Skip to main content

గ్రీసు సంక్షోభం..

గ్రీసు చిన్న దేశమే అయినప్పటికీ గత ఐదేళ్లుగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను గమనించే వారిని, స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉన్న వారిని తన వైపు చూసేలా చేస్తోంది. నిధుల లేమితో సతమతమవుతూ అధిక రుణభారాన్ని భరించలేక యూరోజోన్ నుంచి వైదొలగుతుందేమోనన్న భయాన్ని కలిగించింది. ఒకవేళ అదే జరిగితే ఆ ప్రభావం బ్రిటన్‌పై, తద్వారా మొత్తం యూరోజోన్ ఆర్థిక వ్యవస్థమీద ప్రతికూల ప్రభావం చూపేది. ఈ పరిణామాల దృష్ట్యా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భయం గుప్పిట్లో ఉందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గ్రీసు ఆర్థిక పరిస్థితులను పరిశీలిద్దాం...

గ్రీసుకున్న అప్పులు కాస్తా 2010 ప్రారంభం నాటికి సంక్షోభానికి కారణమయ్యాయి. అంతకంటే ముందు 2009 చివర్లో గ్రీసు రుణభారంపై ప్రపంచవ్యాప్తంగా సందేహాలు, వదంతులు జోరందుకున్నాయి. తమ ఆదాయ, అప్పుల గణాంకాలను కూడా కచ్చితంగా అంచనా వేయలేని స్థితికి గ్రీసు ప్రభుత్వ రుణాలు పెరిగిపోయాయి. దాంతో ఆ దేశం అంతర్జాతీయ సహాయాన్ని అర్థించింది.

వ్యయ నియంత్రణ చర్యలపై వ్యతిరేకత
2010 ఏప్రిల్‌లో తొలి ఉద్దీపన కింద యూరోజోన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్‌ఎఫ్)లు 110 బిలియన్ యూరోలను గ్రీసుకు అందించాయి. అదేసమయంలో ఆర్థిక విధానాలు, సంస్కరణల విషయంలో కఠిన షరతులు విధించాయి. సంక్షోభం అంతకంతకూ పెరుగుతుండటం, వ్యయ నియంత్రణ చర్యలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం వంటివి గ్రీసు ప్రభుత్వానికి చికాకులు తెచ్చిపెట్టడంతో ఒప్పంద షరతులు పాటించడం కష్టమైంది. ఈ నేపథ్యంలో గ్రీసును కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి యూరోజోన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు 2012 ఫిబ్రవరిలో రెండో ఉద్దీపన పథకం కింద మరో 100 బిలియన్ యూరోలను సహాయం చేశాయి. అయితే తొలి ఉద్దీపన పథకం కంటే ఈసారి మరిన్ని కఠిన షరతులు విధించాయి. అధిక స్థాయిలో రుణం తీసుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల గ్రీసు ఆర్థిక వ్యవస్థ కుదుట పడకపోవడానికి కారణాలు...
  • 2008 అమెరికా ఆర్థిక సంక్షోభం ప్రభావం వల్ల జీడీపీ రేటు తగ్గడం
  • అధిక మొత్తంలో ఆర్థికలోటు ఏర్పడటం
  • ప్రభుత్వ రుణ పరిమితి పెరగడం
  • విదేశీ పెట్టుబడులు క్షీణించడం
  • నిరుద్యోగిత రేటు గరిష్టంగా 28శాతానికి పెరగడం
  • కరెంట్ అకౌంట్ లోటు పెరగడం
  • పన్నులు ఎగ్గొట్టడం, ప్రభుత్వ అవినీతి పెరగడం
  • ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగడం
  • అస్థిర ప్రభుత్వాలు పాలించడం
  • రుణపరపతి రేటింగ్ ఏజెన్సీలు, గ్రీసు రుణం పరపతి ర్యాంకును తగ్గిస్తూ రావడం

