History for Competitive Exams : తొలి కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారు?
మొదట రాష్ట్రకూట, కల్యాణీ (పశ్చిమ) చాళుక్య రాజులకు సైన్యాధ్యక్షులు, మాండలికులు, సామంతులుగా ఉండి తర్వాత స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ప్రత్యర్థులుగా ఉన్న ముదిగొండ చాళుక్యులను, వేములవాడ చాళుక్యులను, కందూరు చోడులను, పొలవాస రాజులను, నగునూరు రాజులను ఓడించి తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తొలి కాకతీయులు
తొలి కాకతీయులు (కాకతీయ వంశంలోని ఆదిపురుషులు) రాష్ట్రకూటుల సేనానులుగా తెలంగాణకు వచ్చారని పీవీ పరబ్రహ్మశాస్త్రి నిరూపించారు. వీరు తమ పేరు చివరన రాష్ట్రకూట నామా న్ని (గుండియ రాష్ట్రకూట, ఎర్రయ రాష్ట్రకూట) ధరించేవారు. రాష్ట్రకూటుల రాజ చిహ్నమైన ‘గరుడ’(గరుడబేతయ)ను తమ పతాకాలపై ఉంచుకునేవారు. రాష్ట్రకూటుల ఆస్థాన మతమైన జైనా న్ని అవలంభించడం, వారి వృష్టి వంశాన్నే తమ వంశంగా చెప్పుకోవడం లాంటి కారణాల వల్ల కాకతీయులు రాష్ట్రకూట వంశస్థులేనని స్పష్టమవు తోంది. స్థానిక (తెలంగాణ) బోయ, పుళింద జాతు లవారు జైనమతం ద్వారా సాంఘికోన్నతి సాధించి రాష్ట్రకూటుల వద్ద సైనికోద్యోగులుగా చేరి క్రమంగా సామంతులయ్యారనే అభిప్రాయమూ ఉంది. ఈ వంశానికి ఆద్యుడైన వెన్నరాజు (క్రీ.శ.750–768) రాష్ట్రకూట సేనాని, సామంతుడు. ఆదిలాబా ద్ పశ్చిమ్ర ప్రాంతం, బాసర, ముథోల్, కుబేరు(కుబీర్), భైంసా(మహిషా) ప్రాంతాలు ఇతని రాజ్యంలో ఉండేవి. ఇతడి తర్వాత మొదటి గుండరా జు (క్రీ.శ.768–824), రెండో గుండరాజు (క్రీ.శ. 824 – 870), మూడో గుండరాజు (క్రీ.శ.870 – 895) రాష్ట్రకూటుల సేనానులుగా, సామంతులుగా పనిచేశారు. వీరి కాలం తదితర విషయాల్లో చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.
ఎర్రయరాజు (895–940)
ఈ వంశంలో మొదటి నలుగురి తర్వాత ఎర్రయరాజు (క్రీ.శ.895–940) కూడా రాష్ట్రకూటుల సేనానిగా కురవాడి సీమను పాలించాడు. వేంగి చాళుక్యులకు లోబడి ముదిగొండ చాళుక్యులు పాలించిన నేటి ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొరవి ప్రాంతమే కురవాడి సీమ. ముదిగొండ చాళుక్యులను తరిమేసి రాష్ట్రకూటులు ఎర్రయరాజును ఈ ప్రాంతానికి సామంతుడిగా నియమించారు. అయితే క్రీ.శ.934లో ముదిగొండ చాళుక్యులు ఆ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించారు. ఎర్రయ కొడుకు బేతియకు పెద్ద ప్రాధాన్యం లేదు. తర్వాత బేతియ కొడుకు నాలుగో గుండరాజు(క్రీ.శ.955–990) రాష్ట్రకూటుల సేనానిగా నియమితుడై కొరవిసీమను తిరిగి ఆక్రమించాడు. తూర్పు చాళుక్యులైన రెండో అమ్మరాజు, దానార్ణవుడి మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. నాలుగో గుండరాజు దానార్ణవుడి పక్షం వహించి కొరవిసీమను పొందాడు.
