Skip to main content

Pariksha Pe Charcha: షార్ట్‌కట్స్‌ వద్దు... చీటింగ్‌ చేసేందుకు తెలివితేటల్ని వినియోగించకండి: మోదీ

ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యకమ్రంలో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఇందుకు దిల్లీలోని తాల్కటోరా ఇండోర్‌ స్టేడియం వేదికైంది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. విద్యార్థులతో మాట్లాడుతూ సమయపాలనపై చర్చించారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందని.. విద్యార్థులు గెలుపు, ఓటమిని సమానంగా తీసుకోవాలని సూచించారు.  ఎవరైతే పరీక్షల పట్ల శ్రద్ధ పెడతారో వారి శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా ప్రధాని మోదీని పలు ప్రశ్నలు అడిగారు.
మోదీజీ.. హార్డ్‌ వర్క్‌ చేయాలా లేక స్మార్ట్‌ వర్కా..
పరీక్షా పే చర్చ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చర్చ మధ్యలో ఓ విద్యార్థి ప్రధాని మోదీని.. ‘స్మార్ట్‌ వర్కా లేక హార్డ్‌ వర్కా’ ఏదీ ముఖ్యమైంది ప్రధాని సార్‌ అంటూ ప్రశ్నించాడు.

PM Modi

దీనికి సమాధానంగా ‘కొంతమంది చాలా అరుదుగా తెలివితో పనిచేస్తారు. మరికొందరు తెలివిగా కష్టపడతారు’ అన్ని బదులిచ్చారు. కొంత మంది విద్యార్థులు వారి క్రియేటివిటిని పరీక్షల్లో చీటింగ్‌ చేసేందుకు ఉపయోగిస్తున్నారని... ఆ క్రియేటివిటీని మంచి మార్గానికి వాడుకుంటే గొప్ప విజయాలు అందుకోవచ్చని మోదీ తెలిపారు. మనం జీవితంలో ఎన్నడూ షార్ట్‌కట్స్‌ వెతుక్కోకూడదు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.
నచ్చిన రంగంలో ప్రోత్సహించండి...
ఇదే సమయంలో చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని తల్లిడండ్రులు, ఉపాధ్యాయులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. నచ్చిన రంగంలో పిల్లలను ప్రోత్సహించాలన్నారు. మానసిక ఉల్లాసం ఉంటేనే పిల్లలు బాగా చదువుతారన్నారని.. ప్రశాంతమైన మనసుతో పిల్లలు పరీక్షలు రాస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఇక.. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించారు.  కాగా, ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో సుమారు 38.80 లక్షల మంది పాల్గొన్నారు. గతేడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 15.7 లక్షల మంది పాల్గొన్నారు.
సందేహాల నివృత్తి కోసమే...
పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారికి వచ్చిన సందేహాలపై సమాధానాలు ఇస్తుంటారు. విద్యార్థులను పరీక్షల కోసం సిద్ధం చేస్తుంటారు.

Published date : 27 Jan 2023 03:25PM

Photo Stories