Skip to main content

నాలుగో సంవత్సరం నిర్ణయాత్మకం

ఇంజనీరింగ్ కోర్సులో అత్యంత నిర్ణయాత్మక దశ.. నాలుగో సంవత్సరం..ఈ దశలో వేసే అడుగులే భావి కెరీర్‌కు బాటలు వేస్తాయి.. ఉన్నత విద్య, ఉద్యోగం.. ఇలా ఎటు వైపు పయనించాలన్నా.. ఈ ఏడాదిలోనే అందుకు తగ్గ సన్నాహాలు ప్రారంభించాలి.. అంతేకాకుండా సెమిస్టర్, ఇంటర్నల్ పరీక్షలతోపాటు మీలోని నైపుణ్యాలకు పరీక్ష పెట్టే ప్రాజెక్ట్ వర్క్, క్యాంపస్ ప్లేస్‌మెంట్ వంటి ఎన్నో ప్రధాన ఘట్టాలకు కూడా ఈ చివరి ఏడాది వేదికగా నిలుస్తోంది.. కాబట్టి ఈ దశలో ప్రతిరోజూ కీలకమే.. ఈ నేపథ్యంలో తాజాగా ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టిన విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై సూచనలు...

ఇంజనీరింగ్‌లో మూడేళ్లతో పోల్చితే నాలుగో సంవత్సరం భిన్నమైందని ఎంతో కీలకమైందని చెప్పొచ్చు. ఎందుకంటే నాలుగో సంవత్సరంలో విద్యార్థి అకడమిక్ పరంగానే కాకుండా నైపుణ్యాల పరంగా కూడా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి.

80 శాతం హాజరు:
క్లాసులకు తప్పకుండా హాజరవుతూ ఉండాలి. కనీసం 80 శాతం హాజరు ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా ఆ రోజు క్లాస్‌లో చెప్పే పాఠంపై ముందుగానే ప్రిపేర్ అయి వెళ్లడం లాభిస్తుంది. తద్వారా సదరు అంశంపై అవగాహన పెరుగుతుంది. రోజుకు కనీసం రెండు-మూడు గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. తద్వారా ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.

బ్యాక్‌లాగ్స్ లేకుండా:
నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టే నాటికి విద్యార్థులు రెండు అంశాల్లో స్పష్టంగా ఉండాలి. అవి.. ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేకపోవడం, ‘జాబ్ రెడీ’గా ఉండడం. బ్యాక్‌లాగ్ విషయానికొస్తే.. ఆయా సంవత్సరాలకు సంబంధించి.. ఆయా సంవత్సరాల్లోనే ఉత్తీర్ణత సాధించాలి. బ్యాక్‌లాగ్స్ ఉంటే.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మిమ్మల్ని పరిగణనలోకి తీసుకోరు. సాధ్యమైనంత వరకు మొదటి సంవత్సరం నుంచి ఏ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను ఆ సంవత్సరంలోనే మొదటి ప్రయత్నంలో పూర్తి చేయాలి.

