Skip to main content

జి-7దేశాల సదస్సు తీర్మానాలు...

41వ జి-7 దేశాల సదస్సు జూన్ 7, 8వ తేదీల్లో జర్మనీలోని బవారియన్ ఆల్ఫ్స్‌లో జరిగింది. ఈ సదస్సులో జి-7 సభ్యదేశాల నాయకులతోపాటు ఐరోపా యూనియన్ (ఈయూ) ప్రతినిధులు పాల్గొన్నారు.
1981 తర్వాత జరిగిన అన్ని సమావేశాలకు ఈయూ అధ్యక్షులు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా నేతలతో పాటు అతిథి ఆహ్వానితులుగా ఇథియోపియా, ఇరాక్, అరేబియా, నైజీరియా, సెనగల్, ట్యునీషియా దేశాల నేతలు సదస్సులో పాల్గొన్నారు.

జి-7 సదస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించింది. భద్రత, వాతావరణ మార్పులు, అభివృద్ధి విధానం వంటి అంశాలపై చర్చించింది. పారిస్‌లో జరగనున్న కాప్-21 సదస్సు, పోస్ట్-2015 అభివృద్ధి అజెండాపైనా నేతలు చర్చించారు. సముద్ర పర్యావరణ భద్రత; యాంటీబయాటిక్ రెసిస్టెన్స్; నిర్లక్ష్యానికి గురైన, పేదరిక సంబంధిత వ్యాధులు; ఎబోలా, రిటైల్-సప్లయ్ చైన్ ప్రమాణాలు, మహిళా ఆర్థిక సాధికారత, ఇంధన భద్రత వంటి అంశాలపై సదస్సు దృష్టిసారించింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు:
గత సంవత్సర కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పురోగమనం ఏర్పడిందని జి-7 దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. కొన్ని ముఖ్య అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేటు పెరగడంతోపాటు భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి సాధనకు పరిస్థితులు మెరుగైనట్లు గుర్తించారు. ఇంధన ధరల్లో తగ్గుదల జి-7 దేశాల వృద్ధికి దోహదపడింది. ఇటీవల కాలంలో నిరుద్యోగిత తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే జి-7 దేశాల్లో నిరుద్యోగిత ఇప్పటికీ ఎక్కువగా ఉన్నట్లు సదస్సు స్పష్టం చేసింది. అల్ప ద్రవ్యోల్బణ రేటు; బలహీనమైన పెట్టుబడులు; అధిక ప్రభుత్వ-ప్రైవేటు రుణాలు; అంతర్గత, బహిర్గత అసమతుల్యత; భౌగోళిక ఉద్రిక్తతలు; విత్తమార్కెట్ ఒడిదుడుకులు తదితర సవాళ్లను జి-7 దేశాలు ఎదుర్కొంటున్నట్లు సదస్సు అభిప్రాయపడింది. వీటిని ఎదుర్కొంటూ, వృద్ధి రేటును మెరుగుపరచుకోవాలని స్పష్టం చేసింది. పటిష్టమైన, సమ్మిళిత వృద్ధి సాధన లక్ష్యాలను చేరుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

