Skip to main content

Hyderabad Moosi Floods: మూసీ నది వరదల నుంచి ప్ర‌జ‌ల‌ ప్రాణాలు కాపాడిన చింత చెట్టు

‘సెప్టెంబర్‌ 28’... ఈ తేదీ రాగానే 1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన  వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధిక భాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి.
Hyderabad Moosi Floods, HyderabadHistory,908Flood,NaturalDisaster
Hyderabad Moosi Floods

వరదలు వచ్చి నేటికి 115 ఏళ్లు గడిచినా ఈ నగరానికి నాటి స్మృతులు నేటికీ తడి ఆరకుండానే ఉన్నాయి. అఫ్జల్‌ గంజ్‌ పార్క్‌ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం)లో ఉన్న ఓ చింత చెట్టునాటి జ్ఞాపకాలను నేటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు... ఈ ఏడాది సైతం సెప్టెంబర్‌ 28న అలనాటి వరద సమయంలో ఎంతో మందిని రక్షించిన చింతచెట్టు కింద జరిగే సమావేశం ఒక నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ... నేటి పరిస్థితుల్లో నగరాభివృద్ధికి నిపుణులు చేసే సూచనలకు వేదిక కానుంది. 

Libya floods: లిబియా మృతులు 11 వేలకు పైనే

ప్రాణాలు కాపాడిన చింతచెట్టు.. 

tamarind tree

మూసీ నదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయి. కానీ 1908లో వచ్చిన వరద మాత్రం కనివిని ఎరుగనిది.ఆ వరద బీభత్సానికి 48 గంటల్లో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వరదలో కొట్టుకుపోయారు. 80 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.లక్షన్నర మందికి గూడు లేకుండా పోయింది. వందలకొద్దీ చెట్లు నెలకొరిగాయి. కొందరైతే భవనల పైకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు. తాము బతికుంటామో లేదో తెలియదు అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు.

అలాంటివారిలో కొంతమంది ప్రాణాలను కాపాడింది. ఒక చింత చెట్టు. అది ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. వరదల సమయంలో ఆ చింతచెట్టుపై ఎక్కి 150 మందికిపైగా ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కాపాడిన చెట్టు ఇప్పటికీ సజీవంగానే ఉంది. రెండు రోజుల పాటు వారు తిండితిప్పలు లేకుండా అలాగే ఉండిపోయారని చెబుతారు. ఆ చెట్టుకు 400ఏళ్లనాటి చరిత్ర ఉందని భావిస్తున్నారు.

ఆ వరదలు వచ్చిన మూడేళ్లకు చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ గద్దెనెక్కారు. అలాంటి విపత్తు మరోసారి రావద్దని భావించారు. అందుకోసం సిటీ ప్లాన్‌ రూపొందించాలని, మౌలిక వసతులు కల్పించాలని సంకల్పించారు. 1914 లోనే సిటీ ఇంప్రూవ్‌ మెంట్‌ బోర్డు (సీఐబీ)ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్లానర్‌ సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో సీఐబీ అనేక పథకాలను అమలు చేసింది. అప్పట్లో నగర ప్రణాళిక... బాగ్‌ (ఉద్యానవనాలు), బౌలి (బావులు), తలాబ్‌ (చెరువులు)తో ముడిపడి ఉండింది. పచ్చదనం, జలాశ యాలు నగరప్రణాళికలో కీలక పాత్ర పోషించాయి. 

Morocco Earthquake: మొరాకోలో భారీ భూకంపం

హైదరాబాద్‌.. ఎన్నో సమస్యలు

ఈ శతాబ్ది కాలంలో నగరం ఎంతో అభివృద్ధి సాధించింది  కాకపోతే... నగరం ఊహకు అందని విధంగా విస్తరించింది. జనాభా బాగా పెరిగిపోయింది. నగరంలో అనేక ప్రాంతాలు ఓ మోస్తరు వర్షానికే జలమయమైపోతున్నాయి. పుట్ట గొడుగుల్లా మురికివాడలు వెలిశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఫోరమ్‌ ఫర్‌ ఎ బెటర్‌ హైదరాబాద్‌’, ‘సెంటర్‌ ఫర్‌ దక్కన్‌ స్టడీస్‌’ సంస్థలు ఇతర ఎన్జీఓలతో కలసి అర్బన్‌ ప్లానింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, నగరాభివృద్ధితో ముడిపడిన సంస్థలకు అనేక సూచనలు చేశాయి. 1908 నాటి వరదల భయంకర పరిస్థితికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన చింతచెట్టు నీడలో ‘ఫోరమ్‌ ఫర్‌ ఎ బెటర్‌ హైదరాబాద్‌’ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది.
2008 సెప్టెంబర్‌ 28 నుంచి కూడా ఏటా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి.  హైదరాబాద్‌ నగరం నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాకాలంలో కాల్వలుగా మారుతున్న రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం, పెరిగిపోతున్న ట్రాఫిక్, వాహన కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం,మంచి నీటి సమస్య, డ్రైనేజీ ఇక్కట్లు, ప్రజా రవాణా, మూసీ నది కలుషితం కావడం... మూసీ తీరంలో ఆక్రమణల తొలగింపు ఇలా చెబుతూపోతే...  ఈ జాబితాకు అంతు ఉండదు. ఈ సమస్యల్లో చాలా వాటిని పరిష్కరించేది హైదరాబాద్‌కు చక్కటి ‘ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ప్లాన్‌’ మాత్రమే. 

