Telangana History: తెలంగాణది చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం.. దీని గురించి తెలుసుకోండి..
వర్గ పోరాట స్వభావం కలిగిన పోరాటం. ప్రజాస్వామ్యం కోసం, పౌరహక్కుల కోసం, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడం కోసం జరిగిన పోరాటం.
మొగల్ సామ్రాజ్యంలో భాగమైన దక్షిణ భారతదేశానికి ఔరంగజేబు మరణానంతరం ఢిల్లీ రాజప్రతినిధిగా వచ్చిన సైనికాధిపతే నిజామ్. ఢిల్లీలో మొగల్ సామ్రాజ్య ప్రాభవం తగ్గగానే స్వతంత్రం ప్రకటించుకున్నారు. మైసూరు రాజు టిప్పు సుల్తాన్‌కు, మహా రాష్ట్రులకు వ్యతిరేకంగా బ్రిటిషర్లకు నిజాం మద్దతు ఇచ్చినందుకు, నిజాం నవాబును కాపాడేందుకు బ్రిటిష్ సైన్యాన్ని ఇక్కడ ఉంచారు. వారి ఖర్చుల నిమిత్తం, సర్కారు జిల్లాలను, ఆ తర్వాత రాయ లసీమను వారికి అప్పగించారు.
ఐనా మిగిలిన హైదరాబాదు సంస్థానం దేశంలోని 550 సంస్థా నాలలో పెద్దది. దీని వైశాల్యం 82,696 చదరపు మైళ్ళు. ఇది గ్రేట్ బ్రిటన్ వైశాల్యానికి సమానం. ఇందులో ఎనిమిది తెలుగు జిల్లాలు, ఐదు మరాఠీ జిల్లాలు, మూడు కర్ణాటక జిల్లాలు ఉండేవి. కోటీ ఎనభై లక్షల జనాభాలో సగంమంది మాతృభాష తెలుగు, 25 శాతం మంది మరాఠీ, 12 శాతం మంది ఉర్దూ, 11 శాతం మంది కన్నడ, ఇతర భాషలు మాట్లాడేవారు. కాని ఉర్దూలో తప్ప పాఠశాలలు లేవు. ప్రైవే టుగా మాతృభాషలో పాఠశాలలు పెట్టుకోవడానికి వీల్లేదు.
తెలంగాణ ప్రాంతంలో భూ కేంద్రీకరణ విపరీతంగా వుండేది. మొత్తం సాగులో వున్న భూమి దాదాపు 70% భూస్వాముల చేతుల్లో వుండేది. ఐదు వేల ఎకరాలపైన వున్న భూస్వాములు 550 మంది. చిన్న పెద్ద భూస్వాములలో 1982 మంది ముస్లింలు, 618 మంది హిందూ భూస్వాములు.
నిజాం సొంత ఖర్చుల కోసం 636 గ్రామాల్లో ఐదు లక్షల ముప్ఫై వేల ఎకరాల భూమి వుండేది. 7వ నిజాం ఆస్తి ఆనాడు 400 కోట్ల రూపాయలు. అప్పుడు ప్రపంచంలో కెల్లా ధనవంతుడని పేరుండేది. రాష్ట్రంలో ప్రజలు దుర్భర జీవితం గడిపేవారు. అన్ని కులాలవారు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, ప్రభుత్వ అధికారుల దగ్గర వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చేది.
తెలుగు ప్రజల సంఘంగా ఆంధ్ర జనసభ ప్రారంభమైంది. అది ఆంధ్ర మహాసభగా రూపొందింది. జోగిపేట ప్రథమ ఆంధ్ర మహా సభ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. 1946 నాటికి ఆంధ్ర మహాసభ ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ఈ దశలో ఆంధ్ర మహాసభలో మితవాదులు, అతివాదులు, జాతీయ వాదుల మధ్య ఘర్షణలో వామపక్షవాదులు మెజారిటీ అయ్యారు. రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత పేద ప్రజల సమస్యలు, తెలుగులో బోధన, వెట్టిచాకిరీ రద్దు తదితర అంశాలపైన కార్యాచరణ తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటం హైదరాబాద్ సంస్థాన ప్రజల మీద ప్రభావం చూపింది. మజ్లిస్ పార్టీకి ఖాశిం రజ్వీ అధ్యక్షుడై, హైదరాబాదును స్వతంత్ర ముస్లిం రాజ్యం చేస్తానని ప్రక టించి రజాకార్ల (వలంటీర్) నిర్మాణానికి పూనుకుని వేలాదిమంది ముస్లిములను చేర్పించి దాడులు ప్రారంభించాడు. నిజాం మద్దతి చ్చాడు. తెలంగాణను ముస్లిం మెజారిటీ సంస్థానంగా చేసేందుకు ఇతర రాష్ట్ర్రాల నుండి 8 లక్షల మంది ముస్లింలను అంతకు ముందు తీసుకువచ్చారని ఒక ఆరోపణవుంది.
ఈ దశలో కేంద్ర ప్రభుత్వానికి నిజాంకు మధ్య అనేక చర్చల తర్వాత యథాతథ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం నిజాం రాజుగా కొనసాగుతాడు. విదేశాంగ, రక్షణ కేంద్రం బాధ్యతల్లో వుంటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు కేంద్రం చేసిన ద్రోహం. ఈలోగా విసునూరి రామచంద్రారెడ్డి ప్రజల మీద దాడులు ఉధృతం చేశాడు. ఆయన తల్లి జానకమ్మ నరరూప రాక్షసి.
కడివెండిలో ప్రజలు బలవంతపు ధాన్యం లెవీకి వ్యతిరేకంగా ఊరేగింపు తీస్తే, గడీలోంచి కాల్పులు జరిపి, దొడ్డి కొమరయ్యను బలి తీసుకున్నారు. ఇక, అనేక ఇతర గ్రామాలలో రజాకార్లు గ్రామాలను తగలబెట్టి, స్త్రీలను మానభంగాలు చేశారు. బైరాన్‌పల్లి, పరకాల తదితర గ్రామాలలో డజన్ల సంఖ్యలో ప్రజలు హతులయ్యారు.
ఈ నేపథ్యంలో 1947 సెప్టెంబరు 11వ తేదీన నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని కూలద్రోసి సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసేందుకుగాను, సాయుధ పోరాటం చేయవలసిందిగా రావి నారా యణరెడ్డి, మఖ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి పేరుతో ప్రకటన విడుదల చేశారు. సాయుధ పోరాటం దావానలంలాగా వ్యాపించింది.
ఈ పోరాటం ముఖ్యంగా నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా, ఇతర జిల్లాల్లో కొంత పరిమితంగా జరిగింది. 3,000 గ్రామాలను కమ్యూనిస్టు పార్టీ ప్రభావితం చేసింది. దాదాపు పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచింది. హింసను అరికట్టే పేరుతో యూనియన్ సైన్యాలు హైదరాబాదు సంస్థానాన్ని ముట్టడించాయి. 3 రోజుల్లో నిజాం సైన్యం లొంగి పోయింది.
Cyclones: ఆయాదేశాలతో సంబంధం ఉన్న తుఫాన్ల పేర్లు ఇవే..
మిలిటరీ గవర్నరుగా నియమించబడ్డ జనరల్ చౌదరి కొందరు రజాకార్లను, ఖాశిం రజ్వీని అరెస్టు చేసి, కమ్యూనిస్టుల మీద యుద్ధం ప్రకటించాడు. సరోజినీ నాయుడు కుమారుడు డాక్టర్ జయసూర్య, మరికొందరు మిలిటరీ గవర్నరును కలిసి నెల రోజుల గడువిస్తే, కమ్యూనిస్టులతో చర్చించి, సాయుధ పోరాటాన్ని ఉపసంహరింపజేస్తామని చెప్పారు. దానికి జనరల్ చౌదరి నిరాకరించి నెల రోజు లెందుకు, వారం రోజుల్లో తెలంగాణలో కమ్యూనిస్టులను ఏరివేస్తా నని జవాబిచ్చాడు.
అనివార్యంగా సాయుధ పోరాటం కొనసాగింది. హైదరాబాదు సంస్థానం, భారత యూనియన్‌లో విలీనమైనందున, నిజాం దుష్ట ప్రభుత్వం కూలిపోయినందున మధ్యతరగతి ప్రజలు, కొందరు మేధావులు సాయుధ పోరాటం ఆవశ్యకత లేదని భావించారు. 1951 చివరిలో పార్టీ కేంద్ర కమిటీ సమావేశమై సాయుధ పోరాటాన్ని ఉపసంహరించాలని నిర్ణయించింది.
1952 నాటికి సీపీఐ మీద నిషేధం తొలగనందున పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ పేరుతో కమ్యూనిస్టులు + ప్రజాతంత్ర వాదులు కలిసి పోటీ చేశారు. మెజారిటీ స్థానాల్లో పి.డి.ఎఫ్. గెలిచింది. రావి నారాయణరెడ్డి నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి నెహ్రూ కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిజాం సంస్థానంలోని కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ బలహీనంగా ఉండటంతో కాంగ్రెసుకు వచ్చిన మెజారిటీతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది.
మరొకవైపు రజాకార్లు స్వల్పశిక్షలతో బయటపడితే, కమ్యూనిస్టులపై సుదీర్ఘ శిక్షలు పడ్డాయి. 12 మందికి మరణశిక్షలు విధింప బడ్డాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు, ఆందోళన జరిగింది. వాటిని ముందు యావజ్జీవ కారాగార శిక్షలుగా మార్చి, కొన్నేళ్ళకు రద్దు చేశారు. రాజబహదూర్ గౌర్ రాజ్యసభకు ఎన్నికైనా విడుదల చేయలేదు. చివరకు ఉపరాష్ట్రపతి సర్వేపల్లి జోక్యంతో విడుదలయ్యారు.
Gender Equality: వర్ణ వివక్షపై పోరాడిన నేలలో లింగ వివక్ష..!
భూస్వాములు, వారి తాబేదార్లు, ముందు కాంగ్రెసులో, తర్వాత తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ రాష్ట్ర సమితులలో చేరారు. ఇప్పుడు బీజేపీలో భాగమౌతున్నారు. బీజేపీ వారు చరిత్రను వక్రీకరించి ‘ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువుల పోరాటం’గా చిత్రీక రిస్తున్నారు. ముస్లిం కార్మికులు సాయుధ పోరాటానికి మద్దతిచ్చారు. భారత యూనియన్‌లో హైదరాబాదు సంస్థానం విలీనంలో మిత వాదుల పాత్ర నామమాత్రం.
స్వామి రామానంద తీర్థ నాయకత్వాన కాంగ్రెసు జాతీయవాదులు గట్టిగా పోరాటం చేశారు. కాని సాయుధ పోరాటానిదే ప్రధాన పాత్ర. భారత ఉపప్రధాని సర్దార్ పటేల్ వల్ల మిలిటరీ హైదరాబాదును విలీనం చేసిందనేది దుష్ప్రచారం మాత్రమే. సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుందనే భయంతోనే మిలిటరీని పంపారు. వేలాదిమందిని హత్యలు చేయించిన నిజాంను అరెస్టు చెయ్యకపోగా, రాజప్రముఖ్‌ను చేసి కోటి రూపాయల రాజభరణం ఇచ్చారు. ఇది ‘విముక్తా’, ‘రాజీ’నా ప్రజలు అర్థం చేసుకున్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం మత పోరాటం కాదు. వర్గ పోరాట స్వభావం కలిగిన పోరాటం. ప్రజాస్వామ్యం కోసం, పౌర హక్కుల కోసం, సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం కోసం జరిగిన పోరాటం. ప్రస్తుత నక్సలైట్ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింపు అనే వాదన తప్పు.
పోరాటం చైతన్యవంతులైన ప్రజలు నడుపుతారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన నాటికి ఆంధ్ర మహాసభకు ఏడు లక్షల సభ్యత్వం వుంది. 90 లక్షల తెలుగు భాష మాట్లాడే ప్రజల్లో 7 లక్షల సభ్యత్వం అంటే దాదాపు ప్రతి 12 మంది జనాభాలో ఒకరు ఆంధ్రమహాసభ సభ్యులు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు.
ఏమైనా తెలంగాణ సాయుధ పోరాటం, చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం. మన దేశం కోసం, మన కోసం, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన ఆ యోధులను స్మరించుకుందాం.