Skip to main content

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యువాన్ క్షీణత ప్రభావం

గత రెండు వేల సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటూ చైనా వృద్ధి, తిరోగమన దశలను ఎదుర్కొంది.
1978 తర్వాత ఆర్థిక సంస్కరణలను అమలుపరచిన చైనా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. 2014 నాటికి స్థూల జాతీయోత్పత్తి, కొనుగోలు శక్తి సామ్యం (PPP) ఆధారంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అయితే చైనాలో ఇటీవల సంభవించిన పరిణామాలు ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటానికి దారితీసే విధంగా ఉన్నాయి.

ప్రపంచ వాణిజ్య సంస్థ, ఆసియా, పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, జి-20 లాంటి సంస్థల్లో చైనాకు సభ్యత్వం ఉంది. అణ్వాయుధాలు కలిగిన దేశంగా, పటిష్టమైన ఆర్మీతో ప్రపంచంలో అధిక రక్షణ బడ్జెట్ పరంగా రెండో స్థానం పొందింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అధికంగా ఆకర్షిస్తున్న దేశంగా నిలిచింది. 2014లో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద 500 కార్పొరేషన్‌లలో చైనా కంపెనీలు 95 ఉన్నట్లు ఫార్చ్యూన్ (Fortune) పత్రిక పేర్కొంది. అదే సంవత్సరం ప్రపంచంలో అతిపెద్ద 10 ప్రభుత్వ రంగ కంపెనీల్లో చైనా కంపెనీలు 5 ఉన్నట్లుగా ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది.

గత కొంతకాలంగా చైనా పరిస్థితులు
2007లో చైనా రుణం 7.4 ట్రిలియన్ డాలర్లు. ఇది 2014 నాటికి 28.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు మెక్‌కిన్సే (McKinsey) సంస్థ పేర్కొంది. ఈ మొత్తం చైనా రుణ-జీడీపీ నిష్పత్తిని 228 శాతానికి పెంచింది. ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడంలో 2014లో 137వ స్థానాన్ని, గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో 28వ స్థానాన్ని పొందింది. చైనాలోకి ప్రవేశించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2012లో 253 బిలియన్ డాలర్లుగా ఉంటే 2014లో ఈ మొత్తం 119.56 బిలియన్ డాలర్లకు తగ్గింది. మరోవైపు చైనా నుంచి బయటి దేశాలకు తరలి వెళ్లిన పెట్టుబడులు 2012లో 62.4 బిలియన్ డాలర్లుగా ఉంటే 2014లో 102.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత కొన్నేళ్లుగా రెండంకెల వృద్ధి (Double digit growth) నమోదు చేసుకున్న చైనాలో 2014లో 7.4 శాతం వృద్ధి నమోదైంది. ప్రపంచ ఎగుమతుల్లో 2000 - 2010 మధ్యకాలంలో చైనా వాటా సగటున 10 శాతంగా ఉంటే 2013లో 11.8 శాతానికి పెరిగింది. 2015 జూలైలో చైనా వాటా 8.3 శాతానికి తగ్గింది. గత నాలుగేళ్లుగా చైనాలో ఉత్పత్తిదారులు ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎగుమతుల వృద్ధిరేటు మందగించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి సాధన లక్ష్యం సందేహాస్పదమైంది. ఈ ఏడాది జూన్‌లో షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజి మొత్తం విలువలో 30 శాతం కోల్పోయింది.

మూల్యహీనీకరణకు ముందు చైనా చర్యలు
ఆర్థిక మందగమనాన్ని అధిగమించడానికి చైనా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2014, నవంబరు తర్వాత వడ్డీరేట్లను కేంద్ర బ్యాంకు తగ్గించింది. ఈ ఏడాది జూన్‌లో, వాణిజ్య బ్యాంకులు ఒక ఏడాదికి ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు; ఒకేడాది డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం లాంటి చర్యలను కేంద్ర బ్యాంకు చేపట్టింది. చిన్న వ్యాపారాల రిజర్వు నిష్పత్తిని తగ్గించింది. అధిక రుణాలు ఇచ్చేలా బ్యాంకులు నిర్వహించాల్సిన రిజర్వ్ నిష్పత్తిని కేంద్రబ్యాంకు కొద్ది నెలల క్రితం తగ్గింపు ద్వారా అధిక పరపతి ప్రవాహానికి చర్యలు తీసుకుంది.

యువాన్ మూల్యహీనీకరణ
చైనా తన కరెన్సీ వినిమయ రేట్లను కొన్ని ముఖ్య కరెన్సీలు, ప్రధానంగా అమెరికా డాలరుతో నియంత్రిస్తుంది. ట్రేడింగ్ రోజున ఉదయం ‘పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా’ తన కరెన్సీకి మిడ్ పాయింట్ (రిఫరెన్సు రేటు) నిర్ణయిస్తుంది. దాని నుంచి 2 శాతం వరకు యువాన్ విలువలో తగ్గుదల/పెరుగుదలను కేంద్ర బ్యాంకు అనుమతిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 11 నుంచి 13 వరకు డాలర్‌తో పోల్చినపుడు యువాన్ మిడ్ పాయింట్‌ను వరుసగా 1.9 శాతం, 1.6 శాతం, 1.1 శాతం కేంద్ర బ్యాంకు తగ్గించింది. అమెరికా డాలరుతో పోల్చినపుడు రిఫరెన్సు రేటు 6.40గా ఉన్నప్పుడు యువాన్‌ను 6.27 నుంచి 6.53 మధ్య ఉండటాన్ని కేంద్ర బ్యాంకు అనుమతిస్తుంది. మూడోసారి యువాన్ మూల్యహీనీకరణ (డీవాల్యుయేషన్) తర్వాత పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా యువాన్ సర్దుబాటు రేటు పూర్తయినట్లు ప్రకటించింది. కానీ ఆర్థిక నిపుణుల అభిప్రాయంలో చైనా తన మూల్యహీనీకరణ విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ‘కరెన్సీ యుద్ధం’ ప్రారంభానికి చైనా తెరతీసినట్లుగా కొంతమంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. మరోవైపు తమ కరెన్సీ మూల్యహీనీకరణ ద్వారా యువాన్ ‘మార్కెట్ ఆధారిత వ్యవస్థ’ వైపు పయనిస్తోందనే విషయం స్పష్టమైందని చైనా వాదిస్తోంది.

చైనా ఆశిస్తున్న ప్రయోజనాలు
గత సంవత్సరకాలంగా అమెరికా డాలరుతో పోల్చినపుడు అనేక దేశాల కరెన్సీ విలువలో తగ్గుదల ఏర్పడినప్పటికీ యువాన్ స్థిరంగా ఉంది. చైనా అవలంబించిన వినిమయరేటు విధానం కారణంగానే యువాన్ విలువలో మార్పు చోటుచేసుకోలేదు. లక్షిత వృద్ధి రేటు సాధించే దిశగా ఎగుమతుల వృద్ధిని పెంచే క్రమంలో చైనా మూల్యహీనీకరణ విధానాన్ని అనుసరించింది. మూల్యహీనీకరణ వల్ల ఎగుమతుల వృద్ధిలో పెరుగుదల ఏర్పడి దిగుమతులు క్షీణిస్తాయి. తద్వారా వాణిజ్య మిగులు ఏర్పడుతుంది. కనిష్టంగా 7 శాతం వృద్ధి రేటు సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టడానికి చైనా ప్రభుత్వం సంసిద్ధమైంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) జారీచేసే ‘స్పెషల్ డ్రాయింగ్ రైట్స్’లో యువాన్‌ను భాగంగా ఉంచాలని చైనా అభిలషిస్తోంది. అమెరికా డాలర్, యూరో, పౌండ్, జపనీస్ యన్‌లు ప్రపంచ నిల్వ సంపద(వరల్డ్ రిజర్వ్ అసెట్). స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌లో యువాన్‌ను చేర్చితే ‘రిజర్వ్ కరెన్సీ’గా రూపొందుతుంది. ఇందులో ఉన్న కరెన్సీల సమూహంలో యువాన్‌ను చేర్చాలంటే చైనా అస్థిర వినిమయ రేటు విధానాన్ని పాటించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి భావిస్తోంది. చైనా నుంచి మూలధన ప్రవాహాలు బయట దేశాలకు అధికంగా ఉన్న నేపథ్యంలో డాలర్‌తో పోల్చితే యువాన్ మూల్యహీనీకరణకు డిమాండ్ పెరిగిందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రకటించింది. ఇందువల్ల దిగుమతి చేసుకునే వస్తువుల అధిక వ్యయం కారణంగా డిమాండ్ తగ్గుతుంది. తద్వారా స్థానిక చైనా వ్యాపారంలో వృద్ధి ఏర్పడుతుంది. స్వల్పకాలంలో మూల్యహీనీకరణ ఎంతమేర ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాన్ని చేకూర్చుతుందనేది అంచనావేయడం కష్టమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇతర ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం
  • చైనా తన కరెన్సీ విలువ తగ్గిస్తుండటం అనూహ్యమైన పరిణామంగా భావించవచ్చు. ఎగుమతుల విషయంలో చైనాతో పోటీపడే దేశాలు కూడా తమ కరెన్సీ మూల్యహీనీకరణ విధానాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా కరెన్సీ యుద్ధం (కరెన్సీ వార్) ప్రారంభమై మార్కెట్లలో అనిశ్చితి ఏర్పడుతుంది.
  • యువాన్ మూల్యహీనీకరణ వల్ల చైనాకు ఆసియాలో ప్రత్యర్ధులైన ఇండొనేషియా, దక్షిణ కొరియాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొనవచ్చు. తద్వారా ప్రపంచ మార్కెట్‌లో ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. ఒకవైపు చైనాలో వేతనాలు పెరగడం వల్ల ఉత్పత్తుల్లో పోటీతత్వం తగ్గింది. మరోవైపు ముడి సరుకుల ధరలు, షిప్పింగ్ చార్జీలు పెరగడంతో స్వదేశీ ఉత్పత్తుల్లో పోటీతత్వం తగ్గడానికి కారణమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాలో ఎగుమతులకు పోటీపడే దేశాల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. ఆయా దేశాలు విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి.
  • యువాన్ మూల్యహీనీకరణ వల్ల ప్రపంచ చమురు ధరల్లో తగ్గుదల ఏర్పడి బ్యారెల్ ధర 50 డాలర్లకు తగ్గింది. ఇకపై చైనా నుంచి దిగుమతులకు డిమాండ్ తగ్గి చమురు నుంచి ఇనుప ధాతువు వరకు ధరలు క్షీణించే ప్రమాదముంది. ఈ క్రమంలో ఆయా ఉత్పత్తుల ఎగుమతులపై ఆధారపడిన దేశాల్లో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం ఏర్పడుతుంది. ఈ స్థితి ఆయా దేశాల కరెన్సీ విలువలో ఒడిదుడుకులకు కారణమవుతుంది.
  • ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా తన సహజ వనరులైన బొగ్గు, ఇనుప ధాతువును ఇరుగుపొరుగు ఆసియా దేశాలకు ఎగుమతి చేసి అధిక వృద్ధి సాధించింది. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో చైనా వాటా సుమారు 25 శాతంగా ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం ఆస్ట్రేలియాకు ఆందోళన కలిగించే పరిణామం. 10 శాతం యువాన్ కరెన్సీ విలువలో క్షీణతతోపాటు చైనా ఆర్థిక మందగమనం వల్ల బ్రెజిల్, రష్యా, చిలీ, కొరియా లాంటి దేశాల ఆర్థికవృద్ధిపై ప్రభావం చూపుతుంది.
  • అమెరికా విధాన నిర్ణేతలు కూడా చైనా కరెన్సీ మూల్యహీనీకరణ విధానాన్ని వ్యతిరేకించారు. యువాన్ మూల్యహీనీకరణ అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తుందని, చైనా అన్యాయమైన వాణిజ్య ప్రయోజనాన్ని పొందుతుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్య కరెన్సీలతో పోల్చినపుడు డాలర్ విలువ పెరుగుతున్న క్రమంలో యువాన్ మూల్యహీనీకరణ చేపట్టడాన్ని అమెరికా విధాన నిర్ణేతలు తప్పుబట్టారు.
  • మలేసియాకు చైనా రెండో అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో మలేసియా ఎగుమతులలో చైనా వాటా 12.6 శాతం. యువాన్ విలువ క్షీణత వల్ల దిగుమతి వస్తువులపై చైనా స్వదేశీ వ్యయం తగ్గుతుంది. మలేసియా స్టాక్ మార్కెట్‌పై కూడా ప్రభావం కనిపించింది. బుర్సా మలేసియా కేఎల్ కంపోజిట్ ఇండెక్స్ గతవారంలో 57.55 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది.
  • ఈక్విటీ మార్కెట్లపై కూడా యువాన్ మూల్యహీనీకరణ రుణాత్మక ప్రభావాన్ని నమోదు చేసింది. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఆసియా దేశాల నుంచి పెట్టుబడులు బయట దేశాలకు తరలివెళ్లాయి.

భారత్‌పై ప్రభావం
యువాన్ కరెన్సీ మూల్యహీనీకరణ ప్రభావం రూపాయి విలువలో ఒడిదుడుకులకు కారణమైంది. 2013 సెప్టెంబరు తర్వాత ఈ స్థాయికి క్షీణించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు భారత్ నుంచి చైనాకు వెళ్లాయి. ప్రస్తుత పరిస్థితిలో భారత్ ఎగుమతులు దెబ్బతీసే ప్రమాదముంది. భారత్ ఉత్పత్తులకు చైనాలో ధరలు పెరగడంతో ఆయా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా నుంచి 60.4 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంది. యువాన్ క్షీణత కారణంగా చైనా ఉత్పత్తులకు భారత్‌లో డిమాండ్ పెరిగి స్వదేశీ వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిస్థితి స్వదేశీ పెట్టుబడుల తగ్గుదలకు దారితీసి జీడీపీ వృద్ధి క్షీణిస్తుంది. యువాన్ క్షీణత కారణంగా భారత్ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో చైనా ఉత్పత్తులతో తీవ్ర పోటీ ఎదుర్కొంటాయి. తద్వారా భారత్ అధిక కరెంట్ అకౌంట్ లోటును ఎదుర్కొనే సూచనలున్నాయి. షాంఘై స్టాక్ సూచీ పతనం వల్ల.. భారత్ స్టాక్ మార్కెట్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీలు కొంతమేర నష్టపోతున్నాయి. చైనా ప్రభావం వల్ల వివిధ దేశాల కరెన్సీల పతనం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ఏర్పడిన అనిశ్చితి, దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తత, అంతర్గత వాణిజ్యంలో డాలర్‌తో రూపాయి మారకం రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం లాంటి కారణాలు స్టాక్ మార్కెట్ సూచీలు పతనం కావడానికి కారణమయ్యాయి.

వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్రయోజనం
ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి. అమెరికా, యూరోపియన్ దేశాల్లో స్వల్ప వడ్డీ రేట్ల వల్ల భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. దీంతో రూపాయి వినిమయ రేటులో ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. మార్కెట్లు కొంత స్థిరపడిన నేపథ్యంలో భారత్ నుంచి ఎగుమతులు దెబ్బతినకుండా తగిన చర్యలు చేపట్టడం అవసరం.
Published date : 28 Aug 2015 12:44PM

Photo Stories