Skip to main content

పేదరికం-ప్రపంచ బ్యాంకు నివేదిక

ఇటీవల పేదరికంపై ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదిక బాన్‌కీమూన్ వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం 2012లో ప్రపంచ జనాభాలో 90,20,00,000 మంది (12.8 శాతం) పేదలుండగా, ఈ ఏడాదికి ఆ సంఖ్య 70,20,00,000 (9.6 శాతం)కు తగ్గుతుందని అంచనా వేసింది. అంతేకాకుండా దుర్భర దారిద్య్రంలో ఉన్న జనాభా తొలిసారిగా పది శాతం దిగువకు చేరుతుందని నివేదిక వెల్లడించింది.
ప్రపంచంలోని చాలా దేశాలు పేదరిక సమస్యతో సతమతమవుతున్నాయి. దీన్ని రూపుమాపేందుకు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 2000లో నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాల్లో మొదటి లక్ష్యం.. పేదరికాన్ని అంతం చేయటం! పేదరిక నిర్మూలనలో చాలా దేశాలు కొంతమేర విజయం సాధించినప్పటికీ, ఇప్పటికీ పేదరికం అనేక రూపాల్లో సామాన్య జనంపై విష ప్రభావం చూపుతూనే ఉంది. భారత్‌లో స్వాతంత్య్రం తర్వాత రూపొందించిన పథకాల వల్ల చాలా మంది జీవితాలు మెరుగుపడినప్పటికీ, పేదరికం పూర్తిగా నిర్మూలన కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘దుర్భర దారిద్య్రానికి ముగింపు, భాగస్వామ్య శ్రేయస్సు: ప్రగతి, విధానాలు’ పేరిట ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికను విశ్లేషించాల్సిన అవసరముంది.

2030 నాటికి నిర్మూలించటమే లక్ష్యం:
నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన దిశగా అంతర్జాతీయ సమాజం చేస్తున్న కృషి సానుకూల ఫలితాలు ఇస్తోంది. 2030 నాటికి పేదరికాన్ని అంతం చేయాలన్న లక్ష్యం దిశగా ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే అనేక సవాళ్లను అధిగమించాలి. అత్యంత పేదరికం రేటు అల్పాదాయ దేశాల్లోనే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మంది పేదలు అల్ప-మధ్య ఆదాయ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచ పేదల్లో మూడో వంతు మంది అల్పాదాయ దేశాల్లో ఉండగా, సగం మంది అల్ప-మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నారు. అల్పాదాయ దేశాల్లో 2012లో పేదరికం సగటు రేటు 43 శాతం కాగా, అల్ప-మధ్య ఆదాయ దేశాల్లో ఇది 19 శాతం. ఈ పరిణామానికి కారణం ఒకప్పుడు అల్పాదాయ దేశాల వర్గీకరణలోఉన్న చైనా, భారత్, ఇండోనేషియా, నైజీరియా ఇప్పుడు అల్ప-మధ్య ఆదాయ వర్గీకరణలో చేరటమేనని నివేదిక విశ్లేషించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు:
 • అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి రేట్లు బాగా మెరుగవటం; విద్య, ఆరోగ్యం, సామాజిక రంగాల్లో పెట్టుబడులు కారణంగా పేదరికంలో నిరంతరం పెద్ద ఎత్తున తగ్గుదల కనిపిస్తోంది.
 • ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించటం, ప్రపంచంలో చాలా మంది పేదలు ఘర్షణ పూరిత ప్రాంతాల్లో నివసిస్తుండటం వంటి పరిస్థితుల్లో దుర్భర దారిద్య్రానికి ముగింపు పలకటం క్లిష్టమైన లక్ష్యం.
 • 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఎక్కువ కాలం కొనసాగిన ఆర్థిక మందగమనం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపటం ప్రారంభమైంది. మున్ముందు ఈ ప్రభావంతో అనేక మార్పులు జరగొచ్చు. సమీప భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి అంచనాలు తక్కువ ఆశాజనకంగా ఉంటాయి. పేదరికం అంతం దిశగా చేస్తున్న పోరాటానికి ఇది కొత్త సవాళ్లను సృష్టిస్తుంది.
 • 2008 అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 18.6 శాతం (125 కోట్లు) మంది దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. ఇది 2011 అంచనాల ప్రకారం 14.5 శాతం (100 కోట్లు)గా ఉంది.
 • గ్లోబల్ మానిటరింగ్ రిపోర్టు ప్రకారం 2006-11 మధ్య 86 దేశాలను పరిగణనలోకి తీసుకుంటే, 58 దేశాల్లో అట్టడుగున ఉన్న 40 శాతం మంది పేదల జీవన ప్రమాణాలు కొంతవరకు మెరుగైనప్పటికీ విద్య, ఆరోగ్య వసతుల విషయంలో వారి బతుకులు బాగుపడలేదు.
 • 2011 నాటి కొనుగోలు శక్తి ఆధారంగా దారిద్య్ర రేఖను రోజుకు 1.90 డాలర్ల వద్ద ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
 • ఆదాయం తక్కువగా ఉండటమే పేదరికం కాదు.. విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, ఉపాధి, వ్యక్తిగత భద్రత వంటి అనేక అంశాల్లో జనం జీవితం బాగోలేకుంటే అది కూడా పేదరికం కిందకే వస్తుంది. ఈ ప్రాతిపదికన (బహుళ అంశాల సూచీ) చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల మంది దారిద్య్రం పంజాకు చిక్కి, కష్టాలు ఎదుర్కొంటున్నారు.
 • తూర్పు ఆసియా, పసిఫిక్ మహాసముద్ర సరిహద్దు దేశాల్లో పేదరికం గణనీయంగా తగ్గటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా క్షీణత కనిపించింది. 1990 నుంచి ఏటా 1 శాతం చొప్పున దారిద్య్రం తగ్గుతోంది. ఈ విషయంలో దాదాపు 280 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం, చైనాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు:
విభిన్న వ్యూహాలతో పేదరిక నిర్మూలనకు ప్రయత్నించాల్సిన తరుణమిది. అభివృద్ధిని పరుగులు పెట్టించటంతో పాటు దాన్ని అన్ని ప్రాంతాలకూ సమానంగా విస్తరించటంపైనా దృష్టిసారించాలి. కేవలం అభివృద్ధిపై శ్రద్ధచూపి, అది ఎలా విస్తరిస్తుందో గమనించకపోతే ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదలకు కారణమవుతుంది. వ్యవసాయం, సామాజిక రంగం, ఉపాధి కల్పన వంటి రంగాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిందే. కేవలం అభివృద్ధి సాధనతో పేదరికాన్ని అంతం చేయగలమనుకోవటం సరికాదు. భారత్ వంటి దేశాల్లో వ్యవసాయానికి తగిన ప్రాధాన్యమివ్వటం తప్పనిసరి. ఈ రంగంలో సాధించే అభివృద్ధి వల్ల రెండింతలు పేదరికం తగ్గుతుందనే అంచనాలున్నాయి. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సాధికారత కల్పించటం ముఖ్యం. శ్రమ సాంద్ర ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించటం.. దారిద్య్ర నిర్మూలన దిశగా గొప్ప ముందడుగవుతుంది.

