Skip to main content

భారత ఆర్థిక, వ్యాపార వాతావరణం

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ.. ఆర్థిక వ్యవస్థ పురోగతిలో అంతర్భాగంగా ఉంది. పటిష్ట పార్లమెంటరీ వ్యవస్థ, సాంకేతిక పురోగతి, పోటీ ధరల వద్ద నాణ్యమైన వనరుల లభ్యత వంటివి భారత్‌లో వృద్ధిరేటు పెరుగుదలకు దోహదపడ్డాయి.
ఉత్పత్తిదారులు, కొన్ని సేవల కారణంగా భారత్.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు)కు కేంద్రంగా నిలిచింది. ప్రజాస్వామ్యం, డెమోగ్రఫీ, డిమాండ్ తదితర అంశాల కారణంగా భారత్‌లో వ్యాపార వాతావరణం మెరుగైంది.

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందింది. ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించింది. 2025 నాటికి తయారీ రంగ ఉత్పత్తి విలువ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. తద్వారా జీడీపీలో తయారీ రంగం వాటా 25 శాతానికి చేరి.. 90 మిలియన్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.

ప్రభుత్వం సరళీకృత విధానాల ద్వారా పెట్టుబడిదారులు భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. దీంతో అనేక బహుళజాతి కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయి.

‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్’.. దేశంలో వ్యాపార నిర్వహణను ప్రోత్సహించేలా మార్గదర్శకాలు, విధానాలు రూపొందించడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ప్రస్తుత నిబంధనలను సులభతరం చేయడం, సాంకేతికతను ప్రవేశపెట్టడం, పటిష్టమైన నిర్వహణ తదితరాలపై దృష్టిసారించింది.

భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 8 బిలియన్ డాలర్ల వ్యయంతో 100 స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేస్తోంది. రవాణా, పునరుత్పాదక శక్తి, గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల ఏర్పాటు, అవస్థాపనా సౌకర్యాల కల్పన వంటి అంశాల్లో విదేశీ కంపెనీలు సైతం భాగస్వామ్యులవుతున్నాయి. ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్, అహ్మదాబాద్-ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్, చెన్నై-బెంగళూరు; వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటులో పురోగతి ఏర్పడింది.

పారిశ్రామిక నగరాలు, పట్టణాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించేలా.. ప్రభుత్వం అనేక వ్యూహాత్మక ప్రదేశాలను అభివృద్ధి చేస్తోంది.

