Skip to main content

12వ పంచవర్ష ప్రణాళిక ప్రగతి

పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-17) ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన వృద్ధి క్షీణతను నివారించడంతోపాటు ప్రణాళికలో అధిక వృద్ధి సాధన దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా పరిణమించింది. 2012-13లో 5.6% వృద్ధి నమోదు చేసిన భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రణాళికలోని చివరి రెండేళ్లలో 9% వృద్ధిని సాధించింది. ప్రణాళిక ప్రారంభానంతరం వృద్ధి ధోరణులను పరిశీలిస్తే పన్నెండో ప్రణాళికలో వృద్ధి.. 7 శాతనికి పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
  • 2016-17లో భారత ఆర్థిక వృద్ధిని ఐ.ఎం.ఎఫ్. 7.4%గా అంచనా వేసింది.
  • ప్రణాళిక తొలి నాలుగేళ్లలో వ్యవసాయ రంగ సగటు వృద్ధి 1.6%గా నమోదైంది. 2013-14లో రుతుపవనాల అనుకూలతతో వ్యవసాయానుబంధ రంగం 4.2% వృద్ధిని సాధించింది.
  • పన్నెండో పంచవర్ష ప్రణాళిక.. తయారీ రంగ వృద్ధి లక్ష్యాన్ని 10%గా తీసుకొంది. అయితే లక్ష్య సాధనలో భారత్ వెనుకబడే సూచనలు కన్పిస్తున్నాయి.
  • 12వ ప్రణాళికా వృద్ధిని సేవా రంగ ఆధారిత వృద్ధిగా చెప్పవచ్చు. 2014లో భారత సేవా రంగ వృద్ధి 10.3%గా నమోదైంది
  • 2011-12 నుంచి 2015-16 (నవంబర్ వరకు) సేవా రంగ ఎఫ్‌డీఐల్లో జపాన్ 20%, అమెరికా 19% వాటా కలిగున్నాయి. మారిషస్, సింగపూర్, నెదర్లాండ్స్ ల వాటాలు వరుసగా 18.9%, 18.6%, 15.4%.
అనిశ్చితిలో సానుకూల ఫలితాలు
కీలక రంగాల్లో సంస్కరణలు చేపట్టిన కారణంగా ఈ ప్రణాళికలో స్థూల ఆర్థిక చలాంకాల్లో ప్రగతి సాధ్యమైంది. ధరల స్థిరత్వం, బహిర్గత కరెంట్ అకౌంట్‌లో లోటు తగ్గడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వంటి అంశాలు క్రమంగా భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి పెంపునకు దోహదపడ్డాయి. ఈ ప్రణాళికా కాలంలో ప్రపంచ ఆర్థిక వాతావరణంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతోపాటు రుతుపవనాల అననుకూలత వ్యవసాయ రంగ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించింది. అయినప్పటికీ పారిశ్రామిక, సేవారంగాల్లో అనుకూల వాతావరణం కారణంగా 2013-14లో 6.6%, 2014-15లో 7.2%, 2015-16లో 7.6% వృద్ధి నమోదైంది.
2016-17లో భారత ఆర్థిక వృద్ధిని ఐ.ఎం.ఎఫ్. 7.4%గా అంచనా వేసింది.
 
12వ ప్రణాళికకు సంబంధించి తొలి నాలుగేళ్లలో పెట్టుబడి రేటులో క్షీణత ఏర్పడినప్పటికీ సమిష్టి డిమాండ్‌లో పెరుగుదలను గమనించవచ్చు. ప్రణాళిక చివరి సంవత్సరంలో వేతన సంఘ సిఫార్సుల అమలుతోపాటు వ్యవసాయ రంగ వృద్ధిలో పెరుగుదల వంటి పరిస్థితులు వినియోగ వ్యయ పెరుగుదలకు దారితీయవచ్చు. అదే జరిగితే సమిష్టి డిమాండ్‌లో పెరుగుదల ఏర్పడి పెట్టుబడులు పెరిగి అధిక వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ప్రణాళిక ప్రారంభమైన తర్వాత (2013-14, 2014-15) థర్మల్, న్యూక్లియర్ విద్యుత్ కల్పనలో వృద్ధి నమోదైంది. ఇది దేశంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అవకాశాలను మెరుగుపరిచింది.
 
