Skip to main content

Covid New Variant: కొత్త వేరియంట్‌తో మ‍ళ్ళీ మొదలైన కోవిడ్‌..! ఇవే దాని లక్షణాలు

2020లో కొరోనా ప్రపంచాన్నే చుట్టేసింది. తదుపరిగా అమెరికాలో ఒమిక్రాన్‌ మొదలైంది. ఇలా, పలు దేశాల్లో కోవిడ్‌ వివిధ రకాలుగా విజ్రంభిస్తుండడంతో ప్రజలు భయాందోళకు గురయ్యారు. ప్రస్తుతం, మరో కొత‍్త వేరియంట్‌ కేరళాలో చోటుచేసుకుంది. ఈ కొత్త వేరియంట్‌ గురించి స్పష్టతను ఇస్తూ తీసుకోవల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు.
  Global Pandemic 2020  Virus Prevention Tips  New Variant Awareness

కేరళలో కరోనా కొత్త వేరియెంట్‌ జేఎన్‌.1 వేరియెంట్‌ వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించింది. ఈ వేరియెంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించాలని, పాజిటివ్‌ శాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు తమకు పంపాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలకు లేఖ రాశారు.

మరోవైపు కేరళ పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్రమత్తమై.. 60 ఏళ్లు పైబడిన వాళ్లకు మాస్క్‌ తప్పనిసరి చేసింది.  కర్ణాటక, కేరళ సరిహద్దులో బందోబస్తును పెంచినట్లు ఆరోగ్య మంత్రి దినేశ్‌ గుండూరావు తెలిపారు.  కేరళలో పాజిటివ్‌ కేసులు అధికమైతే ఆ రాష్ట్ర వాహనాలు కర్ణాటకలోకి రాకుండా పూర్తిగా నిలిపి వేయడంతో పాటు ప్రయాణికుల బస్సులను కూడా బంద్‌ చేస్తామని చెప్పారు. 

జేఎన్‌.1 అమెరికాలో..
కరోనా ఇప్పుడు అత్యవసర పరిస్థితికి దారి తీయకపోయినా.. అప్రమత్తంగా ఉండడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త వేరియెంట్‌లు వెలుగు చూస్తున్నాయి.  జేఎన్‌.1 వేరియెంట్‌ కేసులు అమెరికా, చైనా తర్వాత భారత్‌లో బయటపడుతున్నాయి. ఒమిక్రాన్‌లోని పిరోలా వేరియెంట్‌(బీఏ.2.86)కి జేఎన్‌.1 ఉపరకం. జేఎన్‌.1 వేరియెంట్‌ తొలి కేసు అమెరికాలో సెప్టెంబర్‌లో వెలుగు చూసింది. ఇప్పటివరకు 11 దేశాల్లో ఈ వేరియెంట్‌ కేసులు బయటపడ్డాయి. డిసెంబర్‌లో చైనాలో 7 కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ఈ కొత్త వేరియంట్‌ వ్యాప్తి వేగంగానే ఉంటుందని అమెరికా వైద్య విభాగం సెంటర్‌ ఆఫ్‌ డిసీజ్‌ కంట్రోల్‌ & ప్రివెన్షన్‌ హెచ్చరించింది. 


భారత్‌లో ఎలాగంటే.. 
దేశంలో తొలిసారి.. కేరళ తిరువనంతపురం కారకుళంలో  జేఎన్‌-1 స్ట్రెయిన్‌ కేసు వెలుగు చూసింది. 79 ఏళ్ల వృద్ధురాలికి జరిగిన ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలోనే ఇది బయటపడింది. అయితే పెషెంట్‌ మరణంతో జేఎన్‌-1 వేరియెంట్‌పై ఆందోళన వ్యక్తం కాగా.. సదరు పేషెంట్‌ వైరస్‌ వల్లే మరణించలేదని, కిడ్నీ ఇతరత్ర సమస్యల కారణంగానే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

గత వేరియెంట్‌లతో పోలిస్తే..
ఒమిక్రాన్‌ అంత వేగంగా జేఎన్‌.1 వ్యాప్తి చెందట్లేదని వైద్యనిపుణులు గుర్తించారు. అయితే.. వ్యాప్తి మాత్రం ఉంటుందని, చలికాలం సీజన్‌ కావడంతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కష్టతరంగా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు.  ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్నారు.  

జేఎన్‌.1 కరోనా వైరస్‌ గతంలో వైరస్‌ నుంచి కోలుకున్నవాళ్లకు, అలాగే ఇప్పటికే వ్యాక్సిన్‌ వేసుకున్న వాళ్లకూ సోకుతుందని.. అయితే ఈ వేరియెంట్‌ వ్యాక్సిన్‌లకు లొంగే రకమని గురుగ్రామ్‌ సీకే బిర్లా ఆస్పత్రికి చెందిన వైద్యుడు తుషార్‌ తయాల్‌ తెలిపారు. 

లక్షణాలు.. 
జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి.. కొందరిలో కడుపు నొప్పి, మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుంది. గత వేరియెంట్‌లతో పోలిస్తే జేఎన్‌.1 ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్త్రీయ కారణాలు లేవు. పైగా ఆస్పత్రుల్లో చేరాల్సినంత అవసరమూ రాకపోవచ్చని వైద్యులు అంటున్నారు. కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. బదులుగా.. ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. 

సింగపూర్‌లో ఉధృతం..
ఆసియా దేశం సింగపూర్‌లో కరోనా విజృంభిస్తోంది. మొత్తం 56 వేల కేసులు.. అదీ వారం వ్యవధిలోనే నమోదు కావడంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేసింది ఆ దేశం. కేసుల్లో పెరుగుదల కనిపిస్తే లాక్‌డౌన్‌ విధించే ఆలోచన చేస్తామని అక్కడి ఆరోగ్యశాఖ చెబుతోంది. మరోవైపు మలేషియాలోనూ 20వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ రెండు దేశాల్లో వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 కారణమా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Published date : 19 Dec 2023 01:04PM

Photo Stories