Skip to main content

Science And Technology: 180 పంపిస్తే కేవలం 40 మాత్రమే వినియోగంలో ఉన్నాయి... పేరుకుపోతున్న శాటిలైట్లతో భూగోళానికి పెను ముప్పు.. ఆ వివరాలు ఏంటో తెలుసా..?

భూగోళాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ‘చెత్త’. నానాటికీ పెరుగుతున్న వ్యర్థాలను వదిలించుకునేందుకు చాలా దేశాలు పెద్ద కసరత్తే చేస్తున్నాయి. కాగా.. ఇదే సందర్భంలో అంతరిక్షంలోనూ పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్‌ విసురుతోంది.

ప్రస్తుతం రోదసీలో 3,409 శాటిలైట్లు చెత్తగా మారిపోయాయి. ఇవికాకుండా దాదాపు 34 వేల స్పేస్‌ జంక్‌ ముక్కలు, మిలియన్ల కొద్దీ చిన్నపాటి ముక్కలు అంతరిక్షాన్ని కమ్మేశాయి. 2030 నాటికి రోదసీలో ఉండే శాటిలైట్ల సంఖ్య 58 వేలకు దాటిపోవచ్చని అంచనా. దీనివల్ల గగనతలం భవిష్యత్‌లో పెద్ద ముప్పునే ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.  
1957 అక్టోబర్‌ 4న మొదటి శాటిలైట్‌
అంతరిక్ష ప్రయోగాలు మానవాళి చరిత్రను సమూలంగా మార్చేశాయి. ఉపగ్రహాల (శాటిలై­ట్స్‌) వినియోగంతో టీవీ, ఫోన్, ఇంటర్నెట్, జీపీఎస్‌ తదితర సేవలతో పాటు ఎప్పటికప్పుడు వాతా­వ­రణంలో వచ్చే మార్పులను ముందే పసిగట్టి జాగ్ర­త్తలు తీసుకుంటున్నాం. ఒక్క క్లిక్‌తో సమస్త సమా­చారాన్ని అరచేతిలో చూడగలుగుతున్నాం. ఇదంతా శాటిలైట్స్‌ వల్లే సాధ్యమైంది. సోవియట్‌ యూనియన్ 1957 అక్టోబర్‌ 4న స్పుత్నిక్‌ శాటిలైట్‌ ప్రయోగంతో అంతరిక్ష యుగం మొదలైంది.
40 శాటిలైట్లే పనిచేస్తున్నాయి
ఐక్యరాజ్య సమితి ఔ టర్‌ స్పేస్‌ అఫైర్స్‌ విభాగం లెక్కల ప్రకారం 2022 జన­వరి నాటికి భూమి చుట్టూ 8,261 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. 1975 ఏప్రిల్‌ 19న ఆర్య­భట్టతో మొదలుపెట్టిన భారత్‌ ఇప్పటివరకు సుమా­రు 180 శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపించిం­ది. ఇవికాక సుమారు 38 దేశాలకు చెందిన 350­కి పైగా శాటిలైట్లను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మనదేశ శాటిలైట్లలో 40 వరకు సేవలందిస్తుండగా.. మిగిలినవి విశ్వంలో నిరుపయోగంగా ఉన్నాయి.  
భారీగా పెరిగిపోతోన్న ట్రాఫిక్‌...
ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో గగనతలం చెత్తకుప్పగా మారిపోతోంది. యూనియన్‌ ఆఫ్‌ కన్సర్న్‌డ్‌ సైంటిస్ట్స్‌ (యూసీఎస్‌) లెక్కల ప్రకారం స్పేస్‌లో ఉన్న మొత్తం 8,261 శాటిలైట్లలో ప్రస్తుతం 4,852 మాత్రమే సేవలందిస్తున్నాయి. మిగిలిన 3,409 శాటిలైట్లు నిరుపయోగమై వ్యర్థాలుగా మారిపోయాయి.