2015-16లో విద్యుత్ అదనపు సామర్థ్య లక్ష్యం 20037.1 మెగావాట్లు కాగా, 2015 డిసెంబర్ 31 నాటికి 11,226 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరిగింది. పన్నెండో ప్రణాళికలో అదనపు ఉత్పత్తి సామర్థ్య లక్ష్యంలో డిసెంబర్ 2015 నాటికి 81.6% సాధించడం జరిగింది. దీంతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి తగిన చేయూత లభించింది.
 
స్థూల ఆర్థిక చలాంకాల ప్రగతి
ఈ ప్రణాళికా కాలంలో స్థూల పొదుపు, స్థూల స్థిర మూలధన కల్పనలో ఆశించిన పెరుగుదల నమోదు కాలేదు. స్థూల పొదుపులో భాగంగా ప్రభుత్వ రంగ వాటా క్రమంగా తగ్గగా ప్రైవేటు, కార్పొరేటు రంగాల వాటా పెరిగింది. దీంతోపాటు కుటుంబ రంగ వాటా ప్రణాళిక తొలి రెండేళ్లలో పెరిగి, మూడో సంవత్సరంలో తగ్గింది. స్థూల పొదుపు మార్కెట్ ధరల వద్ద 2012-13లో జీడీపీలో 33.8% కాగా, 2014-15లో 33 శాతానికి తగ్గింది. స్థూల స్థిర మూలధన కల్పన 2012-13లో జీడీపీలో ప్రస్తుత ధరల వద్ద 33.4% కాగా 2014-15లో 30.8 శాతానికి2015-16లో 29.4%నికి క్షీణించింది. స్థూల స్థిర మూలధన కల్పనలో భాగంగా ప్రభుత్వ రంగ వాటా స్థిరంగా ఉండగా, ప్రైవేటు, కార్పొరేటు రంగ వాటాలో కొద్దిపాటి పెరుగుదల నమోదైంది. కుటుంబ రంగ వాటాలో తగ్గుదల అధికంగా ఉంది. తలసరి స్థూల దేశీయోత్పత్తి వృద్ధి.. ప్రణాళికలోని మొదటి నాలుగేళ్లలో వరుసగా 4.3%, 5.3%, 5.9%, 6.2%గా నమోదైంది.
 
ప్రణాళిక తొలి మూడేళ్లలో వినియోగంలో వృద్ధి సగటు 5.8% కాగా, స్థిర పెట్టుబడిలో వృద్ధి సగటు 4.4%. ప్రణాళిక ప్రారంభమైన నాలుగేళ్ల తర్వాత టోకు ధరల సూచీ సగటులో తగ్గుదల రేటు అధికంగా ఉంది. ప్రణాళిక నాలుగో సంవత్సరంలో టోకు ధరల సూచీ సగటు రుణాత్మకంగా నమోదైంది. 2013-14 మినహా మిగిలిన మూడేళ్లలో ఎగుమతుల్లో వృద్ధి రుణాత్మకంగా ఉంది. మొదటి నాలుగు సంవత్సరాల ప్రణాళికా కాలంలో కరెంటు అకౌంటు లోటులో స్థిరమైన తగ్గుదలను  గమనించవచ్చు. ప్రణాళిక నాలుగేళ్ల కాలంలో విదేశీ మారక నిల్వల్లో స్థిరమైన పెరుగుదల కనిపించింది. 2012-13లో 292 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక నిల్వలు 2015-16లో 349.6 బిలియన్ డాలర్లకు చేరాయి. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులిచ్చిన పరపతిలో వృద్ధి తొలి రెండేళ్లతో పోల్చితే తర్వాత 2 సంవత్సరాల్లో తగ్గింది. ప్రైవేటు వినియోగ వ్యయంలో వృద్ధి స్థిరంగా ఉండగా, ప్రభుత్వ వినియోగ వ్యయంలో వృద్ధి 2013-14లో 0.4% కాగా, 2014-15లో అధికంగా 12.8%గా నమోదైంది.
 
