ChatGPT vs Google: చాట్ జీపీటీకి గూగుల్ షాక్....బార్డ్‌తో చాట్‌జీపీటీకి చెక్..?
ఇక గూగుల్(Google) పని అయిపోయినట్లే అన్న మాటలు కూడా అనేశారు. అయితే తాజాగా అలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ గూగుల్ కూడా చాట్ జీపీటీకి సవాల్ విసురుతోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం పదండి.!
చాట్ జీపీటీకి పోటీగా బార్డ్....
గూగుల్‌కి సవాల్‌గా దూసుకొచ్చిన చాట్‌జీపీటీకి ఒక రకంగా ఇది చేదువార్తనే చెప్పొచ్చు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్(Microsoft) భారీ పెట్టుబడులతో శరవేగంగా వస్తున్న చాట్‌జీపీటీ ఓపెన్‌ఏఐకి చెక్ చెప్పేందుకు గూగుల్ సిద్ధమైంది. చాట్‌జీపీటీకి పోటీగా సరికొత్త ఏఐ బేస్డ్ చాట్‌బాట్ ‘బార్డ్’(Bard)ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్‌ను కూడా మొదలు పెట్టింది. అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని కూడా గూగుల్ చెప్తోంది.
చదవండి: గూగుల్‌కు మూడినట్లే... సవాల్ చేస్తోన్న చాట్‌జీపీటీడి:
త్వరలోనే అందరికీ అందుబాటులోకి....
వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ కోసం ఈ ఏఐ సర్వీస్ బార్డ్‌ను రిలీజ్ ఓపెన్ చేస్తున్నామని, దీని తరువాత త్వరలోనే పబ్లిక్‌గా విడుదల చేస్తామని గూగుల్,ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. సోమవారం ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన రానున్న కొద్ది వారాల్లోనే పబ్లిక్‌గా విడుదల చేస్తామని తెలిపారు.
3,299 కోట్ల పెట్టుబడి..!
అలాగే ఏఐ వ్యవస్థలలో ఒకటైన ఆంథ్రోపిక్‌లో గూగుల్ దాదాపు 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,299 కోట్లు) పెట్టుబడి పెడుతున్నామని పిచాయ్ చెప్పుకొచ్చారు. నిజానికి ప్రయోగాత్మక సంభాషణ కృత్రిమ మేధతో కూడిన సర్వీస్ బార్డ్ ను రెండేళ్ల క్రితమే గూగుల్ ఆవిష్కరించింది. లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్(LaMDA) ద్వారా అందిస్తోందని పేర్కొన్నారు. తమ విశాలమైన భాషా మోడల్స్ ఇది గొప్ప పవర్ ఇంటిలిజెన్స్, క్రియేటివిటీ కలబోతగా ఉంటుందని చెప్పారు.
చదవండి: ఫ్యూచర్ అంతా మెటావర్స్‌దే...
వేగంగా అభివృద్ధి చెందుతూ రికార్డ్
కాగా టిక్‌టాక్,ఇన్‌స్ట్రాగామ్‌లను అధిగమించి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ వార్తల్లో నిలిచింది. ఈ జనవరిలో దాదాపు 100 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను సాధించిన సంగతి తెలిసిందే. అయితే చాట్‌జీపీటీ 2021 వరకు మాత్రమే అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి అందిస్తోంది. అయితే బార్డ్ మాత్రం అప్‌డేటెడ్‌గా ఉంది. తాజా సమాచారాన్ని కూడా వినియోగదారుడికి అందిస్తోంది. రానున్న రోజుల్లో ఏది దేన్ని బీట్ చేస్తుందో తెలియాల్సి వుంది.