వృద్ధి రేటు ఎప్పుడు మెరుగుపడుతుంది?
 • సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ముందంజలో ఉన్న జి-7 దేశాలు...విద్య, నవకల్పనలను ప్రోత్సహించడం ద్వారా మేధో సంబంధ హక్కులను పరిరక్షించాలి.
 • స్నేహపూరిత వ్యాపార వాతావరణంలో చిన్న, మధ్య స్థాయి సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, తగిన స్థాయిలో ప్రభుత్వ పెట్టుబడులు, నాణ్యమైన అవస్థాపనా రంగ పెట్టుబడులను ప్రోత్సహించాలి.
 • సమర్థవంతమైన వనరుల సమీకరణ, నిర్మాణాత్మక సంస్కరణల అమలు, ఉత్పాదకత పెంపు వంటి చర్యల ద్వారా వృద్ధిరేటును మెరుగుపరచుకోవాలని సదస్సులో నేతలు అభిప్రాయపడ్డారు.
 • ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ‘విత్తవ్యూహాలలో సరళత’ పాటించడం ద్వారా ఉపాధి కల్పన, వృద్ధిని మెరుగుపరచుకోవాలని సూచించారు.
 • రుణ-జీడీపీ నిష్పత్తిని అదుపులో ఉంచుకోవాలని, కేంద్ర బ్యాంకులు అవలంబించే ద్రవ్యవిధానాలు.. ధరల స్థిరత్వం, ఆర్థిక పురోగమనానికి దోహదపడాలని సదస్సు స్పష్టం చేసింది.
 • పటిష్టమైన ఆర్థిక స్థితిగతులు ప్రజల జీవనాన్ని మెరుగుపరచగలవు. ఈ క్రమంలో దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి సాధించేందుకు వాతావరణ పరిరక్షణ, ఆరోగ్య పరిస్థితులు మెరుగవ్వాలని నేతలు అభిప్రాయపడ్డారు.

వృద్ధి అజెండా-కీలకాంశాలు
‘పోస్ట్ 2015’ అజెండా- సుస్థిర అభివృద్ధి
అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి అంశాలకు 2015 మైలురాయిగా నిలవగలదని సదస్సు పేర్కొంది. వచ్చే నెలలో అడిస్ అబాబాలో ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్‌మెంట్‌పై జరగనున్న మూడో అంతర్జాతీయ సదస్సు, పోస్ట్-2015 అభివృద్ధి అంజెడాపై న్యూయార్క్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే సదస్సు కీలకమైనవి. వాతావరణ మార్పులపై ముఖ్యమైన సదస్సు కూడా ఈ ఏడాది చివర్లో పారిస్‌లో జరగనుంది. ప్రజలే కేంద్రంగా ఉన్న పోస్ట్- 2015 సుస్థిర అభివృద్ధి అజెండాకు కట్టుబడి ఉన్నట్లు నేతలు తెలిపారు. సుస్థిర అభివృద్ధిని కొలిచేందుకు ప్రామాణికాలైన పర్యావరణ, ఆర్థిక, సాంఘిక అంశాలను సమతూకంలో పోస్ట్-2015 అజెండా సంఘటితపరచగలదన్నారు. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో అసంపూర్తిగా మిగిలిన పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపు, శాంతిని నెలకొల్పడం, సహజ వనరుల సుస్థిర యాజమాన్యాన్ని మెరుగుపరచడం, సుపరిపాలన, మానవ హక్కులకు కొత్త అజెండాలో పొందుపర్చారని, వాటి సాధనకు కట్టుబడి ఉన్నట్లు నాయకులు తెలిపారు.

మహిళల ఆర్థిక సాధికారత
మహిళల ఆర్థిక భాగస్వామ్యం.. పేదరికం, అసమానతలను తగ్గించడం ద్వారా ఆర్థిక వృద్ధి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మహిళలు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి ఆర్థిక సామర్థ్యం తగ్గడంతో పాటు ఆర్థికాభివృద్ధిలో పెట్టుబడులకు ఆటంకం ఏర్పడుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలపై వివక్షను రూపుమాపేందుకు; మహిళలు, బాలికలపై హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకునేందుకు కృషిచేస్తామని నేతలు పేర్కొన్నారు. మహిళల ఆర్థిక భాగస్వామ్యంలో ఎదురయ్యే సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, చట్టబద్ధమైన అడ్డంకులను తొలగించేందుకు, లైంగిక వేధింపుల నిర్మూలనకు మద్దతు ఉంటుందన్నారు. ఈ అంశాల్లో తమ భాగస్వాములైన అభివృద్ధి చెందుతున్న దేశాలకూ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