ప్రభుత్వ చర్యలు
  • ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా అర్హత గల 1,78,184 గ్రామీణ నివాస ప్రాంతాల్లో 85 శాతానికి రోడ్డు సౌకర్యం కల్పించారు.
  • ఏప్రిల్ 2015-నవంబర్ 2017 మధ్యకాలంలో 15,183 గ్రామాలకు విద్యుదీకరణ సౌకర్యం.
  • రాబోయే రెండేళ్లలో బ్యాంకులకు 2.11 ట్రిలియన్ రూపాయలను రీక్యాపిటలైజ్ చేయాలని నిర్ణయం.
  • రాబోయే 5 సంవత్సరాల కాలంలో రోడ్లు, హైవేల నిర్మాణానికి 7 ట్రిలియన్ డాలర్లు వెచ్చించాలని ఆలోచన.
  • ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను భారత్, జపాన్ సంయుక్తంగా చేపడతాయి.
  • ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 2018-20 మధ్యకాలంలో రోడ్ల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు వ్యయం చేయాలని నిర్ణయం.
  • మిషన్ అంత్యోదయ కింద గ్రామ పంచాయతీలు, ప్రైవేటు కంపెనీలు, సామాజిక సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించి.. గ్రామీణాభివృద్ధిని సాధించేలా ప్రణాళికల రూపకల్పన.
  • ద్వంద్వ పన్నుల వ్యవస్థ, నానో టెక్నాలజీ, ఔటర్ స్పేస్ రంగాల్లో భారత్, పోర్చుగల్ మధ్య 11 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి.
  • భారత రెవెన్యూ రాబడులు 2019 నాటికి 28 నుంచి 30 ట్రిలియన్ రూపాయలుగా ఉంటాయని అంచనా.
వ్యాపార వాతావరణం-ప్రగతి
  • 2017లో ప్రాథమిక మార్కెట్ ద్వారా భారతీయ కంపెనీలు 1.6 ట్రిలియన్ రూపాయలు సమీకరించాయి.
  • 2017 ఏప్రిల్-అక్టోబర్ కాలంలో భారత్ 17,412 మిలియన్ డాలర్ల నికర పెట్టుబడులను ఆకర్షించింది.
  • కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కంపెనీలు చేసే వ్యయం వెల్లడి విషయంలో భారత్‌కు చెందిన 100 కంపెనీలు ముందంజలో ఉన్నాయి.
  • సులభతర వాణిజ్యంలో (2018) భారత్ 100వ స్థానం పొందింది.
  • కొనుగోలు శక్తిసామ్యం (పీపీపీ) ఆధారంగా తలసరి జీడీపీలో భారత్ 126వ స్థానంలో ఉంది.
  • సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఆధార్, బ్యాంక్ ఖాతాల అనుసంధానం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీల పరంగా సబ్సిడీలకు సంబంధించి భారత్ 10 బిలియన్ డాలర్లను ఆదా చేస్తోంది.
  • 2025 నాటికి 1,00,000 స్టార్టప్‌లు ఏర్పాటై.. 3.25 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
  • 2017-18తో పోల్చితే 2018-19 కేంద్ర బడ్జెట్ వ్యయంలో పెరుగుదల 9 శాతం. తద్వారా దేశంలో అవస్థాపనా సౌకర్యాలపై వ్యయం పెరిగి, ఆర్థిక వృద్ధి వేగవంతం కానుంది.
  • సరళీకరణ విధానాల అమలు నేపథ్యంలో 2016-17లో భారతదేశం 43.4 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది.
  • వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 2017, నవంబర్‌లో భారత వస్తు ఎగుమతుల్లో 30.55 శాతం వృద్ధి నమోదైంది.
తక్షణ అవసర చర్యలు
  • చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ శ్రామికుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేసేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరిగి వృద్ధి వేగవంతమవుతుంది.
  • అవస్థాపనా సౌకర్యాలపై ప్రభుత్వ రంగ పెట్టుబడుల పెరుగుదల.. పారిశ్రామికీకరణను వేగవంతం చేస్తుంది. తద్వారా తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
  • భారత ప్రజల సగటు వయసు 2020 నాటికి 29 సంవత్సరాలుగా ఉండి.. భారత్ ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీగా అవతరిస్తుందని అంచనా. 2030 నాటికి పనిచేసే జనాభా 962 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ క్రమంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకునేలా యువతలో నైపుణ్యాలు పెంపొందించాలి.
  • మానవాభివృద్ధిని మెరుగుపరిచే చర్యల్లో భాగంగా విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి. ప్రస్తుతం భారత్ ఆరోగ్యంపై చేసే వ్యయం జీడీపీలో 1.3 శాతం కాగా, చైనా 3 శాతాన్ని, అమెరికా 8.3 శాతాన్ని వెచ్చిస్తున్నాయి. మానవాభివృద్ధి వనరుల అభిలషణీయ వినియోగం.. ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తుంది.
  • దేశంలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమై.. ప్రాంతీయ సమతౌల్యం దెబ్బతింది. ఈ క్రమంలో వెనకబడిన ప్రాంతాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
  • ఉపాధి సామర్థ్యం కలిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలు, వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి.
  • సేవారంగంలో ఉపాధి సామర్థ్య రంగాలైన పర్యాటకం, రవాణా, ఆర్థిక సేవలు తదితరాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
  • సమష్టి డిమాండ్ పెరుగుదలకు తీసుకునే చర్యలు ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని గుర్తించి.. తదనుగుణంగా ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలి.
సారాంశం
వినియోగం పెరగడం, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి నేపథ్యంలో భారత్‌తోపాటు ఆగ్నేయాసియా దేశాలు సుస్థిర ఆర్థికాభివృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ 2025 నాటికి ఐదో అతిపెద్ద వినియోగ మార్కెట్‌గా అవతరిస్తుందని అంచనా. ప్రస్తుత భారత వినియోగం నాలుగు రెట్లు పెరిగి 2025 నాటికి 1.06 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. పటిష్ట ఆర్థిక పునాదులు, సహజ-మానవ వనరులు లభ్యత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో వృద్ధి, పట్టణీకరణ, మధ్యతరగతి వినియోగదారుల్లో పెరుగుదల తదితర అంశాలు.. భారత్, ఆసియాన్‌ల అధిక వృద్ధికి దోహదపడుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం భారత్ 2022 నాటికి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (జర్మనీని వెనక్కినెట్టి) నిలవనుంది.
Published date : 02 May 2018 04:20PM

Photo Stories