Skip to main content

APPSC Group 1 Interview: ఇంటర్వ్యూలో విజయానికి నిపుణుల సలహాలు..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 సర్వీసెస్‌.. రాష్ట్ర స్థాయిలో ఆర్డీఓ, డీఎస్పీ, సీటీఓ తదితర ఉన్నత కొలువులకు మార్గం. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1(2022) ఎంపిక ప్రక్రియకు సంబంధించి తుది దశ ఇంటర్వ్యూలకు రంగం సిద్ధమైంది! గ్రూప్‌ 1 ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్‌ పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసింది. ఇంటర్వ్యూలను ఆగస్ట్‌ 2వ తేదీ నుంచి నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. వేల సంఖ్యలో పోటీని ఎదుర్కొని ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు.. చివరి దశలో చూపే ప్రతిభ అంతిమ విజయంలో నిర్ణయాత్మకం కానుంది. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూలో విజయానికి నిపుణుల సలహాలు..
Expert Tips for Success in APPSC Group-1 Interview
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1-2022 మెయిన్స్‌ ఫలితాలు విడుదల
  • రెగ్యులర్, స్పోర్ట్స్‌ కోటా కలిపి 259 మంది ఇంటర్వ్యూకు ఎంపిక
  • ఆగస్ట్‌ 2 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలు
  • విజేతలుగా నిలిస్తే.. రాష్ట్ర స్థాయిలో ఉన్నత కొలువు

 

  • 87,718: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1(2022) ప్రిలిమ్స్‌కు హాజరైన వారి సంఖ్య.
  • 5,028: ప్రిలిమ్స్‌లో విజయం సాధించి మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు.
  • 259: మొత్తం 111 గ్రూప్‌ 1 పోస్టులకు నిర్వహించిన మెయిన్స్‌లోనూ విజయం సాధించి చివరి దశ ఇంటర్వ్యూకు అర్హత పొందిన వారు. వీరిలో 39 మంది స్పోర్ట్స్‌ కోటా నుంచి ఎంపికయ్యారు.
  • గ్రూప్‌-1 ఎంపిక ప్రక్రియలో తొలి రెండు దశలైన ప్రిలిమ్స్, మెయిన్‌లో అభ్యర్థులు పుస్తక పరిజ్ఞానంతో విజయం సాధించే అవకాశం ఉంది. కాని ఇంటర్వ్యూ మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు సామాజిక, ఆర్థిక, పాలన, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి అవగాహనతో బోర్డ్‌ రూమ్‌లో అడుగుపెట్టాలి అంటున్నారు నిపుణులు.

విభిన్న వ్యూహం

ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలతోపాటు, అకడమిక్‌ నేపథ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమకాలీన అంశాలపై అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూలో రాణించాలంటే.. భావ వ్యక్తీకరణ, సమాధానం చెప్పే తీరు, ఆలోచనల్లో స్పష్టత అవసరం.​​​​​​​

సమకాలీన అవగాహన

గ్రూప్‌-1 స్థాయి అధికారిగా ఎంపికయ్యే అభ్యర్థులకు అవసరమైన సమస్యల పట్ల స్పందన, నిర్ణయ నేర్పు వంటి వాటిని ఇంటర్వ్యూలో పరిశీలిస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రధానంగా తాజా పరిణామాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో కీలకంగా మారిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంటర్వ్యూకు ప్రిపరేషన్‌లో అభివృద్ధి కారక అంశాలకు పెద్దపీట వేయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు-లబ్ధిదారులు తదితర విషయాలపై సంపూర్ణ పట్టు సాధించాలి. 

APPSC Group-1 Interview

వ్యక్తిగతం, వృత్తిగతం

గ్రూప్‌-1 ఇంటర్వ్యూలో.. వ్యక్తిగతం మొదలు వృత్తి నేపథ్యం వరకూ.. ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అకడమిక్‌ నైపుణ్యాలను విధి నిర్వహణలో ఎలా అన్వయిస్తారో సమర్థంగా చెప్పగలిగేలా సన్నద్ధంగా ఉండాలి. ఇప్పటికే వేరే ఉద్యోగాలు చేస్తూ గ్రూప్‌-1 ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత కొలువులో తమ విధులు, సాధించిన ఫలితాలు, ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలు, అవి విధుల పరంగా ఉపయోగపడిన తీరు గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా సన్నద్ధమై ఇంటర్వ్యూకు వెళ్లాలి. ప్రభుత్వ ఉద్యోగి అయితే.. తాము పని చేస్తున్న శాఖల్లో అమలవుతున్న పథకాలు, తమ పరిధిలో వాటి అమలు తీరు, విధి నిర్వహణ పరంగా సదరు అభ్యర్థుల ప్రమేయం వంటి అంశాలకు సమాధానాలను సిద్ధం చేసుకోవాలి. 

