Skip to main content

Indian History : అఖిల భారత యువజన కాంగ్రెస్‌ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది..?

Indian history competitive exams on incidents in viceroys period

ఆధునిక భారతదేశ చరిత్ర – బ్రిటిషర్ల పాలన
వైస్రాయ్‌లు

లార్డ్‌ చెమ్స్‌ఫర్డ్‌ (1916–21)
ఇతడి కాలంలో 1916లో కాంగ్రెస్‌ లక్నో సమావేశంలో అతివాదులు, మితవాదులు, హిందూ–ముస్లింలు ఏకమయ్యారు. 1917లో చంపారన్‌ సత్యాగ్రహం, 1918లో అహ్మదాబాద్‌లో నూలుమిల్లుల ఉద్యమం జరిగాయి. 1919లో మాంటెగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు ప్రవేశపెట్టారు. వీటి ద్వారా ద్వంద్వ పరిపాలన (Diarchy) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలు కల్పించారు. ఆర్థిక వ్యవహారాలు, శాంతిభద్రతలు గవర్నర్‌ ప్రత్యక్ష ఆధీనంలో (Reserved Sub­j­ects); విద్య, ఆరోగ్యం, వ్యవసాయం మొదలైనవి శాసన సంబంధమైన అంశాలు (Transferred Subjects)గా ఉంటాయి. దీని ద్వారా ఎగువసభ, దిగువ సభలు ఏర్పడ్డాయి. చెమ్స్‌ఫర్డ్‌ కాలంలోనే 1919లో జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోత జరిగింది.  1919లో ఢిల్లీలో అఖిల భారత ఖిలాపత్‌ సమావేశం జరిగింది. 
1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించి పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలను బహిష్కరించారు. గాంధీజీ తనకు ఇచ్చిన కైజర్‌–ఇ–హింద్‌ పతకాన్ని తిరిగి ఇచ్చేశారు. 1920లో బాలగంగాధర్‌ తిలక్‌ మరణించారు. సి.ఎన్‌. బెనర్జీ ఇండియన్‌ లిబరల్‌ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఖిలాపత్‌ ఉద్యమం ప్రారంభమైంది. పుణేలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.

Good News For Government Employees : ప్రభుత్వ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. వీరికి దసరా కానుకగా...

లార్డ్‌ రీడింగ్‌ (1921–26) 

ఇతడి కాలంలో అలీగఢ్‌ జామియా మిలియా ఇస్లామియా (జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయం), బిహార్‌ విద్యాపీఠ్, కాశీ విద్యాపీఠ్, గుజరాత్‌ విద్యాపీఠ్‌ తదితర విద్యాసంస్థలను స్థాపించారు. 1921లో పంజాబ్‌లో సిక్కులు గురుద్వారాల నుంచి అవినీతిపరులైన మహంతులను తొలగించడానికి అకాలీ ఉద్యమాన్నిప్రారంభించారు. 1922లో చౌరీచౌరాలో ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను తగులబెట్టారు. ఈ ఘటనలో 22 మంది పోలీసులు మృతి చెందారు. దీంతో  గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు. 1922 డిసెంబర్‌లో చిత్తరంజన్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ కలిసి స్వరాజ్య పార్టీని స్థాపించారు. 1921లో ఎం.ఎన్‌. రాయ్‌ భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. 1926లో మతకలహాలు చెలరేగాయి. వీటిలో భాగంగా ప్రముఖ నాయకుడు, జాతీయవాది అయిన స్వామి శ్రద్ధానంద్‌ను మతచాంధసవాదులు హత్య చేశారు. కె.బి. హెగ్డేవార్, ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను స్థాపించారు. రౌలత్‌ చట్టాన్ని రద్దు చేశారు.

లార్డ్‌ ఇర్విన్‌ (1926–31)

ఇర్విన్‌ కాలంలో 1928 ఫిబ్రవరిలో సైమన్‌ కమిషన్‌ భారతదేశానికి వచ్చింది. ఇందులో భారతీయులెవరికీ సభ్యత్వం కల్పించలేదు. దీంతో ఈ కమిషన్‌కు దేశవ్యాప్తంగా నిరసన ఎదురైంది. 1928 డిసెంబర్‌లో తొలిసారిగా అఖిల భారత యువజన కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నాయకత్వంలో రైతులు 1928లో పన్నుల నిరాకరణోద్యమం సాగించారు. 1928లో చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో ‘హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌’ అనే విప్లవ సంస్థ ఆవిర్భవించింది. భగత్‌సింగ్, బి.కె. దత్తు కలిసి 1929 ఏప్రిల్‌ 8న కేంద్ర శాసనసభలో బాంబు విసిరారు. ప్రజారక్షణ బిల్లు ఆమోదానికి నిరసనగా వీరు ఈ ఘటనకు పాల్పడ్డారు. 1930లో చిట్టగాంగ్‌లో ప్రభుత్వ ఆయుధాగారంపై దాడి జరిగింది. సూర్యాసేన్‌ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో మహిళలు సైతం పాల్గొన్నారు. రాజకీయ ఖైదీలను ఉంచే జైళ్లలో దుర్భర పరిస్థితులు ఉండేవి.