Sattellite


2030 నాటికి 58 వేలకు పైగానే....
ఇవికాకుండా రాకెట్ల నుంచి రాలిపడిన దాదాపు 34 వేల స్పేస్‌ జంక్‌ ముక్కలు (10 సెం.మీ కంటే పెద్దవి), మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకుపోయాయి. ఇటీవల అమెజాన్, స్పేస్‌–ఎక్స్‌ వంటి ప్రైవేట్‌ కంపెనీలు అంతరిక్షంలోకి అడుగుపెట్టి శాటిలైట్ల ప్రయోగాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల 2030 నాటికి రోదసీలో శాటిలైట్ల సంఖ్య 58 వేలకు పైగా దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అంతరిక్షంలో స్పేస్‌ ట్రాఫిక్‌ పెరిగిపోవడంతోపాటు డెబ్రిస్‌ (చెత్త)తో నిండిపోతుందని అంచనా. 
పెనుసవాల్‌.. స్పేస్‌ జంక్‌
అంతరిక్షంలో ఉపగ్రహాలు తిరిగే వృత్తాకార మార్గా­న్ని కక్ష్య (ఆర్బిట్‌) అంటారు. శాటిలైట్స్‌ను మూడు రకాల ఆర్బిట్స్‌లో ఉంచుతారు. ఇవి భూమి నుంచి 300కి.మీ. వరకు లోయర్‌ ఆర్బిట్, 700–1,000 కి.మీ వరకు రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ ఆర్బిట్స్, 36 వేల కి.మీ. జియో సింక్రనస్‌ ఆర్బి­ట్‌ (కమ్యూనికేషన్  శాటిలైట్స్‌) ఉంటాయి. ఏటా వందల సంఖ్య­లో శాటిలైట్లను కక్ష్యల్లోకి పంపుతుండటంతో వాటి మధ్య దూరం తగ్గిపోయి స్పేస్‌ ట్రాఫిక్‌ ఏర్పడుతోంది. దీంతో కొత్త ఉపగ్రహాలను పంపేటప్పుడు ఇ­బ్బం­దులు ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించా­రు. 
40 వేల కి.మీ వేగంతో కింద‌కి...
అంతరిక్షంలో రాకెట్‌ పరికరాల శిథిలాలను స్పేస్‌ డెబ్రిస్‌ అంటారు. ఎక్కువ అంతరిక్ష శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయి. సాఫ్ట్‌బాల్‌ పరిమాణంలో 34 వేల స్పేస్‌ డెబ్రిస్‌ శిథిలాలు ఉ­న్నా­యని, ఒక మిల్లీమీటర్‌ కంటే పెద్ద పరిమాణంలో 128 మిలియన్ల శిథిలాలు ఉన్నాయని నాసా ప్రకటిం­చింది. ప్రతి 10 వేల శిథిలాలలో ఒకటి ప్రమా­దా­నికి కారణమవుతుందని అంచనా వేసింది. ఇ­లాం­టి శిథిలాలు 1999 నుంచి ఇప్పటిదాకా 25 ఐఎస్‌ఎస్‌ను తాకినట్లు స్పేస్‌ శాస్త్రవేత్తలు గుర్తించా­రు. మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుషితం చేస్తున్నాయి. ఈ వ్యర్థ రేణువుల్లో కొన్ని గంటకు 40 వేల కి.మీ. వేగంతో భూకక్ష్య వైపు దూసుకొస్తున్నాయి.
శిథిలాల తొలగింపునకు అంతర్జాతీయ కమిటీ  
వాస్తవానికి అంతరిక్ష వ్యర్థాల్లో మూడింటి ఒక భాగం అమెరికా, రష్యాలవే. వేల కి.మీ. వేగంతో తిరుగుతున్న డెడ్‌ శాటిలైట్లు, రాకెట్‌ శిథిలాలను తొలగించడం కత్తిమీద సాములా మారింది. దీంతో అమెరికా వివిధ దేశాల స్పేస్‌ శాస్త్రవేత్తలతో 1993లో ఇంటర్‌ ఏజెన్సీ స్పేస్‌ డెబ్రిస్‌ కో–ఆర్డినేషన్‌  కమిటీని నియమించింది. ఐక్యరాజ్య సమితి 1959లోనే ‘ఔటర్‌ స్పేస్‌ శాంతియుత ఉపయోగాల కమిటీ’ (యూఎన్‌–సీఓపీయూఓఎస్‌)ని నియమించింది.
‘నాసా’ ట్రాక్‌ చేస్తోంది 
స్పేస్‌లోకి వెళ్లిన ప్రతి వస్తువుకు పొజిషనింగ్‌ నంబర్‌ ఇచ్చి వాటి కదలికలను అనుక్షణం ‘నాసా’ ట్రాక్‌ చేస్తోంది. దీనినే స్పేస్‌ సర్వేలెన్స్‌ నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ అంటారు. నాసా అంచనా ప్రకారం ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష శిథిలాల సంఖ్య లక్షకు పైగా పెరుగుతుందని, ఇవి ట్రాక్‌ చేయడానికి చిన్నవే అయినా అంతరిక్ష నౌకను దెబ్బతీసేంత పెద్దవని యూఎస్‌ మిలటరీ సైతం ప్రకటించింది.
డెబ్రిస్‌ని అంచనా వేయడం కష్టం
అంతరిక్ష యాత్రకు ప్రాణాంతకం లేదా విపత్తు కలిగించే వేల వస్తువులు, నష్టాన్ని కలిగించేంత సామర్థ్యం గలవి మిలియన్ల కొద్దీ ఉన్నాయని అంచనా వేసింది. జియో సింక్రనస్‌ ఆర్బిట్‌లో భారీ బరువుండే ఉప గ్రహాలుంటాయి. ఈ ఆర్బిట్‌లోని పనికిరాని శాటిలైట్లను పైస్థాయికి పంపేస్తారని.. ఇక్కడ డెబ్రిస్‌ని అంచనా వేయలేమని ‘షార్‌’ మాజీ డైరెక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ చెబుతున్నారు. అయితే, అధిక ‘డెడ్‌ శాటిలైట్లు’, శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయని, ఇవే ప్రధాన సమస్య అని ఆయన స్పష్టం చేస్తున్నారు. 
చెత్తను తొలగించే యంత్రాంగం ప్రస్తుతానికి లేదు
ఈ రెండు కమిటీల్లోనూ భారత్‌ ప్రారంభ సభ్యదేశంగా ఉంది. ఈ కమిటీల్లోని శాస్త్రవేత్తలు అంతరిక్ష శిథిలాల తొలగింపుపై ఓ నివేదికను రూపొందించాయి. దీనిప్రకారం అధునాతన రాడార్లు, టెలిస్కోపులను ఉపయోగించి అంతరిక్ష వ్యర్థాలను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు చేస్తుంటారు. కాలం చెల్లిన శాటిలైట్లను కక్ష్య నుంచి తప్పించి భూ వాతావరణంలోకి తెచ్చే యోచన జరుగుతోంది. స్పేస్‌ డెబ్రిస్‌ను తొలగించే యంత్రాంగం ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం వద్దా లేదు. 
- ఎంవైఎస్‌ ప్రసాద్, మాజీ డైరెక్టర్, షార్‌ 

Published date : 28 Jan 2023 01:45PM

Photo Stories