వ్యవసాయ రంగం
ప్రణాళిక తొలి నాలుగేళ్లలో వ్యవసాయ రంగ సగటు వృద్ధి 1.6%గా నమోదైంది. వ్యవసాయోత్పత్తుల క్షీణత అల్పవృద్ధికి ప్రధాన కారణం. 2013-14లో మినహా మిగిలిన కాలంలో సాంవత్సరిక పంట ఉత్పత్తిలో తగ్గుదలకు లోటు వర్షపాతం, అననుకూల వాతావరణం కారణమయ్యాయి. 2014-15లో వ్యవసాయానుబంధ రంగాలపై పెట్టుబడి రూ. 2,56,495 కోట్లు. ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంది. రైతులకు సంస్థాపరమైన పరపతి అందించడం, గిడ్డంగి సౌకర్యాలను పెంచడం, అగ్రి-టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధి ఏర్పాటు వంటి చర్యల వల్ల వ్యవసాయం లాభదాయకంగా మార్చి వాణిజ్య ఆర్గానిక్ ఫార్మింగ్ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావించింది. తీవ్ర కరువు 2012-13లో వ్యవసాయానుబంధ రంగాల్లో వృద్ధి 1.5%గా నమోదు కావడానికి కారణమైంది. 2013-14లో రుతుపవనాల అనుకూలతతో పాటు ఆహార ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, జీవ సంపద, ఫిషరీస్‌లో ప్రగతి నమోదవడంతో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి 4.2%గా నమోదైంది. 2014-15లో దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన కరువు, రబీ కాలంలో అననుకూల వాతావరణం వంటి కారణాలతో పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దాంతో 2014-15లో రుణాత్మక వృద్ధి (-0.2 శాతం) నమోదు కాగా, 2015-16లో 1.1%గా ఉంటుందని అంచనా. దేశంలో ఆహార భద్రత సాధించడంతోపాటు రైతుల జీవన ప్రమాణాన్ని పెంచేందుకు వ్యవసాయ రంగ పరివర్తన ఎంతైనా అవసరం. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, సమర్థమంతమైన నీటి పారుదల సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడుల పెంపు, ఉత్పాదకాల సమర్థ వినియోగం వంటి చర్యలు.. వ్యవసాయ రంగ పరివర్తనకు దోహదపడతాయి.
 
పారిశ్రామిక రంగం
పన్నెండో పంచవర్ష ప్రణాళిక తయారీ రంగ వృద్ధి లక్ష్యాన్ని 10%గా తీసుకొంది. లక్ష్య సాధనకు ఈ ప్రణాళికా కాలంలో ప్రభుత్వం Invest India, make in india, Ease of doing business, నేషనల్  ఈ- గవర్నెన్స్ ప్లాన్‌లో భాగంగా ఈ-బిజ్‌మిషన్ మోడ్ ప్రాజెక్టు వంటి  కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రణాళిక ప్రారంభమైనతర్వాత మొదటి సంవత్సరంతో పోల్చితే తర్వాత కాలంలో స్థూల మూలధన కల్పనలో తయారీ రంగ వాటా తగ్గింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులిచ్చిన పరపతి వృద్ధిలోనూ అనేక ఒడిదొడుకులు వచ్చాయి. తయారీ రంగానికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులిచ్చిన పరపతిలో వృద్ధి 2014-15లో 13.2%కాగా, అది 2015-16లో 2.5% శాతానికి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన డిమాండ్, వస్తు ధరల్లో తగ్గుదల, అనిశ్చిత పెట్టుబడి వాతావరణం వంటి పరిస్థితులున్నప్పటికీ తయారీ రంగం   2013-14, 2014-15లో వృద్ధిలో తగ్గుదలను అధిగమించడంతోపాటు 2015-16లో మంచి వృద్ధిని కనబరిచింది. మొత్తంగా పన్నెండో ప్రణాళికలో తయారీ రంగ వృద్ధి లక్ష్య సాధనలో భారత్ వెనుకబడే సూచనలున్నాయి.
 
