Skip to main content

ఇంజనీరింగ్ లో పరిశోధకుడినవుతా: గేట్ ఈసీఈ ఫస్ట్‌ర్యాంకర్

  • ఐఐఎస్ఈలో ఎంటెక్ చేస్తా
  • ఆలిండియా ఫస్ట్ ర్యాంకు నమ్మలేకపోతన్నా
  • సాక్షి ఇంటర్వ్యూలో గేట్ ఫస్ట్‌ర్యాంకర్ కండె రాకేష్
జాతీయస్థాయిలో ఫస్ట్‌ర్యాంకు ఊహించలేదు. ఏడాదిన్నరముందుగానే ప్రిపరేషన్ మొదలుపెట్టడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఎంటెక్ పూర్తయ్యాక పరిశోధనలోకి అడుగుపెట్టి ఇంజనీరింగ్ రంగంలో పేరు సంపాదించాలనేదే లక్ష్యం అంటున్నారు.. గేట్ 2012 ఫలితాల్లో ఈసీఈ బ్రాంచ్లో ఆలిండియా ఫస్ట్‌ర్యాంకర్ రాకేశ్. ఆయనతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ..

గేట్ ఎంట్రన్స్లో ఈసీఈలో ఫస్ట్‌ర్యాంకు రావడంపై ఎలా ఫీలవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. గేట్లో మంచి ర్యాంకు రావడమే లక్ష్యంగా ప్రిపరేషన్ సాగించా. ఇప్పుడు దానికి తగ్గ ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉంది. గేట్లో జాతీయస్థాయిలో మంచి ర్యాంకు వస్తుందనుకున్నా. కాని ఈసీఈ బ్రాంచ్లో ఫస్ట్‌ర్యాంకు రావడం ఊహించలేకపోతున్నా. నా విజయంతో అమ్మానాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయం ఎప్పటికీ మర్చిపోలేనిది.

మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయి?
మొత్తం 100మార్కులకు 67 మార్కులు వచ్చాయి. దాంతో ఆలిండియాలో ఫస్ట్ర్యాంకు సాధించాను. మొత్తం స్కోరు 1000వచ్చింది.

ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మీ జీవిత లక్ష్యం?
ప్రస్తుతం హైదరాబాద్లోని ఎంవీఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎంటెక్ పూర్తయ్యాక మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.

మీ కుటుంబ నేపథ్యం?
మాది నల్గొండ జిల్లా. నాన్న సీఐడీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. 1నుంచి పదోతరగతి వరకు హైదరాబాద్లోనే చదివాను. ఆ తర్వాత ఇంటర్ నారాయణ, బీటెక్ ఎంవీఎస్సార్లో చదువుతున్నాను.

ఇంజనీరింగ్వైపు రావడానికి కారణం?
నాకు మొదటినుంచీ మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ప్లస్ టు తర్వాత ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇంటర్లో ఎంపీసీ తర్వాత ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టు బాగా నచ్చి ఈసీఈ ఎంచుకున్నా. ఈ బ్రాంచ్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా?లేదా? అని ఆలోచించలేదు. సబ్జెక్టు నచ్చి, దానిపై ఆసక్తితోనే ఈ బ్రాంచ్ ఎంచుకున్నాను.

మీ ప్రిపరేషన్ వివరిస్తారా? రోజుకు ఎన్నిగంటలు చదివారు?
బీటెక్ చదువుతుండగానే గతేడాది గేట్ పరీక్ష రాశాను. 105వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకుతో కోరుకున్న ఐఐటీలో ఎంటెక్ సీటు రావడం కష్టం. దాంతో ఈ ఏడాది కూడా గేట్కు ప్రిపేరయ్యాను. గేట్కు పోటీ తీవ్రంగా ఉంటుంది. ఏ సబ్జెక్టులో వెనుకబడిపోయినా స్కోరింగ్లో రాణించలేం. అందుకే కావలసిన ఐఐటీలో సీటు రావాలంటే.. అత్యున్నత ర్యాంకు వచ్చితీరాలని పట్టుదలగా నిర్ణయించుకున్నా. సొంత ప్రిపరేషన్తోపాటు కచ్చితంగా కోచింగ్ ఉండాలని తెలిసింది. దాంతో కోచింగ్ తీసుకున్నా. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన మెటిరీయల్ చాలా బాగా ఉపయోగపడింది. సబ్జెక్టువైజ్గా ప్రీవియస్ ప్రశ్నలు, ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్పై దృష్టిపెట్టా. తరచుగా ప్రాక్టీసే చేసేవాడిని. అదేవిధంగా టెక్ట్స్బుక్స్ సైతం మంచి స్కోరింగ్లో చాలా ఉపయోగపడ్డాయి. రోజుకు 6 గంటలకు పైగా చదివేవాడిని. దాంతో సబ్జెక్టుపై బాగా పట్టుదొరికింది.

ఎంటెక్లో ఎక్కడ చేరతారు?
ఎంటెక్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్, బెంగళూరు (ఐఐఎస్ఈ)లో చేరాలనుకుంటున్నా. ఎంటెక్ పూర్తిచేసిన తర్వాత పరిశోధన వైపు వెళ్లాలని ఉంది. పరిశోధన చేయాలా? లేదంటే ఎంబీఏ చేసి మేనేజ్మెంట్ రంగంవైపు వెళ్లాలా? అని ఇంకా ఆలోచించలేదు. ఎందుకంటే.. ప్రస్తుతం మేనేజెమెంట్ రంగంలో కెరీర్ అవకాశాలు చాలా ఉన్నాయి. పైగా వేగంగా జీవితంలో ఎదగడానికి మేనేజెమెంట్ రంగం అనేక అవకాశాలు కల్పిస్తోంది. అందుకే ఎంటెక్ పూర్తయ్యేసరికి కచ్చితమైన ఆలోచనతో అడుగువేస్తా.

గేట్ రాయబోయే విద్యార్థులకు మీ సలహా?
గేట్ పరీక్ష కొంతవరకు సులువనే చెప్పవచ్చు. పరీక్షకు ముందునుంచే ప్లానింగ్తో చదివితే మంచి స్కోర్ సాధించడం సులువే. చివర్లో ప్రిపరేషన్ మొదలుపెడితే మంచి ర్యాంకు రాకపోవచ్చు. చాలామంది గేట్ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష కాబట్టి ఏదోలా ర్యాంకు వస్తుందనుకుంటున్నారు. ఏమాత్రం చదవకుండా పరీక్షరాసి ర్యాంకు తెచ్చుకోవాలనుకుంటే.. సమయం వృథా అయినట్టే. సబ్జెక్టులవారీగా ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసకుని పరీక్షకు రెండు నెలల ముందుగానే రివిజన్ మొదలుపెట్టాను. బేసిక్ కాన్సెప్ట్స్పై పట్టు సాధించాను. ప్రశ్న ఎలా అడిగినా ఆన్సర్ చేయగలిగేలా సబ్జెక్టును అర్థం చేసుకున్నాను. గేట్ రాయాలనుకునే విద్యార్థులు బీటెక్ థర్డ్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ మొదలుపెడితే ఈజీగా సక్సెస్ కావచ్చు. పోటీ తీవ్రంగా ఉంటుంది.. కాబట్టి మ్యాథ్స్, రీజనింగ్పై దృష్టిపెట్టాలి. ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ తప్పకుండా చేయాలి. చాప్టర్వైజ్గా మెటిరీయల్ చదివితే ఆలిండియా టాపర్గా నిలవడం సులువే.
Published date : 29 Oct 2014 01:15PM

Photo Stories