నియంత్రణ చర్యల నిలిపివేత:
సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో 2015, జనవరి 22న లెఫ్ట్ పార్టీ అయిన సిరిజా అధికారంలోకి వచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఆ పార్టీ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ ఉద్దీపన ఒప్పందంలో ఉన్న షరతులకు వ్యతిరేకంగా పలు వ్యయ నియంత్రణ చర్యలను నిలిపేశారు. అయితే గత ఒప్పందం ప్రకారం 2015, జూన్ 30లోగా 1.5 బిలియన్ యూరోలను ఐఎమ్‌ఎఫ్‌కు చెల్లించడంలో గ్రీసు విఫలమైంది. దాంతో అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రీసు మొదటి రుణ ఎగవేతదారుగా అపఖ్యాతి పొందింది.

ఈ పరిస్థితుల్లో గ్రీసు ప్రధాని అలెక్సిస్ సిప్రస్ అంతర్జాతీయ రుణదాత సంస్థలు విధించిన కఠిన నియంత్రణ చర్యలు అమలు చేయాలా? వద్దా? అనే విషయంపై 2015, జులై 5న ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తం 62.5 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా అందులో 61.3 శాతం మంది ఉద్దీపన షరతులకు ‘నో’ చెప్పారు. దీంతో గ్రీసు యూరోజోన్ నుంచి బయటకు వెళ్లి, నూతన కరెన్సీని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కొత్త కరెన్సీతో చికాకులు:
సంక్లిష్ట పరిస్థితుల మధ్య యూరో ప్రాంతాన్ని గ్రీసు వీడితే కొత్త కరెన్సీని (డ్రాక్మా) ప్రారంభించాలి. ఆ కొత్త కరెన్సీ యూరోతో పోలిస్తే 50 శాతం మేర పతనమయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే గుదిబండలా ఉన్న దిగుమతి, సేవలు కాస్తా కొండెక్కి కూర్చుంటాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంది. ఫలితంగా గీసు తీవ్రసంక్షోభం దిశగా పయనిస్తుంది. అదే జరిగితే మొదట బ్రిటన్‌పై, తర్వాత యూరో ప్రాంతంపై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, రష్యా తదితర దేశాలు కష్టకాలంలో ఉన్న గ్రీసు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మరోవైపు గ్రీసు నూతన ఆర్థిక మంత్రి కూడా కొత్త ప్రతిపాదనలతో యూరోజోన్ ముందుకు రావడం తాత్కాలికంగా ఉపశమన పరిణామాలుగా పరిగణించవచ్చు.

ఈ నేపథ్యంలో సంక్షోభ పరిష్కారానికి మూడు మార్గాలు ఉన్నాయి.
  • గ్రీసు రుణాలను యురోపియన్ యూనియన్ పూర్తిగా మాఫీ చేయడం
  • గ్రీసు యూరోను వదిలిపెట్టకుండానే కొత్త కరెన్సీ డ్రాక్మా లేదా సమాంతర కరెన్సీని ప్రవేశపెట్టడం
  • గ్రీసు యూరో నుంచి వైదొలిగి, సొంత కరెన్సీ ఏర్పాటు చేసుకోవడం

