Skip to main content

మంచి రోజులకు మెరుగైన చర్యలు

డా॥తమ్మా కోటిరెడ్డి, పొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.
ప్రభుత్వ స్థూల ఆర్థిక విధానాలు Fiscal Consolidation నిర్వహణకు, నిర్మాణాత్మక అడ్డంకుల తొలగింపునకు దోహదపడాలని 2013-14 ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ స్థితి అధిక ఆర్థిక వృద్ధి సాధనకు దారితీస్తుంది. సర్కారు చేపట్టే మెరుగైన చర్యల కారణంగా మంచిరోజులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడటంతోపాటు గవర్నెన్‌‌స మెరుగుదల కారణంగా రాబోయే సంవత్సరాల్లో భారత్ అధిక వృద్ధిని నమోదు చేసుకోగలదని వెల్లడించింది.

2009-10, 2010-11లలో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనం వైపు పయనించినప్పటికీ, 2012-13లో 4.5 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసుకుంది. గత దశాబ్దంలో ఈ వృద్ధి రేటు అతి తక్కువ. తర్వాత ఆర్థిక సంవత్సరం 2013-14లో 4.7 వృద్ధిని ఆర్థిక వ్యవస్థ కనబర్చింది. రుతుపవనాల అననుకూలత, బహిర్గత అంశాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించినప్పటికీ 2014-15లో 5.4 శాతం నుంచి 5.9 శాతం వృద్ధి నమోదు కాగలదని ఆర్థిక సర్వే పేర్కొంది. అల్ప ద్రవ్యోల్బణం కారణంగా సరళమైన ద్రవ్య విధానాన్ని రిజర్‌‌వబ్యాంక్ అనుసరించడంతో పెట్టుబడిదారుల్లో ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరిగింది.

వృద్ధి దిశగా:
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో పురోగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ అధికవృద్ధిని నమోదు చేసుకొనే సూచనలున్నాయని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ప్రభుత్వం పెట్టుబడి వాతావరణాన్ని, గవర్నెర్‌‌సను మెరుగుపరచడానికి తీసుకున్న చర్యల కారణంగా రాబోయే సంవత్సరాల్లో 7-8 శాతం వృద్ధి సాధించవచ్చని తెలిపింది. స్వదేశీ స్థూల ఆర్థిక సమతౌల్యం, సమర్ధత వృద్ధిపెంపునకు దోహదపడగలవు. ప్రభుత్వం, రిజర్‌‌వ బ్యాంక్ తీసుకున్న చర్యలు బహిర్గత ఆర్థికస్థితి మెరుగుపడటానికి కారణమయ్యాయి. ప్రైవేటు కార్పొరేట్ రంగంలో పెట్టుబడులు పెరగడంతో భారత్‌లో 2007-08 వరకు అధిక పెట్టుబడులు సాధ్యమయ్యాయి. ప్రైవేటు కార్పొరేట్ రంగ పెట్టుబడులు తగ్గినందున ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి రేటు ఇటీవలి కాలంలో తగ్గింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పట్ల పెట్టుబడి దారుల్లో విశ్వాసం పెంచాల్సిన అవశ్యకత ఏర్పడిందని ఆర్థిక సర్వే పేర్కొంది. మార్కెట్ ధరల వద్ద జీడీపీ ఆధారంగా 2012-13లో భారత్‌లో సమష్టి డిమాండ్ వృద్ధి 4.7 శాతం నమోదు కాగా, 2013-14లో 5 శాతానికి పెరిగింది. నికర ఎగుమతుల వృద్ధిలో పెరుగుదల కారణంగా సమష్టి డిమాండ్‌లో వృద్ధి కనిపించదని సర్వే పేర్కొంది.

దవ్యలోటు:
ద్రవ్యలోటును తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సర్వే వెల్లడించింది. గత ప్రభుత్వం ఆశించిన ద్రవ్యలోటు లక్ష్యం జీడీపీలో 4.1 శాతం కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొంత అధిక మొత్తంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రతిపాదించవచ్చని సర్వే పేర్కొంది. ఆహారం, ఎరువుల సబ్సిడీ వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా పన్నుల పరిధిని పెంచాలి. భారత్‌లో పన్ను రాబడి జీడీపీలో 9 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఈ మొత్తం అభివృద్ధి చెందిన ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) దేశాల ఒక త్రైమాసిక సగటుకు సమానం. పన్ను జీడీపీ నిష్పత్తి పెంచుకోవాల్సిన ఆవశ్యకతను సర్వే వెలిబుచ్చింది. కరెంట్ అకౌంట్‌లోటు 2014-15లో జీడీపీలో 2.1 శాతానికి తగ్గవచ్చు. 2012-13లో కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 4.7 శాతం కాగా 2013-14లో 1.7 శాతానికి తగ్గింది.

