Skip to main content

పట్టణీకరణ సవాళ్లు

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.
పట్టణీకరణ ముఖ్యాంశాలు
  • గడచిన రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచంలోని నగరాలు.. ఉత్పత్తి, నవకల్పన, వాణిజ్యాలకు సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదికలుగా రూపొందాయి.
  • ప్రపంచ వ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాలతో పాటు ప్రధానంగా ప్రైవేటు రంగంలో ఉపాధి పెరుగుదలకు పట్టణీకరణ దోహదపడింది.
  • పట్టణీకరణ వల్ల ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు పెరగడంతోపాటు అవస్థాపనా సౌకర్యాలు, సర్వీసులపై అధిక పెట్టుబడులు కారణంగా కొన్ని మిలియన్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు.
  • ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగ అభివృద్ధి కూడా పట్టణీకరణలో కీలకపాత్ర పోషించింది.
  • ప్రపంచ జీడీపీలో నగరాల వాటా 80 శాతం

ప్రపంచ నగరాల నివేదిక-2016
1996లో జరిగిన హాబిటెట్ ఐఐ కాన్ఫెరెన్స్ (ఇస్తాంబుల్) తర్వాత ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. గత 20 ఏళ్ల కాలంలో ప్రజల ఆలోచనా ధోరణి, పద్ధతులు, ఉత్పత్తి, వినియోగం, విద్య, ఆరోగ్య స్థితిగతులకు సంబంధించి పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదే కాలంలో నగరాల రూపం, నిర్వర్తించే విధుల్లో మార్పును గమనించొచ్చు. పట్టణీకరణ, వృద్ధి ఒకదానితో ఒకటి కలసి కొనసాగుతాయి. సాంఘిక, ఆర్థిక అంశాల్లో ప్రగతి, సంపద కల్పన, అభివృద్ధి సాధనకు పట్టణీకరణ కీలకమైందనే అంశంలో ఎలాంటి సందేహం లేదు. మనం రూపొందించే ప్రణాళిక, పట్టణీకరణ యాజమాన్యంపై నగరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత పట్టణీకరణ నమూనా అనేక అంశాల్లో అస్థిరత్వాన్ని కనబరుస్తోంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా పట్టణీకరణ ప్రక్రియ ఉండాలని నివేదిక సూచించింది. పౌరులంతా గృహ వసతి కలిగుండాలనే హక్కు, పట్టణీకరణ ప్రక్రియలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని హాబిటెట్ ఐఐ కాన్ఫెరెన్స్(1996) గుర్తించింది. స్థానిక సంస్థల పాత్రతో పాటు విత్త, ఆర్థిక యాజమాన్య సామర్థ్యాన్ని పటిష్ట పరచాల్సిన ఆవశ్యకతను కాన్ఫరెన్స్ వెల్లడించింది. కానీ ఆయా అంశాల అమలు, ఫైనాన్సింగ్, పర్యవేక్షణ వంటి అంశాల్లో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

పట్టణీకరణ ప్రక్రియ నగరాలను అధిక వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడంతోపాటు దేశాలను అభివృద్ధి పథంలోనూ నడిపించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నా, ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలు పట్టణీకరణతో అనుసంధానమై ఉండే బహుళ సవాళ్లను ఎదుర్కోవటంలో విఫలమయ్యాయి. పట్టణీకరణ వల్ల లభించే అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లతోపాటు మిలీనియం వృద్ధి లక్ష్యాల సాధనపై కూడా అర్బన్ అజెండా దృష్టి కేంద్రీకరించాలి. మురికివాడల్లో నివసించే ప్రజలకు సరిపడా నీరు, నాణ్యతతో కూడిన పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన, నగరాల్లో పెరుగుతున్న అసమానతల తగ్గింపు, పేదరిక నిర్మూలన, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూమి యాజమాన్యం వంటి అంశాలపై అర్బన్ అజెండా దృష్టి కేంద్రీకరించాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విధానాల రూపకల్పన జరగాలి. ఈ దిశగా తీసుకునే చర్యలు సమ్మిళితంగా, మైనారిటీలతోపాటు నిర్లక్ష్యానికి గురైన ఇతర వర్గాల అభ్యున్నతికి అనుకూలంగా ఉండాలి. లక్ష్యాల సాధనకు సుస్థిర విధానాల రూపకల్పన అవసరం.

