Ayodhya Dispute Case: దేవుని న్యాయవాది.. కేశవ పరాశరన్ గురించి మీకు తెలుసా.. కేసు వాదించే సమయంలో ఇలా చేశారు..
గత 500 సంవత్సరాలుగా అయోధ్యలోని రామ జన్మస్థలంలో రామమందిరాన్ని పునర్నిర్మించడానికి వందలాది యుద్ధాలు జరిగాయి. వేలాది మంది ప్రజలు త్యాగం చేశారు. 80వ దశకంలో ఆలయ పునర్నిర్మాణం కోసం కరసేవకులు నిర్ణయాత్మక దశ పోరాటాన్ని చేపట్టినప్పుడు.. వందలాది మంది రామ భక్తులు పోలీసుల చేతుల్లో హతం అయ్యారు. 1992లో జరిగిన కరసేవ సమయంలో రామభక్తులు తీవ్ర ఆగ్రహంతో వివాదాస్పద భవనం నేలమట్టం చేశారు. తాత్కాలిక రామమందిరాన్ని నిర్మించారు. రామ మందిర నిర్మాణ పోరాటం చివరి అంకం కోర్టు మెట్లకు ఎక్కింది. ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు జరిగిన చర్చలన్నీ విఫలమైన తర్వాత.. రోజువారీ విచారణ చేపట్టింది. ఈ సంక్లిష్ట సమస్యకు నిర్ణయాత్మక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది.
కోర్టులో రామమందిరం కేసును వాదిస్తున్నప్పుడు, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ 93 ఏళ్ల పరాశరన్‌ను కూర్చోబెట్టి తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని వాదనలు వినిపించాలని ఆదేశించారు. అయితే శ్రీరామునిపై తనకున్న అచంచలమైన భక్తిని విశ్వసించిన కేశవ పరాశరన్ భగవంతుని కార్యాన్ని అత్యంత భక్తీ శ్రద్దలతో చేశారు. తాను శ్రీరామునికి అనుకూలంగా వాదిస్తున్నాను.. కనుక నిలబడి వాదిస్తానని చెప్పారు. అంతేకాదు కేసు వాదించే సమయంలో ఆయన బూట్లు ధరించలేదు.
శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించినప్పుడు.. నాయర్ సేవా సొసైటీ తరపున సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పరాశరన్ ధర్మాసనం ముందు వాదించారు. అయ్యప్ప స్వామి దేవాలయం పవిత్రతను కాపాడటానికి ఒక నిర్దిష్ట వయస్సు గల స్త్రీలను ప్రవేశించకుండా తప్పనిసరిగా నిషేధించవలసి ఉంటుందని పేర్కొన్నారు. 2008లో రామ జన్మభూమి ట్రస్ట్ పోరాటం పీక్ స్టేజ్ కు చేరుకుంది. 2008లో సుప్రీంకోర్టులో రామసేతును రక్షించిన ఘనత పొందిన 96 ఏళ్ల కేశవ పరాశరన్ (9 అక్టోబర్ 1927)ని రామ జన్మ భూమి ట్రస్ట్ బోర్డు ఆశ్రయించింది.
ఆరు దశాబ్దాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి 85 ఏళ్ల వయసులో వృత్తి నుంచి విరమణ తీసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. వాల్మీకి రామాయణ శ్లోకాలను రోజూ పఠించే శ్రీ రామ భక్తుడైన పరాశరన్ రామ జన్మభూమి ట్రస్ట్ విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయారు.
పరాశరన్ తండ్రి, కేశవ్ అయ్యంగార్, న్యాయవాది. వేద పండితుడు. పరాశరన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొన్ని రోజులు ఉద్యోగం చేసి మళ్లీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి లా చదవాలని నిర్ణయం తీసుకున్నారు. లా డిగ్రీ కాలేజీలో చేరాడు. న్యాయశాస్త్ర డిగ్రీలో మూడు పతకాలు అందుకున్న తర్వాత తండ్రి సలహా మేరకు స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.
కేశవ పరాశరన్ ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితులు. 1983 నుండి రాజీవ్ గాంధీ పాలన ముగిసే వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2003లో వాజ్‌పేయి నుంచి పద్మభూషణ్, 2011లో మన్మోహన్ సింగ్ నుంచి పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. యూపీఏ ప్రభుత్వం 2012లో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది.
తాను రాజకీయేతర వ్యక్తిని అని పరాశరన్ చెప్పారు “ఎప్పుడూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకున్నట్లు చెప్పారు. మోడీ ప్రభుత్వ హయాంలో ఎన్‌జేఏసీ చట్టానికి రాజ్యసభలో గట్టి మద్దతు లభించింది. తన రాజ్యసభ పదవీకాలంలో పార్టీలకతీతంగా ఉంటూ తన స్టాండ్‌కు కట్టుబడి ఉన్నట్లు చెబుతారు కేశవ్ .
రామజన్మభూమి కేసును సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు విజయవంతంగా వాదించి ఐదు శతాబ్దాల పోరాటానికి ముగింపు పలికిన కేశవ్ పరాశరన్‌ను భారత చట్టాల పితామహుడు అని మద్రాసు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ అభివర్ణించారు. మతంతో రాజీపడకుండా న్యాయవాద వృత్తికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు.
