షుద్ర విద్యలు చేస్తున్నారనే అనుమానంతో మహిళల మీద హింసకు పాల్పడటం)
సమాజ నిర్వహణలో రాష్ర్టంలో 340 కుటంబ కౌన్సెలింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి దృష్టికి వచ్చిన 31991 కేసుల్లో 26052 కేసులను పరిష్కరించాయి.

గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలకు మధ్యంతర కేంద్రంగా సేవలందించే వ్యవస్థ గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ. వివిధ రకాల పథకాల ద్వారా తాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నారు. వీటిలో చేతి పంపులతో బోరు బావులు, సురక్షిత నీటి సరఫరా పథకాలు, సమాజ రక్షణలో అమలు జరిగే నీటి సరఫరా పథకాలు ముఖ్యమైనవి.
కింద పేర్కొన్న ఆశయాల సాధన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
  • గ్రామీణ ప్రజలందరికీ తాగడానికి యోగ్యమైన, సురక్షితమైన నీటిని తగినంతగా అందజేయడం.
  • ఫ్లోరైడ్ నీరు, ఉప్పు నీరు, ఇతర కలుషిత నీరున్న ప్రాంతాల్లో సురక్షిత నీటి సరఫరా.
  • పూర్తి స్థాయిలో, అందరికీ మంచి నీరు అందే స్థాయికి జనావాసాలన్నింటినీ తీసుకెళ్లడం.
  • వనరులు/ పథకాలు నిలదొక్కుకునే విధంగా తగిన చర్యలు.
  • అన్ని జనావాసాలకు తగిన పారిశుధ్య సదుపాయాలు.
జనావాసాలకు తాగునీటి సదుపాయాలను కల్పించడానికి,పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి సంబంధించిన పథకాలను అమలు చేయడానికి/ పనులను పూర్తి చేయడానికి, వివిధ రాష్ర్ట ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎన్.ఆర్.డి.డబ్ల్యు.పి. 13వ ఆర్థిక సంఘం, నిర్మల్ భారత్ అభియాన్ (ఎన్.బి.ఎ.)లతో పాటు ఇతర సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయి. నాబార్డ్, హడ్కో, ప్రపంచ బ్యాంకు నుంచి రుణాల రూపంలో కూడా నిధులను సమీకరిస్తున్నారు.
నీటి సరఫరాకు మౌలిక సదుపాయాలు: 2015 ఫిబ్రవరి 1 నాటికి ఎన్.ఆర్.డి.డబ్ల్యు.పి., నాబార్డ్, ప్రపంచబ్యాంకు, 13వ ఆర్థిక సంఘం గ్రాంట్లు మొదలైనవాటితో 15,208 జనావాసాలకు ప్రయోజనం చేకూర్చే 6284 పనులు రూ. 3354.15 కోట్ల వ్యయంతో అమల్లో ఉన్నాయి. 2014-15లో వీటి ద్వారా 2085 జనావాసాలకు ప్రయోజనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2015 జనవరి నాటికి 508.21 కోట్లు ఖర్చు చేయగా 1854 జనావాసాలకు పూర్తి ప్రయోజనం చేకూరింది. ఇందులో ఇప్పటివరకు పాక్షికంగా సదుపాయాన్ని పొందుతున్న 1658 జనావాసాలు, నాణ్యత దెబ్బతిన్న 196 జనావాసాలు ఉన్నాయి.
Published date : 15 Oct 2015 05:51PM

Photo Stories