Skip to main content

Rythu Bandhu scheme : ‘రైతు బంధు’ పథకం విశేషాలు.. అర్హ‌త‌లు.. ద‌ర‌ఖాస్తు విధానం ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో రైతుబంధు ఒక‌టి. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తి మరింత ప్రోత్సహించి, రైతుల ఆదాయం పెంచేందుకు నగదు రూపంలో రుణాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే రైతు బంధు.
rythu bandhu scheme details in telugu
Rythu Bandhu Scheme

రైతులు ప్రైవేట్ అప్పుల ఊబిలో చిక్కుకుపోకుండా ఈ స్కీమ్ కాపాడుతోంది. 2018-19 ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు కావాల్సిన తొలి పెట్టుబడిని ప్రభుత్వమే చూసుకుంటోంది. ఒక్కో ఎకరానికి, ఒక్కో రైతుకి ప్రతి సీజన్‌లో రూ.5000ను ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి జమ చేస్తుంది. ఇలా రెండు పంటలుగా తీసుకుంటే ప్రజలకు రూ.10 వేలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. విత్తనాలు, రసాయనాలు, ఎరువులను కొనుగోలు చేసుకునేందుకు, ఇతరాత్ర అవసరాలకు రైతుల చేతికి ఈ నగదును ప్రభుత్వం రైతు బంధు కింద ఇస్తోంది. రైతులకు మద్దతునిచ్చేందుకు భారత్‌లో ప్రవేశపెట్టిన తొలి పెట్టుబడి పథకం ఇదే కావడం విశేషం. రైతు బంధు కింద డబ్బులను తెలంగాణ ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలోకే వేస్తోంది.

రైతు బంధు పథకాన్ని తొలిసారిగా..

rythu bandhu scheme in telangana

రైతు బంధు పథకాన్ని తొలిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతుల సమన్వయ కమిటీ(రైతు సమన్వయ సమితి) కాన్ఫరెన్స్‌లో ఫిబ్రవరి 25న, 2018లో ప్రకటించారు. ఆ తర్వాత 2018 మే 10న కరీంనగర్ జిల్లా, హుజురాబాద్‌ నియోజకవర్గంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 2018-19 బడ్జెట్‌లోనే కేంద్రం ఈ రైతు బంధు పథకం కోసం రూ.12 వేల కోట్లను కేటాయించింది. అంతేకాక 2021లో ఈ పథకం కింద రూ.50 వేల కోట్లను రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది.

ఈ పథకం ప్రయోజనాలు..

rythu bandhu scheme benefits in telugu

కేవలం తొలి పెట్టుబడిని అందించడమే కాకుండా... ఈ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రుణాలను అందిస్తోంది. ఈ పథకం కింద తీసుకునే రుణాలకు కూడా రైతులు ఎలాంటి వడ్డీని చెల్లించాల్సినవసరం లేదు. 58.33 లక్షల మంది రైతులు ఈ పథకం కింద ప్రతి ఏడాది పెట్టుబడి సాయం పొందుతున్నారు. రాష్ట్రంలో 1.43 కోట్ల ఎకరాలలో పంట సాగు జరుగుతోంది. తెలంగాణలో సుమారు 55 శాతం మంది జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతానికి పైగా పేద ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. అంతకుముందు రైతులకు పంట సాయం దొరకకపోతుండటంతో.. పెట్టుబడిదారులు, దళారుల నుంచి అప్పులు తెచ్చుకునేవారు. వారు రైతులపై అధిక వడ్డీలు విధించేవారు. ఈ వడ్డీలతో రైతులు అప్పులు పాలై, ఆత్మహత్యలు చేసుకునేవారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది.

అర్హతలు ఇవే..

rythu bandhu scheme eligibility details in telugu

➤ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్మినెంట్ రెసిడెంట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
➤ రైతు కచ్చితంగా ఆ భూమికి యజమాని అయి ఉండాలి.
➤ రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ స్కీమ్.
➤ కమర్షియల్ రైతులు, సంపన్న వర్గానికి చెందిన రైతులు ఈ పథకం నుంచి ప్రయోజనాలు పొందలేరు.
➤ ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం ఉన్న రైతులు కూడా ఈ స్కీమ్ కింద అనర్హులు.

రైతు బంధుకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే..

rythu bandhu scheme documents required

☛ ఆధార్ కార్డు..గుర్తింపు కోసం తప్పనిసరిగా రైతులు ఆధార్ కార్డును అప్ డేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
☛ ఓటర్ కార్డు... రాష్ట్రానికి చెందిన ఓటర్ కార్డు ఉండాలి.
☛ దారిద్య్ర రేఖకు దిగువనున్న సర్టిఫికేట్.. దారిద్య్రరేఖకు దిగువనున్నట్టు రైతులు సర్టిఫికేట్ సమర్పించాలి.
☛ భూమి యజమాని పత్రాలు... రైతులు తప్పనిసరిగా ఆ భూమికి యజమానులై ఉండాలి. దీని కోసం ల్యాండ్ ఓనర్‌షిప్ ప్రూఫ్‌ను సమర్పించాలి.
☛ కుల ధ్రువీకరణ పత్రం.. రైతులు ఎస్‌సీ, ఎస్టీ లేదా వెనుకబడిన తరగతికి చెందిన వారైతే తప్పనిసరిగా తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
☛ ఈ స్కీమ్ కేవలం తెలంగాణ రైతులకు మాత్రమే. అందుకోసం రైతులు  తమ చిరునామాను సబ్‌మిట్ చేయాలి.
☛ బ్యాంకు అకౌంట్ వివరాలు.. బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా రైతులు సమర్పించాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

rythu bandhu scheme application form

మీ ప్రాంతాలలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా రైతు బంధు పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ధరణిపోర్టల్‌లో ఉన్న రైతుల భూములకు మాత్రమే రైతు బంధు లభిస్తుందని ప్రభుత్వం చెప్పింది. అందుకే ఎప్పటికప్పుడు ధరణి పోర్టల్‌లో మీ భూముల వివరాలను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
అంతేకాక http://rythubandhu.telangana.gov.in/Default_RB1.aspx పై క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రైతు బంధు స్కీమ్ దరఖాస్తు చేసుకునేటప్పుడు మాత్రమే మెనూ బారులో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇయర్‌ను, పీపీబీఎన్‌ఓ నెంబర్‌ను నమోదు చేసి, సబ్‌మిట్ కొట్టాలి. అవసరమైన వివరాలన్ని నింపి, డాక్యుమెంట్లు సమర్పించాలి.హెల్ప్‌లైన్ నెంబర్లు.. రైతు బంధు కోసం సమర్పించాల్సిన నెంబర్.. 04023383520, ఈమెయిల్ ఐడీ omag-ts@nic.in.

వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష‌ల్లో ఈ ‘రైతు బంధు’ పథకం స‌మాచారం మీకు ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉంది.

Published date : 24 Jan 2023 03:38PM

Photo Stories