Skip to main content

ప్రణాళికలు..పగతికి సోపానాలు..

భారత్‌లో ఇప్పటి వరకు అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం ఆర్థికాభివృద్ధి సాధన.
ప్రణాళికా డాక్యుమెంట్ల ఆధారంగా ఆర్థిక ప్రణాళికల ఇతర లక్ష్యాలు.. స్వయం సమృద్ధి; నిరుద్యోగ నిర్మూలన; ఆదాయ అసమానతల తగ్గింపు; పేదరిక నిర్మూలన; ఆధునికీకరణ; సమ్మిళిత, సుస్థిర వృద్ధి.

ఉత్పత్తి కార్యకలాపాలను ఒక కేంద్ర ఆర్థిక సంస్థ నడపటాన్ని ప్రణాళిక అని హెయక్ (Hayek) అభిప్రాయపడ్డారు. 1929లో సంభవించిన ఆర్థికమాంద్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. అప్పటికే పంచవర్ష ప్రణాళికలు అమల్లో ఉన్న రష్యా మాత్రమే ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురికాలేదు. ఈ క్రమంలో ప్రణాళికల అమలు ఆవశ్యకతను ప్రపంచ దేశాలు గుర్తించాయి. రష్యా సాధించిన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక ప్రగతిని భారత్ అర్థం చేసుకుంది. దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం ప్రణాళికల కోసం కొంత కృషి జరిగింది.

ప్రణాళికా సంఘం:
Bavitha
స్వాతంత్య్రానంతరం 1950, మార్చి 15న కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా ప్రణాళికా రచనకు ప్రణాళికా సంఘం ఏర్పడింది. ప్రణాళికా సంఘాన్ని రాజ్యాంగేతర, శాసనేతర సంస్థగా భావించవచ్చు. ఆదేశికసూత్రాల్లోని 39వ నిబంధనకు అనుగుణంగా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1952, ఆగస్టు 6న కేంద్ర కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా జాతీయాభివృద్ధి మండలి ఏర్పాటైంది. ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను జాతీయాభివృద్ధి మండలి పరిశీలించి, ఆమోదం తెలిపిన తర్వాతే ప్రణాళిక అమలవుతుంది. జాతీయాభివృద్ధి మండలికి ప్రధానమంత్రి ఎక్స్‌అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 1967లో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సు మేరకు జాతీయాభివృద్ధి మండలిని పునర్వ్యవస్థీకరించారు. ఈ మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘ సభ్యులు, ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రులు, కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు.
 • సంస్కరణల యుగంలోని తొలి ప్రణాళిక ఎనిమిదో ప్రణాళిక. ఇందులో ప్రణాళికా స్వభావాన్ని సూచనాత్మక ప్రణాళికగా పేర్కొన్నారు. ప్రభుత్వం స్థూల అంశాలను నిర్ణయించి, వాటిని సాధించేందుకు ప్రైవేటు రంగానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం సూచనాత్మక ప్రణాళికలోని ముఖ్యాంశం. ప్రజల భాగస్వామ్యం ఆధారంగా ప్రణాళికలను కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళికలుగా వర్గీకరించవచ్చు. వనరుల కేటాయింపు ఆధారంగా భౌతిక, విత్త ప్రణాళికలుగాను, కాలం ఆధారంగా దీర్ఘదర్శి, స్వల్ప, మధ్యకాలిక ప్రణాళికలుగా వర్గీకరించవచ్చు. ఇప్పటి వరకు భారత్‌లో 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తికాగా, ప్రస్తుతం 12వ ప్రణాళిక అమల్లో ఉంది.
ఆర్థిక ప్రణాళికల లక్ష్యాలు:
భారత్‌లో ఇప్పటి వరకు అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం ఆర్థికాభివృద్ధి సాధన. ప్రణాళికా డాక్యుమెంట్ల ఆధారంగా ఆర్థిక ప్రణాళికల ఇతర లక్ష్యాలు.. స్వయం సమృద్ధి; నిరుద్యోగ నిర్మూలన; ఆదాయ అసమానతల తగ్గింపు; పేదరిక నిర్మూలన; ఆధునికీకరణ; సమ్మిళిత, సుస్థిర వృద్ధి.

నూతన అభివృద్ధి వ్యూహం:
1980వ దశకంలో భారత్‌లో జాతీయాభివృద్ధి సగటు 5.5 శాతంగా నమోదైంది. ఈ దశకంలో ఆర్థికవృద్ధి రేటు పెరుగుదలకు అవలంబించిన వ్యూహం భారత్‌ను సంక్షోభంలోకి నెట్టేసింది. 1990-91లో ప్రారంభమైన సంక్షోభం 91-92లో తీవ్రమైంది. ఈ కాలంలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం తలెత్తింది. 1990-91లో ప్రారంభమైన ద్రవ్యోల్బణం తీవ్రమై 1991 ఆగస్టు నాటికి 16.7 శాతానికి చేరింది. సంక్షోభ సమయంలో వాస్తవిక స్థూలదేశీయోత్పత్తి వృద్ధి రేటు తగ్గింది. ఈ ఆటుపోట్లను అధిగమించేందుకు 1991 జులైలో 18 శాతం మేర రూపాయి మూల్యన్యూనీకరణతో పాటు 600 మిలియన్ డాలర్ల రుణం కోసం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో బంగారం తాకట్టు పెట్టడం వంటి విధానాలను భారత్ అవలంబించింది. ఈ క్రమంలో భారత్.. సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా నూతన అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది.

