Haldwani Eviction: సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. 50 వేల మందికి ఊరట.. ఎవరు వీరు..? ఎక్కడి వాళ్లు..?
‘ఇది రైల్వే స్థలం. మీరు వారం రోజుల్లోగా ఖాళీ చేయాలనేది’ హైకోర్టు ఆదేశం అని స్థానిక అధికారులు చెప్పగానే వాళ్లంతా నెత్తినోరూ బాదుకున్నారు. ‘‘మానవత్వం ఉన్న వాళ్లు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? నిలువ నీడ లేకుండా చేస్తారా?’’ అని మొత్తుకున్నారు. ప్రార్థనలు చేశారు. బైఠాయించారు. ప్రభుత్వం దృష్టికి తమ గోడును తీసికెళ్లేందుకు కొవ్వొత్తుల ప్రదర్శన వంటి నిరసన కార్యక్రమాలు కూడా చేశారు.
ఎవరు వీరు..? ఎక్కడి వాళ్లు..?
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ప్రదేశంలో అనేక మంది కాపురం ఉంటున్నారు. వాటిని గఫూర్ బస్తీ, ఢోలక్ బస్తీ, ఇందిరానగర్ అని పిలుస్తారు. అక్కడ ఇళ్లే కాదు. ప్రభుత్వ పాఠశాలలున్నాయి. నాలుగు గుళ్లు, పది మసీదులు, ఒక బ్యాంకు, కొన్ని షాపులు ఉన్నాయి. వాళ్లంతా నిరుపేదలు. అందులో ఎక్కువ మంది ముస్లింలు. దాదాపు నాలుగువేల కుటుంబాలు.
మొత్తం 50వేల మంది దాకా ఉంటారు. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినవి కాదని చూసిన వాళ్లకు ఎవరికైనా అర్థం అవుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న వాళ్లు హఠాత్తుగా ఆక్రమణదారులు ఎలా అవుతారు. ముందూ వెనక చూడకుండా, ఒక ప్రత్యామ్నాయం అనేది చూపకుండా ప్రభుత్వం వాళ్లని ఖాళీ చేయమని ఎలా చెబుతుంది?
Amritpal Singh: అమృత్‌పాల్‌ను వెనుక నుంచి నడిపించేదెవరు.. వారి పూర్తి వివరాలివే..!
రైల్వే శాఖ ఏం చెబుతోంది?
కొంత మంది అక్కడ భూమిని లీజుకు తీసుకున్నారు. కొంత మంది భూమిని ప్రభుత్వవేలంలో కొనుక్కున్నారు. జిల్లా కోర్టుల్లో దీనికి సంబంధించిన అర్జీలు కూడా ఉన్నాయి. చాలా మంది దగ్గర చట్టబద్ధమైన పత్రాలున్నాయని కూడా చెబుతున్నారు. ఈశాన్య రైల్వేశాఖ ఈ భూమి విషయంలో పొంతనలేని వాదనలు చేస్తోంది. ఒకసారి 78 ఎకరాలు ఆక్రమించారని చెబితే, మరోసారి 29 ఎకరాలు ఆక్రమణ పాలయిందని చెబుతోంది.
2014లో ఈ అంశంపై ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలయినప్పుడు అక్కడ నిర్వాసితులను ఆక్రమణదారులు అని పేర్కొనకపోవటం గమనార్హం. గతంలో ఈ వివాదాన్ని పరిష్కరించటానికి ఒక ఎస్టేట్ అధికారిని నియమించారు. ఆయన ఈ స్థలం రైల్వేదని తేల్చేశారు. 2017లో కూడా హైకోర్టు ఒకసారి అక్కడున్నవారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తే, అప్పుడు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఏం చెప్పింది?
ఈ భూమిపైన హల్ద్వానీ నివాసితులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులేదని భావించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తక్షణం వారిని తొలగించాలని ఆదేశించింది. అవవసరమైతే సాయుధ బలగాల సహకారం తీసుకునయినా అక్కడున్న వాళ్లని తరిమివేయటానికి, రైల్వే అధికారులకు, జిల్లా యంత్రాంగానికి అనుమతులిచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసిన సామాజిక కార్యకర్త, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్.ఎ.నజీర్, పి.ఎస్.నరసింహతో కూడిన బెంచీ దీనికి సానుకూలంగా స్పందించింది.
Indian Politics: భారత రాజకీయాల్లో తండ్రీకూతుళ్లదే ఇప్పటికీ రికార్డు... ఆ రికార్డు ఏంటో మీరు ఓ లుక్కేయండి.!
‘‘ఇది మానవీయ సమస్య. దీనికి ఆచరణ యోగ్యమైన పరిష్కారం కనుగొనాలి’’ అని సూచించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఒక పద్ధతి ప్రకారమే మేం ముందుకు వెళుతున్నామని రాష్ట్రప్రభుత్వం పేర్కొన్నా, దశాబ్దాలుగా ఉంటున్న వారిని సాయుధ పోలీసు బలగాలు ఉపయోగించి ఎలా ఖాళీ చేయిస్తారని న్యాయమూర్తులు నిలదీశారు.
ఆశ్రయం పొందే హక్కు (రైట్ టు షెల్టర్):
ఆశ్రయం పొందే హక్కుఅనేది భారతదేశంలో వివాదాస్పదమైన హక్కుగా చెప్పుకోవాలి. పునరావాస కల్పన అనే దాన్ని ప్రభుత్వాలు కూడా అంతగా పట్టించుకోవు. ఆశ్రయం పొందే హక్కు అనేది రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద ప్రతి ఒక్కరికీ లభించే హక్కు. సుప్రీంకోర్టు 1996లో ఒక కేసులో ( చమేలి సింగ్ vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్) ఈ మేరకు తీర్పునిచ్చిన విషయం గమనార్హం. పునరావాసం, ఆశ్రయం పొందే హక్కులను సంబంధించి 1990లో ఇచ్చిన మరో తీర్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
జంతువులు ఆశ్రయం కల్పించటం అనేది వాటి శరీరానికి రక్షణ కల్పిస్తే చాలు, అదే మనుషులయితే వారికి తగిన వసతి కల్పించాలి. వారు శారీరకంగా, మానసికంగా, తెలివితేటలపరంగా ఎదగటానికి అవసరమైన చర్యలు చేపట్టవలసి ఉంటుందని పేర్కొంది. హల్ద్వానీ కేసులో ప్రభుత్వం వారిని అక్కడ నుంచి తొలగించటానికి ముందు వారికి ప్రత్యామ్యాయనివాసాలు చూపించవలసి ఉంది. దశాబ్దాలుగా వారు అక్కడ నివసిస్తున్నారన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దూకుడుగా వ్యవహరించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు.
మరో వైపు హల్ద్వానీ కేసు సుప్రీంకోర్టుకు ఒక గొప్ప అవకాశాన్ని అందించింది. స్థానిక రాజకీయ ప్రాధాన్యతల మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు చేయకుండా మార్గదర్శకాలు అందించటానికి అది వీలుకల్పించింది. ప్రస్తుతానికి గండం గడిచినట్టే. హల్ద్వానీవాసులకు ఎలాంటి ముప్పు లేదు. వచ్చేనెలలో సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. అప్పుడు నివాసితులు ఆశించిన పూర్తి న్యాయం లభిస్తుందని కోరుకుందాం.