TGPSC Group 1 Mains: మూడు రోజుల్లో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు.. అభ్యర్థుల ఆందోళనలు.. ఈ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు..
ఒకవైపు రాజకీయ పార్టీలను సంప్రదిస్తూనే.. మరోవైపు పరీక్షల వాయిదా కోసం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌ను వేరువేరుగా కలిశారు. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అనుసరించిన విధానంతో రిజర్వుడ్ అభ్యర్థులు నష్టపోయారంటూ వారికి వివరించి పరీక్షల రీషెడ్యూల్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరారు.
టీజీపీఎస్సీ వైఖరిపై న్యాయపోరాటం చేస్తామని, ఇందుకు సహకరించాలని కేటీఆర్‌ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్‌కుమార్ గౌడ్ కూడా వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్న మెయిన్స్ పరీక్షల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అలాగే, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ చేపట్టడంతో పరీక్షల నిర్వహణ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అనివార్యం అని తెలుస్తోంది.
ఎన్నెన్నో వివాదాలు...
గ్రూప్–1 పరీక్షల విషయంలో ఆది నుంచి వివాదాలే. 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్‌లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2022 అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా... ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడడంతో ఆ పరీక్షను టీజీపీఎస్సీ రద్దు చేసింది. ఆ తర్వాత 2023 జూన్‌లో మరోమారు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా... ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు లోపాలను ఎత్తిచూపుతూ ఆ పరీక్షను రద్దు చేసింది.
చదవండి: Government Jobs: పల్లెల్లో సర్కారీ కొలువులపై అనాసక్తి.. ఎందుకో తెలుసా?
అంతలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం... కమిషన్ చైర్మన్, సభ్యుల రాజీనామాలు, ఆ తర్వాత ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం... నూతన చైర్మన్, సభ్యులను నియమించడం చకచకా జరిగిపోయాయి. టీజీపీఎస్సీ పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపిక చేపట్టింది.
గత నోటిఫికేషన్‌లో జీవో 55 ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసిన టీజీపీఎస్సీ... ఈసారి జీవో 29ని జోడిస్తూ దీని ప్రకారం ఎంపిక చేసింది. అయితే, జీవో 29 ద్వారా రిజర్వుడ్ అభ్యర్థులు నష్టపోయారని కొందరు ఆందోళన చేపడుతుండగా... ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చిన ప్రశ్నల్లో తప్పులు దొర్లాయని, వాటిని తొలగించి తుది ఫలితాలు ప్రకటించాలనే డిమాండ్లతో న్యాయపోరాటానికి దిగారు. అయితే ఆయా పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
46 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తాం: సీఎస్
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 46 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు.
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సవాలుతో కూడుకున్నదని, వదంతులకు తావివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
కమిషన్ కార్యాలయం నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగులకు ఒక గంట అదనంగా సమయం కేటాయిస్తున్నట్టు చెప్పారు. సహాయకుల (స్క్రైబ్) సహాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Tags
- TSPSC Group-1 Mains Exam Dates
- TSPSC Group-1 Mains
- TSPSC Group 1 Recruitment
- TGPSC Group 1 Mains Exam
- TGPSC Group 1 Mains exam schedule
- TGPSC Group 1 Mains Syllabus & Exam Pattern
- TSPSC Group 1 Recruitment 2024
- KTR
- TPCC
- Reschedule Exams Request
- Telangana News
- Group1MainsExamination
- TGPSCSelectionProcess
- ReservedCandidatesProtest
- TelanganaPublicServiceCommission
- Group1ExamReschedule
- MainsExamAnxiety
- TGPSCExamProcedure
- TelanganaExams
- GovernmentPressure
- ExamPostponement
- SakshiEducationUpdates