కానీ చివరి పరిష్కారం వల్ల మరికొన్ని దేశాలు(స్పెయిన్, పోర్చుగల్ లాంటివి) యూరోజోన్ నుంచి వైదొలిగితే పెను సంక్షోభానికి తెరలేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే తాజాగా ప్రజాభిప్రాయ సేకరణలో గ్రీసు ప్రజలు వ్యయ నియంత్రణ చర్యలకు ‘నో’ చెప్పినా, ఆర్థిక సంక్షోభం నుంచి గ్రీసును గట్టెక్కించడానికి కఠిన సంస్కరణలవైపు ఆ దేశ ప్రధాని అలెక్సిస్ ిసిప్రస్ మొగ్గు చూపారు. యురోపియన్ స్టెబిలిటీ మెకానిజమ్ నుంచి షరతులతో కూడిన 5350 కోట్ల యూరోల రుణాన్ని పొందేందుకు కొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చారు. అవి: విలువ ఆధారిత పన్నులు (వ్యాట్)లో కొత్త స్లాబులు; పర్యాటక దీవులకు ఇస్తున్న పన్ను ప్రయోజనాలను 2016 చివరి నాటికి ఎత్తివేత; 2019 కల్లా వేతనాల్లో కోత, సెలవు వేతనం, ప్రయాణ భత్యాలు తదితరాలను ఐరోపా కూటమి నిబంధనలకు అనుగుణంగా మార్పులు; ముందస్తు పదవీ విరమణ ఎత్తివేత. 2022 నాటికి పదవీవిరమణ వయసు 67 సంవత్సరాలకు పెంచడం. ఆరోగ్య కేటాయింపులు 4 శాతం నుంచి 6 శాతం పెంపు; సైనిక వ్యయంలో ఈ ఏడాది 10కోట్ల యూరోలు, వచ్చే ఏడాది 20కోట్ల యూరోల చొప్పున కోత; కార్పొరేటు పన్నులు 26 నుంచి 28 శాతానికి పెంపు. రైతులకు ఇంధన రాయితీ ఎత్తివేత; పన్ను వసూళ్ల క్రమబద్ధీకరణకు, అక్రమ రవాణా నియంత్రణకు స్వయం ప్రతిపత్తి ఉన్న కొత్త పన్నుల ఆదాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం.

ఈ ప్రతిపాదనలకు గ్రీసు చట్టసభలో ఓటింగ్ జరిగి, అంగీకారం కుదిరింది. రుణదాతలైన ఐరోపా యూనియన్, ఐఎంఎఫ్, ఐరోపా సెంట్రల్ బ్యాంకులు కూడా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, చివరకు ఐరోపా దేశాల ఆర్థికమంత్రులకు పంపారు. చాలా ఐరోపా దేశాలు ఈ ప్రతిపాదనలకు మొగ్గు చూపడంతో ఇది తుది ఆమోదంపొందే అవకాశం ఉంది.

భారత్‌పై ప్రభావం!
రుణదాతల నుంచి తదుపరి ఉద్దీపన ప్యాకేజీ షరతులను గ్రీసు ప్రజలు తోసిపుచ్చడం వల్ల ఏర్పడే పరిణామాల నుంచి తట్టుకొనే శక్తి భారత్‌కు ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయితే రూపాయి మారకం విలువపై ఆ ప్రభావం పడొచ్చని పేర్కొంది.

  • గ్రీసు సంక్షోభం నుంచి మనకు మూడు విధాలుగా రక్షణ ఉంది.
    1. స్థూల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండటం
    2. భారత్‌కు భారీ స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉండటం
    3. భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండటం.
  • భారత్‌కు గ్రీసుతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పెద్దగా లేకపోవడం వల్ల ఆ ప్రభావం పరిమితంగానే ఉండొచ్చు. కానీ, విదేశీ మారకం రేటు రూపంలో భారత్‌పై సంక్షోభ ప్రభావం ఉంటుంది.
  • గ్రీసు సంక్షోభం వల్ల భారత ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. ఎందుకంటే గ్రీసుకు మన ఎగుమతులేవీ లేవు. ఒకవేళ ఐరోపా యూనియన్ ఇబ్బందులు ఎదుర్కొంటే అప్పుడు భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది.
  • యూరోజోన్ బలహీనతల వల్ల భారత ఐటీ రంగం పైనా ప్రభావం ఉంటుంది.
  • గ్రీసు సంక్షోభం వల్ల భారత్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఐరోపాలో వడ్డీరేట్లు పెరిగితే, భారత్ నుంచి పెట్టుబడులు తరలి వెళ్లే అవకాశం ఉంది. మొత్తంమీద చూస్తే గ్రీసు సంక్షోభం భారత్‌పై చూపే ప్రభావం తక్కువే.

