Skip to main content

ఎఫ్‌డీఐలపై ప్రభుత్వ విధానం

ఆర్థికాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ముఖ్య సూచికగా భావించవచ్చు. ప్రతి ఆర్థిక వ్యవస్థలోని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల అభివృద్ధిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ప్రధాన భూమిక పోషిస్తాయి. విత్త వనరుల బదిలీ, సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత పెంపునకు ఎఫ్‌డీఐలు దోహదపడ్డాయి.భారతీయ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటంలో ఎఫ్‌డీఐల పాత్ర ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఎఫ్‌డీఐ విధానంపై ఫోకస్...
1991 తర్వాత భారతదేశం స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని అవలంబిస్తోంది. కొన్ని రంగాలు మినహా ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యకలాపాల్లో ఇతర దేశాలు, పెట్టుబడిదారుల పెట్టుబడులను అనుమతించింది. విదేశీ వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అనేక మౌలిక సౌకర్యాలను కల్పించింది. ఈ స్థితి భారత్ ధనాత్మక వృద్ధిని నమోదుచేసుకునేందుకు కారణమైంది. ఇప్పటివరకు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశంలో, అధిక ఎఫ్‌డీఐలను ఆకర్షించటం ద్వారా దేశంలో ఉత్పత్తి, ఉపాధి పెరిగాయి. తద్వారా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందటానికి గల అవకాశాలు మెరుగయ్యాయి.

నిబంధనలు సరళతరం
ఆర్థిక వృద్ధిని పెంపొందించటంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థలో రుణేతర విత్త వనరులకు ముఖ్య ఆధారంగా ఎఫ్‌డీఐలు నిలిచాయి. భారతదేశంలో తక్కువ వేతనం వద్ద పనిచేసే శ్రామికుల సంఖ్య అధికంగా ఉంది. పన్ను మినహాయింపుల వంటి ప్రోత్సాహకాల ద్వారా దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం అధికంగా ఉన్న దేశంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఉపాధి వృద్ధి అధికంగా ఉంటుంది. ముఖ్య రంగాలైన రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల చమురు శుద్ధి కర్మాగారాలు, టెలికాం, స్టాక్ మార్కెట్‌లలో ఇటీవల ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం సడలించింది.

మార్కెట్ పరిమాణం: ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్’ ప్రకారం 2014, ఫిబ్రవరిలో దేశంలోకి 36 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు ప్రవేశించాయి. 2015లో 44.9 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు చేరాయి. ఇదే కాలంలో విదేశీ పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు అనుమతి ద్వారా దేశంలోకి ప్రవేశించిన ఎఫ్‌డీఐలలో 26 శాతం పెరుగుదల ఏర్పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మెరుగుదల, ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించటం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఎఫ్‌డీఐల ప్రవాహం పెరిగింది. అవస్థాపనా, సేవల రంగాల్లో పెట్టుబడులు అధికమై, ఎఫ్‌డీఐల ప్రవాహంలో పెరుగుదల కనిపించింది. అవస్థాపనా రంగంలో చమురు, గ్యాస్, మైనింగ్, టెలికాంలు; సేవల రంగంలో.. ఐటీ సర్వీసులు, వాణిజ్య రంగాలు అధిక ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి.

2015, జూన్‌లో దేశంలోకి ప్రవేశించిన ఎఫ్‌డీఐల మొత్తం 2.05 బిలియన్ డాలర్లుగా నమోదైంది (2014 జూన్‌లో 1.9 బిలియన్ డాలర్లు). 2015, ఫిబ్రవరిలో దేశంలోకి ప్రవేశించిన ఎఫ్‌డీఐ మొత్తంలో మారిషస్ వాటాలు ఎక్కువ. తర్వాత స్థానాల్లో సింగపూర్, నెదర్లాండ్స్, జపాన్, అమెరికాలు నిలిచాయి. అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం స్థితి మెరుగుపడి, రూపాయి విలువలో స్థిరత్వం ఏర్పడింది.

అనుమతించిన ప్రతిపాదనలు (సెప్టెంబరు 29, 2015)
  • విదేశీ పెట్టుబడి ప్రోత్సాహక మండలి సిఫార్సులకు అనుగుణంగా రూ.5 వేల కోట్లు (770 మిలియన్ డాలర్లు) విలువైన ఎఫ్‌డీఐలను సెప్టెంబరు 29, 2015న జరిగిన సమావేశంలో 18 ప్రతిపాదనలను ప్రభుత్వం అనుమతించింది.

ముఖ్య ప్రతిపాదనలు
  • ముంబై సమీపంలోని తాలోజా (Taloja)లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పదార్థాల తయారీ కెల్లాగ్ కో (Kellogg Co).. మొదటి పరిశోధన, అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలో భాగంగా భారీ పెట్టుబడులు.
  • బెంగళూరు విమానాశ్రయం దగ్గరలో రూ.3,200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న తైవానీస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్.
  • మహారాష్ట్రలోని సతార్దాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పోస్కో కొరియా, శ్రీ ఉత్తమ్ స్టీల్‌తో ఒప్పందంపై సంతకం.
  • ముంబై, పుణే మధ్య తయారీ యూనిట్ ఏర్పాటులో భాగంగా, రాబోయే మూడేళ్లలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సంబంధించి ఫోక్స్‌కాన్ (Foxconn), మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం.
  • సెమీ హైస్పీడ్ ట్రెయిన్ సెట్స్ తయారుచేసేందుకు ప్రముఖ సంస్థలైన బాంబార్డియర్, హ్యుండాయ్, ఆర్‌ఓటీఈఎం, టాల్గో, సీఏఎఫ్‌లకు అనుమతి.
  • దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా, రూ. 12,500 కోట్ల పెట్టుబడి(1.9 బిలియన్ డాలర్లు)తో స్వీడిష్ హోం ఫర్నిషింగ్ బ్రాండ్‌ల 25 స్టోర్ల ఏర్పాటు.
  • రూ.1500 కోట్ల పెట్టుబడి (234.3 మిలియన్ డాలర్లు)తో హైదరాబాద్‌లో గూగుల్ నూతన క్యాంపస్ ఏర్పాటు.

యూఎన్‌సీటీఏడీ నివేదిక-2015
యూఎన్‌సీటీఏడీ(2015) నివేదిక ప్రకారం, ప్రపంచంలో 2014లో అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన మొదటి పది దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆర్థిక వ్యవస్థ పురోగమన నేపథ్యంలో 2015లో అధిక ఎఫ్‌డీఐలను భారత్ ఆకర్షించగలదని యూఎన్‌సీటీఏడీ పేర్కొంది. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో జాతీయ రహదారుల నిర్మాణం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు వంటి అవస్థాపనా సౌకర్యాల కల్పనకు భారత్‌కు ఒక ట్రిలియన్ డాలర్ల మేరకు నిధులు అవసరమవుతాయి. ఈ క్రమంలో ఎఫ్‌డీఐల మద్దతు భారత్‌కు అవసరం. 2014లో సర్వీసులు, టెలీకమ్యూనికేషన్లు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నిర్మాణరంగంలో అభివృద్ధి, విద్యుచ్ఛక్తి, ట్రేడింగ్, ఆటోమొబైల్ రంగాలు అధిక ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి.

ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు (నవంబరు, 2015)
15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం ఇటీవల సడలించింది. కొన్ని రంగాల్లో 49 శాతం ఎఫ్‌డీఐలను, కొన్నింటిలో 100 శాతం పెట్టుబడులకు అనుమతించింది. కొన్ని రంగాల్లో ముందస్తు అనుమతులు లేకుండా ఆటోమేటిక్ పద్ధతిలో పెట్టుబడులకు అంగీకరించింది. ఈ చర్యల ద్వారా వివిధ కీలక రంగాల్లో పెట్టుబడులు పెరిగి, ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇతర దేశాలపై దిగుమతుల కోసం ఆధారపడకుండా స్వదేశీ వస్తువుల విక్రయానికి సంస్కరణలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. సంస్కరణలు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రజల ఆర్థిక శ్రేయస్సు పెంపొందించటం ప్రాథమికమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు.

