Skip to main content

ప్రపంచ ఆర్థిక వేదిక - 2015

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచాలనే ఆశయంతో ఏర్పడిన వేదికే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం). ఆర్థిక వృద్ధి - సంస్కరణలు, అందరికీ సంపద, ఆహార భద్రత, పేదరిక నిర్మూలన, సమ సమాజ స్థాపన అనే మహోన్నత లక్ష్యాల్ని ఏమేర సాధించామో సమీక్షించేందుకు వివిధ దేశాల అధినేతలు, ఆర్థిక వేత్తలు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా సమావేశమవుతుంటారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా 44 సదస్సులు జరిగాయి. అయితే లక్ష్య సాధనలో వేదిక ఇప్పటికీ వెనుకబడే ఉందన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో జనవరి 21 నుంచి 24 వరకు జరిగిన 45వ సమీక్షలో ఏయే అంశాలపై ప్రధానంగా చర్చ సాగింది? లక్ష్యాలేమిటి? అనే అంశాలను ఓసారి పరిశీలిస్తే ...

‘నూతన ప్రపంచ విధానం’ ముఖ్య ఎజెండాగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు 45వ వార్షిక సమావేశం జనవరి 21 నుంచి 24 వరకు జరిగింది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 2800 మంది అంతర్జాతీయ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వీరిలో మన దేశం నుంచి 120 మంది హాజరయ్యారు. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక, సాంఘిక అంశాలపై విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ఆర్థిక వృద్ధి, పర్యావరణ సుస్థిరత, విత్త వ్యవస్థలు, అందరికీ ఆరోగ్యం, సాంఘికాభివృద్ధి అనే అంశాలు ముఖ్యంగా చోటుచేసుకున్నాయి.

ప్రపంచ ఆర్థిక దృక్పథం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి సంబంధించి గతేడాది సమావేశంతో పోల్చితే ఈసారి కొంత నిరాశావాదం కనిపించింది. ఆర్థిక నిపుణులు, వివిధ కేంద్ర బ్యాంకు గవర్నర్లు... భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక పురోగతి కనిపించవచ్చని ఆశాభావం వ్యక్తం చేయగా... 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 3.5 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐ.ఎం.ఎఫ్) అంచనా వేసింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అందిస్తున్న విత్త మద్ధతు, క్షీణిస్తున్న చమురు ధరలు, బ్రెజిల్, చైనా, జపాన్ ఆర్థిక వ్యవస్థలలో చోటు చేసుకుంటున్న నిర్మాణాత్మకమైన మార్పులు, అమెరికా ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. యూరోజోన్‌లో నిర్మాణాత్మక సంస్కరణల అమలు ఒక పెద్ద సవాలుగా నిపుణులు పేర్కొన్నారు. సమగ్రమైన సంస్కరణల విధానాన్ని అమలుపరిచినప్పుడే యూరోజోన్‌లో ఉత్పాదకత, ఉపాధి, పెట్టుబడులు వేగవంతమవుతాయి. ఒకవేళ సమగ్ర సంస్కరణలు అమలు చేయకపోతే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అందించే విత్త ప్యాకేజీ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వవని ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు. క్షీణిస్తున్న చమురు ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థ లలో అధిక వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. కాబట్టి ఆయా ఆర్థిక వ్యవస్థలు నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి సారించాలని చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు సూచించారు.

‘‘బ్రెజిల్‌లో చమురు ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ దేశంలో పేద ప్రజల ఆదాయ పెంపుపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని’’ బ్రెజిల్ ఆర్థిక మంత్రి జోవాక్విం లెవీ తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పెట్టుబడులు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. వ్యాపారానికి అనువైన దేశంగా బ్రెజిల్‌ను రూపొందించడమే తమ ముఖ్య లక్ష్యమని లెవీ తెలిపారు. శ్రేయోదాయకంకాని ద్రవ్య విధానం, ఫిస్కల్ కన్సాలిడేషన్, నిర్మాణాత్మక సంస్కరణలతో తమ దేశం 2 శాతం వృద్ధి సాధనకు సంకల్పించిందని బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ హరుహికో కురోడా వివరించారు. చైనా వృద్ధి అంశాలనూ ఆయన ప్రస్తావించారు. సగటున 7.5 వృద్ధి సాధిస్తూ నిర్మాణాత్మక సంస్కరణల అమలు వేగవంతంలో చైనా ముందుందని ప్రశంసించారు. అమెరికా ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటేనే ప్రపంచ సమష్టి డిమాండ్‌లో పురోగతి సాధ్యమని సదస్సులో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అయితే అమెరికా వృద్ధి పెంపులో వినియోగదారులు, ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల కారణమని, ప్రగతిలో ప్రైవేటు పెట్టుబడుల భాగస్వామ్యం లేదని వక్తలు వివరించారు. విత్తరంగ అభివృద్ధిలో సాంకేతిక రంగ పాత్ర ప్రధానమని, తద్వారా వాణిజ్య, చెల్లింపు వ్యవస్థలు మెరుగుపడగలవని స్పష్టం చేశారు.

పలు సమస్యలు-పరిష్కార మార్గాలు
ఆహారభద్రత - వ్యవసాయం - ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లు అనే అంశంతో చర్చ ప్రారంభించారు. పెట్టుబడి, నవకల్పన, సమష్టి కృషి ద్వారా సుస్థిర, సమ్మిళిత ఆహార వ్యవస్థను సాధించడంతోనే దీనికి సరైన పరిష్కార మార్గమని సదస్సు పిలుపునిచ్చింది. కాగా శరణార్థుల ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శరణార్ధుల కమిటీ (యూఎన్‌హెచ్‌సీఆర్) హై కమిషనర్ ఆంటో నియో గట్టర్స్ పిలుపునిచ్చారు. పలు కారణాలతో 2013 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 5.1 లక్షల మంది శరణార్థులు ఉన్నారని వివరించారు. మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై కొంత నిరాశావాదాన్ని వ్యక్తపరచినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో చేపట్టిన సంస్కరణలను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కిమ్ ప్రశంసించారు.

సాంఘిక సంస్కరణలకు ప్రాధాన్యం
సదస్సులో పాల్గొన్న ప్రపంచ నాయకులు సాంఘిక సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చారు. దీనికి కారణం చైనా వృద్ధి రేటు, వస్తు మార్కెట్‌లలో క్షీణత, యూరోజోన్ విత్త సంక్షోభం. సుస్థిర సాధన, సాంఘిక- ఆర్థిక తారతమ్యాల తగ్గింపుపై విధాన నిర్ణేతలు తమ దృష్టిని కేంద్రీకరించాలని నిపుణులు కోరారు.

అందరికీ సంపద
సదస్సులో ఆదాయం, జండర్ పారిటీ టు ఎన్విరాన్‌మెంట్, ఈక్విటబుల్ గ్రోత్ అంశాల్నీ ప్రస్తావించారు. ప్రపంచంలో ఉన్న 1 శాతం ధనిక వర్గం చేతిలో సంపద మొత్తం కేంద్రీకృతమవడంపై సదస్సులో ఆందోళన వ్యక్తమైంది. ప్రపంచ ఆస్తులలో బిలియనీర్ల వాటా 2009 తర్వాత 48 శాతానికి పెరిగింది. 2016 నాటికి అది 50 శాతం కావచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 2009-2014 మధ్య కాలంలో అంతర్జాతీయంగా ధనికుల సంపద రెట్టింపయిందని ఆక్స్ఫామ్ (OXFAM) అనే అంతర్జాతీయ నివేదిక వెల్లడించిన విషయంపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదాయ, సంపదలోని వ్యత్యాసాల కారణంగా ప్రపంచ శాంతి, ఆదాయ వృద్ధి సాధనలో వారు ఏమేర నిర్లక్ష్యానికి గురవుతున్నారనే అంశాన్ని చర్చించారు. పెరుగుతున్న అసమానతలతో పేదరిక నిర్మూలన సాధ్యం కాదని సదస్సు అభిప్రాయపడింది. పేద ప్రజల రక్షణ విషయంలో పారదర్శకత పెంపు, అసమానతల తొలగింపుపై వ్యాపారవేత్తలు ఎలాంటి పాత్ర పోషించాలో నిపుణులు సూచించారు. అత్యుత్తమ కార్పోరేట్ సామాజిక బాధ్యతతో సుస్థిర సంస్థను రూపొందించినట్లయితే ఆదాయ సమృద్ధిని, ఆదర్శప్రాయమైన జీవనోపాధి రూపంలో శ్రేయోదాయక సమాజాన్ని ఆవిష్కరించవచ్చని వారు పేర్కొన్నారు.

సమావేశం నివేదికలు
 • ప్రపంచ విపత్తులు 2015
 • విద్యుత్తు భవిష్యత్తు (ది ఫ్యూచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ)
 • మ్యాగ్జిమైజింగ్ ది లైఫ్ ఇయర్స్
 • పార్టనరింగ్ ఫర్ సైబర్ రెసిడెన్స్
 • ది బిజినెస్ ఆఫ్ క్రియేటివిటీ
 • వాణిజ్య సామర్థ్య పెంపు (ఎనేబిలింగ్ ట్రేడ్)
 • డేటా డ్రివెన్ డెవలప్‌మెంట్
 • బిల్డింగ్ ఫౌండేషన్స్ ఎగెనైస్ట్ కరప్షన్
 • హెల్త్ సిస్టమ్స్ లీప్ ఫ్రాగింగ్ ఇన్ ఎమర్జింగ్ ఎకనామిక్స్
 • ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
 • బ్రిడ్జింగ్ ది స్కిల్స్ అండ్ ఇన్నొవేషన్ గేప్ టు బూస్ట్ ప్రొడక్టివిటీ ఇన్ లాటిన్ అమెరికా
ఎవరేమన్నారంటే..
అసమానతలు, వాతావరణంలో మార్పులు, తీవ్రవాదం లాంటి దీర్ఘకాల సవాళ్లు, ప్రపంచంలో చోటుచేసుకున్న మార్పులపై ఎవరేమన్నారంటే..?

‘‘గత కొన్నేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొన్న బ్రెజిల్‌లో ఆశావహ దృక్పథం ఏర్పడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మెరుగవుతున్న నేపథ్యంలో గత ఐదేళ్లతో పోల్చితే రాబోయే ఐదేళ్ల కాలంలో బ్రెజిల్ మంచి ఫలితాలు సాధిస్తుంది’’.
రాబర్టో ఎగ్డియో సెటుబల్, సీఈఓ, ఉపాధ్యక్షుడు, ఇటాయు యూనీ బాంకో


‘‘పేదప్రజలపై ప్రపంచ వృద్ధి ప్రభావం పెరగాలి. ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలలో ఆరోగ్య సంరక్షణ మెరుగుదల, నాణ్యతతో కూడిన విద్య అసమానతల తొలగింపునకు దోహదపడగలదు’’.
జిమ్ యాంగ్ కిమ్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షులు


‘‘ఈ ఏడాది ప్రభుత్వాలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. యూరోపియన్ కేంద్ర బ్యాంకు అవలంబిస్తున్న క్వాంటిటేటివ్ ఈజింగ్‌తో పాటు దిగజారుతున్న చమురు ధరలతో ప్రభుత్వాలు కొంత మేర అనిశ్చిత వాతావరణాన్ని చవిచూసే అవకాశం ఉంది’’.
రాబిన్ నిబ్లెట్, ఛాతామ్ హౌజ్, యూకే డెరైక్టర్


‘‘అధిక ఉపాధి రేటు, యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉంది. ఆదాయ పంపిణీ ద్వారా ప్రజల శ్రేయస్సు మెరుగుపరచే విషయంలో చైనా కృషి ప్రశంసనీయం’’.
లీ కెకియాంగ్, చైనా ప్రధానమంత్రి.


‘‘వృద్ధిని పెంపొందించే పటిష్టమైన కోశ విధానం జర్మనీకి అవసరం. ప్రభుత్వ పెట్టుబడులను పెంచడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది’’.
ఏంజెలా మెర్కెల్, జర్మనీ ఫెడరల్ చాన్స్‌లర్


‘‘భద్రత లేకుండా సంపదలో పెరుగుదల అసాధ్యం. తీవ్రవాదాన్ని వార్షిక సమావేశ అజెండాగా చేర్చాలి. ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యమివ్వాలి ’’.
ఫ్రాంకోయిస్ హొలాండే, ఫ్రాన్స్ అధ్యక్షుడు


‘‘ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యాలతోనే ఆర్థికవృద్ధి సాధ్యం ’’.
మెటియొ రెంజి, ఇటలీ ప్రధాన మంత్రి.


‘‘అంతర్గత భద్రత, పారదర్శకతలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. ఇంటర్నెట్‌ను అతిపెద్ద ప్రపంచ వస్తువుగా గుర్తించాలి. ఇంటర్నెట్ వ్యవస్థను నష్టపరిస్తే ఆర్థిక భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది’’.
సత్య నాదెళ్ల, సీఈఓ, మైక్రోసాఫ్ట్


‘‘భారతదేశంలో వ్యాపార అవకాశాల గురించి వివరించడానికి డబ్ల్యూఈఎఫ్ సరైన వేదిక. పెట్టుబడులకు భారత్ ఇప్పటికే అనువైన అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం పోటీ దేశాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. భారత్‌లో గత ఏడెనిమిది నెలలుగా తీసుకుంటున్న చర్యల్ని కొనసాగిస్తే పెట్టుబడిదారులను మరింతగా ఆకర్షించే అవకాశం ఉంది’’.
అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి, ఇండియా
Published date : 29 Jan 2015 05:05PM

Photo Stories