వికేంద్రీకరణ- మునిసిపాలిటీల విత్త పరిస్థితుల మెరుగు - బ్రెజిల్
1988లో రూపొందించిన నూతన ఫెడరల్ రాజ్యాంగం ద్వారా బ్రెజిల్ మునిసిపాలిటీలకు విధులు, విత్త అధికారాలను బదిలీ చేసింది. 2013 నాటికి బ్రెజిల్‌లో 5570 మునిసిపాలిటీలు ఉండగా, వాటిలో 75 శాతం జనాభా 20,000 కంటే తక్కువ. ఆ దేశంలో కౌన్సిల్స్ లేదా మునిసిపల్ బోర్డులను ఏర్పాటు చేసుకొనే హక్కును మునిసిపాలిటీలకు ఇచ్చారు. రాష్ట్రాలకు మునిసిపాలిటీలపై కొన్ని అధికారాలు ఉన్నా, నగర రవాణా, ప్రీ స్కూల్, ఎలిమెంటరీ విద్య, భూ వినియోగం, ఆరోగ్య సంరక్షణ, చారిత్రక, సాంస్కృతిక పరిరక్షణ వంటి అంశాల్లో నియంత్రణను మనిసిపాలిటీల పరిధిలోకి తీసుకొచ్చారు. అనేక పెద్ద నగరాల్లో ఏర్పాటు చేసిన కౌన్సిల్స్ లేదా మునిసిపల్ బోర్డుల్లో ఎన్నికైన కౌన్సిలర్లతోపాటు కమ్యూనిటీ గ్రూపులకు సంబంధించి ఎన్నిక కాని (నాన్ ఎలక్టెడ్) ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరు పట్టణాభివృద్ధి, విద్య, పర్యావరణం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. మునిసిపాలిటీలు చట్టాలను రూపొందించే అధికారాన్ని కూడా కలిగున్నాయి. రాష్ట్రాలు, మునిసిపాలిటీలు ప్రభుత్వ రంగ రాబడి, వ్యయంలో 50 శాతం వాటాను కలిగున్నాయి. మునిసిపాలిటీలకు సొంత రాబడితోపాటు, రాష్ట్రాలు, ఫెడరల్ ప్రభుత్వాలు బదిలీ చేసే నిధులు ఆదాయ వనరులుగా ఉంటాయి. బ్రెజిల్ మునిసిపాలిటీల సొంత రాబడి ముఖ్యంగా సంపద పన్ను, వృత్తి పన్ను నుంచి లభిస్తుంది. మునిసిపాలిటీల మొత్తం రాబడిలో 35 శాతం అంతర్గత రాబడి కాగా, 65 శాతం రాష్ట్రాలు, ఫెడరల్ ప్రభుత్వాల నుంచి లభించిన బదిలీల వాటా ఉంటుంది. అతి పెద్ద మునిసిపాలిటీల్లో అంతర్గత రాబడి వాటా ఎక్కువ కాగా, చిన్న మునిసిపాలిటీల్లో బదిలీల ద్వారా లభించే రాబడి ఎక్కువ.

