Oscar Awards: 22 ఏళ్ల తర్వాత ఆస్కార్‌కు ఇండియన్ మూవీ... ఓ నటుడిని నగ్నంగా నిలబెట్టి మరీ అవార్డు డిజైన్.. ఆ నటుడు ఎవరో తెలుసా..?
ఈ ఏడాదికి గానూ 95వ ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. 2023లో ఇచ్చే ఆస్కార్ అవార్డుల బరిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది.
అకాడమీ అవార్డు... ఆస్కార్‌గా
మొదట ఈ అవార్డును అకాడమి అవార్డు అని పిలిచేవారు. దీని పూర్తి పేరు ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’. ఆ తర్వాత దీనికి ఆస్కార్ అనే పేరు పెట్టారు. ఆ పేరు ఎలా వచ్చిందనేది కచ్చితమైన సమాచారం లేదు. కానీ దీని వెనుక ఓ ఊహాగానం ఉందట. ఈ అకాడమీ అవార్డులను ఇచ్చే సంస్థకు మార్గరెట్ హెరిక్ అనే మహిళ సేవలందించారట. విజేతలకు అందించే ఈ అవార్డు ప్రతిమను చూసి ఆమె.. ‘దీని ఆకృతి మా అంకుల్ ఆస్కార్‌లా ఉంది’ అని చెప్పిందట. దీంతో అలా ‘ఆస్కార్ అవార్డు’గా పేరు వచ్చింది. 1939లో ఇదే పేరును అధికారికంగా స్వీకరించారు.
ప్రతిమను ఎలా తయరు చేస్తారంటే...
ఆస్కార్ అవార్డును చూడటానికి బంగారంలా మెరిసిపోతుంది. దీంతో అంతా ఈ అవార్డును బంగారంతో చేస్తారని భావిస్తారు. నిజానికి ఆస్కార్ ప్రతిమలో ఉండేదంతా బంగారం కాదు. దీనిని కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఇక ఈ ప్రతిమ 35 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉంటుంది. బరువు మాత్రం దాదాపు నాలుగు కేజీలు ఉంటుంది. దీనికి ఐదు స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను(నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు) ఇవి సూచిస్తాయి.
అయితే ఈ అవార్డు సృష్టికర్త ఎంజీఎం స్టూడియో ఆర్డ్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్. ఆయన ఆస్కార్ ప్రతిమను తయారు చేసే సమయంలో డిజైన్ కోసం నటుడు ఎమిలో ఫెర్నాండెజ్‌ను నగ్నంగా నిలబెట్టి ఈ అవార్డు సృష్టించారు. అలా ఆ నటుడు రూపంలో కెడ్రిక్ గిబ్బన్స్ ఆస్కార్ ప్రతిమను డిజైన్ చేశారు. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా ఉంటుంది. 50 ఆస్కార్ ప్రతిమలు తయారుచేయాలంటే సాధారణంగా మూడు నెలలు పడుతుంది. మొట్ట మొదటి ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 1929లో మే 16న హాలీవుడ్ లో ఉన్న హోటల్ రూజ్వెల్ట్‌లో జరిగింది. చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్‌కు చోటు
ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ సాంగ్ నామినేట్ అయింది. రీసెంట్‌గా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి. మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి.