Skip to main content

River Cruise: రోజుకు రూ.25 వేలా..? 51 రోజుల ప్రయాణంలో ప్రతీ రోజూ ప్రత్యేకతే..!

ప్రపంచంలోనే అతిపెద్ద రివర్‌ క్రూయిజ్‌ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రూయిజ్‌ వారణాసి నుంచి 3,200 కిలోమీటర్లు ప్రయాణించనుంది.
Cruise River

అస్సాంలోని దిబ్రూగర్‌ వద్ద తొలి పర్యటన ముగియనుంది. తొలి బ్యాచ్‌లో 52 మంది స్విస్‌ టూరిస్టులు పాల్గొంటున్నారు. మొత్తం 51 రోజుల ప్రయాణానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రయాణికుడికి ఒక రోజుకు రూ. 25,000 వరకు ఖర్చు అవుతుంది.
వారణాసి నుంచి బయల్దేరే గంగా విలాస్‌ మొత్తం 3,200 కి.మీ. ప్రయాణించి బంగ్లాదేశ్‌ మీదుగా అసోంలో దిబ్రుగర్‌కు చేరుకుంటుంది.  
ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజులు సమయం పడుతుంది. 27 నదుల్ని దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది.  
మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్‌లో 18 సూట్స్‌ ఉన్నాయి.   

62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్‌ ఉంటుంది.  
ప్రయాణికుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజూ నౌకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్‌ సర్వీసు, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేసే అవకాశం ఉంటుంది.  

Cruise River

ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను ఈ ప్రయాణంలో సందర్శించవచ్చు.
బిహార్‌లో పట్నా, జార్ఖండ్‌లో సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లో కోలకతా, బంగ్లాదేశ్‌లో ఢాకా, అసోంలో గౌహతి పట్టణాలను గంగా విలాస్‌ కవర్‌ చేస్తుంది.  
బిహార్‌ స్కూల్‌ ఆఫ్‌ యోగ, విక్రమశిల యూనివర్సిటీలను విజ్ఞానం పంచే ప్రాంతాలు, సుందర్‌బన్స్‌, బెంగాల్‌ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్‌ పార్క్‌ వంటి జాతీయ ఉద్యానవనాలను సందర్శించవచ్చు.  
మొదటి రోజు వారణాసిలో గంగా హారతిని సందర్శించిన అనంతరం ఈ నౌక బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్‌కతాకి 35వ రోజున బంగ్లాదేశ్‌లో ఢాకాకి చేరుకుంటుంది. ఇక 50వ రోజు అంటే మార్చి 1న తిరిగి అసోంలోని దిబ్రుగఢ్‌కి చేరుకుంటుంది.

Published date : 13 Jan 2023 07:03PM

Photo Stories