సేవా రంగం
అమెరికా సంక్షోభానికి ముందు సేవారంగంలో సగటు వార్షిక వృద్ధి 9.3%కాగా, సంక్షోభానంతర కాలంలో సగటు వృద్ధి 8.3%గా నమోదైంది. 2014లో భారత్‌లో సేవా రంగ వృద్ధి 10.3%గా నమోదైంది. గడచిన రెండేళ్లలో  సేవారంగంలో ఎఫ్‌డీఐల ప్రవాహం అధికమైంది. మెడికల్ టూరిజంతోపాటు పర్యాటక రంగం, షిప్పింగ్, పోర్‌‌ట సర్వీసెస్, సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఐటీ రంగ అభివృద్ధికి తీసుకొనే చర్యలు భవిష్యత్తులో సేవా రంగ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. అంతర్జాతీయ పర్యాటకులకు సంబంధించి 2013లో 7 మిలియన్‌ల మంది  భారత్‌ను  సందర్శించగా,  అది  2014లో 7.7 మిలియన్‌లకు పెరిగింది. మొత్తం సేవల ఎగుమతుల్లో వృద్ధి 2013-14లో 4% కాగా, ఏవియేషన్, పర్యాటకం, షిప్పింగ్, రైల్వేస్, పోర్టులు వంటి సర్వీసులకు సంబంధించి పన్నెండో ప్రణాళిక తొలి నాలుగేళ్లలో చక్కని ప్రగతి నమోదైంది. వ్యవసాయ, తయారీ రంగాలతో పోల్చితే సేవా రంగంలో వృద్ధి ఆశాజనకంగా ఉండనుంది. మొత్తంగా 12వ ప్రణాళికలో వృద్ధిని service led growth (సేవారంగ ఆధారిత వృద్ధి) గా భావించవచ్చు.
 
సాంఘిక సేవలు- కేంద్ర ప్రభుత్వ వ్యయం
ప్రణాళికా కాలంలో మొదటి నాలుగేళ్లలో సాంఘిక సేవలపై కేంద్ర ప్రభుత్వ వ్యయం సగటున జీడీపీలో 27-28% ఉండగా, విద్యపై వ్యయం సగటున జీడీపీలో 3 శాతంగా, ఆరోగ్యంపై సగటున 1.3%గా నమోదైంది. కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో శాతం పరంగా మొదటి నాలుగేళ్లలో సామాజిక సేవలపై వ్యయం సగటు సుమారు 25%కాగా, విద్య, ఆరోగ్య రంగాలపై సగటు వ్యయం వరుసగా 11%, 4.8%గా నమోదైంది. సాంఘిక సేవలపై జరిగిన మొత్తం వ్యయంలో మొదటి నాలుగు సంవత్సరాల కాలంలో సగటున విద్య, ఆరోగ్య రంగాలపై వరుసగా 45%, 19% వ్యయం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 0-6 వయో వర్గం 13.6% కాగా, ఏటా 26 మిలియన్‌ల మంది  భారత్‌లో జన్మిస్తున్నారు. ఐదేళ్లలోపు  శిశు మరణాలు 1990లో ప్రతి వెయ్యి జననాలకు 126 ఉండగా, 2013లో 49కు తగ్గింది. 2011 లెక్కల ప్రకారం బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశాల్లోని 75% కుటుంబాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదు.  2014 అక్టోబర్ 2 -2015 అక్టోబర్ 2 కాలంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద 88 లక్షల టాయ్‌లెట్‌ల నిర్మాణం జరిగింది.
 