క్రీ.శ.973లో కల్యాణీ చాళుక్య రెండో తైలపుడు రాష్ట్రకూట రాజ్యాన్ని ఆక్రమించాడు. దీంతో తైలపు ణ్ని ఆశ్రయించిన ముదిగొండ చాళుక్య బొట్టు బేతరాజు.. విరియాల ఎర్రసేనాని ద్వారా తిరిగి కొర విసీమను పొందగలిగాడు. దీంతో కాకతీయులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. కానీ తన భార్య విరియాల కామసాని వినతి మేరకు ఎర్రసేనాని కల్యాణీ చాళుక్య చక్రవర్తిని ఒప్పించి మొదటి బేతరాజు(క్రీ.శ.992–1052)ను అనుమకొండ విషయపాలకుడిగా నియమించాడు. కామసాని మొద టి బేతరాజు (గరుడ బేతరాజు) మేనత్త, గుండరాజు సోదరి.
☛ Join our Telegram Channel (Click Here)
మొదటి ప్రోలరాజు
బేతరాజు కల్యాణీ చాళుక్య సామంతుడిగా స్థిరపడ్డాడు. ఇతడి రాజ్యం కొరివిసీమ సరిహద్దు నుంచి కరీంనగర్ మండలంలో ఉన్న శనిగరం వరకు వ్యాపించింది. బేతరాజు తర్వాత అతడి కొడుకు మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1052–1076) రాజ్యానికొచ్చాడు. ఇతడు వేములవాడ చాళుక్యరాజు భద్రగుణ్ణి (మూడో బద్దెగుడు) ఓడించి సబ్బిసాయర మండలం(కరీంనగర్ ప్రాంతం)లోని కొన్ని ప్రాంతాలను జయించాడు. అనుమకొండ విషయాన్ని మొదటి బేతరాజు తొలుత పొందినప్పటికీ శాశ్వతమాన్యంగా పొందింది మాత్రంప్రోలరాజే. ప్రోలుడు చిత్రకూటలో అరాచకత్వాన్ని అణచివేయడం, బద్దెగుణ్ని జయించడం, కొంకణంపై విజయం సాధించడం వల్ల అతడి శౌర్యప్రతాపాలకు గుర్తింపుగా చక్రవర్తి అనుమకొండను శాశ్వతమాన్యంగా ఇచ్చాడు.
రెండో బేతరాజు
ఒకటో సోమేశ్వరుడు క్రీ.శ.1068లో మరణించాడు. తర్వాత చక్రవర్తిగా వచ్చిన రెండో సోమేశ్వరుణ్ని తొలగించి అధికారంలోకి రావాలని ఆరో విక్రమాదిత్యుడు వీలైనంత మంది మాండలికులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రోలుడు, అతడి కుమారుడు రెండో బేతరాజు.. ఆరో విక్రమాదిత్యుడికి అండగా నిలిచారు. అది ప్రోలుడి తర్వాత రాజైన రెండో బేతరాజు (క్రీ.శ.1076–1108)కు ఉపయోగపడింది. ΄ారమార జగద్దేవుడు స్వాతంత్య్రం ప్రకటించుకోవడమూ దీనికి దోహదం చేసింది. జగద్దేవుడి నుంచి సబ్బి సహస్రం మొత్తాన్ని విక్రమాదిత్యుడు బేతరాజుకు ఇచ్చినట్లు పద్మాక్షి ఆలయ శాసనం ద్వారా తెలుస్తోంది. శనిగరం ప్రాంతంతో΄ాటు సబ్బి సహస్రం కాకతీయ రాజ్యంలో చేరాయి. ముదిగొండ చాళుక్యుల రాజ్యంలోని కొన్ని భాగాలు కూడా ఇతడి రాజ్యంలో చేరాయి. ఇతడు అనుమకొండలో బేతేశ్వరాలయాన్ని, తన తండ్రి పేరుతో ప్రోలేశ్వరాలయాన్ని నిర్మించాడు.
