Skip to main content

భారత ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు..

ఆర్థిక సర్వే 2015-16ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 26న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వాతావరణం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ భారత్ 2014-15లో 7.2 శాతం, 2015-16లో 7.6 శాతం వృద్ధి సాధించినట్లు ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందినట్లు పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం ప్రపంచ వృద్ధి సగటు 2014లో 3.4 శాతం కాగా, 2015లో 3.1 శాతం. భారత ఆర్థిక వాతావరణంలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, సంస్కరణలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను సర్వే సూచించింది.
సర్వే ప్రస్తావించిన అంశాలు
భారతదేశ దీర్ఘకాల సామర్థిత వృద్ధి ఇంకా 8 శాతం నుంచి 10 శాతంగానే ఉంది. మూడు అంశాలపై దృష్టిసారించడం ద్వారా దీన్ని పెంచుకోవచ్చు. అవి.. 1. మార్కెట్ వ్యతిరేక విధానాలకు భారత్ దూరంగా ఉండాలి. 2. దేశ జనాభా వల్ల ప్రయోజనం పొందాలంటే విద్య, ఆరోగ్య రంగంలో అధిక పెట్టుబడులు పెట్టాలి. 3. చలనాత్మక రంగాలైన సేవలు, తయారీ రంగం ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురికాకూడదు.
  • దేశంలో 42 శాతం కుటుంబాలు తమ ఆదాయంలో అధిక భాగాన్ని వ్యవసాయ కార్యకలాపాల ద్వారానే పొందుతున్నాయి. ఉత్పాదకత పెంపు, వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మలచుకోకపోవడం, మార్కెట్లో ఒడుదుడుకులు కారణంగా చిన్న రైతులు, వ్యవసాయ శ్రామికుల ఆదాయాల్లో క్షీణత ఏర్పడింది. కొత్తగా ప్రవేశపెట్టిన పంట బీమా పథకం రైతులు సమస్యల నుంచి గట్టెక్కడానికి ఉపకరిస్తుంది.
  • దశాబ్దం కిందట జీడీపీలో తయారీ వస్తు, వస్తు సేవల ఎగుమతి వాటా 11 శాతం కాగా, ప్రస్తుతం అది 18 శాతానికి పెరిగింది.

పోటీతత్వ సమాఖ్య
ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమవుతున్నాయి. అధిక పెట్టుబడులు.. ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి పెంపునకు దోహదపడతాయి. శ్రామిక చట్టాలను సవరించడం ద్వారా అధిక వృద్ధి పరిశ్రమలను ఆకర్షించడానికి రాజస్థాన్ ప్రయత్నిస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలు కూడా ఇదే మార్గంలో ప్రయాణించడానికున్న అవకాశాలను పరిశీలిస్తున్నాయి. నైపుణ్యం లేని శ్రామికులకు సాధారణ తయారీ రంగంలో అధిక ఉపాధిని కల్పించే సామర్థ్యాన్ని కొన్ని కంపెనీలు కలిగి ఉన్నాయి. చైనాతో పాటు తమిళనాడు తయారీ ఉత్పత్తుల కేంద్రాలుగా రూపొందడానికి మెరుగైన ఉపాధి లభ్యత, వేతన స్థాయిలే కారణం. దేశంలో పోటీతత్వ సమాఖ్య చాలా పోటీతత్వం ఉన్నదిగా రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వస్తు-సేవల పన్ను
భారత పన్నుల వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని సర్వే పేర్కొంది.. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలి. పన్ను-జీడీపీ నిష్పత్తి పెరగాల్సిన అవసరముంది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ను వేగవంతంగా అమలు చేయాల్సిన అవసరముంది. సంపన్న వర్గాలకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించాలి. దేశంలోని పౌరులందరూ ఉపయోగించుకునే అత్యవసర సేవలైన ప్రజా మౌలికవసతులు, శాంతిభద్రతలు, కాలుష్యం తగ్గించే అంశాలకు వ్యయం పరంగా ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి.
  • పారదర్శకతను పెంపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల కోశ సామర్థ్యం పెరగాలి. సంపద పన్ను పురోగామి పన్ను కాబట్టి, ఆ విధమైన పన్నును అభివృద్ధిపరచాలి.
  • భారతదేశ పట్టణ భవిష్యత్తు కోణంలో చూస్తే స్మార్ట్ నగరాలకు స్మార్ట్ పబ్లిక్ ఫైనాన్స్, పటిష్ట సంపద పన్ను విధానం అవసరం.