మహిళా సాధికారత
ఈ ప్రణాళిక అమలు కాలంలో మహిళా సాధికారత, సమ్మిళిత వృద్ధికి సంబంధించి చెప్పుకోదగ్గ ప్రగతి సాధ్యం కాలేదు. 2012 నాటికి 24.2% మహిళలు మాత్రమే షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25.5%, పట్టణ ప్రాంతాల్లో 23.6% మహిళలు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారు.
 
2014 నాటికి దేశంలో 27.5% మహిళలు మాత్రమే షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు.  గ్రామీణ ప్రాంతాల్లో 26.9%, పట్టణ ప్రాంతాల్లో 27.2%, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 29.7% మహిళలు మాత్రమే బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నెండో పంచవర్ష ప్రణాళికలో సమ్మిళిత వృద్ధి సాధన నెరవేరలేదని భావించవచ్చు. 2015 మానవాభివృద్ధి నివేదిక ప్రకారం 2014లో మహిళల్లో మానవాభివృద్ధి సూచీ విలువ 0.525 కాగా, పురుషుల్లో 0.660గా నమోదైంది. దీని ఆధారంగా ఆ సూచీకి సంబంధించిన అనేక సూచికల విషయంలో లింగ బేధాన్ని గమనించవచ్చు. 2014లో భారత్‌లో తలసరి స్థూల జాతీయాదాయం మహిళల్లో 2116 డాలర్లు, పురుషుల్లో 8656 డాలర్లుగా నమోదైంది. ఇదే సంవత్సరానికి సంబంధించి expected years of schooling  బాలికల్లో 11.3 ఏళ్లు, బాలురలో 11.8 ఏళ్లుగా ఉంది. mean years  of schooling బాలికల్లో 3.6 ఏళ్లు, బాలురలో 7.2 ఏళ్లుగా నమోదైంది.
 
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
ఈ ప్రణాళికా కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. ఎఫ్‌డీఐలకు సంబంధించి తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితంగా వాటి ప్రవాహంలో పెరుగుదల నమోదైంది. 2012-13లో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 22.4 బిలియన్ డాలర్లు కాగా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఎఫ్‌డీఐల ప్రవాహ వేగం మరింత పెరిగింది. అక్టోబర్ 2014 నుంచి జూన్ 2015 మధ్య ఎఫ్‌డీఐల్లో 40% పెరుగుదల ఏర్పడింది. 2011-12 నుంచి 2015-16 (నవంబర్ వరకు) సేవా రంగానికి లభించిన ఎఫ్‌డీఐల్లో జపాన్ 20% కాగా, అమెరికా 19% వాటాలను కలిగున్నాయి. మారిషస్, సింగపూర్, నెదర్లాండ్స్ ల వాటాలు వరుసగా 18.9%, 18.6%, 15.4%గా ఉన్నాయి. గత రెండేళ్లలో దేశంలో ప్రవేశించిన  మొత్తం ఎఫ్‌డీఐల్లో 70% మేర ఢిల్లీ, హరియాణా, మహారాష్ర్ట, క ర్నాటక, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే కేంద్రీకృతమయ్యాయి. దీంతోపాటు పారిశ్రామిక, అవస్థాపనా ప్రాజెక్టుల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్, చైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
 
విద్య, ఆరోగ్య రంగాలపై పెట్టుబడుల క్షీణత కారణంగా మానవాభివృద్ధిలో పెరుగుదల లేదు. ఈ ప్రణాళికలో అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉన్నందున మేక్ ఇన్ ఇండియాకు తగిన చేయూత లభించనుంది. తొలి నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో వృద్ధి సగటు 1.6 శాతంగా ఉండటం ఆందోళన కలిగించే పరిణామం.
Published date : 17 Aug 2016 12:05PM

Photo Stories