రెండో ప్రోలరాజు
బేతరాజు తర్వాత ఇతడి పెద్ద కొడుకు దుర్గరాజు (క్రీ.శ.1108–క్రీ.శ.1116) రాజయ్యాడు. పదవీచ్యుతుడైన కొలను΄ాక రాజు జగద్దేవుని ప్రోత్సాహంతో పొలవాస పాలకుడు మేడరాజు స్వాతంత్య్రం పొందడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో పారమార జగద్దేవుని స్థానంలో కుమార సోమేశ్వరుడు(క్రీ.శ.1108–1125) కొలనుపాక రాజప్రతినిధిగా నియమితుడయ్యాడు. ఈ తిరుగుబాట్లను అణచడానికి కుమార సోమేశ్వరుడికి అండగా నిలిచిన రెండో ప్రోలరాజు(క్రీ.శ.1116–1157) జగద్దేవుడిని పారదోలి సోదరుడు దుర్గరాజును పదవీచ్యుతుణ్ని చేసి సింహాసనం అధిష్టించాడు. చాళుక్య చక్రవర్తుల నుంచి స్వాతంత్య్రం పొందడానికి ప్రయత్నించిన సామంతులందరితో యుద్ధం చేసి ఓడించాడు. ఈ రకంగా తెలంగాణ మొత్తాన్ని జయించి కల్యాణీ చాళుక్య ప్రతాపచక్రవర్తి రెండో జగద్దేకమల్లుడు (క్రీ.శ.1138–1150)కి విధేయుడిగా ఉన్నాడు.
☛ Join our WhatsApp Channel (Click Here)
రెండో ప్రోలరాజు విజయాలు
కొలనుపాక రాజప్రతినిధిగా నియమితుౖడైన కుమార సోమేశ్వరుడు తన తండ్రి విక్రమాదిత్యుడి అనంతరం క్రీ.శ.1126లో మూడో సోమేశ్వరుడిగా రాజ్యానికొచ్చాడు. అంతకుముందు నుంచే కందూరునాడును పాలిస్తున్న యువరాజు కుమార తైల పుడు (క్రీ.శ.1110–1137) తన సోదరుడు మూడో సోమేశ్వరుడికి వ్యతిరేకంగా దక్షిణ తెలంగాణలో స్వాతంత్య్రం పొందడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ ప్రయత్నంలోనే మూడో సోమేశ్వరుడికి అనుకూలుడైన కందూరి చోడ మొదటి గోకర్ణుడిని చంపించి కందూరునాడును శ్రీదేవి తొండయ, గోవింద దండేశులకు పంచి సామంతులుగా చేసుకున్నాడు. దీంతో మొదటి గోకర్ణుడి కుమారుడు రెండో ఉదయచోడుడు మూడో సోమేశ్వరుణ్ని ఆశ్రయించాడు. సోమేశ్వరుడి ఆదేశంతో రెండో ప్రోలుడు శ్రీదేవి తొండయ, గోవింద దండేశులను ఓడించి ఉదయ చోడుడికి (క్రీ.శ.1131–36) పట్టం కట్టాడు. ఈ రకంగా దక్షిణ తెలంగాణ మీద ప్రోలుడు ఆధిక్యం సాధించాడు.
తన అనుయాయుల ఓటమిని జీర్ణించుకోలేని తైలపుడు కాకతీయుల ఉత్తర సరిహద్దులో ఉన్న పొలవాస రాజైన మేడరాజును, అతడి తమ్ముడు గుండరాజును ప్రేరేపించాడు. అప్పటికే వీరు చాళుక్య చక్రవర్తుల పట్ల అవిధేయులుగా ఉన్నారు. రెండో జగద్దేకమల్లుడి(క్రీ.శ.1138–1150) పక్షాన నిలబడి ప్రోలరాజు గుండనను సంహరించాడు. గుండన కుటుంబానికి చెందిన ఏడో రాజును పారదోలాడు.