వ్యవసాయం, ఆహార యాజమాన్యం:
2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 264.4 మి.టన్నులు. నూనె గింజల ఉత్పత్తి 32.4 మి.టన్నులుగా సర్వే అంచనా వేసింది. ఉద్యానవన ఉత్పత్తి 2012-13లో 265 మి.టన్నులు. వీటి ఉత్పత్తి మొదటిసారిగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే అధికంగా నమోదైంది. అధిక సేకరణతో జూన్ 1, 2014 నాటికి కేంద్ర ఆహారధాన్య నిల్వలు 69.84 మి.టన్నులకు చేరుకున్నాయి. 2013లో ఆహార ధాన్యాల నికర లభ్యత 229.1 మి. టన్నులుగా సర్వే అంచనా వేసింది. రుతుపవనాలు అనుకూలించని పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తి, ఆహార ధరలపై ఆ ప్రభావం ఉంటుందని సర్వే హెచ్చరించింది. పంట దిగుబడి తక్కువగా ఉండటం, భూసార క్షీణత, ఎరువులు ఆహార సబ్సిడీ ప్రత్యక్ష బదిలీ, మార్కెట్ అడ్డంకులతో వ్యవసాయ రంగం కొన్ని సవాళ్లను ఎదుర్కోనుందని సర్వే పేర్కొంది.

కొత్త ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ఆవశ్యకత:
పబ్లిక్ ఫైనాన్‌‌స పటిష్ట పర్చాల్సిన ఆవసరాన్ని ఎకనమిక్ సర్వే తెలిపింది. సరైన అకౌంటింగ్ పద్ధతులు, మెరుగైన బడ్జెటరీ యాజమాన్యంతో కూడిన కొత్త ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) చట్టం రూపొందించాలని సూచించింది. కోశ విధాన రూపకల్పనలో కొత్త ఆలోచనా దృక్పథం అవసరమని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం 2006 నుంచి 2014 మధ్య కాలంలో అధికంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విత్త స్థితి దిగజారిందని సర్వే అభిప్రాయపడింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా కుటుంబ రంగం నష్టాన్ని చవిచూసినప్పటికీ ప్రభుత్వ రుణభారం తగ్గింది. భవిష్యత్‌లో ద్రవ్యోల్బణంలో తగ్గుదల ధోరణి ఉంటుందని పేర్కొంది. నాణ్యతతో కూడిన విత్త సర్దుబాట్లకు సంబంధించి పన్నులు, వ్యయం లాంటి విషయాల్లో వృద్ధి ఉండాలని సర్వే అభిప్రాయపడింది. పన్నుల వ్యవస్థకు సంబంధించి వస్తు, సేవలపై పన్ను, ప్రత్యక్ష పన్నుల కోడ్, సక్రమ పన్ను పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాలని నొక్కి చెప్పింది. ద్రవ్య బాధ్యత, పన్ను, వ్యయ సంస్కరణలు మధ్య కాలిక అజెండాగా ఉండి వాటి అమలుకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం తీసుకుంటుంది. క్రెడిట్ రేటింగ్ మెరుగుపర్చుకోవడం, తక్కువ ద్రవ్యోల్బణ రేటు, అల్ప మూలధన వ్యయం, వ్యాపారంపై విశ్వాసం పెంపు లాంటి చర్యలు దీర్ఘకాల ప్రోత్సాహకాలకు సంబంధించి స్వల్ప కాలంలో ప్రయోజనం కల్పించగలవని సర్వే పేర్కొంది.

పభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం:
సామాజిక రంగ కార్యక్రమాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యం పెంపు, టూరిజం, వ్యవసాయ రంగంలో ఆస్తుల కల్పన, అవస్థాపనా సౌకర్యాలను అనుసంధాన పరుస్తూ ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమం ప్రభుత్వ అజెండాగా ఉండాలని చెప్పింది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. కొన్ని రాష్ట్రాల్లో జనాభా సగటు వయసు 30 సంవత్సరాలు పైబడింది. కేరళ రాష్ర్ట జనాభా సగటు వయసు 33, హిమాచల్ ప్రదేశ్ జనాభా సగటు వయసు 30.4 ఏళ్లుగా సర్వే పేర్కొంది. వీరిలో ఉపాధి పెంపొందించడం ద్వారా ఉన్న జీవన ప్రమాణం పెంచాలంటే అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం అత్యవసరం. వీటితోపాటు పేదరిక, నిరుద్యోగ నిర్మూలనా కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలి. సామాజిక రంగ అభివృద్ధిపై వ్యయానికి అనుపాతంగా ప్రతిఫలం లభించడం లేదని సర్వే అభిప్రాయపడింది. పబ్లిక్ సెక్టార్, మౌలిక వసతుల అల్ప వినియోగంతో ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అవసరం. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ప్రతి నివాస ప్రాంతానికి 1 కి.మీ.లోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి. నేషనల్ రూరల్ లైవ్‌లీహుడ్ మిషన్‌ను సక్రమంగా అమలు చేసే క్రమంలో ముడి సరుకుల ఉత్పత్తిదారులు, కుటుంబ రంగం, వినియోగదారుల మధ్య పటిష్టమైన సంబంధం ఏర్పరచాలి. సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి జీరో బేస్డ్ బడ్జెటింగ్ విధానాన్ని రూపొందించాలి. సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల ప్రజల జీవన ప్రమాణం పెంచే చర్యల్లో భాగంగా పెన్షన్‌లు, ఎన్‌ఆర్‌ఈజీఏ, విద్య వంటి సౌకర్యాలు సరైన మద్దతు ఇవ్వాలని సర్వే స్పష్టం చేసింది.

విదేశీ పెట్టుబడులు:
విదేశీ పెట్టుబడులను ఒక విభాగం పరిధిలోకి తీసుకురావాలి. ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్‌‌టమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ మధ్య విదేశీ పెట్టుబడులకు సంబంధించిన వివాదాలను రూపుమాపడానికి ఈ చర్య అవసరం. ప్రస్తుతం విదేశీ పెట్టుబడులను మన దేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ , రిజర్‌‌వ బ్యాంక్, డిపార్‌‌టమెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ నిర్వహిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఫార్మాస్యూటికల్ రంగంలో మంత్రిత్వ శాఖల మధ్య ఏర్పడిన వివాదాలలో విదేశీ పెట్టుబడులను అనుమతించడంలో జాప్యం ఏర్పడింది.

సేవా రంగ ప్రగతి:
2012లో జీడీపీ ఆధారంగా ప్రపంచంలోని అతిపెద్ద 15 దేశాల్లో మొత్తం స్థూల దేశీయోత్పత్తికి సంబంధించి భారత్ 10వ స్థానాన్ని, సేవా రంగ జీడీపీ పరంగా 12వ స్థానాన్ని సాధించింది. సేవారంగ వృద్ధిలో చైనా తర్వాత భారత్ రెండో స్థానాన్ని పొందింది. 2007-2012 మధ్య చైనాలో సేవారంగ సగటు వృద్ధి 10.9 శాతం కాగా భారత్‌లో 9 శాతం నమోదైంది. 2012లో ప్రపంచ జీడీపీలో సేవారంగం వాటా 65.9 శాతం కాగా మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా 44 శాతం. భారత్‌కు సంబంధించి 2012లో సేవారంగం వాటా జీడీపీలో 56.9 శాతం కాగా మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా 28.1 శాతం. 2012-13తో పోల్చితే 2013-14లో సేవారంగంలో తక్కువ వృద్ధికి వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వ, సమాచార రంగాల్లో తక్కువ వృద్ధి నమోదు కావడమే కారణం. 2013-14లో సేవారంగంలో వృద్ధి 6.8 శాతంగా సర్వే తెలిపింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఆదాయ స్థాయిలో పెరుగుదలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరగడానికి, ఉపాధి అవకాశాలు మెరుగవడానికి సేవా రంగంలో పురోగతి కారణమయిందని సర్వే అభిప్రాయపడింది. సేవారంగంలో సాఫ్ట్‌వేర్, టెలికాం రంగాలు ప్రపంచంలో భారత్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి కారణమయ్యాయి.