సదస్సు అభిప్రాయాలు
 • 2030 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 1/3 వంతు మహిళలు జి-7 దేశాల చర్యల వల్ల సాంకేతికపరమైన, వృత్తిపరమైన శిక్షణ, విద్యను అభ్యసించాలి.
 • జి-7 దేశాల్లోనూ మహిళలు, బాలికలకు శిక్షణ, విద్యా ప్రమాణాలను పెంచాల్సిన అవసరముంది.
 • 2025 నాటికి పనిలో భాగస్వాములైన వారిలో లింగ అంతరాన్ని 25 శాతానికి తగ్గించడంతోపాటు మహిళలలో నాణ్యతగల ఉపాధి పెంపునకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 • ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెంపునకు ప్రైవేటు రంగం తగిన చేయూతనివ్వాలి. నవకల్పనలు, వృద్ధి, ఉపాధి పెంపునకు మహిళా వ్యవస్థాపకత ఒక ముఖ్య కారకం.
 • వ్యాపారాలు ప్రారంభించే సమయంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యల కారణంగా జి-7 దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా సొంత వ్యాపారాల నిర్వహణలో పురు షులతో పోల్చినపుడు మహిళల సంఖ్య తక్కువగా ఉంది.
 • మహిళల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంపునకు జి-7 దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు ఇతర దేశాలు పాలుపంచుకోవచ్చు.

వాణిజ్యం
ఉపాధి, సుస్థిర వృద్ధికి వాణిజ్యం, పెట్టుబడి ప్రధానాంశాలు. వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును పెంపొందించాలి. రక్షణ విధానాలను వ్యతిరేకించడం ద్వారా ఆర్థిక వ్యవస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. పెట్టుబడులను పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వాణిజ్యంలో అడ్డంకులు తొలగించేందుకు పబ్లిక్ ఎక్స్‌పోర్ట్ ఫైనాన్స్‌కు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. అంతర్జాతీయ వర్కింగ్ గ్రూప్ రూపొందించే ప్రమాణాలకు జి-7 దేశాల మద్దతు ఉంటుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ బాలీ ప్యాకేజీ అమలుతో పాటు బహుళ వాణిజ్య వ్యవస్థ (Multilateral Trading System) నియమావళిని పటిష్టపరిచే విషయంలో వాణిజ్య సదుపాయ ఒప్పందం(టీఎఫ్‌ఏ) అమలుపై దృష్టిసారించాలి. ఈ విషయంలో జి-7 దేశా ల మద్దతు ఉంటుంది. అధిక ప్రమాణాలతో కూడిన నూతన ద్వైపాక్షిక, ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను జి-7 సదస్సు స్వాగతించింది. ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్‌షిప్ (టీపీపీ), ట్రాన్స్ అట్లాంటిక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పార్టనర్‌షిప్ (టీటీఐపీ)లతో పాటు ఐరోపా యూనియన్- జపాన్ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం విషయంలో జరుగుతున్న వాణిజ్య చర్చల పురోగతిని సదస్సు స్వాగతించింది.

అణుభద్రత
ప్రపంచ వ్యాప్తంగా అణుభద్రత అత్యంత ప్రాధాన్యతాంశం గా సదస్సు పేర్కొంది. జి-7 న్యూక్లియర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గ్రూప్ నివేదికను సదస్సు స్వాగతించింది. చెర్నోబిల్ షెల్టర్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యేందుకు కట్టుబడి ఉన్నట్లు సదస్సు స్పష్టం చేసింది. అణు కార్యకలాపాల తనిఖీ విషయంలో ఇరాన్.. అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు సహకరించాలని సదస్సు పిలుపునిచ్చింది. ఉత్తర కొరియా అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను ఖండించింది.

ఆరోగ్యం
ద్వైపాక్షిక కార్యక్రమాల ద్వారా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వలస ప్రజలు, శరణార్థుల ఆరోగ్య సంరక్షణపైనా దృష్టిసారించాలి. ప్రపంచ దేశాలు ఆరోగ్య రంగంలో తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకతను ఎబోలా సంక్షోభం సూచిస్తోంది. ఎబోలా కేసులను సున్నాకు తీసుకొచ్చేందుకు జి-7 కట్టుబడి ఉంది. ఎబోలా ప్రభావానికి గురైన దేశాలు తిరిగి పురోగమించేందుకు మద్దతు ఉంటుంది.