పట్టణ జనాభా వృద్ధి - యువ, అధిక వయోవర్గం
1990, అనంతర కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరిగింది. 1990- 2000 మధ్య పట్టణాల్లో నివాసం ఉండేవారి సంఖ్యలో పెరుగుదల సంవత్సరానికి సగటున 57 మిలియన్లు కాగా, అది 2010 -15 మధ్య కాలంలో సగటున 77 మిలియన్లకు పెరిగింది. 1990లో మొత్తం ప్రపంచ జనాభాలో 43% (2.3 బిలియన్లు) పట్టణ ప్రాంతాల్లో నివసించగా, ఆ సంఖ్య 2015 నాటికి 54%కి పెరిగింది (4 బిలియన్లు). పట్టణ ప్రాంత జనాభా పెరుగుదల ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధంగా లేదు. పట్టణ ప్రాంతాల్లో అధిక జనాభాకు సంబంధించి ఆసియా ప్రథమ స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఐరోపా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు నిలిచాయి. ఆసియాలో 2.11 బిలియన్ల మంది పట్టణ జనాభా కాగా, 2010లో ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో 33% వాటాను ఆసియా కలిగి ఉంది. చైనాలో ఆర్థిక ప్రగతికి పట్టణీకరణ, పారిశ్రామికీకరణ గణనీయంగా తోడ్పడ్డాయి. చైనా జీడీపీలో మొదటి పది పెద్ద నగరాల వాటా 20%గా ఉంది. 1995-2015 మధ్య కాలంలో పట్టణ జనాభా సగటు సాంవత్సరిక వృద్ధిలో అల్పాదాయ దేశాలు ముందంజలో (3.68%) ఉండగా, తర్వాత స్థానంలో మధ్య ఆదాయ (2.63%) దేశాలు నిలిచాయి. అధిక ఆధాయం గల దేశాల్లో పట్టణ జనాభా సగటు సాంవత్సరిక వృద్ధి 0.88% మాత్రమే. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పట్టణ జనాభా సగటు సాంవత్సరిక వృద్ధిని పరిశీలిస్తే ఆఫ్రికా (3.44%) ముందంజలో ఉండగా, తర్వాత స్థానాల్లో ఆసియా (2.78%), లాటిన్ అమెరికా, కరేబియన్ (1.74%)లు ఉన్నాయి. ఐరోపాలో పట్టణ జనాభా సగటు సాంవత్సరి వృద్ధి (0.31%) తక్కువగా నమోదైంది.

ప్రపంచంలో అధికంగా అభివృద్ధి చెందిన ఐరోపాలో పట్ణణ జనాభా వృద్ధి తక్కువగా ఉంది. ఐరోపాతో పోల్చితే ఆఫ్రికాలో పట్టణీకరణ 11 రెట్లు ఎక్కువ. ఆఫ్రికాలో పట్టణీకరణ పెరుగుదలకు సహజ పెరుగుదలతో పాటు గ్రామీణ, పట్టణ వలసలు, గ్రామీణ ప్రాంతాలను తిరిగి పట్టణ ప్రాంతాలుగా వర్గీకరించడంతో పాటు కొన్ని దేశాల్లో వివాదాలు, విపత్తులు కారణమయ్యాయి. 20 సంవత్సరాల కిందట అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి ఏజెన్సీల మద్దతుతో పెద్ద నగరాలకు వలసలను అరికట్టేందుకు అనేక విధానాలను అవలంబించాయి. పట్టణ జనాభాలో పెరుగుదల కన్నా ప్రపంచ వ్యాప్తంగా నగరాలు ఆక్రమించిన భూ విస్తీర్ణంలో పెరుగుదల రేటు అధికంగా ఉంది. 2030 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పట్టణ జనాభా రెండు రెట్లు కాగలదని, నగరాలు ఆక్రమించిన విస్తీర్ణం మూడింతలవుతుందని అంచనా. అల్ప, మధ్యాదాయ దేశాల్లో అనేక పెద్ద, మెగా సిటీలు ఏర్పడతాయని అంచనా. 1995లో 22 పెద్ద నగరాలు, 14 మెగాసిటీలు ఉండగా, వాటి సంఖ్య 2015లో రెట్టింపు అయింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మెగా సిటీల సంఖ్య అధికంగా ఉంది. ఇదే ధోరణి కొనసాగి 2030నాటికి ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లోని పెద్ద నగరాలు మెగాసిటీలుగా రూపాంతరం చెందుతాయని అంచనా.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద నగరాలు, మెగా సిటీలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం ప్రపంచ జనాభాలో 1/5 వంతు జనాభాను కలిగిన 600 పెద్ద నగరాల వాటా ప్రపంచ జీడీపీలో 60%. ఈ మొత్తంలో అభివృద్ధి చెందిన దేశాల్లోని నగరాల వాటా ఎక్కువ. 2025నాటికి కూడా ఇదే స్థితి ఉంటుందని అంచనా.

గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లో సంతాన సాఫల్యతా రేటు అధికంగా ఉన్నా శిశు మరణాల రేటు తగ్గింది. ఫలితంగా ఆయా దేశాల్లో యువ జనాభా పెరిగి నిరుద్యోగ సమస్య తీవ్రమవడాన్ని గమనించవచ్చు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య, దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, పసిఫిక్ ద్వీపాల్లోని యువకుల్లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్యలో సగటు వృద్ధి సంవత్సరానికి 3.26 శాతంగా నివేదిక పేర్కొంది. 1950లో ఈ వయసు మొత్తం జనాభాలో 8% కాగా, 2000 నాటికి 10%కి పెరిగింది. 2015లో 60, అంతకు మించి వయసున్న వారు 901 మిలియన్ల మంది ఉన్నారు. వీరు మొత్తం ప్రపంచ జనాభాలో 12% అని నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం ఐరోపా మొత్తం జనాభాలో 60 ఏళ్లు, అంతకు పైబడిన జనాభా 24% కాగా, 2050 నాటికి ఆఫ్రికాతో పాటు అన్ని ప్రాంతాల్లో వీరి వాటా 25%గా ఉండగలదని నివేదిక అభిప్రాయపడింది. యువ వయోవర్గం, అధిక వయోవర్గం ఆయా ప్రాంతాలు, దేశాల్లోని సాంఘిక, ఆర్థిక, పర్యావరణ అభివృద్ధిని ప్రభావితం చేయగలదు. యువ జనాభాకు విద్య, శిక్షణ, కమ్యూనిటీ సౌకర్యాలపై పెట్టుబడి అవసరం. అధిక వయోవర్గ జనాభాకు ఆరోగ్య సంరక్షణ, రవాణా, ఇతర సామాజిక భద్రతా పథకాలపై అధిక పెట్టుబడుల అవసరం ఉంటుంది.

మురికివాడల పెరుగుదల
నివాస గృహాలు, మౌలిక సౌకర్యాలు వంటి పట్టణాభివృద్ధి అనుబంధ అంశాలపై 1960, 1970 దశాబ్దాల్లో ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితులు దృష్టి కేంద్రీకరించాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసల ద్వారా నగరాల వృద్ధిలో పెరుగుదల నమోదైంది. దీంతో పట్టణాల్లో ప్రజలకు సరిపోయే విధంగా గృహవసతి కల్పనకుగాను పెద్ద తరహా ప్రభుత్వ పథకం, తక్కువ వ్యయంతో కూడిన గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఏర్పడింది. యూఎన్-హాబిటెట్ అంచనాల ప్రకారం 2001లో 924 మిలియన్ల ప్రజలు (ప్రపంచ మొత్తం పట్టణ జనాభాలో 31.6% శాతం) మురికివాడల్లో నివసిస్తున్నారు. యూఎన్-హాబిటెట్ ఇటీవల అంచనాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మొత్తం పట్టణ జనాభాలో మురికివాడల్లో నివసించే జనాభా 1990లో 46.2% కాగా, అది 2014లో 29.7%కు తగ్గింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మురికివాడల్లో నివసించేవారి సంఖ్య 1990లో 689 మిలియన్లు కాగా, అది 2014లో 880 మిలియన్లకు పెరిగింది. అనేక దేశాల్లో మురికి వాడల్లో నివసించేవారు, మిగిలిన పట్టణ జనాభా మధ్య సంఖ్యా పరమైన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సంఖ్యాపరంగా వ్యత్యాసాన్ని తగ్గించాలంటే ఆయా దేశాలకు చాలా సమయం పడుతుందని నివేదిక పేర్కొంది. మౌలిక సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి తెచ్చే విధానాల రూపకల్పనే నూతన అర్బన్ అజెండాలో ముఖ్యాంశంగా ఉండాలి.

