Skip to main content

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2015-16

రాష్ట్ర విభజన జరిగి దాదాపు రెండేళ్లు అవుతున్నప్పటికీ.. విభజన వల్ల తలెత్తిన సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనడం ప్రభుత్వానికి సవాలుగా పరిణమించింది. విత్త లోటుతో సతమతమవుతోన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత రాజధాని నగరమైన అమరావతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయానికై ఎదురు చూస్తోంది. పేదరిక నిర్మూలన, ఆకలి, వ్యాధుల నిర్మూలన, లింగ అసమానతల తొలగింపుతోపాటు తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల పెంపు లాంటి అంశాలతో 2000 సంవత్సరంలో మిలీనియం వృద్ధి లక్ష్యాలను నిర్దేశించారు. ఈ లక్ష్యాల సాధనలో ప్రపంచవ్యాప్తంగా మంచి పురోగతి సాధ్యమైంది. కానీ భారతదేశంతోపాటు, రాష్ట్రంలోనూ పేదరికం, అసమానతల తొలగింపు లాంటి అంశాల్లో ఆశించిన స్థాయిలో ప్రగతి సాధ్యపడలేదు. మిలీనియం వృద్ధి లక్ష్యాల అమలు కాలం గతేడాది డిసెంబర్‌తోనే పూర్తయింది. దీంతో భారత ప్రభుత్వం డిసెంబర్ 11, 2015న 14 లక్ష్యాలు, 88 సూచికలతో కూడిన ఎస్‌డీజీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది.
ముఖ్య సవాళ్లు, చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాళ్లు, వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలను ఆర్థిక సర్వే కింది విధంగా పేర్కొంది.
ఎ. అమరావతి - ప్రజా రాజధాని
బి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
సి. మచిలీపట్నం నౌకాశ్రయం
డి. భావనపాడు నౌకాశ్రయం
ఇ. గ్రోత్ కారిడార్ల ఏర్పాటు
ఎఫ్. బీచ్ కారిడార్ ప్రాజెక్టు
జి. సాంఘిక, పట్టణ అవస్థాపనా ప్రాజెక్టులు
హెచ్. లాజిస్టిక్ కేపిటల్ ఆఫ్ ఇండియా
ఐ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
జె. సింగిల్ డెస్క్ పోర్టల్ - వన్ స్టాప్ పోర్టల్ ఫర్ జీ2బీ సర్వీసెస్
కె. పారిశ్రామిక పెట్టుబడిదారులకు అనువైన వాతావరణాన్ని కల్పించడం
ఎల్. పారిశ్రామిక వివాదాల చట్టం, శ్రామిక చట్టం, ఫ్యాక్టరీల చట్టం కింద చేపట్టిన శ్రామిక సంస్కరణలు.
ఎం. పరిశ్రమలతో అనుసంధానించిన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం.
ఎన్. కేబినెట్ ఇప్పటి వరకూ ఆమోదించిన 25కు పైగా ఫార్వర్డ్ లుకింగ్ పాలసీలు.
ఓ. తీర/నౌకాశ్రయ ఆధారిత వృద్ధి - గేట్ వే టూ సౌత్ ఆసియా.

ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి
గత మూడేళ్లుగా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. స్థిర ధరల వద్ద (2011-12) జీఎస్‌డీపీ వృద్ధి 2013-14లో 8.50 శాతంగా, 2014-15లో మొదటి సవరించిన అంచనాల ప్రకారం 7.98 శాతంగా నమోదైంది. 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం 10.99 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి భారత జీడీపీ వృద్ధిరేటు 7.6 శాతం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీ స్థిర ధరల వద్ద 2012-13లో రూ. 3,79,623 కోట్లు కాగా, 2015-16లో రూ. 4,93,641 కోట్లకు పెరిగింది. 2015-16 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద (నికర రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రకారం) రూ. 1,07,532. 2014-15తో పోల్చినప్పుడు 2015-16లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయంలో వృద్ధి 12.38 శాతం కాగా, స్థిర ధరల వద్ద 10.13 శాతం.

వ్యవసాయ, అనుబంధ రంగాలు
ఈ ఏడాది రుతుపవనాల ప్రతికూలత వల్ల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గింది. ఈ కారణంగా 6.99 లక్షల హెక్టార్లలో ముఖ్య పంటలైన వరి, పత్తి, వేరుశనగ, పొగాకు, మొక్కజొన్న, చెరకు పంటలను పండించలేకపోయారు. 2014-15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 160.03 లక్షల టన్నులు కాగా, 2015-16లో 137.56 లక్షల టన్నులకు తగ్గింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2015-16లో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో క్షీణత 14.04 శాతం. 2014-15తో పోల్చినప్పుడు 2015-16లో పప్పు ధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి పెరిగింది. 2014-15లో ఆహార ధాన్యాలను 39.63 లక్షల హెక్టార్లలో సాగు చేయగా, 2015-16లో 41.30 లక్షల హెక్టార్లలో సాగు చేశారని అంచనా.