హైదరాబాద్‌లో మంచినీటి సమస్య పరిష్కారమయ్యింది. రహదారులు వృద్ధి చెందాయి. ఓ.ఆర్‌.ఆర్‌. లాంటివి ఎన్నో వచ్చాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌.లు వస్తున్నాయి. ఫ్లై ఓవర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎయిర్‌ పోర్ట్, మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నాలాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే నగరం శరవేగంగా విస్తరిస్తున్నందున  సదుపాయాలను పెంచవలసి ఉంది. రాబోయే రోజుల్లో మంచిరేవుల నుంచి ఘట్‌ కేసర్‌ దాకా మూసీ మీదుగా రూ.10 వేల కోట్ల వ్యయంతో ఓఆర్‌ఆర్, విమానాశ్రయంతో పాటు, ఇతర ప్రాంతాలను కలుపుతూ ఎక్స్‌ ప్రెస్‌ వే కూడా రానుంది. ఇది ఒక్కటే కాదు. నగరానికి నాలుగు వైపులా సుమారుగా 100 కి.మీ దాకా ఇదే తరహా అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ మనకు సానుకూల సంకేతాలే అనడంలో సందేహం లేదు.

Emergency Funds for Godavari Floods: గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు

అభివృద్దితో పాటు సమస్యలూ..

అభివృద్ధితో పాటూ సమస్యలూ తలెత్తుతాయి. వీటిని దుర్కొనడానికి మాస్టర్‌ ప్లాన్‌ అత్యంత కీలకం. 1975 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివిధ సంస్థల ద్వారా హైదరాబాద్‌కు 6 మాస్టర్‌ ప్లాన్లు వచ్చాయి. వాటిని కలిపి ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ప్లాన్‌ అమలుచేయాలి. హైదరాబాద్‌ నగరం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాహన కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీ ముఖ్యమైన అంశాలుగా మారిపోయాయి. వీటిని నివారించేందుకు ప్రజా రవాణా ఒక్కటే మార్గం. అందులోనూ గ్రీన్‌ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించాలి. రెండవ దశ ఎమ్‌ఎమ్‌ టీఎస్‌ వ్యవస్థను మరింతగా విస్తరించాలి. దాంతో పాటుగా ఇప్పటికే ఉన్న లోకల్‌ రైల్‌ లాంటి వాటిని అభివృద్ధి చేయాలి. 
నగరం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ, వరదనీళ్లు. ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని స్థానికంగా వినియోగించుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. మిగులు నీటిని (శుద్ధి అయినవి మాత్రమే) స్థానిక చెరువుల్లోకి, మూసీనదిలోకి పంపించేలా చూడాలి. హైదరా బాద్‌కు వలసలను నివారించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రాజధానికి 100 కి.మీ. వెలుపల కౌంటర్‌ మాగ్నెట్స్‌గా వివిధ చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలి. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాలి.

Telangana Rains: తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షపాతం నమోదు... 24 గంటల్లో 64 సెం.మీల వ‌ర్షం... ఎక్క‌డంటే

వారసత్వాన్ని కాపాడుకోవాలి

ఈ రోజున హైదరాబాద్‌ యావత్‌ దేశపు గ్రోత్‌ఇంజిన్లలో ఒకటిగా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్‌ నగరానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయాలి.  హైదరాబాదు నగరంలో నేటికీ ఎన్నో చారిత్రక భవనాలు వారసత్వ జాబితాలోకి ఎక్కవలసి ఉన్నాయి. అలాంటి వాటిని పరిరక్షించుకోవాలి. కనీసం 5 లేదా 6 ప్రాంతాలు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. అఫ్జల్‌ గంజ్‌ పార్క్‌ లో ఉన్న   చింత చెట్టునూ, ఆ స్థలాన్నీ నగర సహజ వారసత్వంలో భాగంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
‘నేను నిర్మించిన నగరం చేపలతో నిండిన మహా సముద్రంలా ఉండాలి’ అని అప్పట్లో కులీ కుతుబ్‌ షా కోరుకున్నారు. అది నిజమైంది. నగరం జనసంద్రమైంది. ఇప్పుడు కావాల్సింది ఆ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మరింతగా అందించడం. హైదరాబాద్‌ నగరం కూడా శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి లోనైంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పరిస్థితి ఇలానే కొనసాగితే 115 ఏళ్ల క్రితం వరదలే మరోసారి నగరాన్ని ముంచెత్తే పరిస్థితి కూడా పొంచి ఉంది.  పైన పేర్కొన్న అన్ని సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక లతో ముందుకెళ్లడం నేటి తక్షణావసరం. 

జనాభాలోనూ గ్రేటరే..! 140 దేశాల కన్నా హైదరాబాద్‌ జనాభా ఎక్కువ

Published date : 29 Sep 2023 09:10AM

Photo Stories