Skip to main content

TSPSC Paper Leakage Case: మాస్‌ కాపీయింగ్‌తో రూ.కోటి సంపాదన.. రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు..

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజ్‌తోపాటు హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన నీటిపారుదల శాఖ పెద్దపల్లి ఏఈ పూల రమేష్‌ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి.
Earning 1 crore from mass copying
మాస్‌ కాపీయింగ్‌తో రూ.కోటి సంపాదన.. రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు..

సిట్‌ అధికారులు ఇతడిని మే 31న కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు ప్రస్తావించారు. హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ ద్వారా ఇతడు రూ.1.1 కోటి వరకు ఆర్జించినట్లు తేల్చారు. ఒక్కో అభ్యర్థితో రూ.20–30 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకుని, ఏడుగురితో ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాయించినట్లు పేర్కొన్నారు. కొంత మొత్తం అడ్వాన్సుగా తీసుకున్న ఇతడు మిగిలింది ఫలితాల తర్వాత తీసుకోవాల్సి ఉందని అందులో చెప్పారు. కాగా, భార్యను హత్య చేసినట్లు రమేష్‌పై ఆరోపణలున్నాయి. 

చదవండి: Group I: ప్రిలిమ్స్‌ వాయిదా వేయండి.. కారణం ఇదే..

ఆస్పత్రిలో డాక్టర్‌ ద్వారా పరిచయం 

పెద్దపల్లిలో ఇరిగేషన్‌ ఏఈగా పనిచేస్తున్న రమేష్‌కు గతంలో నార్కట్‌పల్లి వద్ద ప్రమాదం జరిగింది. అప్పట్లో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... డాక్టర్‌ ద్వారా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి సురేష్‌ పరిచయం అయ్యాడు. ఆపై ఇద్దరూ స్నేహితులుగా మారడంతో నగరంలోని రమేష్‌ ఇంట్లో సురేష్‌ అద్దెకు దిగాడు. ఆపై ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం మానేసిన సురేష్‌ పేపర్ల లీకేజ్‌లో కీలకంగా మారాడు. ఇతడి ద్వారా ఏఈ పరీక్షలకు సంబంధించిన పేపర్లు రమేష్‌కు అందాయి. వీటిని ఇతడు 30 మందికి విక్రయించాడు. ఇలా వచ్చిన సొమ్ములో సగం సగం తీసుకుందామని సురేష్‌ ప్రతిపాదించాడు. దీనికి అంగీకరించని రమేష్‌... తనకు 70 శాతం ఇచ్చేలా సురేష్‌ను ఒప్పించాడు.

చదవండి: TSPSC: కొలువుల అర్హత పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

అభ్యర్థులను వెతికి పట్టుకోవడం, విక్రయించడం లాంటి రిస్కులు తనవే అని, అందుకే ఎక్కువ వాటా కావాలన్నాడు. దీంతో సురేష్‌ ఏఈఈ, డీఏఓ పేపర్ల లీకేజ్‌ విషయం ఇతడికి చెప్పలేదు. దీంతో ఏడుగురితో ఒప్పందం చేసుకుని హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు పథకం వేశాడు. ఇతడు అనుసరించిన హైటెక్‌ కాపీయింగ్‌కు ఓ సినిమానే స్ఫూర్తిగా నిలిచింది. ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ చిత్రం చూసిన రమేష్‌ అందులోని కాపీయింగ్‌ పంథాను కాస్త హైటెక్‌గా మార్చి టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు వినియోగించాడు. కాపీయింగ్‌కు రమేష్‌ భారీ స్కెచ్‌ వేశాడు. ఇంటర్‌నెట్‌ నుంచి అత్యాధునికమైన చెవిలో ఇమిడిపోయే బ్లూటూత్, సిమ్‌కార్డు ఆధారంగా పని చేసే చిన్న రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌ తదితరాలు ఖరీదు చేశాడు. బ్లూటూత్‌ డివైజ్‌ ఎవరికీ కనిపించకుండా చెవిలో పెట్టించాడు. వారి చొక్కా కింది భాగంగా ప్రత్యేకంగా కుట్టించిన జేబులో రిసీవర్‌ ఉంచాడు. ఏడుగురు అభ్యర్థులు కచ్చితంగా ఇన్‌షర్ట్‌ చేసుకునేలా సూచించి తనిఖీల్లో దొరక్కుండా చేశాడు. ఓ పరీక్ష కేంద్రం నిర్వాహకుడితో ఒప్పందం చేసుకున్న రమేష్‌ పరీక్ష పత్రం బయటకు పంపేలా ప్రేరేపించాడు. ఆయా పరీక్షలకు గైర్హాజరైన వారి ప్రశ్నపత్రాలు అన్ని సిరీస్‌లవి ఫొటోలు తీసి ఈ నిర్వాహకుడు వాట్సాప్‌ ద్వారా రమేష్‌కు పంపాడు. అప్పటికే ఇతడు సిద్ధం చేసుకున్న బృందానికి వీటిని పంపాడు. వాళ్లు చాట్‌జీపీటీ యాప్‌ ద్వారా ఆయా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి.. వాటిని తమ వద్ద ఉన్న ట్రాన్స్‌మీటర్‌ ద్వారా ఏడుగురు అభ్యర్థులకు చెప్పారు. ఒక సిరీస్‌ తర్వాత మరో సిరీస్‌లోని ప్రశ్నల జవాబులను వీళ్లు చెప్పారు. రమేష్‌తోపాటు ముగ్గురు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్‌ మిగిలిన నిందితుల కోసం గాలిస్తోంది. అరెస్టయిన ఇతర నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సిట్‌ నిర్ణయించింది. 

చదవండి: High Court: గ్రూప్‌–2 అభ్యర్థులను ఇతర హాస్టళ్లకు తరలించొద్దు

Published date : 01 Jun 2023 05:07PM

Photo Stories