ఆశావహ పరిస్థితులు:
2014-15లో భారత్‌లో వ్యాపార కార్యకలాపాల పెరుగుదలకు సేవారంగం దోహదపడగలదని సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. విమానయాన రంగంలో ఏయిర్ ఏసియా , టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్‌‌స వంటి సంస్థల ప్రవేశం కారణంగా ఆ రంగం పురోగమించే సూచనలున్నాయి. సుస్థిర ప్రభుత్వం ఏర్పడడంతోపాటు ఆర్థిక వ్యవస్థలో వృద్ధి విషయంలో ఆశావహ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సేవారంగ అభివృద్ధికి అవరోధంగా ఉన్న అన్ని నియంత్రణలు తొలగించాల్సిన ఆవశ్యకతను సర్వే వెలిబుచ్చింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ రంగ సేవల సంస్థ (సర్వీసెస్ పీఎస్‌యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణకు అధిక అవకాశం ఉంది. ఈ చర్య ప్రభుత్వ రాబడి పెంపుతోపాటు ఆయా సేవల వృద్ధి రేటు పెరుగుదలకు దోహదపడగలదు. ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలు కొరవడిన నేపథ్యంలో నౌకాశ్రయ సేవలను విస్తృత పరచాల్సిన ఆవశ్యకతను సర్వే స్పష్టం చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారా రైల్వేరంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఇండియన్ రైల్వేస్ తగిన చర్యలు చేపట్టగలదని సర్వే పేర్కొంది. రైల్వే ఆపరేషన్ మినహా మిగిలిన అన్ని అంశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతికి ప్రతిపాదనలు రూపొందుతాయని సర్వే అభిప్రాయ పడింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు, సబ్ అర్బన్ కారిడార్లు, హైస్పీడ్ రైల్ వ్యవస్థ, డెడికేటెడ్ ఫ్రైట్ లైన్‌‌సలో ఎఫ్‌డీఐల అనుమతికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జపాన్ లాంటి దేశాల్లో రైల్వే వ్యవస్థ ప్రైవేటీకరణ సత్ఫలితాలనివ్వగా, యునెటైడ్ కింగ్‌డమ్‌లో విఫలమైంది. ఈ నేపథ్యంలో రైల్వే వ్యవస్థలో ఎఫ్‌డీఐలను కొన్ని రంగాలకే అనుమతించే ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన ఆవశ్యకతను సర్వే పేర్కొంది.

కోల్ మైనింగ్‌లో ప్రైవేట్ రంగం:
కమర్షియల్ కోల్ మైనింగ్‌లో ప్రైవేటు రంగాన్ని అనుమతించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియాను పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకతను సర్వే తెలిపింది. ఉత్పత్తి పెంపుతోపాటు డ్రై ఫ్యూయల్ దిగుమతులను తగ్గించుకోవాలి. ఫిబ్రవరి 2014లో డ్రైఫ్యూయల్ దిగుమతి విలువ రూ. 95,175 కోట్లు. డిమాండ్-సప్లయ్‌ల మధ్య అంతరం తగ్గించే క్రమంలో 2012-13లో 146 మి.టన్నులను దిగుమతి చేసుకోగా ఈ విలువ రూ. 92,538 కోట్లు. 2013-14లో 169 మి.టన్నులను దిగుమతి చేసుకోగా ఈ విలువ రూ. 95,175 కోట్లుగా నమోదైంది. సేవలకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు అధిక అవకాశాలున్నాయి. నోడల్ ఏజెన్సీ, మార్కెటింగ్ సౌకర్యాల విస్తరణ సేవా రంగంలో అధికవృద్ధి సాధనకు వీలు కలుగుతుందని సర్వే పేర్కొంది. అవస్థాపనా రంగంపై అధిక పెట్టుబడుల ద్వారా వృద్ధి, ఉపాధి కల్పనకు వీలవుతుంది.
Published date : 18 Jul 2014 05:22PM

Photo Stories