దీనికి నిరసనగా జతిన్‌దాస్‌ అనే యువకుడు 63 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి ప్రాణత్యాగం చేశాడు. 1931లో భగత్‌సింగ్,  రాజ్‌గురును పోలీసు అధికారుల హత్యకేసుల్లో విచారించి ఉరితీశారు. 1929లో  కాంగ్రెస్‌ పార్టీ లాహోర్‌లో సమావేశమైంది. ‘సంపూర్ణ స్వరాజ్యం’ కాంగ్రెస్‌ ఆశయమని ఈ సమావేశంలోనే ప్రకటించారు. అదే ఏడాది త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ 1930 మార్చి 12న దండి సత్యాగ్రహం ప్రారంభించారు. ఇదే ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధికెక్కింది. 1930లో జరిగిన తొలి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి భారతీయ నాయకులను ఆహ్వానించారు. కానీ, సైమన్‌ నివేదికపై చర్యకు నిరసనగా వీరు సమావేశాన్ని బహిష్కరించారు. తర్వాత గాంధీ–ఇర్విన్‌ సంధి జరిగింది. ఉద్యమాన్ని నిలిపివేశారు.

Gurukula Students Food Problems: గురుకులంలో విద్యార్థుల కష్టాలు

లార్డ్‌ వెల్లింగ్‌టన్‌ (1931–36)

ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ నాయకత్వంలో పఠాన్లు ‘ఖుదాయ్‌ ఖిద్మత్‌ గార్‌’ అనే సంస్థను ప్రారంభించారు. దీనికి భగవంతుడి సేవకులని అర్థం. వీరినే ‘రెడ్‌ షర్ట్‌’లు అని కూడా పిలుస్తారు. మణిపూర్‌ వాసులు జాతీయోద్యమంలో సాహసోపేత పాత్ర పోషించారు. గాంధీజీ పిలుపు మేరకు నాగాలాండ్‌ వీరనారి ‘రాణి గైడిన్‌లియూ’ పదమూడేళ్ల వయస్సులోనే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఆమె తిరుగుబాటు జరిపారు. 1932లో బ్రిటిష్‌ ప్రభుత్వం రాణికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 1947లో స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం ఆమెను విడుదల చేసింది. 1931లో రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనడానికి గాంధీజీ లండన్‌ వెళ్లారు. ఈ సమావేశంలో ‘కమ్యూనల్‌ అవార్డు’ను ప్రకటించారు. దీని ప్రకారం మైనారిటీలకు ప్రత్యేక నియోజక వర్గాలు కల్పించారు. దీనికి నిరసనగా గాంధీజీ నిరాహారదీక్ష చేపట్టారు.
నిమ్నజాతులకు కూడా ప్రత్యేక స్థానాలను  ప్రకటించారు. గాంధీ–అంబేద్కర్‌ మధ్య పుణే ఒప్పందం జరిగింది. 1932లో మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.  ఓటింగ్‌ అర్హత, ఉమ్మడి నిధులు, రాష్ట్రాల ఆర్థిక వనరుల గురించి ఈ సమావేశంలో చర్చించారు. మహిళలకు ఓటు హక్కు కల్పించడం, రాష్ట్రాల శాసనసభ్యుల సమాఖ్య, ఎగువసభ, ప్రతినిధులను ఎన్నుకోవడం మొదలైనవి ఈ సమావేశం నిర్ణయించిన నూతన విషయాలు. గాంధీ–ఇర్విన్‌ ఒప్పందం తర్వాత 1933లో కాంగ్రెస్‌ అధికారికంగా ఉద్యమాన్ని నిలిపివేసింది. 1935 భారత ప్రభుత్వ రాజ్యాంగ చట్టం ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఫెడరల్‌ (సమాఖ్య) వ్యవస్థ ఏర్పాటైంది. రాష్ట్రాలకు స్వపరిపాలనాధికారం లభించింది. 1935 చట్టం రాజ్యాధికారాలను మూడు రకాలుగా విభజించింది. అవి:
1. సమాఖ్య అధికారాలు 
2. రాష్ట్ర అధికారాలు 
3. ఉమ్మడి అధికారాలు 
తమ అధికార పరిధిలో శాసనాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వాధికారం ఉంటుంది. ఉమ్మడి జాబితాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనం చేయవచ్చు. ఏ శాసన్నానైనా వీటో చేసే అధికారం గవర్నర్‌ జనరల్‌కు ఉంటుంది. బిల్లులను పునఃపరిశీలించమని సూచించే లేదా బ్రిటిష్‌ చక్రవర్తి నిర్ణయానికి పంపే అధికారం గవర్నర్‌ జనరల్‌కు ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ఎగువ సభలో 2/5వ వంతు, దిగువ సభలో 3/5వ వంతు స్థానాలు సంస్థానాధీశులకు కేటాయించారు. భారత్‌ నుంచి బర్మాను వేరు చేశారు. జయప్రకాశ్‌ నారాయణ్‌æ కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశారు. 1936లో ఆలిండియా కిసాన్‌ సభ ఏర్పాటైంది.