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో కొన్ని ఉప రంగాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. మొత్తంగా చూస్తే ఈ రంగంలో వృద్ధి స్థిర ధరల వద్ద (2011-12) 2015-16లో 8.4 శాతంగా నమోదైంది. 2015-16లో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో స్థూల కలుపబడిన విలువలో (రూ. 1,21,915 కోట్లు) ప్రగతి ఉన్నప్పటికీ, వ్యవసాయ రంగంలో రుణాత్మక వృద్ధి నమోదైంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అధిక వర్షపాతం వ్యవసాయ రంగ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపింది. 2014-15లో రాష్ట్రంలో స్థూల సాగునీటి విస్తీర్ణం 38.86 లక్షల హెక్టార్లు కాగా, నికర సాగునీటి విస్తీర్ణం 29.27 లక్షల హెక్టార్లు. నికర సాగునీటి విస్తీర్ణంలో 14.29 లక్షల హెక్టార్లు కాలువల కింద, 2.93 లక్షల హెక్టార్లు చెరువుల కింద, 10.80 లక్షల హెక్టార్లు బావుల కింద, 1.25 లక్షల హెక్టార్లు ఇతర నీటి ఆధారాల కింద ఉంది.

చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. మంచినీటి చేపలు, ఉప్పు నీటి రొయ్యల ఉత్పత్తిలోనూ రాష్ట్రానిదే అగ్రస్థానం. సముద్ర చేపల ఉత్పత్తిలో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. 2014-15లో భారత్ ఎగుమతి చేసిన మొత్తం సముద్ర చేపల ఎగుమతుల విలువ రూ.33,441 కోట్లు. ఇందులో మన రాష్ట్రం వాటా రూ. 14,000 కోట్లు (42 శాతం).

పారిశ్రామిక రంగం
రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ‘పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక విధానం 2015-20’ను ఏర్పాటు చేసింది. గతేడాది ఏప్రిల్ 29న సింగిల్ డెస్క్ పాలసీని ప్రారంభించింది. పరిశ్రమ ఏర్పాటుకు 21 పని దినాల్లోగా అన్ని విధాలైన అనుమతులను మంజూరు చేయడమే సింగిల్ డెస్క్ పాలసీ లక్ష్యం. పెట్టుబడులను ఆకర్షించడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యూహం. 2015-20 సంవత్సరాలకు సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి విధానం, ఆటోమొబైల్ పరికరాల విధానం, టెక్స్‌టైల్, అపెరల్ పాలసీ, బయోటెక్నాలజీ పాలసీ, ఎంఎస్‌ఎంఈ విధానం, విమాన, రక్షణ ఉత్పత్తుల విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

గతేడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో 1784 పెద్ద, మెగా ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 4,35,506 మందికి ఉపాధి లభిస్తోంది. 2015-16లో రూ. 3,969 కోట్ల పెట్టుబడితో 22 పెద్ద, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. ఇవి 9228 మందికి ఉపాధినిస్తున్నాయి. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఎంఎస్‌ఎంఈ విధానం 2015-20’ను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 1,11,387 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఉన్నాయి. రూ. 20,592 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ సంస్థలు 12,42,294 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 2015-16లో (2015 సెప్టెంబర్ వరకు) రూ.1592.74 కోట్ల పెట్టుబడితో 1988 ఎంస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయి. ఇవి 33,652 మందికి ఉపాధి కల్పించాయి.

గత ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో మొత్తం 19 ప్రత్యేక ఆర్థిక మండళ్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో ఐటీ/ఐటీ అనుబంధ సేవలకు సంబంధించినవి, బహుళ వస్తు సెజ్‌లు, ఫార్మాస్యూటికల్స్ సెజ్‌లు నాలుగేసి చొప్పున ఉండగా, టెక్స్‌టైల్, అపెరల్ సెజ్‌లు రెండు ఉన్నాయి. లెదర్ సెక్టార్, ఫుట్‌వేర్, అల్యూమినియం రిఫైనింగ్, ఆహర శుద్ధికి సంబంధించిన సెజ్‌లు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గత సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం 19 ప్రత్యేక ఆర్థిక మండళ్లలో(ఎఫ్‌డీఐలు కాకుండా) మొత్తం పెట్టుబడి రూ. 14,399.17 కోట్లు. వీటి ద్వారా 62,895 మందికి ఉపాధి లభించింది. 2015-16లో (2015 సెప్టెంబర్ వరకు) రాష్ట్రంలోని సెజ్‌ల నుంచి జరిగిన భౌతిక ఎగుమతుల విలువ రూ. 3354.94 కోట్లు.