వ్యవసాయ రంగం
గత రెండేళ్లుగా దేశంలో కరువు పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో వృద్ధి క్షీణించింది. ముఖ్య పంటల కిందున్న విస్తీర్ణం తగ్గింది. దాంతో పాటే ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు సుస్థిర జీవన ప్రమాణాలు అందించడానికి, ఆహార భద్రతను కల్పించేందుకు వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి.
  • వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు, సమర్థవంతమైన నీటిపారుదల పరిజ్ఞానంపై పెట్టుబడులు, ఉత్పాదితాల సమర్థ వినియోగం వ్యవసాయ రంగంలో వృద్ధి పెంపునకు దోహదపడతాయి.
  • ఎరువుల రంగంలో విస్తృత సంస్కరణలు తీసుకురావాలి. రైతులకు యూరియాపై స్థిర రాయితీని నేరుగా చెల్లించడం ద్వారా యూరియా మార్కెట్‌పై నియంత్రణను తొలగించాలి.
  • యూరియా దిగుమతులపై ఆంక్షలు తొలగించాలి. రాయితీపై రైతులకిచ్చే ఎరువుల పరిమాణంపై పరిమితి విధించాలి.
  • రాబోయే కాలంలో కొరత ఏర్పడేందుకు అవకాశమున్న వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి తగిన చర్యలు తీసుకోవాలి.
  • రైతుల్లో వ్యవసాయంపై ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కనీస మద్దతు ధరలను ఖరీఫ్ సీజన్‌కు ముందే ప్రకటించాలి.
  • సాగునీటి వసతులను మెరుగుపరచేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర ఉపాధి పథకాల నిధులను ఉపయోగించాలి.
  • ప్రైవేటు రంగంలో విత్తనాభివృద్ధి పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తే, విత్తనాల మార్కెట్లో పోటీ పెరిగి, నాణ్యమైన విత్తనాలు బయటకొస్తాయి.

పారిశ్రామిక రంగం
దేశంలో అధిక వృద్ధి సాధనలో పారిశ్రామిక రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. 2015-16లో తయారీ రంగంలో ప్రగతి కారణంగా పారిశ్రామిక రంగంలో అధిక వృద్ధి నమోదైంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణకు, అవస్థాపనా రంగ ప్రగతికి ఉపయోగపడ్డాయి.
  • మేకిన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్‌సిటీస్ కార్యక్రమాలు రాబోయే కాలంలో దేశ ఆర్థిక వృద్ధికి ఇంజన్ వంటి పారిశ్రామిక రంగానికి తోడ్పడే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారం చేయడం సులభం)- 2016 నివేదిక ప్రకారం 2015లో భారత్ స్థానం 142 కాగా, 2016లో 130వ స్థానంతో ర్యాంకును మెరుగుపరచుకుంది.

సేవారంగం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం చలనాత్మక రంగంగా రూపొందింది. ఇది విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడమే కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన రంగంగా నిలిచింది. కానీ, ప్రపంచ వృద్ధి మందగమనం ఈ రంగంపైనా ప్రభావం చూపింది. ఇటీవలి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను పరిశీలిస్తే.. చైనా, భారత్, అమెరికా వంటి దేశాల్లో సేవారంగ సానుకూలత కనిపిస్తోంది. చైనాలో 2015లో సేవారంగ వృద్ధి 8.3 శాతం కాగా, పారిశ్రామిక అభివృద్ధి మందగించింది. అమెరికాలో 2015లో వాస్తవిక జీడీపీ వృద్ధి 2.4 శాతం కాగా, సేవలపై వ్యక్తిగత వినియోగ వ్యయంలో వృద్ధి 2.8 శాతంగా నమోదైంది. భారతదేశంలో 2014లో సేవారంగంలో వృద్ధి 10.3 శాతం కాగా, 2015-16లో 9.2 శాతంగా ఉంది.

