Skip to main content

Swapnil Kusale: అవరోధాలను దాటి.. భారత్‌ నుంచి తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించిన స్వప్నిల్‌ కుసాలే!

గత రియో, టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో మూగబోయిన భారత తుపాకీ ‘పారిస్‌’లో మాత్రం గర్జిస్తోంది.
Paris Olympics Bronze Medalist Swapnil Kusale Special Story

తమపై పెట్టుకున్న అంచనాలను వమ్ముచేయకుండా షూటర్లు భారత్‌కు మూడో పతకాన్ని అందించారు. ఆగ‌స్టు 1వ తేదీ జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో స్వప్నిల్‌ కుసాలే కాంస్య పతకాన్ని సాధించాడు. 

ఎవరూ ఫైనల్‌కు చేరని ఈవెంట్‌లో..
గతంలో భారత్‌ నుంచి ఒలింపిక్స్‌లో ఎవరూ ఫైనల్‌కు చేరని ఈవెంట్‌లో స్వప్నిల్‌ కుసాలే తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించాడు. తీవ్రమైన పోటీ ఉండే విశ్వ క్రీడల్లో క్వాలిఫయింగ్‌తో పోలిస్తే అసలు సిసలు సత్తా ఫైనల్లో చూపిస్తేనే పతకాలు ఖరారవుతాయి. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతుండటంతో స్వప్నిల్‌ పతకం సాధిస్తాడని పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ తన నైపుణ్యంపై అపార నమ్మకమున్న స్వప్నిల్‌ అందరినీ ఆశ్చర్యపరిచే ప్రదర్శన చేశాడు.

షూటింగ్‌లో ఎంతో క్లిష్టమైన ఈవెంట్‌గా పేరున్న 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌లో (నీలింగ్, ప్రోన్, స్టాండింగ్‌) స్వప్నిల్‌ తొలి ప్రయత్నంలోనే ఒలింపిక్‌ పతకాన్ని గెలిచి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. గురువారం జరిగిన 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఫైనల్లో 28 ఏళ్ల స్వప్నిల్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్‌ 451.4 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 

స్టేజ్‌–1లో త్రీ పొజిషన్స్‌లో భాగంగా నీలింగ్‌ స్టేజ్‌ ముగిశాక స్వప్నిల్‌ 153.3 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రోన్‌ స్టేజ్‌ పూర్తయ్యాక స్వప్నిల్‌ 310.1 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఎలిమినేషన్‌ను నిర్ణయించే చివరి స్టేజ్‌ స్టాండింగ్‌లో స్వప్నిల్‌ నిలకడగా పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు.

Paris Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధించిన‌ స్వప్నిల్ కుసాలే

2012 నుంచి అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వప్నిల్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలిసారే పతకాన్ని గెలిచి తన కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. లియు యుకున్‌ (చైనా; 463.6 పాయింట్లు) స్వర్ణం, సెరీ కులిష్‌ (ఉక్రెయిన్‌; 461.3 పాయింట్లు) రజతం సాధించారు.  

సిఫ్ట్‌ కౌర్, అంజుమ్‌ విఫలం 
మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో ప్రపంచ రికార్డు తనే పేరిట లిఖించుకున్న భారత యువ షూటర్‌ సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా, సీనియర్‌ షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. 32 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో సిఫ్ట్‌ కౌర్‌ 575 పాయింట్లు స్కోరు చేసి 31వ స్థానంలో నిలువగా... అంజుమ్‌ 584 పాయింట్లు సాధించి 18వ స్థానాన్ని దక్కించుకుంది. కేవలం టాప్‌–8లో నిలిచిన షూటర్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.  

‘ఒక్కడే’ గెలిచి చూపించాడు! 
ఈతరం కుర్రాళ్లు, స్టార్‌ ఆటగాళ్లు ఒంటిపై టాటూస్‌ ముద్రించుకుంటే వాటిపై ఏం రాసి ఉంటుంది? తమకు ఆత్మీయులైన వారి పేర్లు గానీ ఆసక్తికర పంచింగ్‌ లైన్‌లు గానీ ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడో ఒక చోట దేవుడి బొమ్మలు కూడా ఉంటాయి. స్వప్నిల్‌ కుసాలే తన వెన్నెముక భాగం మొత్తం ‘మహా మృత్యుంజయ మంత్రం’ టాటూగా ముద్రించుకున్నాడు. మానసికంగా తనకు కావాల్సిన బలాన్ని, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చలించని దృఢత్వాన్ని ఆ రుగ్వేద మంత్రం తనకు ఇస్తుందని అతను బలంగా నమ్ముతాడు. అందుకే కావచ్చు సుదీర్ఘకాలం పాటు షూటింగ్‌ సర్క్యూట్‌లో ఉంటూ గొప్ప ఫలితాలు రాకపోయినా అతను ఎప్పుడూ స్థైర్యాన్ని కోల్పోలేదు. 