సమగ్ర కార్యాచరణ అవసరం
నైపుణ్యాల కల్పన, యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించటంపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. అందరికీ సమాన అవకాశాలు అందుబాటులో ఉండే వాతావరణం సృష్టించాలి. కనీసం అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి. దేశాలన్నీ సమగ్ర అభివృద్ధి వ్యూహాలను రూపొందించుకోవాలి. వాటి ప్రకారం సామాజిక రక్షణ చట్రాలను ఏర్పాటు చేసి, మానవాభివృద్ధి దిశగా కార్యాచరణ ప్రారంభించాలి. ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాలను దృష్టిలో ఉంచుకొని, సుస్థిరాభివృద్ధి వైపు అడుగులు వేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించటం ద్వారా సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చు. పౌర సేవల ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అనేక సందర్భాల్లో రుజువైంది. ప్రతి ఒక్కరికీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించే వికేంద్రీకృత ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించటం కోసం మొదట చేయాల్సిన పని దారిద్య్రాన్ని నిర్మూలించటం. ఆధునిక ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవటంలో సగటు జీవికి పేదరికం అడుగడుగునా అడ్డుపడుతోంది. కాబట్టి సమాజంలోని అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందించటం ప్రభుత్వాల అంతిమ లక్ష్యం కావాలి.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఇటీవల ఆమోదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లోనూ దారిద్య్ర నిర్మూలనకు పెద్దపీట వేశారు. ఏ రూపంలో ఉన్నాసరే దారిద్య్రాన్ని 2030లోగా తుడిచిపెట్టాలనే అంశానికి ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం పేదరిక తీవ్రత ఎక్కువగా ఉన్న సబ్ సహారన్, ఆఫ్రికా దేశాలు, పశ్చిమాసియా దేశాలు, కొన్ని పసిఫిక్ ప్రాంత దేశాలపై దృష్టిసారించాలి. ఐరాసతో పాటు ప్రపంచ బ్యాంకు గ్రూపు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటివి ఆయా దేశాలకు తోడ్పాటు అందించాలి. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషిచేయాలి. మానవ సమాజంపై అనాదిగా ప్రభావం చూపుతున్న అంశాల్లో ప్రధానమైన పేదరికంపై అంతర్జాతీయ సమాజం మరింత దృఢ నిశ్చయంతో పోరాడాల్సిన సమయం వచ్చింది. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ-ఉపాధి అవకాశాల సృష్టి, నాణ్యమైన విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన, మహిళా సాధికారత, శాంతిసుస్థిరత వంటి బహుముఖ అంశాల్లో ముందుకెళ్తే 2030 నాటికి దారిద్య్ర నిర్మూలన సాకారం కావొచ్చు.