Good Food For Youth: యువత ఈ ఫుడ్ తీసుకుంటే...బెస్ట్‌ హెల్త్‌ మీదే..

లార్డ్‌ లిన్‌లిత్‌ గో (1936–44) 

భారత ప్రభుత్వ చట్టం–1935 ప్రకారం 1937 జూలై నాటికి ఎన్నికలు నిర్వహించారు.  కాంగ్రెస్‌ పార్టీ చాలా రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 1937లో జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1936లో తొలి అఖిల భారత కిసాన్‌ సభ ఆవిర్భవించింది. నాటి నుంచి రైతాంగం జాతీయోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించింది. 1936 లక్నో కాంగ్రెస్‌ సమావేశంలో సోషలిజాన్ని ఆమోదించారు. 1938లో జాతీయ కాంగ్రెస్‌ గుజరాత్‌లోని హరిపూర్‌లో సమావేశమైంది. దీనికి సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షత వహించారు. 1939లో బోస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. గాంధీ, నెహ్రూ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినప్పటికీ సుభాష్‌ చంద్రబోస్‌ గెలుపొందారు.  వర్కింగ్‌ కమిటీలో గాంధీజీ అనుయాయులు బోస్‌ పట్ల విముఖత చూపారు. దీంతో ఆయన  అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కొందరు వామపక్ష వాదులతో కలిసి ఫార్వర్డ్‌ బ్లాక్‌ అనే కొత్త పార్టీని ప్రారంభించారు. 1927 డిసెంబర్‌ నాటికే అఖిల భారత సంస్థాన ప్రజాసభ ప్రారంభమైంది. 1939లో నెహ్రూ ఈ సభకు అధ్యక్షుడయ్యాడు. 1939లోనే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. భారతీయులను సంప్రదించకుండానే భారత్‌లోని బ్రిటిష్‌ ప్రభుత్వం యుద్ధంలోకి అడుగుపెట్టింది. ఈ విషయమై జాతీయ కాంగ్రెస్‌కు లేదా కేంద్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులకు మాటమాత్రంగా కూడా చెప్పలేదు. 1940లో ముస్లిం లీగ్‌ దేశ విభజన తీర్మానాన్ని ఆమోదించింది. అదే ఏడాది బ్రిటిష్‌ ప్రభుత్వం ఆగస్టు ఆఫర్‌ జారీ చేసింది. దీని ప్రకారం మైనారిటీలకు అధిక స్థానాలను కేటాయిస్తారు. యుద్ధం ముగిశాక నూతన రాజ్యాంగంలో ఈ విషయాన్ని పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. 1941లో సుభాష్‌ చంద్రబోస్‌ నిర్బంధం నుంచి తప్పించుకొని బెర్లిన్‌ వెళ్లారు. 1942లో ఆయన  ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హిందు ఫౌజ్‌)ని స్థాపించారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం విదేశాల నుంచే బోస్‌ పోరాడారు.  ఆయన ‘జైహింద్‌’ అనే నినాదమిచ్చారు.
రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయుల పూర్తి సహకారం కోసం బ్రిటన్‌ ప్రయత్నించింది. ఇందు కోసం 1942 మార్చిలో సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ నేతృత్వంలో ఒక రాయబార బృందాన్ని భారత్‌కు పంపింది. క్రిప్స్‌ బ్రిటిష్‌ మంత్రివర్గ సభ్యుడు, లేబర్‌ పార్టీలో రాడికల్‌ సభ్యుడు. వీలైనంత త్వరగా స్వపరిపాలన ప్రతిపాదించడమే తమ లక్ష్యమని క్రిప్స్‌ తెలిపారు. కాంగ్రెస్‌ కమిటీ 1942 ఆగస్టు 8న బొంబాయిలో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో క్విట్‌ ఇండియా తీర్మానాన్ని ఆమోదించారు. కాంగ్రెస్‌ ΄ార్టీ, గాంధీజీ నాయకత్వంలో అహింసాయుత ప్రజాపోరాటాన్ని కొనసాగించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని సమర్థవంతంగా అణచివేసింది.

లార్డ్‌ వేవెల్‌ (1944–47) 

1944లో అట్లీ బ్రిటన్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1945లో కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ పార్టీలు లార్డ్‌ వేవెల్‌ సమక్షంలో సిమ్లాలో సమావేశమయ్యాయి. రాజ్యాంగ, మత అడ్డంకులను తొలగించేందుకు ఆ ΄ార్టీలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 1946లో అఖిల భారత తంతి–త΄ాలా కార్మికులు సమ్మె చేశారు. కౌలు రేట్ల తగ్గింపు కోసం రైతాంగ పోరాటాలు అధికమయ్యాయి. సమ్మెలు, హర్తాళ్లు, ప్రదర్శనలు నిర్వహించడంలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ పరిస్థితుల్లో బ్రిటిష్‌ ప్రభుత్వం 1946 మార్చిలో కేబినెట్‌ మిషన్‌ను పంపింది. అధికార బదిలీ గురించి భారత జాతీయ నాయకులతో ఈ మిషన్‌ సంప్రదింపులు జరిపింది. నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చే దాకా తాత్కాలిక జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బ్రిటిష్‌ రాయబార వర్గం సూచించింది. 1946 సెప్టెంబర్‌లో నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక జాతీయ ప్రభుత్వం ఏర్పాటైంది. ముస్లింలీగ్‌ మంత్రి వర్గంలో చేరింది. కేబినెట్‌ ప్లాన్‌ను అంగీకరించని ముస్లింలీగ్‌ 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష చర్యాదినంగా ప్రకటించింది. నేవీ తిరుగుబాటు చేసింది. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించింది.

Current Affairs: సెప్టెంబ‌ర్ 6వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!

లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ (1947)

మౌంట్‌ బాటన్‌ 1947లో భారత వైస్రాయ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన కాంగ్రెస్, ముస్లింలీగ్‌ నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత్, పాకిస్తాన్‌ స్వతంత్ర దేశాలుగా అవతరి స్తాయన్న ప్రకటన 1947 జూన్‌ 3న విడుదలైంది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్‌ నూతన దేశంగా ఆవిర్భవించింది. అదే రోజు అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 1948 జనవరి 30న గాడ్సే గాంధీజీని కాల్చి చంపాడు.

ముఖ్యాంశాలు

    1929:  లాహోర్‌లో నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ సమావేశం. ‘సంపూర్ణ స్వరాజ్యమే’ తమ ఆశయమని ప్రకటన.
    1930 మార్చి 12: దండి సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ.
    1942 మార్చి: సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ నేతృత్వంలో భారత్‌కు రాయబార వర్గం రాక.
    1942 ఆగస్టు 8:   బొంబాయిలో కాంగ్రెస్‌ కమిటీ సమావేశం, క్విట్‌ ఇండియా తీర్మానానికి ఆమోదం.
    1946 మార్చి:  కేబినెట్‌ మిషన్‌ భారత్‌ రాక.
    1946 ఆగస్టు 16: కేబినెట్‌ ప్లాన్‌ను అంగీకరించని ముస్లిం లీగ్, ఆగస్టు 16ను ప్రత్యక్ష చర్యాదినంగా ప్రకటన.
    1947 జూన్‌ 3: భారత్, పాకిస్తాన్‌ స్వతంత్ర దేశాలుగా అవతరిస్తాయనే ప్రకటన విడుదల. 

TS DSC Final Key Released : టీఎస్ డీఎస్సీ-2024 ఫైన‌ల్ కీ విడుద‌ల‌.. అలాగే రిజ‌ల్డ్స్‌ను కూడా...

Published date : 09 Sep 2024 09:42AM

Photo Stories