నిజంగా కూడా కుసాలే కెరీర్‌ను చూస్తే చాలా ఆలస్యంగా గుర్తింపు వచ్చినట్లుగా కనిపిస్తుంది. 14 ఏళ్ల వయసులో షూటింగ్‌ను కెరీర్‌ను ఎంచుకున్న స్వప్నిల్‌ మూడేళ్ల తర్వాత తన తొలి అంతర్జాతీయ పోటీలో బరిలోకి దిగాడు. కానీ అతను తొలి ఒలింపిక్స్‌ ఆడేందుకు 12 సంవత్సరాలు పట్టింది. 2016 రియో ఒలింపిక్స్‌ సమయంలో అతని పేరు కనీసం పరిశీలనలో కూడా లేకపోగా.. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు కొన్నాళ్ల ముందు చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకపోవడంతో టీమ్‌లోకి ఎంపిక చేయలేదు. 

అయితే స్వప్నిల్‌ సుదీర్ఘ కాలం పాటు తన ఆటనే నమ్ముకున్నాడు. అవకాశం వచ్చిన ప్రతీసారి విజయాన్ని అందుకుంటూ తనేంటో నిరూపించుకుంటూనే వచ్చాడు. ఎట్టకేలకు ఈసారి 28 ఏళ్ల వయసులో అతను మొదటిసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగడమే కాకుండా కాంస్యంతో చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.  

అవరోధాలను దాటి.. 
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ సమీపంలోని కంబల్‌వాడి స్వప్నిల్‌ స్వస్థలం. తండ్రి సురేశ్‌ కుసాలే పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి అనిత ప్రస్తుతం సర్పంచ్‌గా పని చేస్తోంది. షూటింగ్‌ సర్క్యూట్‌లో ఉన్న చాలా మందితో పోలిస్తే స్వప్నిల్‌ నేపథ్యం సామాన్యమైనదే. తండ్రికి ఆటలపై ఆసక్తి ఉండటంతో కొడుకు స్కూల్‌లో ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వ పథకం ‘క్రీడా ప్రబోధిని’లో చేర్పించాడు. నిబంధనల ప్రకారం వారంతా ఒకే తరహాలో ఫిట్‌నెస్‌ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా క్రీడాంశం ఎంచుకునే అవకాశం ఇస్తారు. 

Swapnil Kusale: ఒలింపిక్స్ విజేత‌ స్వప్నిల్‌కు రైల్వే శాఖ పదోన్నతి

అందులో స్వప్నిల్‌ షూటింగ్‌ను ఎంచుకున్నాడు. నాసిక్‌లోని భోన్సాలా మిలిటరీ స్కూల్‌లో ఉన్న షూటింగ్‌ రేంజ్‌లో ఓనమాలు నేర్చుకున్న స్వప్నిల్‌ ఆ తర్వాత మరింత రాటుదేలాడు. అయితే సహజంగానే ఖర్చుతో కూడుతున్న క్రీడ కావడంతో వేర్వేరు దశల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. తండ్రి బ్యాంకులో అప్పు చేసి మరీ సొంత రైఫిల్‌ కొనివ్వాల్సి వచ్చింది. దీంతో పాటు ప్రాక్టీస్‌లో వాడే బుల్లెట్‌లు కూడా చాలా ఖరీదైనవి కావడం వల్ల చాలా జాగ్రత్తగా వాడుకుంటూ సాధన చేయాల్సి వచ్చేది.  

గగన్‌ నారంగ్‌ను ఓడించి.. 
18 ఏళ్ల వయసులో స్వప్నిల్‌ ప్రతిభను ‘లక్ష్య స్పోర్ట్స్‌’ సంస్థ గుర్తించింది. వారి ఆర్థిక సహాయంతో పరిస్థితి మెరుగైంది. ఈ క్రమంలో భారత జాతీయ క్యాంప్‌లో అవకాశం దక్కింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో చూపించిన ప్రదర్శనకుగాను భారత రైల్వేలో టికెట్‌ కలెక్టర్‌ ఉద్యోగం లభించడంతో పరిస్థితి మరింత మెరుగైంది. 2015లో ఆసియా జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ 3లో కేటగిరీలో స్వర్ణం గెలుచుకోవడంతో తొలిసారి అతనికి గుర్తింపు దక్కింది.