ఈ విజయంతో ప్రోలరాజు ఉత్తర తెలంగాణ మీద ఆధిక్యత సాధించాడు. చక్రవర్తి పక్షాన కుమా ర తైలపుడిని ఓడించాడు. ఈ విజయోత్సాహంతో కృష్ణానది దాటి శ్రీశైలంలో విజయస్తంభం నాటించాడు. తెలంగాణపై ఆధిక్యం సాధించాక తీరాంధ్రను జయించే ప్రయత్నంలో మరణించాడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఇతడే ప్రారంభించాడు. నతవాడి దుర్గరాజు సోదరి ముప్పమాంబ ప్రోలరాజు భార్య. వీరి కుమారులు.. రుద్రదేవుడు, మహాదేవుడు, హరిహరుడు, గణపతి, రేపొల్ల దుర్గరాజు. తండ్రి మరణానంతరం పెద్దకుమారుడైన రుద్రదేవుడు (క్రీ.శ.1158–క్రీ.శ.1195) రాజ్యానికొచ్చాడు.
మూడు సామంత రాజ్యాలు
కాకతీయ రాజ్య పరిసరాల్లో మూడు సామంత రాజ్యాలు ఉండేవి. తూర్పున ముదిగొండ చాళుక్యులు, వాయవ్యంగా కరీంనగర్ జిల్లాలో పొలవాస నాయకులు, దక్షిణాన కందూరు చోడులు ఉండేవారు. అనుమకొండ విషయానికి పశ్చిమాన ఉన్నప్రాంతం రాజు ప్రత్యక్ష ఆధీనంలో ఉండేది. అనుమకొండకు నైరుతి దిశగా కొలనుపాక కేంద్రంగా రాజప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. ప్రోలరాజు వీరిపై ఆధిక్యత సాధించిన సందర్భంలో రుద్రదేవుడు సింహాసనం అధిష్టించాడు.
రుద్రదేవుడు
తైలపుడు తన సోదరుడు జగదేక మల్లుని పదవీచిత్యుణ్ని చేసి అధికారంలోకి వచ్చాడు. కాబట్టి పరబ్రహ్మ శాస్త్రి పేర్కొన్న తైలపుడు ఈ మూడో తైలపుడు కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. పదవీభ్రష్టులైన కల్యాణి చాళుక్య రాజులు తమ పూర్వవైభవాన్ని తిరిగి సంతరించుకోలేరని నిర్ణయించుకున్న రుద్రదేవుడు క్రీ.శ.1162/3లో సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. తెలంగాణలో తిరుగులేని ప్రభువుగా మారిన తర్వాత తీరాంధ్రపై దృష్టి పెట్టాడు.
వేయి స్తంభాల గుడి
రుద్రదేవుడు(క్రీ.శ.1158–క్రీ.శ.1195) తన తండ్రిని చంపిన వెలనాటి రాజుపై మొదట విజృంభించాడు. పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహా యపడ్డాడు. ధాన్యకటకాన్ని స్వాధీనం చేసుకున్నా డు. దుర్జయులను ఓడించి త్రిపురాంతకాన్ని జయించాడు. క్రీ.శ.1186 నాటికి తీరాంధ్రను గెలిచాడు. ఈ రకంగా రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్యానికి గట్టి పునాదులు వేశాడు. ఈ విజయాల్లో సహాయం చేసిన రేచర్ల బేతిరెడ్డికి నల్లగొండ జిల్లాలోని ఆమనగల్లును, చెరకు రెడ్లకు జమ్ములూరును ఇచ్చాడు. ఇతడి రాజ్యం ఉత్తరాన గోదావరి, పశ్చిమాన బీదరు, దక్షిణాన శ్రీశైలం, తూర్పున సముద్రం వరకు విస్తరించిందని వేయి స్తంభాల గుడి శాసనం ద్వారా తెలుస్తోంది. రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని కొంతమేర పూర్తిచేశాడు. రుద్రేశ్వర దేవాలయాన్ని కట్టించాడు. ఇదే వేయి స్తంభాల గుడి.
