Skip to main content

భారత ఆర్థిక రంగంలో బ్యాంకుల విలీనం

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.
2007లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని వణికించింది. ఈ పరిణామ ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై మొదట్లో అంతగా లేదు. అయితే 2008 సెప్టెంబర్ నుంచి సంక్షోభం తీవ్రమవడంతో అమెరికా, ఐరోపాలోని ముఖ్య విత్త సంస్థలు విలవిల్లాడాయి. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మూలధన ప్రవాహ ం తగ్గింది. ఈ అనుభవాలను గుణపాఠాలుగా మలచుకొని పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ విత్త వ్యవస్థలో విలీన ప్రక్రియను వేగవంతం చేశాయి. అలాంటి సంస్కరణలు చేపట్టిన దేశాల్లో భారత్ కూడా ఒకటి.

2008 ఆర్థిక సంక్షోభం- పరిణామాలు:
సెప్టెంబర్ 2008లో బ్రాడ్‌ఫర్డ్ అండ్ బింగ్లే అనే తనఖా బ్యాంకును యునెటైడ్ కింగ్‌డమ్ జాతీయం చేసింది. ఐస్‌లాండ్ ప్రభుత్వం కొన్ని బ్యాంకులను మూసేసింది. బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ ప్రభుత్వాలు బ్యాంకింగ్, బీమా కంపెనీలలో 49.9 శాతం వాటాను కొనుగోలు చేశాయి. కాగా జర్మనీ ప్రభుత్వం బ్యాంక్ బెయిల్ అవుట్ ప్లాన్‌ను ప్రకటించింది. యూరోపియన్ ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. అధిక ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థలలో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం అభివృద్ధి చెందుతున్న దేశాలకు విస్తరించి వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థిక సాయం లాంటి అంశాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, చైనాలపైనా కనిపించింది.

విలీనాలకు దారితీసిన పరిస్థితులు:
అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాంకింగ్ సంస్థలు నిర్వహించే ఆర్థిక వ్యవస్థల్లో అనువైన వాతావరణం ఉంది. దీంతో బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకొంది. అంతర్జాతీయ ఆర్థిక వాతావరణంలో వచ్చిన మార్పులతో బ్యాంకుల పాత్ర, నిర్మాణత, విధులు, సేవల విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగం రాణించాలంటే అధిక మూలధనాన్ని సమీకరించాలి. పెట్టుబడి సంస్థలలో అధిక లాభాలకువాటాదార్ల నుంచి ఒత్తిడి పెరగడం, ఇంటా, బయటా పెరుగుతున్న పోటీ వాతావరణం నేపథ్యంలో ప్రతిఫలం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ అంశాలన్నీ విత్త సంస్థల మధ్య విలీనాలకు దారితీశాయి.

భారత్‌లో బ్యాంకింగ్ రంగ స్థితి:
భారత విత్త మార్కెట్‌లో సంస్కరణల ఆర్థిక రంగంలో నవకల్పనలకు చోటు లేదు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతర కాలంలో బ్యాంకింగ్ రంగం కొంతమేర పుంజుకొన్నప్పటికీ, గత రెండేళ్ల కాలంలో దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు మందగించింది. 2012-13లో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల సమష్టి బ్యాలెన్స్ షీటులో వృద్ధి తగ్గింది. ముఖ్యంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి పరపతి వృద్ధిలో తగ్గుదల అధికంగా ఉంది. మౌలిక రంగానికి లభించిన పరపతిలోనూ ఇదే పరిస్థితి. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు లభించిన పరపతిలో క్షీణత కారణంగా సేవారంగ వృద్ధి తగ్గింది. 2012-13లో ప్రభుత్వ సెక్యూరిటీలపై బ్యాంకింగ్ రంగ పెట్టుబడులతోపాటు వడ్డీ రూపేణా రాబడులు సన్నగిల్లాయి. వడ్డీ రూపేణా ఆర్జించిన ఆదాయం కంటే బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో బ్యాంకుల నిర్వహణ, నికర లాభాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఆమోదయోగ్యంకాని (నాన్ అప్రూవ్డ్) సెక్యూరిటీలకు సంబంధించి బ్యాంకింగ్ రంగ పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2011-12లో ఆస్తుల నుంచి లభించిన ప్రతిఫలం (Return on assets), ఈక్విటీల నుంచి రాబడి (Return on equity) తగ్గింది. 2013 మార్చి నాటికి Capital to risk weighted assets ratio లోనూ ఇదే పరిస్థితి.

రికవరీ కాని రుణాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన స్థితి కుంటుపడిన కారణంగా బ్యాంకింగ్ రంగ ఆస్తుల నాణ్యత తగ్గింది. పర్యవసానం స్థూల రికవరీ కాని రుణాలు (ఎన్‌పీఏ) పెరిగాయి. 2011-12 బ్యాంకింగ్ రంగంలో స్థూల ఎన్‌పీఏల వాటా మొత్తం రుణాలలో 3.1 శాతం కాగా 2012-13లో 3.6 శాతానికి పెరిగింది.

ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపు ఆస్తుల నాణ్యతలో తగ్గుదల ఏర్పడింది. 2013 మార్చి చివరి నాటికి ఈ గ్రూపు ఎన్‌పీఏ (రికవరీ కాని రుణాలు) నిష్పత్తి 5 శాతం కంటే అధికం కాగా తరువాత స్థానంలో జాతీయం చేసిన బ్యాంకుల ఎన్‌పీఏలు ఉన్నాయి. మార్చి 2010లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు రూ. 59,972 కోట్లు. అవి కాస్త మార్చి 2014 నాటికి రూ.2,04,249కోట్లకు పెరిగాయి.

2008-09లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు మొత్తం రుణాలలో 2.09 శాతం ఉంటే, మార్చి 2014 నాటికి 4.4 శాతానికి పెరిగాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభ అనంతర కాలంలో బ్యాంక్ గ్రూపుల్లోనూ, బ్యాంకింగ్ వ్యవస్థలోని ఇతర బ్యాంకులలోనూ ఆస్తుల నాణ్యత లోపించింది. 2013-14లో ప్రైవేట్ రంగ బ్యాంకులు అందించిన పరపతిలో తగ్గుదల కనిపించింది. 2012-13లో ప్రభుత్వ ఆమోదిత సెక్యూరిటీలపై 28 శాతం ఉన్న వాణిజ్య బ్యాంకుల పెట్టుబడులు మార్చి 2014 నాటికి 26.9 శాతానికి పడిపోయాయి.

పెట్టుబడి - డిపాజిట్ నిష్పత్తి మార్చి 2013లో 29.7 శాతం ఉంటే, 2014 మార్చి చివరి నాటికి 28.7 శాతానికి తగ్గింది. 2013-14లో వాణిజ్య బ్యాంకులు వ్యవసాయ రంగానికి అందించిన పరపతిని తగ్గించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రాధాన్యతా రంగానికి అందించిన పరపతిలో ఇటీవల కాలంలో పెరుగుదల ఏర్పడినప్పటికీ, రికవరీ కాని రుణాల ప్రభావం భారంగా మారింది. ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా ఇదే అవస్థను ఎదుర్కొంటున్నాయి.