ఆహార భద్రత
సుపరిపాలన, ఆర్థిక వృద్ధి, మార్కెట్ల పనితీరు మెరుగుపడటం, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడులు వంటివి పౌష్టికాహారం మెరుగుపడేందుకు, ఆహార భద్రతకు దోహదపడతాయి. 2030 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 500 మిలియన్ ప్రజల్లో ఆకలి, పౌష్టికాహారలోపాన్ని పారదోలడం జి-7 లక్ష్యం. దీన్ని సాధించేందుకు జి-7 ఆహారభద్రత, పోషణ అభివృద్ధి విధానం తగిన చేయూతనిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చలనాత్మక మార్పులకు బాధ్యతాయుతమైన పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరముందని సదస్సు స్పష్టం చేసింది. వ్యవసాయ రం గంలో సుస్థిర అభివృద్ధి సాధనకు, సంక్షోభకాలంలో ఆహార భద్రత కల్పించేందుకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది.

తీవ్రవాదంపై పోరు
అంతర్జాతీయ సమాజం తీవ్రవాదం, హింసకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని సదస్సు గుర్తించింది. తీవ్రవాద ఆ లోచనా ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలకుండా నిరోధించే విషయంలో నేతలు మద్దతు తెలిపారు. తీవ్రవాద కార్యకలాపాల కారణంగా నష్టపోయిన ఇరాక్, ట్యునీషియా, నైజీరియాతోపాటు ఇతర దేశాలు,ప్రాంతాల విషయంలో ఆయా దేశాలతో కలిసికట్టుగా పనిచేయగలమని వెల్లడించారు.

ఇతర దేశాలకు ఆపన్న హస్తం
ఆఫ్రికాలో ప్రజాస్వామ్య సంస్థలను పటిష్టపరచడం, ఆర్థిక అవకాశాలను పెంపొందించాల్సిన ఆవశ్యకతను సదస్సు వెలిబుచ్చింది. తమ ఆఫ్రికన్ భాగస్వామ్య దేశాలలో భద్రత, పరిపాలన, సుస్థిరత పెంపునకు తాము కట్టుబడి ఉన్నట్లు నేతలు స్పష్టం చేశారు. మాలి, సూడాన్, దక్షిణ సూడాన్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, నైజీరియా, బురిండిలు భద్రత, సుస్థిరత, పాలన విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు తోడ్పాటు అందిస్తామని సదస్సు స్పష్టం చేసింది. అఫ్గానిస్థాన్‌లో సుస్థిరత, సంపద, ప్రజాస్వామ్య వ్యవస్థను మెరుగుపరిచే విషయంలో తమ మద్దతు ఉంటుందని జి-7 దేశాల అధినేతలు భరోసా ఇచ్చారు. ఇటీవల భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌కు అవసరమైన అత్యవసర సహాయాన్ని కొనసాగించగలమని నేతలు స్పష్టం చేశారు.
 • సమర్థవంతమైన వనరుల సమీకరణ, నిర్మాణాత్మక సంస్కరణల అమలు, ఉత్పాదకత పెంపు వంటి చర్యల ద్వారా వృద్ధిరేటును మెరుగుపరచుకోవాలి.
 • ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ‘విత్తవ్యూహాల్లో సరళత’ పాటించడం ద్వారా ఉపాధి కల్పన, వృద్ధిని మెరుగుపరచుకోవాలి.
 • కేంద్ర బ్యాంకులు అవలంబించే ద్రవ్యవిధానాలు.. ధరల స్థిరత్వం, ఆర్థిక పురోగమనానికి దోహదపడే విధంగా ఉండాలి.
 • మహిళల ఆర్థిక భాగస్వామ్యంలో ఎదురయ్యే సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, చట్టబద్ధమైన అడ్డంకులను తొలగించేందుకు, లైంగిక వేధింపుల నిర్మూలనకు జి-7 దేశాల మద్దతు ఉంటుంది.
Published date : 26 Jun 2015 04:45PM

Photo Stories