ప్రపంచ పేదరిక స్థాయి

సం.

పేదవారి సంఖ్య (కోట్లలో)

పేదరికం రేటు (శాతం)

1990

195.9

37.1

1999

174.7

29.0

2011

98.7

14.2

2012

90.2

12.8

2015 (అంచనా)

70.2

9.6


భారత్ - పేదరిక పరిస్థితి
 • అత్యంత తక్కువ పేదరికం రేటు నమోదైన పేద జనాభా కలిగిన దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది.
 • భారత్‌లో గ్రామీణ విద్యుదీకరణ వల్ల వినియోగం, ఆర్జనలో మార్పు వచ్చింది. స్త్రీ, పురుష కార్మిక సరఫరా పెరిగింది. బాలికలు పాఠశాలకు వెళ్లడం పెరిగింది.
 • అసాధారణ వాతావరణ పరిస్థితులు వ్యవసాయ ధరలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు, కరువు, మరణాలను తగ్గించేందుకు రైలు మార్గాల అనుసంధాన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు సహకరించాయి.
 • విద్య, ఆరోగ్యం, సాంఘిక భద్రత వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు భారత్‌లోనూ పేదరికం తగ్గింది.
 • భారత్‌లో కుటుంబ సర్వేలకు ఉపయోగించిన కొత్త విధానాలు.. దేశంలో పేదరికం రేటు ఇంకా తక్కువ ఉండొచ్చని సూచిస్తున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది.
 • ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ఇండియా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వివిధ వర్గాల వారికి బీమా సౌకర్యం కల్పించటం వంటి అంశాలు భారత్‌లో పేదరికం తగ్గుదలకు దోహదంచేశాయి.

భారత్‌లో పేదరిక అంచనాలు
భారత్‌లో 1979 నుంచి ప్రణాళిక సంఘం పేదరిక అంచనాలను చేపడుతోంది. కుటుంబ వినియోగ వ్యయంపై జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌వో) దత్తాంశాలను ఉపయోగించుకొని, అంచనా వేస్తోంది. దారిద్య్ర రేఖ నిర్వచనంలో ప్రణాళికా సంఘం సూత్రంపై విమర్శలు రావటంతో ప్రభుత్వం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. 2005లో టెండూల్కర్ కమిటీని నియమించారు. దీని ప్రకారం 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో 25.70 శాతం, పట్టణాల్లో 13.7 శాతం మొత్తంమీద 21.92 శాతం పేదలున్నారు. సి.రంగరాజన్ నేతృత్వంలో 2012లో దారిద్య్రాన్ని అంచనా వేసేందుకు మరో కమిటీ ఏర్పాటైంది. 2014, జూలైలో కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీని ప్రకారం 2011-12లో 30.9 శాతం గ్రామీణులు, 26.4 శాతం పట్టణ ప్రాంత వాసులు మొత్తంమీద దేశంలో 29.5శాతం మంది పేదరికంలో ఉన్నారు. దేశంలోని ప్రతి పదిమందిలో ముగ్గురు పేదలేనని కమిటీ తేల్చింది. పట్టణాల్లో రోజుకు రూ.47 కంటే తక్కువ, గ్రామాల్లో రూ.32 కంటే తక్కువ వెచ్చించే వారిని పేదలుగా పరిగణించాలని కమిటీ పేర్కొంది. రంగరాజన్ కమిటీ ప్రకారం 2011-12లో దేశంలో 36.03 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు.

General Essays ‘‘దుర్భర దారిద్య్రం నుంచి ప్రపంచాన్ని బయటపడేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఆ దిశగా అవసరమైతే మా ప్రయాణాన్ని పునఃసమీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ సౌభాగ్యం దిశగా నడిపించటమే మా లక్ష్యం’’
- 2014లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీమూన్ చేసిన వ్యాఖ్యలు.

General Essays‘‘పేదరికం తగ్గుముఖం పడుతుందన్న అంచనా మంచి వార్త. మానవ చరిత్రలో అత్యంత పేదరికానికి ముగింపు పలకగలిగే మొదటి తరం మనదేనని ఈ అంచనాలు తెలియజేస్తున్నాయి’’
-జిమ్ యాంగ్ కిమ్, ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు
Published date : 30 Oct 2015 12:09PM

Photo Stories