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం
ఆర్థిక ప్రగతి కారణంగా దేశాల్లో పట్టణ జనాభాలో మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రజల నిష్పత్తిలో పెరుగుదల నమోదైంది. కానీ, ఈ స్థితి ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకే విధంగా లేదు. పట్టణ ప్రాంతాల్లో నీటి సౌకర్యం అందుబాటులో సబ్-సహారా ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాలు వెనుకబడ్డాయి. నీటి సౌకర్యం అందుబాటులో ఆసియా, ఉత్తర-దక్షి ణ ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో పరిస్థితి మెరుగయింది. 1990వ దశకంలో తాగునీటి సౌకర్యం కల్పనలో డిమాండ్, సప్లయ్‌ల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కొద్దిపాటి పాత్రను పోషిస్తుందని ఆశించినా మిశ్రమ ఫలితాలే వచ్చాయి. ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా అనేక దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం వెలుగులోకి వచ్చింది. ఓ అధ్యయనం ప్రకారం అభివృద్ధి చెందుతున్న 90 దేశాల్లో నీరు, పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలు ప్రైవేటీకరణ చెందాయి.

సంతులిత జనాభా పంపిణీ సాధ్యం కావాలంటే...
గ్రామీణ పేదరిక నిర్మూలనలో పట్టణీకరణ కీలకపాత్ర పోషిస్తుంది. భారతదేశంలో ఒక అధ్యయనం ప్రకారం పట్టణ జనాభాలో రెండు లక్షల పెరుగుదల.. గ్రామీణ పేదరికాన్ని 1.3 నుంచి 2.6 శాతం వరకు తగ్గించగలదు. మొత్తంమీద 1983 నుంచి 1999 వరకు గ్రామీణ పేదరికంలో 1.3-2.5 శాతం వరకు తగ్గుదల ఉండటానికి పట్టణ-గ్రామీణ లింకేజీ కారణమైంది. పట్టణీకరణ వల్ల ప్రయోజనం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న, మధ్య తరహా పట్టణాలకు కూడా చేరుతుంది. సరిపోయినంత అవస్థాపనా సౌకర్యాలు, అవకాశాలను చిన్న, మధ్య తరహా పట్టణాల్లో కల్పిస్తే గ్రామీణ పట్టణీకరణ (ఖఠట్చ ్ఖటఛ్చజ్డ్చ్టీజీౌ) జరిగి సంతులిత జనాభా పంపిణీ సాధ్యమవుతుంది.

2000-05 మధ్యకాలంలో భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి వృద్ధిరేటు 1.97 శాతం కాగా, పట్టణ ఉపాధి వృద్ధి రేటు 3.22 శాతంగా నమోదైనట్లు నివేదిక అభిప్రాయపడింది. దేశంలో పెరుగుతున్న జనాభా, పట్టణ అవస్థాపనా సౌకర్యాలపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో 2014లో 100 స్మార్ట్ సిటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను భారతదేశం ప్రకటించింది. సుస్థిర అభివృద్ధి సాధనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి భారత్ అనువైన వాతావరణం కల్పించాలని నివేదిక పేర్కొంది.

అసమానతలు
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అసమానతలకు సంబంధించి పట్టణ అంశం ప్రధానంగా నిలిచింది. గత 30 ఏళ్లలో అనేక దేశాల్లో పేద, ధనికుల మధ్య వ్యత్యాసాలు అధికంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. ప్రపంచంలో అధిక పట్టణ జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన చైనాలో అధిక పట్టణీకరణతోపాటు ఆదాయం, సంపదల్లో అసమానతలు కూడా పెరిగాయి. 2010లో గినీ గుణకం చైనాలో 0.42 కాగా, 2012లో 0.47గా నమోదైంది. ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నగరాలతో పోల్చితే చైనా నగరాల్లో అసమానతలు తక్కువ. పట్టణ ప్రాంతాల్లో అసమానతల పెరుగుదల కారణంగా గత 20 ఏళ్లలో గేటెడ్ కమ్యూనిటీలు పెరిగాయని నివేదిక పేర్కొంది. అమెరికాలోని హౌసింగ్‌కు సంబంధించి 1990 దశకం చివర్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలోని దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లోని నూతన గృహాల్లో 40% గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నాయి. 2003లో 7 మిలియన్ కుటుంబాలు అమెరికాలోని 20,000 గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నాయి.
Published date : 30 Aug 2016 12:25PM

Photo Stories