ఇందులోని ముఖ్య విధానాలు..
 • విత్త స్థితిని చక్కదిద్దడం ద్వారా స్థూల ఆర్థిక స్థిరీకరణ.
 • ఎగుమతుల వృద్ధి పెంపునకు వాణిజ్య విధానంలో సంస్కరణలు.
 • పరిశ్రమల పోటీతత్వాన్ని పెంపొందించేందుకు పారిశ్రామిక విధాన సంస్కరణలు.
 • ఫైనాన్షియల్ రంగంలో సంస్కరణలు.
11వ ప్రణాళిక అభివృద్ది వ్యూహం:
 • పదకొండో ప్రణాళిక.. సమ్మిళిత, సత్వర వృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. పటిష్ట స్థూల ఆర్థిక విధానాల ఆధారంగా అభివృద్ధి వ్యూహానికి రూపకల్పన చేశారు. ఇందులోని లక్ష్యాలు..
 • సాంవత్సరిక వృద్ధి 9 శాతం సాధించడం ద్వారా పేదరికం తగ్గింపుతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడం.
 • పేదలకు ఆరోగ్యం, విద్య వంటి ముఖ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం.
 • అందరికీ సమాన అవకాశాలు కల్పించడం.
 • విద్య, శిక్షణా నైపుణ్యం పెంపు ద్వారా సాధికారత.
 • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు.
 • పర్యావరణ సుస్థిరత.
 • మహిళా ఏజెన్సీల గుర్తింపు.
 • సుపరిపాలన.
11వ ప్రణాళికలో వివిధ రంగాల్లో వృద్ధి:
ఈ ప్రణాళిక మొత్తం ప్రభుత్వ రంగ కేటాయింపు 2006-07 ధరల్లో రూ. 36,44,718 కోట్లు. దీంట్లో కేంద్రం వాటా రూ. 21,56,571 కోట్లు కాగా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా రూ. 12,13,608 కోట్లు. వనరుల కేటాయింపులో సాంఘిక రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. తర్వాతి స్థానాల్లో శక్తి, రవాణా, సమాచార రంగాలు నిలిచాయి. విద్యపై ఎక్కువ మొత్తం వెచ్చించడం వల్ల ఈ ప్రణాళికను విద్యాప్రణాళికగా వర్ణించారు. ఈ ప్రణాళికలో జీడీపీ వృద్ధి రేటు 7.9 శాతంగా నమోదైంది. రంగాల వారీగా వృద్ధిరేటును పరిశీలిస్తే రవాణా, నిల్వ, సమాచార రంగాల్లో అధిక వృద్ధి నమోదైంది. వ్యవసాయం, అడవులు, మత్స్య రంగాలు 3.6 శాతం వృద్ధిని సాధించాయి. నీటిపారుదల రంగానికి వనరుల పంపిణీ సరిగా లేకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో అనుకున్న లక్ష్యం (4 శాతం) సాధించలేదు. ప్రణాళికలో పెట్టుబడి రేటు స్థూల దేశీయోత్పత్తిలో 37.6 శాతం కాగా, ఈ మొత్తంలో స్థిర పెట్టుబడి రేటు 32.9 శాతం.

12వ ప్రణాళిక
2012, ఏప్రిల్ 1 నుంచి 2017, మార్చి 31 కాలానికి ప్రణాళికా సంఘం 12వ పంచవర్ష ప్రణాళికను రూపొందించింది. వేగవంతమైన, సుస్థిరమైన, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి ఈ ప్రణాళిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని ఎనిమిది శాతంగా నిర్దేశించారు. మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడి రూ.80,50,123 కోట్లు కాగా ఇందులో కేంద్రం వాటా రూ.43,33,739 కోట్లు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వాటా రూ.37,16,385 కోట్లు. ప్రజల ఆర్థిక, సాంఘిక పరిస్థితులు మెరుగుపడాలంటే ఆర్థిక జీడీపీ వృద్ధిరేటు సాధించాల్సిన అవసరముందన్నది ప్రణాళికా సంఘ సభ్యుల అభిప్రాయం. ‘‘అధిక వృద్ధి ద్వారా అధిక రాబడి వస్తుంది. దీనివల్ల సమ్మిళిత వృద్ధి సాధనకు ఉపాధి హామీ పథకం, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, సమీకృత శిశు అభివృద్ధి సేవలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయొచ్చు’’ అని ప్రణాళికా రచయితలు భావించారు.
 • 12వ ప్రణాళికలో వివిధ రంగాల వృద్ధిరేటు లక్ష్యాలను పరిశీలిస్తే.. వ్యవసాయ రంగం- 4 శాతం, పారిశ్రామిక రంగం-8.1 శాతం, సేవా రంగంలో 9.1 శాతం. 2004-05 ధరల వద్ద పెట్టుబడి రేటు లక్ష్యాన్ని జీడీపీలో 39.3 శాతంగా నిర్ణయించగా, ఇందులో స్థిర పెట్టుబడి రేటు 34 శాతం. ప్రస్తుత ధరల వద్ద పొదుపు రేటు లక్ష్యాన్ని జీడీపీలో 34.2 శాతంగా నిర్ణయించారు. ప్రణాళికా కాలంలో శ్రామిక శక్తికి అదనంగా 2.40 కోట్లు మంది తోడుకాగలరని అంచనా.
 • ప్రభుత్వ రంగ పెట్టుబడిలో సాంఘిక సేవలు అధిక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తం పెట్టుబడిలో వీటి వాటా 34.7 శాతం. శక్తి రంగం 18.8 శాతం, రవాణా 15.7 శాతం, గ్రామీణాభివృద్ధి ఆరు శాతం, నీటిపారుదల-వరదల నివారణ 5.5 శాతం, పరిశ్రమలు, ఖనిజాలు 4.9 శాతం పొందాయి.
 • 12వ ప్రణాళికలో రూ.36 లక్షల కోట్ల మేర రుణం సేకరించడం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని ప్రణాళిక రచయితలు భావించారు.
లక్ష్యాలు: 12వ పంచవర్ష ప్రణాళికలో 25 లక్ష్యాలను పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, అవస్థాపనా సదుపాయాలు, పర్యావరణం-సుస్థిరత, పేదరికం-ఉద్యోగిత అంశాల ఆధారంగా లక్ష్యాలను నిర్ణయించారు.
అవి..
 • వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 8 శాతం.
 • వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం.
 • తయారీ రంగ వృద్ధి రేటు 10 శాతం.
 • తలల లెక్కింపు నిష్పత్తి ఆధారంగా పేదరిక శాతాన్ని 10 శాతం పాయింట్లు తగ్గించాలి.
 • వ్యవసాయేతర రంగంలో అయిదు కోట్ల కొత్త ఉపాధి అవకాశాలు.
 • శిశు మరణాల రేటును 25కు (ప్రతి వెయ్యి జననాలకు), ప్రసూతి మరణాలను 1కి (ప్రతి వెయ్యి జననాలకు) తగ్గించాలి.
 • ప్రణాళిక చివరి నాటికి అవస్థాపనా సౌకర్యాలపై పెట్టుబడిని జీడీపీలో తొమ్మిది శాతానికి పెంచాలి.
 • ప్రణాళిక చివరి నాటికి స్థూల నీటిపారుదల గల భూమిని 90 మిలియన్ హెక్టార్ల నుంచి 103 మిలియన్ హెక్టార్లకు పెంచాలి.
 • ప్రణాళికా కాలంలో ఏడాదిలో ఒక మిలియన్ హెక్టార్లలో చెట్లు నాటాలి.
 • ప్రణాళిక చివరి నాటికి 90 శాతం కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందించాలి.
 • 11వ ప్రణాళికలో సాధించిన వృద్ధి కంటే 12వ ప్రణాళికలో రాష్ట్రాలు అధిక వృద్ధిని సాధించాలి.
 • ఉన్నత విద్యలో అదనంగా 20 లక్షల సీట్లు పెంచాలి.
 • పాఠశాలలో లింగ వ్యత్యాసాన్ని, సాంఘిక వ్యత్యాసాన్ని నిర్మూలించాలి.
 • పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 0-3 ఏళ్లు మధ్యగల పిల్లల సంఖ్యను ప్రస్తుత స్థాయి నుంచి సగానికి తగ్గించాలి.
 • అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి.
 • ప్రణాళిక పూర్తయ్యేనాటికి అన్ని గ్రామాలను ఏ సీజన్‌లోనైనా బాగుండే (All Weather Roads) రహదారులతో అనుసంధానించాలి.
 • గ్రామీణ టెలీ సాంద్రతను 70 శాతానికి పెంచాలి.
 • 50 శాతం గ్రామపంచాయతీలు నిర్మల్ గ్రామ హోదాను పొందేలా చేయాలి.
 • ప్రణాళిక ముగిసేనాటికి సబ్సిడీలు, ఇతర సంక్షేమ చెల్లింపులు ఆధార్‌కార్డులు, బ్యాంక్ ఖాతాల ద్వారా జరిగేలా చూడాలి.
 • పునరావృత విద్యుత్ సామర్థ్యాన్ని అదనంగా 30 వేల మెగావాట్లు పెంచాలి.
 • 2020 నాటికి వాతావరణ కలుషితాలను 20 శాతం-25 శాతం మేర తగ్గించాలి (2005 స్థాయితో పోల్చితే).
 • ప్రణాళికాంతానికి జాతీయ, రాష్ట్ర రహదారులను కనీసం రెండు రోడ్ల రహదారులుగా మార్చాలి.
 • ప్రణాళిక చివరి నాటికి తూర్పు, పశ్చిమ సరకు రవాణా కారిడార్‌లను పూర్తిచేయాలి.
Published date : 19 Dec 2014 04:30PM

Photo Stories