రాష్ట్రంలో మొత్తం 44 రాష్ట్రస్థాయి ప్రభుత్వ రంగ సంస్థలు (ఉమ్మడి రాష్ట్రంలో) కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ఏపీ జెన్‌కో, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఎల్), ఏపీ ఎంఎస్‌ఐడీసీ, ఏపీఎస్‌పీడీసీఎల్‌లు మూలధనం పరంగా ముందు వరుసలో నిలిచాయి.మొత్తం 44 ప్రభుత్వ రంగ సంస్థల్లోని మూలధనంలో తొలి ఐదు ప్రభుత్వ రంగ సంస్థల వాటా 75.54 శాతం. 2012-13లో 20 ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలను ఆర్జించాయి. అధిక లాభాల పరంగా ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, ఎస్‌ఎస్‌ఎల్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ముందు వరుసలో నిలిచాయి. 20 ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం లాభంలో వీటి వాటా 43.17 శాతం.

నీటిపారుదల
ప్రస్తుత ప్రాజెక్టుల కింద కృష్ణా నది నుంచి రాష్ట్రానికి 512.04 టీఎంసీల నీటిని కేటాయించారు. మిగిలిన నీటిని అవసరమైన మేరకు వినియోగించుకునే స్వేచ్ఛనిచ్చారు. తెలుగు గంగ ప్రాజెక్టు, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. కృష్ణా నీటి వివాదాల ట్రిబ్యునల్ ప్రకారం మిగులు నీటి ఆధారంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. గోదావరి కింద ప్రస్తుత నీటి వినియోగం 308.703 టీఎంసీలు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేరు-నగరి తొలి దశ, బి.ఆర్.ఆర్.వంశధార ప్రాజెక్టు (స్టేజ్-2, ఫేజ్-2), పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ రిజర్వాయర్‌లను 2015-16 నుంచి 2017-18లోగా పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో ఉన్న 40,817 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. భూగర్భ జలనవరుల అంచనా కోసం రాష్ట్రాన్ని 736 వాటర్ షెడ్లు (భూగర్భ జల బేసిన్లు)గా విభజించారు. 2014-15లో నికర భూగర్భ జల నీటిపారుదల సాంద్రత 11.09 లక్షల హెక్టార్లు. భూగర్భ జలాల కింద స్థూల సాగు విస్తీర్ణం 2014-15లో 15.32 లక్షల హెక్టార్లు. భూగర్భ జల లభ్యతలో పెరుగుదల కోస్తాంధ్ర ప్రాంతంలో 1.35 మీటర్లుగా, రాయలసీమలో 1.94 మీటర్లుగా నమోదైంది.

విద్యుత్
2015-16లో 50,000 నూతన వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది సెప్టెంబర్ వరకు 39,553 పంపు సెట్లకు కనెక్షన్లు ఇచ్చింది. గత సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో 15.49 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అవస్థాపిత విద్యుత్ సామర్థ్యం 10,587.43 మెగావాట్లు. రాష్ట్ర వృద్ధి వేగవంతమవడానికి విద్యుత్ రంగ సంస్కరణలు దోహదం చేశాయి.

రవాణా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 4 జోన్లు, 12 రీజియన్లు, 126 డిపోలతో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015 అక్టోబర్ నాటికి ఆర్టీసీలో 11,962 బస్సులు, 60,006 మంది ఉద్యోగులు ఉన్నారు. రోజుకు సగటున వాహన ఉత్పాదకత 362 కి.మీ. విజయవాడ, తిరుపతి, కడప, రాజమండ్రిలోని నాన్ మెట్రో విమానాశ్రయాల ఆధునీకరణకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కుప్పం, దగదర్తి, ఓర్వకల్లులో ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలున్నాయి. రాష్ట్రానికి 974 కి.మీ. పొడవైన సముద్ర తీరం ఉంది. విశాఖపట్నంలోని ప్రధాన ఓడరేవు భారత ప్రభుత్వ నిర్వహణలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో 14 నోటిఫైడ్ నౌకాశ్రయాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ సెజ్‌ను మైనర్ పోర్టుగా ప్రకటించింది.

జిల్లాల వారీగా తలసరి ఆదాయం(స్థిర బేసిక్ ధరలు 2011-12వద్ద నికర జిల్లా దేశీయోత్పత్తి ఆధారంగా) రూపాయల్లో..

జిల్లా

2012-13

2013-14

2014-15

శ్రీకాకుళం

50,321

52,762

54,139

విజయనగరం

56,474

59,477

62,194

విశాఖపట్నం

96,337

1,00,104

1,05,174

తూర్పు గోదావరి

71,139

74,677

78,826

పశ్చిమ గోదావరి

72,003

77,479

78,981

కృష్ణా

85,092

93,645

1,01,003

గుంటూరు

70,808

77,930

83,692

ప్రకాశం

70,673

75,662

80,516

ఎస్‌పీఎస్ నెల్లూరు

74,196

78,888

84,650

వైఎస్‌ఆర్

54,450

60,670

67,283

కర్నూలు

53,806

62,941

66,080

అనంతపురం

57,257

60,744

67,491

చిత్తూరు

62,939

67,851

72,797

ఆంధ్రప్రదేశ్

68,730

74,063

79,442

Published date : 08 Apr 2016 01:03PM

Photo Stories