రైతు కష్టాలు తీరుస్తా: గేట్ అగ్రిఇంజనీరింగ్ ఫస్ట్‌ర్యాంకర్
Sakshi Education
- వ్యవసాయం అంటే మక్కువ; అందుకే అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో చేరా
- రైతులకు సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
- గేట్ ఫస్ట్‌ర్యాంకర్గా నిలిచిన బీహార్ వాసి అతుల్కుమార్ ఝాతో సాక్షి ఇంటర్వ్యూ
ఫస్ట్ ర్యాంకు సాధించారు..ఎలా ఫీలవుతున్నారు?
గేట్ పరీక్ష రాస్తునప్పుడు మంచి ఇన్స్టిట్యూట్లో ఎంటెక్ సీటు వస్తే చాలనుకున్నా. ఆ తర్వాత ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆలిండియా టాప్ 10లో నిలవాలనుకున్నా.. కాని ఫలితాలు వచ్చాక అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఆలిండియా టాపర్గా నిలవడం నమ్మలేకపోతున్నా. జీవితంలో మొట్టమొదటిసారిగా నమ్మలేని సంఘటన ఇది. అమ్మానాన్న చాలా సంతోషంగా ఉన్నారు.
మీ స్వస్థలం? విద్యా,కుటుంబ నేపథ్యం?
మాది బీహార్. మ్యాథ్స్ గ్రూప్లో ప్లస్ టూ రాజస్థాన్లో చదివాను. ఆ తర్వాత ఐఐటీ-జేఈఈ రాశాను. 7మార్కుల దూరంలో మంచి ర్యాంకు దూరమైంది. దాంతో ఐసీఏఆర్ ఎంట్రన్స్ పరీక్ష రాయడంతో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో చేరా. నాన్న బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. అమ్మ గృహిణి. చదువు విషయంలో ఇంట్లో ప్రోత్సహించేవారు. అందరిలా డిమాండ్ ఉన్న బ్రాంచ్ తీసుకోమని ఏనాడు ఒత్తిడితేలేదు. నా ఇష్టాన్ని వారి ఇష్టంగా భావించి వెన్నంటి నిలిచారు.
గేట్ మార్కులు? స్కోర్
మొత్తం 100కు 48.33 మార్కులు సాధించాను. దాంతో ఆలిండియా ఫస్ట్ర్యాంకు సొంతమైంది. స్కోర్ స్కోర్ 728.
ఇంజనీరింగ్లో అగ్రికల్చర్ బ్రాంచ్ ఎంచుకోవడానికి కారణం?
బీటెక్ అంటే.. కేవలం సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్సేకాదు. చాలామంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అంటే చిన్నచూపు చూస్తారు. అది సరికాదు. ఈ బ్రాంచ్తో పేరుప్రఖ్యాతలు సాధించినవాళ్లు చాలామంది ఉన్నారు. నాకు మొదటినుంచీ వ్యవసాయం అంటే ఇష్టం. అందుకే ఈ బ్రాంచ్ తీసుకున్నా. అగ్రికల్చర్ ఇంజనీరింగ్తో దేశంలో పేద రైతులకు నా వంతు సేవచేయాలన్నదే నా లక్ష్యం. ఎందుకంటే.. ఇప్పటికే రైతులకు పంట సాగులో ఎన్నో సవాళ్లున్నాయి. వాటిలో కొన్నింటికైనా నా వంతు పరిష్కారం చూపాలనేదే ఆశ.
ఎంటెక్ ఎక్కడ జాయిన్ అవుతారు? భవిష్యత్తు లక్ష్యం?
ఐఐటీ ఖరగ్పూర్.. లేదంటే ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్లో చేరతా. ఎంటెక్ తర్వాత విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ చేయాలనుకుంటున్నా. కచ్చితంగా రైతు సమస్యలపై పరిశోధన చేయాలన్నది నా లక్ష్యం. ప్రధానంగా ఇరిగేషన్ షెడ్యూలింగ్ విధానంపై దృష్టిసారిస్తున్నాను. దీనిద్వారా నీటివనరులను శాతాన్ని తగ్గించి రైతులు ఎక్కువ ఉత్పాదకత సాధించేదిశగా పరిశోధనలు చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా సాగులో నూతన యంత్రాల ఆవిష్కరణ, కొత్త పద్దతులను కనుగోవాలనేది నా లక్ష్యం.
గేట్కు ఎలా ప్రిపేరయ్యారు? రోజుకు ఎన్ని గంటలు చదివారు?
అగ్రికల్చర్ బీటెక్లో భాగంగా భోపాల్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో శిక్షణ తీసుకున్నా. దీనిద్వారా అనేక కొత్త విషయాలు తెలిశాయి. నావంతు రైతులకోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. థర్డ్ ఇయర్ నుంచే గేట్కు ప్రిపరేషన్ మొదలుపెట్టాను. పరీక్ష విధానం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. కాబట్టి ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు సంపాదించి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేవాడిని. అదేవిధంగా ప్రాబ్లమేటిక్ ప్రశ్నలను ఎక్కువగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించా. సబ్జెక్టును చదివి అర్థం చేసుకునేందుకు ముఖ్యమైన టెక్ట్స్బుక్స్ చదివాను. సొంతంగానే గేట్కు ప్రిపేరయ్యా. రోజుకు 3 నుంచి 4 గంటల వరకు చదివేవాడిని.
గేట్ రాయబోయే విద్యార్థులకు సలహా?
గేట్ ప్రవేశపరీక్ష కొంచెం కఠినంగా ఉంటుంది. మంచి ర్యాంకు సాధించలేం అనే భావన విడనాడాలి. ఎవరైనా సులువుగా పాస్కావచ్చు. మంచి ర్యాంకు, మంచి ఇన్స్టిట్యూట్లో సీటు రావాలంటే కొంత కష్టపడాలి. బీటెక్ థర్డ్ ఇయర్ నుంచే రోజుకు 3 నుంచి 4 గంటలు చదివితే మంచి ర్యాంకు కష్టంకాదు. సబ్జెక్టును అర్థంచేసుకుని చదివితేనే ప్రయోజనం ఉంటుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాలి. క్వశ్చన్ ఏవిధంగా అడిగినా సమాధానం గుర్తించేలా ప్రిపేరవ్వాలి!!
Published date : 29 Oct 2014 01:12PM