స్వీయ అభిప్రాయం

ఇంటర్వ్యూలో విజయానికి అభ్యర్థులు మెరుగుపరచుకోవాల్సిన మరో నైపుణ్యం.. స్వీయ అభిప్రాయాల వ్యక్తీకరణ. సహజంగా బోర్డ్‌ సభ్యులు..  ఆయా అంశాలపై అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తా­రు. కాబట్టి సదరు విషయాలపై అభ్యర్థులు తమకంటూ ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పరచుకోవాలి. అందుకోసం దిన పత్రికలను చదవాలి. వాటిలోని ఎడిటోరియల్స్‌ను, ఆయా విషయాలపై ప్రముఖుల విశ్లేషణలను చదవడతోపాటు వాటిపై తమ సొంతం అభిప్రాయాల్ని సిద్ధం చేసుకోవాలి. బోర్డు సభ్యులను మెప్పించాలంటే.. ప్రతి అంశంపైనా స్వీయ అభిప్రాయంతోపాటు విశ్లేషించే నైపుణ్యం ఉండాలి.

నిర్ణయ సామర్థ్యం

  • గ్రూప్‌-1 ఇంటర్వ్యూలో అభ్యర్థుల్లోని డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌ను కూడా పరిశీలిస్తారు. గ్రూప్‌-1 స్థాయి అధికారిగా ఏదైనా సమస్య ఎదురైతే ఎలా స్పందిస్తారు? సదరు నిర్ణయం తీసుకోవడానికి సహేతుక కారణాలను వివరించే నేర్పు కూడా ఉండాలి. 
  • ఇంటర్వ్యూ సమయంలో ఎదురయ్యే ప్రశ్నలకు సానుకూల దృక్పథంతో సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రశ్నలు ఎదురైనప్పుడు నిర్మాణాత్మక దృక్పథంతో విశ్లేషించగలగాలి. 

బోర్డ్‌ సభ్యులకు అభివాదం

ఇంటర్వ్యూ బోర్డ్‌లో సాధారణంగా ఒక చైర్మన్, నలుగురు లేదా అయిదుగురు సభ్యులు ఉంటారు. బోర్డ్‌ రూమ్‌లోకి అడుగుపెట్టిన అభ్యర్థులు ముందుగా చైర్మన్‌కు అభివాదం చేస్తూ.. మిగతా సభ్యులకు కూడా అభివాదం చేయాలి. అదే విధంగా సమాధానాలు ఇచ్చే సమయంలోనూ ప్రశ్న అడిగిన బోర్డ్‌ సభ్యుడినే చూస్తూ చెప్పకుండా.. మిగతా వారికి కూడా ఆ సమాధానం చెబుతున్నట్లుగా వ్యవహరించాలి. అందరితో ఐ కాంటాక్ట్‌ను కొనసాగించడం అలవర్చుకోవాలి.

హావ, భావాలు

ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలు ఇచ్చేటప్పుడు అభ్యర్థులు తమ హావ, భావాలపై నియంత్రణ పాటించాలి. ముఖ్యంగా ముఖ కవళికలు, అనవసరంగా కాళ్లు, చేతులు కదిలించడం వంటివి చేకూడదు. అదే విధంగా సీట్లో బిడియంగా కూర్చుని సమాధానం ఇవ్వడం కూడా సరికాదు. దీంతోపాటు ఇంటర్వ్యూ బోర్డ్‌ సభ్యుల ముందు వినమ్రంగా వ్యవహరించడం అవసరం.