విలీన ప్రక్రియ -పరిశీలించే అంశాలు
బ్యాంకుల మధ్య విలీనం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
 1. కొనుగోలు చేసే బ్యాంకు లక్ష్యాలు, వ్యూహాలు
 2. కొనుగోలుకు లోనయ్యే బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు, అనుబంధ విధులు, పరిపాలన, శ్రామిక లక్షణాలు
 3. జాతీయ, అంతర్జాతీయ సాధారణ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు.
 4. బ్యాంకుల సంపదపై సమీక్ష
 5. విలీన ప్రక్రియలో ఎదురయ్యే న్యాయ సంబంధ సమస్యలు
 6. రాబడి, లాభదాయకతలో పురోగమనం
 7. ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడం
 8. శ్రామికశక్తి రేషనలైజేషన్, ఉద్యోగ బాధ్యతల పునః పంపిణీ
 9. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న షేర్ల ధరలు
 10. నికర వర్కింగ్ కేపిటల్
బ్యాంకుల విలీనం-ప్రయోజనాలు
 1. బ్యాంకుల విలీనంతో పెద్ద విత్త సంస్థ ఏర్పడుతుం ది. దీనివల్ల సేవల విస్తృతి పెరుగుతుంది. సాంకేతికత, యాజమాన్య, మార్కెటింగ్ పరంగా అభివృద్ధి చెందుతుంది. నష్ట భయాన్ని నివారించే సామర్థ్యం ఏర్పడుతుంది.
 2. వివిధ వ్యయాలలో తగ్గుదల ఏర్పడి విత్త సంస్థ లాభదాయకత పెరుగుతుంది. 1960-1983 మధ్య కాలంలో వాణిజ్య బ్యాంకుల మధ్య జరిగిన విలీనాలు, అక్విజన్స్ కారణంగా పశ్చిమ ఐరోపా, అమెరికా దేశాల్లోని బ్యాంకింగ్ రంగంలో కాస్ట్ సేవింగ్ 15 శాతానికి పెరిగినట్లు అంచనా. 2000-2009 సంవత్సరాలకు సంబంధించి ఆగ్నేయ ఐరోపా, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ వ్యవస్థలలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ గ్రీస్, విలీనం చేసిన విత్త సంస్థలలో కాస్ట్ సేవింగ్ 25 శాతంగా అంచనా. విలీనాల వల్ల ప్రత్యేకీకరణ జరిగి యాజమాన్య పరమైన ప్రయోజనాలను విత్తసంస్థలు పొందాయని గత అనుభవ పూర్వక ఆధారాలు చెబుతున్నాయి.
 3. బ్యాంకుల విలీనంతో విత్త వ్యవస్థలో పరిమిత స్వామ్యం (ైజీజౌఞౌడ) మార్కెట్ ధోరణులు ఏర్పడతాయి. తక్కువ సంఖ్యలో పరపతి సంస్థలు విత్త మార్కెట్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నందువల్ల వాటి లాభదాయకత పెరుగుతుంది. రిటైల్ బ్యాంకింగ్ మార్కెట్‌లో డిపాజిట్లు, రుణాలపై వడ్డీరేట్ల మార్జిన్ పెంపును నిర్వహించగలవు. దీంతో ప్రజలలో పొదుపుపై ఆసక్తి పెరిగి మూలధన సంచయనం అభివృద్ధి చెందుతుంది.
 4. నష్టభయాన్ని ఎదుర్కొనే క్రమంలో విత్త యాజమాన్య సాధనాలైన డెరివేటివ్ ప్రొడక్ట్స్ (ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్), బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లలో నమోదు కాకుండా తత్సమాన ప్రయోజన అంశాలను పెద్దమొత్తంలో ఉన్న విత్త సంస్థ సమర్థవంతంగా వినియోగించగలదు.
 5. నూతన సాంకేతిక పరిజ్ఞానం వ్యయంతో కూడినదైనా, పెద్ద గ్రూపులు దాన్ని భరించగలవు. దీంతో ఆర్థిక సేవల ఉత్పత్తి, పంపిణీలో ఆదా ఏర్పడుతుంది. వీటి ద్వారా ఆయా గ్రూపులకు కస్టమర్ బేస్ పెరుగుతుంది.
 6. వాటాదారుల ప్రతిఫలాలు గరిష్టంగా ఉంటాయి. కొత్త ఫైనాన్షియల్ గ్రూప్ విత్త వ్యవస్థలో చలనాత్మక పాత్ర పోషించి, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూర గొంటుంది. దీంతో స్టాక్ ధరలు ఊపందుకుంటాయి. షేర్ ధరలలో స్థిర, దీర్ఘకాల పెరుగుదల ఉండవచ్చు.
 7. వ్యక్తిగత బ్యాంకుల రికవరీ కాని రుణాల తగ్గుదలకు విలీన ప్రక్రియ దోహద పడుతుంది. వివిధ ప్రాంతాలలో నిరుపయోగంగా ఉన్న వనరులను గుర్తించి,, వాటి అభిలషణీయ వినియోగానికి విలీన ప్రక్రియ దోహదపడుతుంది.
 8. వినూత్న ఆర్థిక ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, కొత్త మార్కెట్‌ల అన్వేషణకు విలీన ప్రక్రియ ఉపకరిస్తుంది. బ్యాంక్ శాఖల సంఖ్య పెరగడంతో పాటు ఆర్థిక సమ్మిళితం సాధ్యమవుతుంది.
 9. బ్యాంకుల సంఖ్య తక్కువగా ఉన్నపుడు అవి తమ లక్ష్య సాధనలో విఫలమవడానికి అవకాశాలు స్వల్పం. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని దేశాల అనుభవాలు తెలియజేశాయి. స్థానికంగా రెండు చిన్న లేదా ప్రాంతీయ బ్యాంకుల విలీనం ద్వారా వాణిజ్య బ్యాంకులతో బ్యాంకింగ్ వ్యాపారంలో పోటీ పడే స్థాయికి చేరుకోగలుగుతాయి.
విలీనం-సమస్యలు
ప్రతిపాదిత ఫైనాన్షియల్ అంశాలతో పాటు కొన్ని విషయాలకు సంబంధించి బ్యాంకుల విలీన ప్రక్రియలో అవరోధాలు ఏర్పడే అవకాశాలున్నాయి.
 1. విలీన ప్రక్రియతో ఏర్పడిన పెద్ద సంస్థకు ముఖ్యకార్యనిర్వహణాధికారి (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా ఎవరు వ్యవహరిస్తారు? వ్యవస్థకు వారసత్వ పగ్గాలు ఏ విధంగా ఉంటుందనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
 2. గ్రూపునకు సంబంధించి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ ఎవరుండాలి? అనే అంశం విలీన ప్రక్రియకు అవరోధం కల్పిస్తుంది.
 3. విలీనం కావాలని కోరుకుంటున్న బ్యాంకుల ప్రణాళికకు సంబంధించిన విధానాలు ఒకే విధంగా లేనపుడు కొత్త బ్యాంక్ ఏ ప్రాతిపదికన విధానాలను అవలంబిస్తుంది?
స్వాగతించదగినదే
Bavitha
బ్యాంకుల విలీనానికి రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదే. బ్యాంకుల మధ్య విలీన ప్రక్రియకు ద్వారాలు తెరిచింది. అధిక విలువను ఎక్కడ సమకూర్చుకోవాలో బ్యాంకులే నిర్ణయించుకోవాలి. చిన్న, పెద్ద బ్యాంకుల మధ్య విలీనాలను రిజర్వ్‌బ్యాంక్ స్వాగతిస్తుంది. గత ఏడాదితో పోల్చిచూస్తే.. ఈ ఏడాది మన ఆర్థిక వ్యవస్థ విపత్తులను తట్టుకునేలా పటి ష్టంగా రూపొందిందని భావిస్తున్నాను.
Published date : 22 Aug 2014 10:44AM

Photo Stories