Lancet Study: లావెక్కిపోతోన్న ప్రపంచం.. 100 కోట్లు దాటిన స్థూలకాయులు!!
1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కనిపించిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది.
మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్లపై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది.
ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది.
Leap year Legends: ఫిబ్రవరి 29వ తేదీ ప్రాధాన్యతలు ఇవే!!
తక్షణం మేల్కొనాలి..
ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’ అని ఆవేదన వెలిబుచ్చారు.
ఇలా చేశారు..
► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు.
► ఎన్‌సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు.
► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు.
► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు.
గణాంకాలివీ..
► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు.
► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు.
► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది.
► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు.
భారత్‌లోనూ..
భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ.