Skip to main content

Voting Rules : జాగ్ర‌త్త‌..ఓటు వేయ‌కుంటే.. లైసెన్స్‌ రద్దు.. జరిమానా కూడా.. ఎక్క‌డంటే..!

ఓటు అత్యంత శ‌క్తివంత‌మైన‌ది. దేశ‌చ‌రిత్ర‌ను మార్చే శ‌క్తి కేవలం ఓటుకే ఉంది. ఇలాంటి శ‌క్తివంత‌మైన‌ ఓటును మ‌న దేశంలో చాలా మంది నిర్ల‌క్ష్యంతో క‌నీసం ఓటు హ‌క్కును కూడా వినియోగించుకోవ‌డం లేదు.
Voting booth with ballot, PowerOfTheBallot, Voter registration formChangeHistory

మన దేశంలో కొన్నిచోట్ల 60 శాతం ఓటింగ్‌ జరిగితే గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే దీన్ని హక్కుగా చూడకుండా బాధ్యతగా తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలన్న డిమాండ్‌ కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి బలంగా వినిపిస్తోంది.

☛ How To Apply Voter ID Card: ఓటు హక్కు లేదా..? అయితే ఆన్‌లైన్‌లో ఇలా నమోదు చేసుకోండి..

తప్పనిసరిగా ఓటు వేయాల్సిందే..
ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. వేయకుంటే కొన్ని దేశాలు జరిమానా విధిస్తుండగా, మరికొన్ని ప్రభుత్వ సాయాన్ని, సదుపాయాలను నిలిపివేస్తున్నాయి.ఇంకొన్ని దేశాల్లోనైతే అలాంటి వారికి ఏకంగా ఓటుహక్కును తొలగించేస్తున్నారు. ఎందుకు ఓటు వేయలేకపోయారో సరైన కారణం చూపితే గానీ మళ్లీ ఆ హక్కును కల్పించరు. తప్పనిసరిగా ఓటు వేయాల్సిన దేశాల్లో బెల్జియం, అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, అర్జెంటీనా, బొలీవియా, ఉక్రెయిన్‌, బ్రెజిల్‌, ఈజిప్టు, గ్రీస్‌, ఇటలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయిలాండ్‌, టర్కీ, స్విట్జర్లాండ్‌, న్యూజిలాండ్‌ తదితరాలు ఉన్నాయి.

Voting Process : అస‌లు పోలింగ్‌ కేంద్రం అంటే ఏమిటి? ఎవరెవరి పాత్ర ఎంత..? ఓటు వేసే విధానం ఎలా?

భారీగా జరిమానా..బెల్జియంలో..
ఈ దేశంలో ఓటరు జాబితాలో పేరు ఉండి, వరుసగా నాలుగుసార్లు ఓటెయ్యకపోతే.. పదేళ్ల వరకు ఓటుహక్కు తొలిగిస్తారు. మొదటిసారి ఓటు వేయకపోతే 2 వేల నుంచి 4 వేల యూరోల వరకు, రెండోసారి 10 వేల యూరోల వరకు జరిమానా విధిస్తారు. పైగా సర్కారు ఉద్యోగావకాశాలు, పథకాలు, సదుపాయాల్లో ప్రాధాన్యం తగ్గిస్తారు. ఎన్నికలు జరిగిన వారం రోజుల్లో సంబంధిత ఓటర్లపై చర్యలు తీసుకుంటారు.

ఎన్నికల రోజు సెలవు ఉండదు.. అమెరికాలో
ఇక్కడ ఓటు వేయడంపై ఎలాంటి ఆంక్షలూ లేవు. అయినా ఇక్కడ 85 శాతం వరకు ఓటింగ్‌ నమోదవుతుంది. పోలింగ్‌ రోజు సెలవు ఉండదు. ఉద్యోగులు, ప్రజలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ఓటు విలువ పట్ల అమెరికన్లలో చైతన్యం ఎక్కువ.

గుర్తింపు కార్డు ఉంటేనే..
ఈ దేశంలో ఓటు వేసినవారికి గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అది ఉన్నవారికే ప్రభుత్వ సౌకర్యాలను కల్పిస్తారు. రేషన్‌, విద్యుత్‌, తాగునీటి వసతి పొందాలంటే ఈ కార్డును సంబంధిత అధికారులకు చూపించాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయకపోతే.. వేతనాలు సరిగా అందవు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఆస్ట్రేలియా.. వారం రోజుల్లో విచారణ..
ఇక్కడ అర్హులైన ప్రతిఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. ఎన్నికల రోజున వీరంతా తప్పకుండా ఓటు వేయాలి. వేయకుంటే జరిమానా విధిస్తారు. ఎన్నికలు జరిగిన వారంలోగా విచారణ చేపట్టి, అపరాధ రుసుము ఎంతన్నది నిర్ణయిస్తారు. ఇక్కడ 96 శాతం ఓటింగ్‌ నమోదవుతుంది. ఎన్నికలకు చాలా ముందు నుంచే ఓటుహక్కు వినియోగంపై ప్రభుత్వం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

గ్రీస్‌.. డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు రద్దు
ఇక్కడ ఓటు వేయకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు రద్దవుతాయి. లేదంటే వాటి మంజూరును నిలిపివేస్తారు. ఓటు వేయకపోవడానికి గల కారణాలను అధికారులకు ఆధారాలతో చూపించాల్సి ఉంటుంది. వారు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితేనే మళ్లీ ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. ప్రభుత్వం నుంచి పొందే సౌకర్యాలపై ఆంక్షలు విధిస్తారు.

సింగపూర్‌.. పేరు తొలగిస్తారు..
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే సింగపూర్‌లో ఓటు వేయడం తప్పనిసరి. వేయనివారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. ఓటు వేయకపోవడానికి గల కారణానికి ఆధారాలను అధికారులకు చూపిస్తే పునరుద్ధరిస్తారు. ఎక్కువ మంది ప్రజలు కోరుకునే ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లే సింగపూర్‌ అభివృద్ధిలో ముందుందన్న వాదనలున్నాయి.

ఇక్కడా తప్పనిసరి చేయాలి..
ఎన్నికలు ప్రగతికి బాటలు వేస్తాయి. మంచి ప్రభుత్వం రావడానికి దోహదపడతాయి. అందుకే అయిదేళ్లకోసారి ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే, చాలా ప్రాంతాల్లో అర్హులైన అనేక మంది వివిధ కారణాలతో తమ ఓటుహక్కు వినియోగించుకోవడం లేదు. వందశాతం లక్ష్యంగా ఎన్నికల సంఘం అధికారులు కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతీ ఓటరు ఓటు వేసేలా ప్రచారం, ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన దగ్గర కూడా ఓటు వేయడం తప్పనిసరి చేయాలి. ఇతర దేశాల తరహా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.

మీకు తెలుసా.. ఓటు ఎన్ని రకాలుగా వేయవచ్చో..?

Published date : 28 Nov 2023 08:27AM

Photo Stories