గ్రీసు సంక్షోభం కాలక్రమం
  • 2009 డిసెంబరు: క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, గ్రీసు రుణ పరపతి ర్యాంకును తగ్గించటం.
  • 2010, ఫిబ్రవరి 9: మొదటి వ్యయ నియంత్రణ చర్యలపై గ్రీసు పార్లమెంటు ఓటింగ్, ఆమోదం తెలపడం. ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలపై నియంత్రణ.
  • 2010, మార్చి 3: రెండో వ్యయ నియంత్రణ చర్యలపై గ్రీసు పార్లమెంటు ఆమోదం. ఫించన్లపై నియంత్రణ, కొన్ని నిత్యావసర వస్తువులపై పన్నును 19 నుంచి 21 శాతానికి పెంపు.
  • 2010, మే 2: అప్పటి గ్రీసు ప్రధాని పాపండ్రో, యూరోజోన్ దేశాధినేతల మధ్య ఆర్థిక సహకార ఒప్పందం (బెయిల్ అవుట్). ఐఎమ్‌ఎఫ్, యూరోజోన్‌లు కలిపి 110 బిలియన్ యూరోల రుణ సహాయం.
  • 2010, మే 5: వ్యయ నియంత్రణ చర్యలకు వ్యతిరేకంగా గ్రీసులో 48 గంటల బంద్‌కు ప్రజలు పిలుపునివ్వడం. శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి.
  • 2010, మే 6: మూడో వ్యయ నియంత్రణ చర్యలకు గ్రీసు పార్లమెంట్ ఆమోదం.
  • 2010, డిసెంబరు 15: గ్రీసు పార్లమెంటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల జీతభత్యాలపై కొత్త చట్టాన్ని ఆమోదించడం. ఈ చట్టం ప్రకారం ఉద్యోగుల నెలవారీ వేతనాలపై 10 శాతం కోత విధింపు.
  • 2011 నవంబరు: గ్రీసు వ్యయ నియంత్రణ చర్యల అమలుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా గ్రీసు ప్రధాని పాపండ్రో రాజీనామా. కొత్త ప్రధానిగా పాపడిమోస్ ఎన్నిక.
  • 2012 ఫిబ్రవరి: రెండో ఉద్దీపన (లేదా) ఆర్థిక సహకార ఒప్పందం (బెయిల్ అవుట్) కింద ఐఎంఎఫ్, యూరోజోన్ మరో 100 బిలియన్ యూరోల రుణ సహాయం.
  • 2015, జనవరి 25: గ్రీసు శాసనసభకు ఎన్నికలు, నూతన ప్రభుత్వంగా సిరిజా పార్టీ ఎన్నిక. ప్రధాని అలెక్సిస్ సిప్రస్ ఎన్నిక.
  • 2015, ఫిబ్రవరి 20: గ్రీసు రుణ చెల్లింపు గడువును నాలుగు నెలలపాటు పొడిగింపు. ఒప్పంద చర్చలు విఫలం.
  • 2015, జూన్ 4: వ్యయ నియంత్రణ చర్యల కోసం జూలై 5న రిఫరెండంను ప్రవేశపెడుతున్నట్లు గ్రీసు ప్రధాని ప్రకటన.
  • 2015, జూన్ 28: గ్రీసు పార్లమెంట్ జూలై 5న నిర్వహించే రిఫరెండంకు ఆమోదం.
  • 2015, జూన్ 30: ఐఎంఎఫ్‌కు తిరిగి రుణ చెల్లింపులో గ్రీసు విఫలమవడం. 2015, జూలై 5: వ్యయ నియంత్రణ చర్యలకు వ్యతిరేకంగా గ్రీసు ప్రజల ఓటు.
  • 2015, జూలై 6: నూతన ఆర్థిక మంత్రిగా ‘సకలోటస్’ నియామకం.
  • 2015, జూలై 16: కొత్త వ్యయ నియంత్రణ చట్టానికి గ్రీసు పార్లమెంటు ఆమోదం, యురోపియన్ దేశాధినేతల ముందుకు కొత్త చట్టంతో గ్రీసు చర్చలకు సుముఖం.
Published date : 20 Aug 2015 05:37PM

Photo Stories