Bappi Lahiri: ఓ సంగీత సంచలనం ఇకలేరు.. ఈయన రికార్టులు చూస్తే..
డిస్కో కింగ్ ఆఫ్ బాలీవుడ్, గోల్డ్‌మ్యాన్ బప్పీదా మరణం తీరని లోటంటూ పలువురు సంతాపం ప్రకటించారు.
3 సంవత్సరాల వయస్సులో..
బప్పీ లహరి అనగానే ప్రసిద్ధ డిస్కో-ఎలక్ట్రానిక్ సంగీతం, ఒంటినిండా బంగారు ఆభరణాలు, గొలుసులు, కంకణాలు, వెల్వెట్ కార్డిగాన్స్, సన్ గ్లాసెస్‌తో ఒక స్పెషల్ స్టైల్ గుర్తు వస్తుంది. 1952 నవంబరు 27న కోలకతాలో పుట్టారు బప్పీ లహరి, ఆయన అసలు పేరు అలోకేష్ లహరి. 3 సంవత్సరాల వయస్సులో తబలా వాయించడం ప్రారంభించి అటు బాలీవుడ్‌ను, ఇటు సౌత్‌లో ముఖ్యంగా తెలుగు తమిళం,కన్నడ పరిశ్రమలో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. తన తుది శ్వాసవరకూ మ్యూజిక్ ప్రాణంగా బతికిన లెజెండ్ ఆయన.
తెలుగులో..
డిస్కో, ఎనర్జిటిక్ సాంగ్స్‌కు పెట్టింది పేరు బప్పీ లహరి. డిస్కో డాన్సర్, నమక్ హలాల్, హిమ్మత్ వాలా, షరాబీ, డర్టీ పిక్చర్ లాంటి అనేక మూవీల్లోని పాటలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన బప్పీ దా సింహాసనం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. బప్పీదా అనగానే సింహాసనం సినిమాలో ఆకాశంలో ఒక తార పాట గుర్తొస్తుంది. అలాగే బాలకృష్ణ రౌడీ ఇన్పెక్టర్, నిప్పురవ్వ, చిరంజీవి గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, స్టేట్ రౌడీ మూవీల్లోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే మెహన్ బాబుకు రౌడీగారి పెళ్లాం, పుణ్యభూమి నా దేశం, బ్రహ్మ లాంటి సినిమాలకు ట్యూన్స్ అందించారు బప్పీ. బప్పీ మ్యూజిక్ అయినా, పాటలైనా ఎప్పటికీ ఎవర్ గ్రీనే. డిస్కో, ఫాస్ట్ బీట్స్, వెస్ట్రన్, క్లాసిక్ మిక్డ్స్ ట్యూన్స్‌తో ఆడియన్స్ మైమరిచిపోయారు.
ఓ సంగీత సంచలనం..
ముఖ్యంగా 70, 80 90వ దశకంలో తన సంగీతంతో సంచలనం సృష్టించారు. చివరగా 2020లో భాగి 3లోను, రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. ఆయన మ్యాజిక్‌కు ఎలాంటి వారైనా స్టెప్స్ వేయాల్సిందే. ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్ అంటూ డిస్కో సాంగ్స్‌తో యూత్‌ను ఉర్రూత లూగించారు.
కెరీర్‌కు మలుపు ఇక్కడే..
1973 లో బాలీవుడ్‌మూవీ నన్హా షికారి, 1974 తొలి చాన్స్ అందుకున్న బప్పీ లహరి తన కంపోజిషన్‌తో ఆకట్టుకున్నాడు. తరువాత 1975లో జఖ్మీ మూవీ కెరీర్‌కు మలుపు తిరిగింది, క్రమంగా ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1976 చల్తే చల్తే డూపర్ సూపర్ హిట్ అయింది. జాతీయ స్థాయిలో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1986లో 33 సినిమాలకు 180కి పైగా పాటలను రికార్డ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. కేవలం ర్యాక్, డిస్కో సాంగ్స్ మాత్రమే కాదు ఆశా భోంస్లే ,లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడిన ఎన్నో మధురమైన పాటలను కూడా ఆయన స్వరపరిచారు. 1983-1985 కాలంలో జితేంద్ర హీరోగా నటించిన 12 సూపర్-హిట్ సిల్వర్ జూబ్లీ సినిమాలకు కంపోజ్ చేసి రికార్డ్ సృష్టించారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయారు.
తొలి చిత్రం..
ఇక ఆయన స్పెషల్ అప్పిరియన్స్‌పై వివరణ ఇస్తూ బప్పిదా తొలి చిత్రం జఖ్మీ సక్సెస్ సందర్భంగా తన తల్లి హరే రామ హరే కృష్ణ లాకెట్ ఉన్న బంగారు గొలుసు గిప్ట్ ఇచ్చారనీ, ఇక తరువాత ప్రతీ పాట హిట్ అవుతూ వచ్చి, బంగారంతో అదృష్టం వచ్చిందని చెప్పారు. అంతే కాదు ఈ విషయంలో అమెరికన్ పాప్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీ తనను ప్రభావితం చేశారనీ, తాను కూడా సెలెబ్రిటీగా మారాక బంగారు గొలుసులతో తనకంటూ ఒక స్టైల్‌తో పాపులర్ అయినట్టు ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు.