Skip to main content

India and New Zealand: భారత్, న్యూజిలాండ్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు

ద్వీపదేశమైన న్యూజిలాండ్‌లో ఖలిస్తానీ శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతుండడం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.
India Flags Khalistani Threat in Talks with New Zealand

ఆయా శక్తులను కఠినంగా అణచివేయాలని న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి క్రిస్టోఫర్‌ లక్సన్‌కు విజ్ఞప్తి చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు న్యూజిలాండ్‌ను అడ్డాగా మారనివ్వకూడదని కోరారు. మోదీ, లక్సన్ మార్చి 17వ తేదీ ఢిల్లీలో సమావేశమయ్యారు.

భారత్‌–న్యూజిలాండ్‌ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. 2019లో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడులు, 2008 నవంబర్‌ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు సారూప్యం ఉందని మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాడికల్‌ శక్తులపై పోరాడే విషయంలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య సహకారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. 

రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి రోడ్‌మ్యాప్‌   
భారత్, న్యూజిలాండ్‌ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై చర్చలు ప్రారంభం కావడాన్ని మోదీ, లక్సన్‌ స్వాగతించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే భారత్, న్యూజిలాండ్‌ మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు. 

ఇండో–పసిఫిక్‌ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాత్మక వైఖరిపై తాము చర్చించామని లక్సన్‌ వివరించారు. మోదీ, లక్సన్‌ భేటీ సందర్భంగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య ఆరు కీలక ఒప్పందాలు కుదిరాయి. 

India, Mauritius Elevate Ties: భారత్, మారిషస్ దేశాల మధ్య కుదిరిన 8 కీలక ఒప్పందాలు

రెండు దేశాల నడుమ రక్షణ సంబంధాలను వ్యవస్థీకృతంగా మార్చడం, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు పక్షాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ పరిశ్రమ రంగంలో సహకారం కోసం ఒక రోడ్‌మ్యాప్‌ రూపొందించాలని ఇరు దేశాలు నిర్ణయానికొచ్చాయి.  

విస్తరణవాదం వద్దు.. అభివృద్ధే కావాలి   
స్వేచ్ఛాయుత, భద్రతతో కూడిన, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్‌కు భారత్, న్యూజిలాండ్‌ బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇండో–పసిఫిక్‌లో అభివృద్ధిని కోరుకుంటున్నాం తప్ప విస్తరణవాదాన్ని కాదంటూ పరోక్షంగా చైనా తీరును తప్పుపట్టారు. ఇండో–పసిఫిక్‌ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను అందరూ గౌరవించాలని మోదీ, లక్సన్‌ పేర్కొన్నారు. 

ఈ మేరకు ఇరువురు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అక్రమ వలసల సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒక దేశానికి చెందిన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కార్మికులకు మరో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చట్టబద్ధమైన ఏర్పాటు చేసుకోవాలని, దీనిపై చర్చలు ప్రారంభించాలని అంగీకారానికి వచ్చారు. గాజాలో శాశ్వతంగా శాంతి నెలకొనాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడించారు.

PM Modi: మారిషస్.. భారత్‌కు, గ్లోబల్‌ సౌత్‌కు మధ్య ఒక వంతెన

Published date : 18 Mar 2025 03:35PM

Photo Stories