Skip to main content

TSPSC Group1: తెలంగాణ గ్రూప్ 1 ప‌రీక్ష‌పై నీలినీడ‌లు... ప‌రీక్ష‌ను వాయిదా ఉంటుందా..?

తెలంగాణ‌లో గ్రూప్ 1 ప‌రీక్ష‌పై నీలినీడ‌లు అలుముకున్నాయి. కొంత‌మంది అభ్య‌ర్థులు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో ప‌రీక్ష నిర్వ‌హ‌ణ ముందుగా నిర్ణ‌యించిన తేదీకే జ‌రుగుతుందా.. లేదా..? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
TS high court
TS high court

ఇప్ప‌టికే ఈ ప‌రీక్ష పేప‌ర్ లీక‌వ‌డంతో ఒక‌సారి ర‌ద్దు చేశారు. మ‌ళ్లీ కొత్త తేదీని ప్ర‌క‌టించి అందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను అధికారులు ప‌రిశీలిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో ఈ అంశం కోర్టుకు ఎక్క‌డంతో అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

చదవండి: TSPSC Paper Leakage Case: మాస్‌ కాపీయింగ్‌తో రూ.కోటి సంపాదన.. రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు..

students

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ‘సిట్‌’తోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించడంపై అభ్యంతరం ఉందని, యూపీఎస్సీ లాంటి మూడో సంస్థకు ఈ బాధ్యతను అప్పగించాలని పిటిషనర్లు కోరారు. 

చదవండి: High Court: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌పై ఉత్తర్వులు ఇవ్వలేం

గత ఏడాది అక్టోబరులో జరిగిన పరీక్షలను రద్దు చేయడంతోపాటు జూన్‌ 11న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ జారీచేసిన వెబ్‌నోట్‌ను రద్దు చేయాలని కోరుతూ కొంత‌మంది అభ్య‌ర్థులు హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది పరీక్షలు జరిగాక ప్రశ్నపత్రాలు లీక్‌ అయిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ ఇప్పటికే 49 మంది దాకా అరెస్ట్‌ చేసిందని, ఈ సంఖ్య 100కు చేరవచ్చన్నారు. 

tspsc

సిట్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దుచేసి తాజాగా నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిందన్నారు. లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని.. పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రత్యేక సంస్థకు అప్పగించాలని కోరారు. పరీక్షలకు సంబంధించి 5 లక్షల మంది ఆశావహులున్నారన్నారు.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లీకేజీ వ్యవహారంలో 49 మంది ఉద్యోగులు లేరని, కేవలం ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారన్నారు. దీనికి బాధ్యులైనవారిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

students

పరీక్షల నిర్వహణ, రహస్య విభాగాల పర్యవేక్షణ నిమిత్తం చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అధికారి, అసిస్టెంట్‌ కంట్రోలర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 

మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు జరిగినట్లు ఆయ‌న హైకోర్టుకు చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 5వ తేదీకి వాయిదా వేశారు.

Published date : 02 Jun 2023 02:03PM

Photo Stories