Education System: విద్యారంగం బాగుపడాలంటే..?
మరి దేశ భవిష్యత్తును నిర్ణ యించే తరగతి గదులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థ రూపురేఖలే మార్చే స్తాం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక నూతన విధానాన్ని ఆవిష్కరిస్తాం’ అని తెలంగాణ ఉద్యమ సమయంలో గొప్పగా ప్రకటించారు. కానీ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచినా విద్యారంగం తిరోగమన బాటలోనే పయనిస్తోంది. రాష్ట్రావిర్భావం తర్వాత పాఠశాలలు బ్రహ్మాండంగా బాగుపడ్డాయనీ, విద్యా రంగం కోసం ప్రభుత్వం ఎంతో చేస్తున్నదనీ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నారు. వీరు వాస్తవాలను దాచిపెట్టి అసత్యాలను ప్రొజెక్ట్ చేస్తున్నారు.
కార్పొరేట్ విద్యా సంస్థలకు..
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతులు మంజూరు చేయడం, నిబంధనలు పాటించని పాఠశాలల అనుమతులను కొన సాగించడం ద్వారా ప్రభుత్వం విద్యారంగానికి తీరని నష్టం కలిగిస్తున్నది. బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు మంగళం పాడుతున్నది. కోవిడ్ రెండవ వేవ్ అనంతరం పాఠశాలలు భౌతికంగా పునః ప్రారంభం అయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లుగా విద్యాశాఖ గణాంకాలే చెబుతున్నాయి. మరి పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఆరేళ్లుగా పదోన్నతులు లేక ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. సబ్జెక్టు టీచర్ల కొరత విద్యార్థుల భవిష్యత్తు పాలిట శాపంగా పరిణమించింది. టీచర్ల తాత్కాలిక సర్దుబాటు ఉపాధ్యాయుల లేమిని తీర్చే దివ్యౌషధం ఏమాత్రం కాదని తేలిపోయింది.
రాష్ట్రంలోని 17 ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. రెగ్యులర్ ఉపాధ్యాయులు ఒక్కరు కూడా లేని మోడల్ స్కూల్స్ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఒత్తిడి సమస్యను తీర్చడానికి మోడల్ స్కూల్స్‌కి ఇతర పాఠశాల నుండి ఉపాధ్యాయులను డిప్యూటేషన్ ఇవ్వడం విధాన లోపమే తప్ప పరిష్కారం అసలే కాదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో సమస్యల చిట్టా చాంతాడంత ఉంది. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్... ఒకదానితో మరొక వ్యవ స్థకు అంతరాలున్నాయి. సొంత భవనాల నిర్మాణాలు ప్రారంభం కాకపోవడం, నిర్మాణం ప్రారంభమైనవి సకాలంలో పూర్తి కాకపోవడం... ఇలా ప్రచార ఆర్భాటానికి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతన లేదనే అపప్రథను మూటగట్టుకుంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో రేకెత్తిన సున్నితమైన సమస్య వల్ల గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలకు మరింత మంది ఉపాధ్యాయులు దూరమయ్యారు. మైనర్ మీడియం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య విపరీతంగా ఉన్నా తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనేది గగనమైంది.
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించడా నికి ప్రభుత్వమే చొరవ చూపాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల్లోని ఖాళీలన్నింటినీ రెగ్యులర్ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలి. వివిధ రకాల గురుకుల పాఠశాలలను ఏకతాటిపైన నిలిపేందుకు సొసైటీలన్నింటినీ కలిపి ఒక కామన్ బోర్డుని ఏర్పాటు చేయాలి. కాంట్రాక్టు విధానంలో నియమింపబడిన ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
అందరికీ విద్య అందించాలనే లక్ష్యం..
విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న దేశాలు నేడు అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయి. అందరికీ విద్య అందించాలనే లక్ష్యం ప్రభుత్వ విద్యా రంగం ద్వారా మాత్రమే సాధ్యం. ప్రభుత్వ పాఠ శాలలను బాగు చేసుకున్న రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచీలో కూడా పురోగమిస్తున్నాయి. కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాలే దీనికి ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికై పరితపించాలి. గతంలో రాష్ట్ర పెద్దలు చెప్పినట్లు ప్రపంచంలోనే అత్యు న్నత స్థాయి విద్యను అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది!
వ్యాసకర్త: వరగంటి అశోక్,
ప్రభుత్వోపాధ్యాయుడు