TSPSC Group 4 History Questions : గ్రూప్–4 రాతపరీక్షలో.. 'హిస్టరీ' నుంచి అడిగే ప్రశ్నలు ఇవే.. ఈ అంశాల నుంచే 10–15 ప్రశ్నలు..
ఈ నేపథ్యంలో.. గ్రూప్-4 పేపర్-1 మొత్తం 150 ప్రశ్నలకు పరీక్ష ఉంటే.. హిస్టరీ విభాగం నుంచి 10–15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.ఇందులో ఎక్కువ శాతం ప్రశ్నలు భారత జాతీయోద్యమం నుంచి ఉంటాయి. సంవత్సరాల వారీగా ఉద్యమంలోని వివిధ దశలు, వాటి ఫలితాలు, ఉద్యమాన్ని నడిపిన వ్యక్తుల జీవిత చరిత్ర, జాతీయోద్యమం నాటి గవర్నర్ జనరల్స్, ఆ కాలంలో విడుదలైన బ్రిటిష్ చట్టాలు, వాటిపై భారతీయుల స్పందన, జాతీయోద్యమ కాలంలో తెలంగాణలో జరిగిన సంఘటనలు వంటి వాటిపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. జాతీయోద్యమ చరిత్రకు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి.
☛ TSPSC Group 4 Economy Questions : గ్రూప్–4 రాతపరీక్షలో.. 'ఎకానమీ' నుంచి అడిగే ప్రశ్నలు ఇవే.. ఈ అంశాలపై పట్టు ఉంటే చాలు..
భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా..
భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అవి.. ప్రాచీన (Ancient), మధ్యయుగ (Medieval ), ఆధునిక (Modern) చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్రలో సంస్కృతిని ప్రత్యేకంగా చదవాలి. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతియుగ అంశాలపై దృష్టిసారించాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి. క్రీ.పూ.6వ శతాబ్దంలో ప్రచారంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు–వారి బోధనలు, సామాజిక మార్పులకు అవి ఏ విధంగా కారణమయ్యాయో విశ్లేషించుకోవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, ఆంధ్ర శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి.
ఎక్కువగా..
ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి. కుషాణులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్య రాజులు.. ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ఏవిధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. మధ్యయుగ చరిత్రలో సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
ఆధునిక భారత చరిత్రకు సంబంధించి క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వా త భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్ల–మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం తదితర అంశా లపై దృష్టిసారించాలి. జాతీయ ఉద్యమంలోని ముఖ్య పరిణామాలను తెలుసుకోవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ విధానానికి స్వస్తీ చెప్పాలి..
అభ్యర్థులు ముందుగా చరిత్ర అంటే రాజులు– యుద్ధాలు– ఘట్టాలు అనే పరిమితమైన దృక్పథాన్ని వీడాలి. దీనికి భిన్నంగా ఆయా రాజ వంశాల పరిపాలన, వాటి ఫలితాలు, అప్పటి ప్రజల జీవన విధానాలు, శిస్తు విధానాలు, నిర్మాణాలపై విస్తృత దృక్పథంతో ముందుకు సాగాలి. సబ్జెక్టును ఆబ్జెక్టివ్ + సబ్జెక్టివ్ ప్రిపరేషన్ సాగించాలి. విజయనగర సామ్రాజ్యం, శాతవాహనులు, తూర్పు (వేంగీ) చాళుక్యులు, రెడ్డి రాజులు, ఇక్ష్వాక రాజ వంశాలు, ఆయా రాజుల కాలంలోని కళలు, సంసృృతి, కట్టడాల పరంగా అందించిన సేవలు, చేపట్టిన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఉదాహరణకు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. ఆధునిక భారత దేశ చరిత్రకు సంబంధించి ప్రధానంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలుగు ప్రాంత నాయకుల పాత్రను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి.
ఏదైనా ఒక టాపిక్‌ను చదివేటప్పుడు..
స్వాతంత్య్రోద్యమ ఘట్టంలో పత్రికలు, జన సంఘాల పాత్ర, వాటి ప్రభావం, వాటిని నడిపించిన వారి గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం ఆంధ్ర ప్రాంతంలో యూరోపియన్ల ప్రమేయం. యూరోపియన్లు ఆంధ్ర ప్రాంతంలో చేసిన వ్యాపారాలు, అభివృద్ది చేసిన ఓడ రేవులు, ఏ రాజుల కాలంలో ఎవరు ఎక్కువ వాణిజ్యం చేశారు అనే అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. గ్రూప్–1, 2, 3, 4 ఏదైనా ఒక టాపిక్‌ను చదివేటప్పుడు ఎప్పటికప్పుడు ముఖ్యమైన పాయింట్లను నోట్స్ రాసుకోవాలి.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్–4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