ముఖ్య రంగాల్లో సడలించిన నిబంధనలు
  • రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతానికి పెంచారు. అంతకు మించితే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతి తప్పనిసరి.
  • పూర్తయిన టౌన్‌షిప్‌లు, దుకాణ సముదాయాలు, మాల్స్, వాణిజ్య కేంద్రాల నిర్వహణలో ఏ విధమైన ముందస్తు అనుమతి అవసరం లేకుండా, ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి.
  • టెలిపోర్టులు, డెరైక్ట్ టు హోం, కేబుల్ నెట్‌వర్క్‌లు, మొబైల్ టీవీ, స్కైబ్రాడ్‌కాస్టింగ్ సర్వీసులో ఎఫ్‌డీఐ పరిమితిని 74 నుంచి 100 శాతానికి పెంపు. వీటికి సంబంధించి 49 శాతం వరకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి. అంతకన్నా ఎక్కువైతే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
  • వార్తలు కాని అంశాలు, వర్తమాన అంశాల అనుసంధానంలో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి.
  • వార్తా చానళ్లలో ఎఫ్‌డీఐల పరిమితి 49 శాతానికి పెంపు.
  • ఎఫ్‌ఎం రేడియో, ప్రభుత్వ మార్గంలోని వర్తమాన అంశాల టీవీ చానళ్లలో, ప్రభుత్వ ఆమోదం ద్వారా ఎఫ్‌డీఐల పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంపు.
  • ప్రాంతీయ విమానయాన సేవల్లో ఆటోమేటిక్ పద్ధతిలో 49 శాతం వరకు ఎఫ్‌డీఐల అనుమతి.
  • సాధారణ పౌర విమానయానం, విమాన నిర్వహణ సేవల్లో ఎఫ్‌డీఐల పరిమితి 74 నుంచి 100 శాతానికి పెంపు.
  • కాఫీ, రబ్బరు, పామాయిల్, యాలకులు, ఆలివ్ నూనె వంటి తోటల పెంపకంలో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐల అనుమతి.
  • స్థానిక, ప్రైవేటు బ్యాంకుల్లో 74 శాతం వరకు పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి.
  • ప్రస్తుత ఎఫ్‌డీఐ నిబంధన ప్రకారం, సింగిల్ బ్రాండ్ చిల్లర వర్తకంలో 30 శాతం వస్తువులను స్థానిక చిన్న పరిశ్రమల నుంచి సేకరించుకోవాలి. దీన్ని ఎఫ్‌డీఐ పెట్టిన తేదీ నుంచి ఇంతకుముందు పరిగణనలోకి తీసుకునేవారు. అయితే తొలి స్టోరు ప్రారంభించిన తేదీ నుంచి పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • రూ.5 వేల కోట్ల వరకు వచ్చే ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రోత్సాహక మండలికి అధికారం ఇచ్చింది.
  • సుంకంలేని దుకాణాల్లో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం పెట్టుబడులకు అనుమతించింది.
  • ప్రవాస భారతీయుల యాజమాన్యం, నియంత్రణలో ఉన్న కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సమ్మతించింది.
  • భారత తయారీదారులు తమ సొంత బ్రాండ్ ఉత్పత్తులను ఏ రూపంలో అయినా(ఈకామర్స్, టోకున లేదా చిల్లర వర్తకం) ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయించుకోవచ్చు.

ఎఫ్‌డీఐల ప్రవాహం వేగవంతం
2000-2014 మధ్యకాలంలో దేశంలోకి ప్రవేశించిన మొత్తం ఎఫ్‌డీఐలలో సేవా రంగం వాటా ఎక్కువ. తర్వాత స్థానాల్లో నిర్మాణం, అభివృద్ధి రంగాలు, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, డ్రగ్స్, ఫార్మా నిలిచాయి. ఇదే కాలానికి సంబంధించి ఎఫ్‌డీఐల ప్రవాహం కారణంగా వివిధ రంగాల జీడీపీ, ఉపాధి వృద్ధిలో పెరుగుదల ఏర్పడింది. ఇటీవల ప్రభుత్వ విధానం(ఎఫ్‌డీల నిబంధనల సడలింపు) కారణంగా ఎఫ్‌డీఐల ప్రవాహం పెరిగి అధిక ఆర్థిక వృద్ధి దిశగా భారత్ పయనించగలదని ఆశించవచ్చు.

వివిధ దేశాల నుంచి వచ్చిన ఎఫ్‌డీఐల మొత్తం (2000-2014)

దేశం

ఎఫ్‌డీఐలు (మిలియన్ డాలర్లలో)

మారిషస్

75,519

సింగపూర్

21,674

యూకే

17,622

జపాన్

14,785

అమెరికా

11,492


2000-2014 మధ్యకాలంలో భారత్‌కు సంబంధించి మారిషస్, సింగపూర్, యూకే, జపాన్, అమెరికాలు అతిపెద్ద పెట్టుబడిదారులుగా నిలిచాయి. ఈ కాలానికి సంబంధించి మొత్తం 135 దేశాల నుంచి 2,00,457 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను భారత్ ఆకర్షించింది. మారిషస్ వాటా 2000-2011 మధ్యకాలంలో 39.91 శాతం, 2011-12లో 28.30 శాతం, 2012-13లో 42.35 శాతం, 2013-14లో 26.27 శాతంగా నమోదైంది.
Published date : 20 Nov 2015 12:55PM

Photo Stories