రెండేళ్ల తర్వాత జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వప్నిల్‌ తన ఆటతో అందరి దృష్టిలో పడ్డాడు. 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో తన ఆరాధ్య షూటర్, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్యపతక విజేత గగన్‌ నారంగ్, మరో సీనియర్‌ చయన్‌ సింగ్‌లను దాటి స్వర్ణం గెలుచుకున్న స్వప్నిల్‌ సంచలనం సృష్టించాడు. అతని ఎదుగుదలలో కోచ్‌గా భారత మాజీ షూటర్‌ దీపాలీ దేశ్‌పాండే కీలకపాత్ర పోషించింది.  

సందేహాలను పటాపంచలు చేస్తూ..
చాలా కాలం క్రితమే 2022 అక్టోబరులోనే కైరోలో జరిగిన వరల్డ్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలవడంతో స్వప్నిల్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ కేటగిరీలో భారత్‌కు కోటా ఖాయం చేశాడు. కొన్నాళ్ల క్రితం నిర్వహించిన ట్రయల్స్‌లో కూడా రాణించడంతో ఈ విభాగంలో భారత్‌ తరఫున పోటీ పడేందుకు అతనికే అవకాశం దక్కింది. అయినా సరే... స్వప్నిల్‌ పతకం సాధించడంపై పెద్దగా ఆశలు లేవు. దానికి కారణం ఉంది. 

ఈ ఒలింపిక్స్‌కు ముందు అతను వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, వరల్డ్‌ కప్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచాడు. ఇవన్నీ కూడా టీమ్‌ ఈవెంట్లలో గెలిచిన పతకాలే! వ్యక్తిగత విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ నమోదు చేయలేదు. దాంతో గెలుపుపై సందేహాలు. కానీ స్వప్నిల్‌ తన పట్టుదలతో వాటన్నింటినీ పటాపంచలు చేశాడు. అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్య ఆటతో ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచాడు.        

Manu Bhaker: 124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్‌.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు..

భారత్‌కు మూడు పతకాలు.. ఇదే తొలిసారి
ఒకే ఒలింపిక్స్‌ ఒకే క్రీడాంశంలో భారత్‌కు మూడు పతకాలు రావడం ఇదే తొలిసారి.  గతంలో రెజ్లింగ్‌లో రెండుసార్లు రెండు పతకాల చొప్పున రాగా.. షూటింగ్‌లో ఒకసారి, అథ్లెటిక్స్‌లో ఒకసారి రెండేసి పతకాలు లభించాయి. 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో బ్రిటిష్ ఇండియా అథ్లెట్‌ నార్మన్‌ ప్రిచర్డ్‌ 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాలు  గెలిచాడు.

2012 లండన్‌ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో సుశీల్‌ కుమార్‌ రజతం, యోగేశ్వర్‌ దత్‌  కాంస్యం సాధించాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో విజయ్‌ కుమార్‌ రజతం,  గగన్‌ నారంగ్‌ కాంస్యం సొంతం చేసుకున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో  రవి కుమార్‌ దహియా రజతం, బజరంగ్‌ పూనియా కాంస్యం సాధించారు.

Manu, Swapnil and Sarabjot

 

ఈవెంట్‌కు ముందు పెరిగిన గుండెవేగం!
'ఈవెంట్‌కు ముందు గుండెవేగం పెరిగింది. దేవుడిని ప్రార్థిస్తూ నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాను. కొత్తగా ఏమీ ప్రయత్నించకుండా నాకు తెలిసిన ఆటనే ప్రదర్శించాను. పోటీ జరుగుతున్న సమయంలో స్కోరుబోర్డు వైపు అస్సలు చూడలేదు. ఇన్నేళ్ల నా కష్టం మాత్రం గుర్చుకొచ్చింది. తల్లిలాంటి కోచ్‌ దీపాలీతో పాటు ఇతర సహాయక సిబ్బంది నన్ను మానసికంగా దృఢంగా ఉంచారు. 

ఒత్తిడిని తట్టుకుంటూ ప్రశాంతంగా ఉండటం నా ఆటలో కీలకం. ఈ విషయంలో నేను ఎమ్మెస్‌ ధోనిని అభిమానిస్తాను. కాంస్యం గెలవడం సంతృప్తినచ్చింది. అయితే నాకు నేను ఒక మాట (స్వర్ణం గెలవడం కావచ్చు) ఇచ్చుకున్నాను. అది మాత్రం ఇంకా పూర్తి కాలేదని అనుకుంటున్నా.' అని స్వప్నిల్‌ కుసాలే అన్నారు.

Paris Olympics: ఒలింపిక్స్‌లో పడి లేచిన తరంగం.. ‘మను’సంతా పతకమే!

Published date : 02 Aug 2024 06:11PM

Photo Stories