జాబ్‌రెడీగా:
జాబ్ మార్కెట్ ఆశిస్తున్న విధంగా తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలి. మొదటి సంవత్సరం నుంచి ఈ అంశాలపై దృష్టి సారించాలి. ఈ క్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం, లీడర్‌షిప్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి. గ్రూప్ డిస్కషన్, టీమ్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవచ్చు. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాలుపంచుకోవడం వల్ల మెదడు చురుకుదనంతోపాటు, టైమ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు కూడా ఆస్కారం లభిస్తుంది. వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. చదువుతున్న బ్రాంచ్‌లో కాలానుగుణంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని తమను తాము మెరుగు పర్చుకోవడానికి ప్రయత్నించాలి. విజయంతో నిమిత్తం లేకుండా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలకు హాజరుకావాలి. తద్వారా చక్కటి పరిజ్ఞానం అలవడుతుంది. అంతేకాకుండా ఈ అంశాలను రెజ్యుమెలో పొందుపరచడంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇంపార్టెంట్ ఆఫ్ ఇంగ్లిష్:
ప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో ఇంజనీరింగ్ విద్యార్థులందరూ ఉద్యోగ సాధనలో వెనకబడటానికి ప్రధాన కారణం..కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించడం, ఇంగ్లిష్‌లో పట్టు సాధించకపోవడం. చదవడం, వినడం, రాయడం, మాట్లాడటం.. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు నాలుగు స్తంభాల వంటివి. ఇంగ్లిష్ అనేది.. ప్రపంచ భాష. వ్యాపార భాష కూడా. అందుకే కంపెనీలు ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలిగే విద్యార్థుల పట్ల మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్ నైపుణ్యాలు మెరుగుపరచుకునేందుకు ప్రయత్నించాలి. ద హిందూ, ఎకనమిక్ టైమ్స్ వంటి దినపత్రికలతోపాటు బిజినెస్ ఇండియా, అవుట్‌లుక్, ఇండియా టుడే వంటి మ్యాగజైన్లు చదవడం , ఎన్‌డీటీవీ-ప్రాఫిట్, సీఎన్‌బీసీ-టీవీ18, సీఎన్‌ఎన్-ఐబీఎన్ వంటి చానల్స్ చూస్తూ వినడం ద్వారా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు. అంతేకాకుండా కాలేజీ ఈవెంట్స్, చర్చల్లో పాల్గొంటూ.. మాట్లాడే నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నించాలి.

లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా:
ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో కీలకమైంది ప్రాజెక్ట్ వర్క్. దీన్ని నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో చేయాల్సి ఉంటుంది. అంతవరకు కోర్సులో భాగంగా నేర్చుకున్న విషయాలపై విద్యార్థికి ఉన్న అవగాహనను ప్రాక్టికల్‌గా ఏవిధంగా అన్వయించుకోగలుగుతున్నాడు అనే అంశాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించింది ప్రాజెక్ట్ వర్క్. కాలేజీ/యూనివర్సిటీలో సాధారణంగా ఒక్కరు లేదా ఇద్దరి నుంచి నలుగురు వరకు విద్యార్థులు బృందంగా ఏర్పడి ప్రాజెక్టును చేపడతారు. బ్రాంచ్‌ను బట్టి ప్రాజెక్ట్ అంశాలు వేర్వేరుగా ఉంటాయి. ఎంచుకున్న కెరీర్‌కు అనుగుణంగానే ప్రాజెక్ట్ ఉండడం.. కెరీర్ పరంగా లాభిస్తుంది. ఈ విషయంలో ప్రాజెక్ట్ గైడ్, సూపర్‌వైజర్, ప్రొఫెసర్లు, సీనియర్ల సలహాలు తీసుకోవాలి. అంతేకాకుండా చదువుతున్న బ్రాంచ్‌లో లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై ప్రాజెక్ట్ వర్క్ చేపట్టవచ్చు. ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించి మొబైల్ కంప్యూటింగ్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్.. సివిల్‌కు సంబంధించి గ్రీన్ హౌస్, తదితరాలు. ఈ వివరాలను ఇంటర్నెట్ లేదా జర్నల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రాథమిక భావనలపై పట్టు ఉన్న అంశాన్నే ప్రాజెక్ట్ వర్క్ కోసం ఎంచుకోవాలి. నిర్దేశిత సమయంలో పూర్తి చేసే అవకాశం ఉన్న అంశానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాజెక్ట్ వర్క్ సమయంలో నిరంతర అధ్యయనం చేయాలి. ఆత్మవిశ్వాసంతో ఉంటూ, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు సంబంధించిన సందేహాలుంటే బుక్స్, ప్రొఫెసర్ల సహాయంతో నివృత్తి చేసుకోవాలి. ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్ గైడ్, ప్రొఫెసర్లను సంప్రదించి వారి సలహాలను తీసుకోవాలి. టైటిల్ పేజీ, అబ్‌స్ట్రాక్ట్, అక్‌నాలెడ్జ్‌మెంట్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ తదితర అంశాలను పొందుపరుస్తూ ప్రామాణిక నమూనాలో రిపోర్ట్‌ను సిద్ధంచేసి కళాశాలలో సమర్పించాలి. చేసిన ప్రాజెక్ట్‌కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ప్రాజెక్ట్‌కు గ్రేడింగ్ లేదా వెయిటేజీ ఇస్తారు. కెరీర్‌లో దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.