☛ Follow our Instagram Page (Click Here)
మహాదేవుడు
రుద్రదేవుడికి కుమారులు లేకపోవడం వల్ల తమ్ముడు మహాదేవుడు(క్రీ.శ.1195–1198) రాజ్యానికి వచ్చాడు. ఇతడు జైతుగి (క్రీ.శ.1192–1200) కాలంలో యాదవరా జ్యం మీద చేసిన యుద్ధంలో మరణించాడు. మహాదేవుని భార్య రాణి బయ్యాంబ. గణపతిదేవుడు, మైలాంబ, కుందమాంబ వీరి సంతానం. యాదవరాజులు గణపతిని బంధించారు. ఇదే అదనుగా ముదిగొండ చాళుక్యులు, వెలనాటి చోళులు, చోళరాజులు కాకతీయ సామ్రా జ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారు. కానీ సామంతసేనానైన రేచర్ల రుద్రారెడ్డి (రుద్రసేనాని) మిగతా సేనానులు, సామంతులైన విరియాల, మాల్యాల సహాయంతో వీరిని ఓడించినట్లు పాలంపేట శాసనం ద్వారా తెలుస్తోంది. రుద్రసేనాని గణపతి దేవుడిని విడిపించి క్రీ.శ.1199లో కాకతీయ రాజ్య పట్టాభిషిక్తుడిని చేశాడు.
మాదిరి ప్రశ్నలు:
1. కాకతీయ వంశానికి ఆద్యుడు?
1) గణపతిదేవుడు 2) మొదటి గుండన
3) వెన్నరాజు 4) మొదటి బేతరాజు
2. ఓరుగల్లు కోట నిర్మాణానికి పునాదులు వేసినవాడు?
1) మొదటి ప్రోలరాజు
2) రెండో ప్రోలరాజు
3) గణపతిదేవుడు
4) రుద్రదేవుడు
3. నతవాడి దుర్గరాజు సోదరి ముప్పమాంబ ఎవరి భార్య?
1) మొదటి ప్రోలరాజు
2) గణపతిదేవుడు
3) మొదటి బేతరాజు
4) రెండో ప్రోలరాజు
4. తొలి కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారు?
1) శాతవాహనులు 2) రాష్ట్రకూటులు
3) బాదామి చాళుక్యులు 4) ఇక్ష్వాకులు
5. మలి కాకతీయులు ఎవరి సామంతులు?
1) రాష్ట్రకూటులు
2) కల్యాణి చాళుక్యులు
3) బాదామి చాళుక్యులు
4) కందూరి చాళుక్యులు
6. రుద్రదేవుడు ఏ కాలంనాటికి తీరాంధ్రను జయించాడు?
1) క్రీ.శ. 1186 2) క్రీ.శ. 1180
3) క్రీ.శ. 1176 4) క్రీ.శ. 1190
7. పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సహాయపడ్డ కాకతీయ రాజు?
1) గణపతిదేవుడు 2) ప్రతాపరుద్రుడు
3) రుద్రదేవుడు 4) రెండోబేతరాజు
8. రుద్రదేవుడు యుద్ధాల్లో తనకు సహాయం చేసిన ఏ రాజును ఆమనగల్లు సామంతునిగా నియమించాడు?
1) రేచర్ల నామిరెడ్డి 2) రేచర్ల చెవిరెడ్డి
3) రేచర్ల లోకిరెడ్డి 4) రేచర్ల బేతిరెడ్డి
9. వేయి స్తంభాల గుడి (రుద్రేశ్వరాలయం) ని కట్టించినవారు?
1) రుద్రదేవుడు 2) గణపతిదేవుడు
3) రుద్రమదేవి 4) ప్రతాపరుద్రుడు
☛Follow our YouTube Channel (Click Here)
సమాధానాలు
1) 3 2) 2 3) 4 4) 2 5) 2
6) 1 7) 3 8) 4 9) 1
Tags
- history material and model questions
- Competitive Exams
- appsc and tspsc history material
- model and preparatory questions in history
- history for competitive exams
- preparatory questions and material
- history for groups exams
- appsc and tspsc groups
- appsc and tspsc history subject
- appsc history material
- tspsc history material
- kakatiyas in history
- kakatiya's history for competitive exams
- Government Jobs
- Police Exams
- police jobs exams
- Education News
- Sakshi Education News