చర్చకు ఆస్కారం

గ్రూప్‌-1 ఇంటర్వ్యూలో కొన్ని సందర్భాల్లో అడిగిన ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పడంతోనే ముగియకుండా..దానికి కొనసాగింపుగా అనుబంధ ప్రశ్నలు, బోర్డ్‌ సభ్యుల అభిప్రాయాలతో కలిసి చర్చగా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు సదరు అంశంపై లోతైన అవగాహన లేకపోతే ఇబ్బందిగా మారుతుంది. నిజాయతీగా తమకు తెలిసినంత వరకు చెప్పి.. మిగతా విషయాలు తెలియవని అంగీకరించాలి. అలా కాకుండా తాము చెప్పిందే కరెక్ట్‌ అనే రీతిలో వాదనకు దిగితే.. ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ఆస్కారముంది.

సమాజ సేవకోసం

గ్రూప్‌-1 స్థాయి పోస్ట్‌ల ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు.. తాము ఆ పోస్ట్‌లకు ఎలా సరితూగుతాం, విధుల నిర్వహణ క్రమంలో తమకున్న లక్షణాలు ఏంటి.. అనే ప్రశ్నలు సంధించుకొని.. ఇంటర్వ్యూకు సన్నద్ధమవ్వాలి. ఇలాంటి ప్రశ్నలు బోర్డు అడిగినప్పుడు.. చాలామంది సమాజ సేవ కోసం అంటూ జవాబిస్తారు. ఈ సమాధానం చెబుతూనే.. అప్పటి వరకు తాము వృత్తి పరంగా పొందిన అనుభవం, లేదా సమకాలీన అంశాలపై తమకున్న అవగాహన ద్వారా విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరిస్తామనేలా సమాధానం చెప్పాలి. 

ఎంట్రీ నుంచి ఎగ్జిట్‌ వరకు

ఇంటర్వ్యూ రూమ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి బయటికి వచ్చే వరకూ.. హుందాగా, వినమ్రంగా వ్యవహరించాలి. ముందుగా డోర్‌ నాక్‌ చేసి.. బోర్డ్‌ సభ్యుల అనుమతి తీసుకున్నాకే గదిలోకి వెళ్లాలి. అందరినీ చూస్తూ విష్‌ చేయడం మరవొద్దు. తర్వాత బోర్డ్‌ సభ్యులు ఆఫర్‌ చేసే వరకు సీటులో కూర్చోవద్దు. ఇక సీట్లో కూర్చుకున్నాక.. తాము కూర్చునే శైలి కూడా హుందాగా ఉండేలా చూసుకోవాలి. నిటారుగా కూర్చోవాలి. ఇందులోనే సగం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఎదురుగా ఉన్న టేబుల్‌పై చేతులు పెట్టడం వంటివి చేయకూడదు. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత బోర్డ్‌ సభ్యులందరికీ ఆపాదించేలా ధన్యవాదాలు తెలుపుతూ బయటికి రావాలి.

APPSC Group-1 Interview

పేపర్‌ రీడింగ్‌ మస్ట్‌

ఇంటర్వ్యూకు హాజరయ్యే రోజు దినపత్రికలను చదవాలి. గతంలో చాలా సందర్భాల్లో పలువురు అభ్యర్థులకు 'ఈ రోజు న్యూస్‌ పేపర్లో మీరు ప్రాధాన్యంగా భావించిన వార్తలు ఏవి?' లేదా 'ఈ రోజు ఫలానా వార్తా కథనంలో పేర్కొన్న అంశాలపై మీ అభిప్రాయం ఏంటి?' వంటి ప్రశ్నలు సైతం ఎదురయ్యాయి. కాబట్టి ఇంటర్వ్యూ రోజు కనీసం ఒక తెలుగు దిన పత్రిక, ఇంగ్లిష్‌ దినపత్రిక చదవాలి. అంతేకాకుండా వాటిల్లోని ముఖ్యమైన అంశాలను గుర్తించుకోవాలి.

75 మార్కులే కానీ

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 75. మెయిన్స్‌ మార్కులతో పోలిస్తే ఇవి తక్కువగానే కనిపిస్తుండొచ్చు. కానీ గత ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. మెయిన్స్‌లో మంచి మార్కులు వచ్చినా.. ఇంటర్వ్యూలో సరైన మార్కులు రాక అవకాశం చేజార్చుకున్న వారెందరో ఉన్నారు. కాబట్టి ప్రతి మార్కు కీలకంగా నిలిచే గ్రూప్‌1 ఎంపిక ప్రక్రియలో.. ఇంటర్వ్యూలోనూ అత్యుత్తమ ప్రదర్శన చూపేలా సన్నద్ధమవ్వాలి.
 

Published date : 25 Jul 2023 06:28PM

Photo Stories