కాపీ వద్దు:
ప్రస్తుతం అధిక శాతం మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌కు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించడం లేదు. కాపీ వర్క్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. దీని వల్లే నాలెడ్జ్ రాకపోగా జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశించే సరికి ఇతరులతో వెనకబడిపోతారు. ఇది కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పరిధి చిన్నదైనా సొంత ఆలోచనలతో పూర్తి చేయడం మంచిది. ప్రాజెక్ట్ వర్క్ సమయంలో చొరవ, పరిజ్ఞానం ఉన్న వారికి ఆ తర్వాత అదే సంస్థ ఉద్యోగం ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

ఉన్నత విద్య:
ఉన్నత విద్య దిశగా ఆలోచనలు ఉంటే ‘గేట్’ దిశగా దృష్టి సారించడం మేలు. పలు ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు గేట్ స్కోర్ ప్రాతిపదికగా ఎంట్రీ స్థాయి నియామకాలను చేపడుతున్నాయి. ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్ తక్కువగా ఉంటే కాలేజీల విద్యార్థులు ఈ అంశాన్ని నిశితంగా గమనించాలి. అంతేకాకుండా ఐఐటీ, నిట్, ఐఐఎస్‌సీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు మిగతా టాప్ కాలేజీలు కూడా ఎంటెక్/ఎంఈ కోర్సులో ప్రవేశానికి గేట్ స్కోర్‌కు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాయి. గేట్ కాకుండా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలకు హాజరుకావచ్చు. మీ ఆసక్తి ఉన్న రంగాల్లో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేసే స్పెషలైజ్డ్ కోర్సులను కూడా ఎంచుకోవచ్చు. అంతేకాకుండా రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్‌కు సంబంధించి పలు కోర్సులను చేయవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్య దిశగా ఆలోచిస్తున్న విద్యార్థులు.. జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీమ్యాట్ వంటి పరీక్షలకు ప్రిపేర్ కావాలి. ఇందులో మెరుగైన స్కోర్ సాధిస్తే అక్కడి యూనివర్సిటీలు అందించే స్కాలర్‌షిప్స్, టీచింగ్ అసిస్టెన్‌‌స వంటి ఆర్థిక చేయూతను పొందే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ తర్వాత మేనేజ్‌మెంట్ రంగంలో పీజీ చేయాలనుకుంటే కోర్సు పూర్తయిన వెంటనే కాకుండా.. సంబంధిత పరిశ్రమలో కనీసం రెండు సంవత్సరాలపాటు పని చేసిన తర్వాత అటువైపు దృష్టి సారించడం మంచిది.

కాంపిటీటివ్ దిశగా:
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అవకాశం లభించని విద్యార్థులు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్, ఇంజనీర్ల నియామకం వివిధ ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షలు, ఐబీపీఎస్ బ్యాంక్ నియామక పరీక్షలు, యూపీఎస్సీ/ ఏపీపీఎస్సీ/ ఎస్‌ఎస్‌సీ/ ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలపై దృష్టి సారించొచ్చు.