సుప్రీం కోర్టులో వాదిస్తున్న సమయంలో వేల సాక్ష్యాలను ఉదహరించాలి. ఇందు కోసం కేశవ పరాశరన్ కు డజనుకు పైగా లాయర్లు సహకరించారు. అతని బృందంలోని ప్రధాన ఆరుగురు న్యాయవాదులు యోగేశ్వరన్, అనిరుద్ధ శర్మ, శ్రీధర్ పొట్టరాజు, అదితి డాని, అశ్విని కుమార్ డి. ఎస్., భక్తి వరదన్ సింగ్.
రామజన్మభూమి కేసును కోర్టులో వాదిస్తున్నప్పుడు, పరాశరన్ తన వాదనను బలపరిచేందుకు అనేక హిందూ గ్రంధాలను, శ్లోకాలను సాధారణ ఉదాహరణల రూపంలో ఉపయోగించారు.
అయోధ్యలో 40 నుండి 50 మసీదులు ఉన్నాయని.. ముస్లింలు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు. అయితే హిందువులకు ఆ ప్రాంతం రాముడు జన్మించిన ప్రదేశం.. మరే ఇతర ప్రదేశంలో రామ జన్మ భూమిగా పూజించలేమని పేర్కొన్నారు.
కోర్టులో రామమందిరం గురించి వాదిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడూ సహనం కోల్పోలేదు. ప్రత్యర్థి న్యాయవాదిపై ఏనాడూ అసహనం వ్యక్తం చేయలేదు. సున్నీ వక్ఫ్ బోర్డ్ లాయర్ రాజీవ్ ధావన్ వాదించేటప్పుడు చాలా సార్లు అరుస్తూ ఉండేవాడు.
పరాశరన్ తన చివరి వాదనను సమర్పించిన తర్వాత.. కోర్టు హాలు నుండి బయటకు వచ్చి.. రాజీవ్ ధావన్ బయటకు వచ్చే వరకు వేచి ఉండి.. అతనితో ఫోటో దిగి, అతనికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు తమ మధ్య గొడవ కోర్టు హాలులోపల మాత్రమేనని.. బయటికి వస్తే మనసులో ఎలాంటి చెడు అభిప్రాయం ఉండదని చెప్పారు.
పరాశరన్ అద్భుతమైన ఫోటోగ్రాఫిక్ జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నారు. అతని సహాయ న్యాయవాది అనిరుద్ధ శర్మ మాట్లాడుతూ ఏ పుస్తకం సహాయం లేకుండా తన వాదనలను వినిపించే సమయంలో చరిత్ర, మత గ్రంథాలు , సంస్కృత పుస్తకాలను సులభంగా ప్రస్తావించేవారు అని గుర్తు చేసుకున్నారు.
రామమందిరం విషయంలో వాదించడానికి ఒక్క పైసా కూడా తీసుకోకుండా దేవుడి పనికి పూనుకున్నారు కేశవ పరాశరన్. కోర్టులో ఎనిమిది గంటల వాదన తర్వాత ఆఫీసుకు వచ్చి మరుసటి రోజు వాదనకు నోట్స్ రాసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అప్పుడు ఆయనకు 93ఏళ్లు. కేశవ పరాశరన్ అంకితభావం ఊహకు అందనిది.
రామజన్మభూమి కేసు తీర్పు రోజున పరాశరన్ ఢిల్లీలోని తన ఫ్లాట్‌కి తిరిగి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అప్పటి వరకు కనిపించని కోతులు ఒక్కసారిగా కనిపించి చెట్లపై దుముకుతూ సందడి చేశాయి. రాముడి జన్మ భూమి ఆయనకే లభించిందన్న ఆనందంతో హనుమంతుడు ఇలా చేశాడని భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన ప్రముఖ న్యాయవాది నరగుంద అప్పటి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు.
రామజన్మభూమి, శబరిమల కేసుల్లో హాజరయ్యేందుకు రిటైర్మెంట్ తీసుకున్న తాను మళ్లీ నల్ల కోర్టు ధరించానని చెప్పడం సరి కాదు. తనను ఈ విషయల్లో వాదించడానికి దేవుడు ఎంపిక చేసినట్లు.. అంతా దేవుడి చిత్తమని తను నమ్ముతున్నానని కేశవ పరాశరన్ చెబుతారు.
చిన్న వయస్సులో సంపాదించిన గౌరవాన్ని, కీర్తిని మొత్తం పణంగా పెట్టి కోర్టులో వాదించడానికి .. గెలవడానికి రంగంలోకి దిగారు. శ్రీరాముని అనుగ్రహం ఫలితంగా కేశవ పరాశరన్ తన బృందంతో కలిసి విజయం సాధించి.. చరిత్రలో కీర్తి పతాకాన్ని ఉన్నతంగా ఎగురవేసుకున్నారు. అయితే కేశవ పరాశరన్ మళ్లీ కోర్టుకు రాలేదా? అని విలేకరి ప్రశ్నించగా.. ‘లాయర్లకు రిటైర్మెంట్ లేదు’ అని కేశవ పరాశరన్ బదులిచ్చారు.
Tags
- Ayodhya Dispute Case
- Keshava Parasaran
- Legendary Lawyer
- Former Attorney General of India
- Supreme Court Senior Lawyer
- Supreme Court
- First Trustee of the Ram Janmabhoomi Teerth Kshetra Trust
- Indira Gandhi
- Rajiv Gandhi
- Tamil Nadu
- Srirangam
- Former Solicitor General of India
- Sabarimala Case
- Pitamah of Indian Bar
- Padma Bhushan
- Padma Vibhushan
- Rajya Sabha
- General Knowledge
- K Parasaran
- Sakshi Education Latest News