సర్వే ముఖ్యాంశాలు
  • 2015-16లో ఆర్థిక వృద్ధిరేటును 7.6 శాతంగా సర్వే అంచనాలు పేర్కొన్నాయి.
  • 2016, జనవరి నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 349.6 బిలియన్ అమెరికన్ డాలర్లు.
  • అల్ప ద్రవ్యోల్బణం కొంత కాలంగా కొనసాగడం వల్ల ధరల స్థిరత్వంపై విశ్వాసం పెరిగింది.
  • 2017, మార్చి చివరినాటికి రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్బణ లక్ష్యం 5 శాతాన్ని సాధిస్తుంది.
  • 2016-17లో జీడీపీ వృద్ధిరేటు 7 నుంచి 7.75 శాతంగా ఉండగలదు.
  • 2016-17లో సబ్సిడీ బిల్లు జీడీపీలో 2 శాతం లోపు ఉంటుంది.
  • 2015-16లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో వృద్ధి 3.1 శాతం.
  • ముందస్తు అంచనాల ప్రకారం 2015-16లో పారిశ్రామిక రంగంలో వృద్ధి 7.3 శాతం.
  • రాయితీపై ఇచ్చే వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి పదికి తగ్గించాలి.
  • దేశంలో ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సంస్కరణలు వేగం పుంజుకోవాలి.
  • సంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ చర్యల కారణంగా రూ.45,000 కోట్ల ఆదాతో పాటు 21,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తగ్గుతుంది.
  • ప్రస్తుత పన్ను చెల్లింపు పరిధిలో ఆదాయం ఆర్జిస్తున్న వర్గం 5.5 శాతం మాత్రమే ఉండగా, వారిని 20 శాతానికి పెంచాలి.
  • 2016-17లో లక్ష్యానికి తగిన విధంగానే ద్రవ్యలోటు ఉంటుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్య సాధన కష్టతరమవుతుంది.
  • పొదుపు పథకాలపై పన్ను ప్రయోజనాలు ఉండకూడదు.
  • అసంఘటిత రంగం ఉపాధి కల్పించినందువల్ల నిరుద్యోగిత స్థాయి తగ్గింది.
  • భారతదేశంలో స్థూల ఆర్థిక వాతావరణం మెరుగుపడినందు వల్ల పెట్టుబడుల కేంద్రంగా నిలుస్తుంది.
  • ఎరువుల రంగానికి సంస్కరణ ప్యాకేజీ అవసరం
  • ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను భారతీయులందరికీ ప్రత్యేకంగా పేద, నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలకు సాంఘిక భద్రత కల్పించడానికి ప్రారంభించారు.
  • పాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానం పొందింది. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ వాటా 18.5 శాతం.
  • ఏడో వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాల్లో ఏర్పడే పెరుగుదల ధరలను అస్థిరపరచదు. ద్రవ్యోల్బణంపై కొద్దిపాటి ప్రభావం చూపుతుంది.
  • ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద 200 మిలియన్ల ప్రజలకు బ్యాంకింగ్ ఖాతాలు తెరిచారు.

ప్రస్తుత మూల ధరల వద్ద గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) లో వివిధ రంగాల వాటా:

2011-12

2014-15

ప్రభుత్వ రంగం

20.6

19.4

ప్రైవేటు కార్పొరేట్ రంగం

33.9

35.9

గృహ రంగం

45.5

44.8


ముఖ్య సూచికలు

విభాగం

యూనిట్

2014-15

2015-16

జీడీపీ (2011-12 ధరలు)

రూ.కోట్లు

10552151 (1ఆర్)

11350962 (ఏఈ)

వృద్ధి రేటు

శాతాల్లో

7.2

7.6

మూల ధరల (2011-12 ధరలు) వద్ద జీవీఏ

రూ.కోట్లు

9727490 (1ఆర్)

10437579 (ఏఈ)

వృద్ధి రేటు

శాతాల్లో

7.1

7.3

పొదుపు రేటు

జీడీపీలో శాతం

33

ఎన్‌ఏ

తలసరి నికర జాతీయాదాయం

(ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద)

రూ.

86879

93231

గమనిక: 1 ఆర్: మొదటి సవరించిన అంచనాలు; ఏఈ: ముందస్తు అంచనాలు; ఎన్‌ఏ: అందుబాటులో లేదు
Published date : 01 Apr 2016 02:11PM

Photo Stories