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇలా
Engineering క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో మంచి కొలువు దక్కించుకోవాలంటే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ తప్పనిసరి. నియామకాల కోసం క్యాంపస్‌లలో అడుగుపెట్టే కంపెనీలపై విద్యార్థులు అవగాహన ఏర్పరచుకోవాలి. అవి నిర్వహించే ఎంపిక పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలి. ఇంటర్నెట్‌ను ఉపయోగించి కంపెనీల క్యాంపస్ సెలక్షన్‌‌స ప్రక్రియలపై అవగాహన పెంచుకోవాలి. కంపెనీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది. అవి.. అర్హత, ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ ఇంటర్వ్యూ/హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ. అర్హతా ప్రమాణాల మొదటి దశను దాటాలంటే.. విద్యార్థులు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచి మంచి పర్సంటేజీ సాధిస్తుండాలి. మల్టీనేషనల్ కంపెనీలు 70 శాతం కంటే ఎక్కువ మార్కులున్న విద్యార్థులనే రాత పరీక్షకు అనుమతిస్తున్నాయి. అదే భారత్‌లోని టాప్ కంపెనీలు కనీసం 60 శాతం మార్కులు ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి. రెండో దశలో అప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తాయి. గంటపాటు జరిగే ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్‌ఎబిలిటీ, లాజికల్ ఎబిలిటీ తదితర అంశాలపై ప్రతిభను పరీక్షిస్తారు.
  • క్వాంటిటేటివ్ ఎబిలిటీ: ఈ విభాగంలో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో, ప్రొపర్షన్ అండ్ వేరియేషన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, నంబర్స్, లీనియర్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా సఫీషియన్సీ, యావరేజెస్, సింపుల్ ఇంటరెస్ట్, కాంపౌండ్ ఇంటరెస్ట్ తదితర అంశాలు ఉంటాయి.
  • వెర్బల్ ఎబిలిటీ: వొకాబులరీ, సినానిమ్స్, యాంటానిమ్స్, అనలాజిస్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ కరెక్షన్, గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, క్రిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • లాజికల్ ఎబిలిటీ: గేమ్స్, పజిల్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, అనలాజిస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డెరైక్షన్స్, సింబల్స్ అండ్ నేషన్స్, ఆడ్‌మాన్, సిల్లోజిసమ్స్, బైనరీ లాజిక్, క్యాలెండర్, క్లాక్స్, క్యూబ్స్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రమ్స్, నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
రిఫరెన్స్ బుక్స్:
  • ఆర్.ఎస్.అగర్వాల్ (క్వాంట్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్) ఫర్ అప్టిట్యూడ్
  • పజిల్స్ బై శకుంతలా దే వి- ఇంటర్వ్యూ కోసం
  • వొకాబులరీ కోసం- వర్డ్ పవర్ మేడ్ ఈజీ- నార్మన్ లూయీస్
  • లెట్ అజ్ సీ- యశ్వంత్ కనే త్కర్
  • ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ సీ, సీ++ బై రాబర్ట్ లాఫోర్
  • జీఆర్‌ఈ బారోన్స్
  • లాజికల్ రీజనింగ్- టైమ్ మెటీరియల్.
మూడు-నాలుగు దశలు:
మూడో దశ.. గ్రూప్ డిస్కషన్. ఇందులో వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ స్కిల్స్, నేర్చుకోవాలనే తపన, నాయకత్వ లక్షణాలు, చొరవ, విషయావగాహన తదితర అంశాలను పరీక్షిస్తారు. ఇందులో విషయావగాహనకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. రాజకీయ తాజా పరిణామాలపై ప్రామాణిక మ్యాగజైన్లు, దినపత్రికలు చదువుతూ అవగాహన పెంచుకోవాలి. గ్రూప్ ఈవెంట్స్‌లో చురుగ్గా, చొరవగా పాల్గొనడం ద్వారా బృంద నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఇంటర్వ్యూలో ప్రధానంగా నాయకత్వ లక్షణాలు, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, వర్క్ డిసిప్లిన్, సమయపాలన, బృంద నైపుణ్యాలు, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, చొరవ, వస్త్రధారణ, కాన్ఫిడెన్‌‌స లెవల్, వైఖరి, సమాధానాలు చెప్పే తీరు వంటి అంశాలను గమనిస్తారు. కాబట్టి ఈ అంశాల పట్ల అప్రమత్తతతో ఉండాలి. ఆత్మవిశ్వాసంతో సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరుపై సమగ్ర అవగాహనతో ఉండాలి.

Engineering
Published date : 26 Sep 2013 04:25PM

Photo Stories