Skip to main content

జేఈఈ అడ్వాన్స్‌డ్.. ప్రతిభావంతుల పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్.. చక్కటి ఇంజనీరింగ్ కెరీర్ దిశగా కీలక ఘట్టం.. ఎంసెట్, జేఈఈ-మెయిన్ తదితర ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తర్వాత నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధిస్తేనే ఐఐటీ కల సాకారమవుతుంది.. దేశంలోని లక్షా యాభై వేల మంది ప్రతిభావంతులు మాత్రమే హాజరయ్యే ఈ పరీక్షలో నెగ్గాలంటే.. ప్రతి ఎత్తును ఎంతో చాకచక్యంగా వేయాలి.. అప్పుడే ప్రతిభావంతుల సమరంలో విజేతగా నిలవడంతోపాటు ఐఐటీ లక్ష్యాన్ని ఛేదించడం సులభమవుతుంది.. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌కు అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణుల సలహాలు, సూచనలు..

Bavithaజేఈఈ-అడ్వాన్స్‌డ్ 2014 కూడా గతేడాది మాదిరిగానే ఉండొచ్చు. కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కాబట్టి విద్యార్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆఫ్‌లైన్ (పేపర్-పెన్సిల్) విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. వీటిల్లో నాలుగు రకాల ప్రశ్నలిస్తారు. ప్రతి పేపర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి పేపర్‌కు సమయం మూడు గంటలు. ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది.

మ్యాథమెటిక్స్!
  • గత నాలుగు-ఐదేళ్ల ప్రశ్నపత్రాలను గమనిస్తే ఎక్కువ శాతం ప్రశ్నలు అల్జీబ్రా, కాలిక్యులస్ నుంచి వచ్చాయని చెప్పొచ్చు. వీటిల్లో అధిక శాతం ప్రశ్నలు మిక్స్‌డ్ కాన్సెప్ట్ ఆధారితం.
  • గతేడాది అడ్వాన్స్‌డ్‌లో పేపర్-1, పేపర్-2లలో అల్జీబ్రా నుంచి అత్యధిక ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నల క్లిష్టత విషయానికొస్తే.. పేపర్-1లో 25 శాతం ప్రశ్నలు సులభంగా, 50 శాతం ప్రశ్నలు మధ్యస్తంగా, 25 కష్టమైనవిగా ఉన్నాయి. పేపర్-2లో 50 నుంచి 60 శాతం ప్రశ్నలు సులభంగా ఇచ్చారు.
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావాలంటే.. జేఈఈ-మెయిన్‌లో అర్హత సాధించాలి. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు నెలల సమయాన్ని ఇంటర్మీడియెట్ పరీక్షలతోపాటు జేఈఈ-మెయిన్ ప్రిపరేషన్‌కు వెచ్చించాలి. ఆ తర్వాత ఉండే 40 నుంచి 50 రోజుల సమయాన్ని అడ్వాన్‌్ండ్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
  • పేపర్-1,పేపర్-2లలో కలిపి ప్రొబబిలిటీ, కాంప్లెక్స్ నంబర్స్, లిమిట్స్ అండ్ డిఫరెన్షియన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టర్ అల్జీబ్రా, 3డీ జ్యామెట్రీ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని చెప్పొచ్చు. డిఫరెన్షియల్ ఇంటిగ్రల్, సర్కిల్స్, 3డి స్ట్రైట్ లైన్స్, మాక్సిమ-మినిమ, ఏరియాస్ నుంచి కూడా ప్రశ్నలు రావచ్చు. ప్లేన్, వెక్టర్ అల్జీబ్రా, పారాబొలా, సర్కిల్స్ నుంచి అడుగుతున్న ప్రశ్నలు సులభంగా ఉంటున్నాయి. డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్, ప్రొబబిలిటీ, కాంప్లెక్స్ నంబర్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి అడిగే ప్రశ్నలను క్లిష్టంగా రూపొందిస్తున్నారు.
  • 11,12వ తరగతుల నుంచి సమాన వెయిటేజీలో ప్రశ్నలు ఇస్తున్నారు.
  • ఇటువంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కాన్సెప్ట్స్ (మూల భావనలు)పై పట్టు ఏర్పర్చుకోవాలి.
  • ఇప్పటికే మొదటి, రెండో సంవత్సరానికి పునశ్చరణ (రివిజన్) పూర్తి చేసి ఉంటారు. కాబట్టి ఫిబ్రవరి 20 వరకు ఇంటర్ సెకండియర్ టాపిక్స్‌పై దృష్టి పెట్టాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి వివిధ ఫార్ములాలు-ఉపయోగాలపై అవగాహన పెంచుకోవాలి. జేఈఈ-మెయిన్ గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
  • మరో కీలక విషయం అన్ని చాప్టర్లను ప్రిపేర్ కావడం కంటే 80 శాతం చాప్టర్లను 100 శాతం (సంపూర్ణంగా) ప్రిపేర్ కావడం ప్రయోజనకరం.
  • చాలా మంది విద్యార్థులు చాప్టర్, యూనిట్‌ల వారీగా వివిధ రకాల పుస్తకాలను చదువుతుంటారు. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. కాబట్టి ఏదో ఒక ప్రామాణిక పుస్తకాన్ని సంపూర్ణంగా చదవడమే ప్రయోజనం.
-ఎం.ఎన్.రావు,

ఫిజిక్స్
  • జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ సాధనలో ఫిజిక్స్ సబ్జెక్ట్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. మ్యాథమెటిక్స్‌లో చురుగ్గా ఉన్న విద్యార్థులు ఫిజిక్స్‌లో రాణించడానికి మంచి అవకాశం ఉంటుంది.
  • సాధారణంగా ఫిజిక్స్‌లో అడిగే ప్రశ్నలు నేరుగా, మెమొరీ బేస్డ్ కాకుండా వివిధ కాన్సెప్ట్‌ల ఆధారంగా ఉంటాయి. అదే సమయంలో కొంచెం తికమక(ట్విస్ట్) పెట్టేలా అడుగుతా రు. కాబట్టి సిలబస్‌లో ఒక్క చిన్న అంశాన్ని కూడా వదిలివేయకుండా కాన్సెప్ట్ బేస్డ్‌గా ప్రిపరేషన్ సాగించినప్పుడే ఈ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుంది.
  • సాధారణంగా విద్యార్థులు ఫిజిక్స్‌లో మోడ్రన్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్ అంశాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ అంశాలకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటారు. కానీ గతేడాది అడ్వాన్స్‌డ్‌లో మోడ్రన్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్ అంశాలకు అధిక ప్రాధాన్యత లభించింది.
  • జేఈఈ సిలబస్‌ను పూర్తి చేయడానికి చక్కని మార్గం.. ఉమ్మడి భావనలు (కామన్ కాన్సెప్ట్) ఉన్న అంశాలను ఒకే సమయంలో ప్రిపేర్ కావడం. ఉదాహరణకు గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నో స్టాటిస్టిక్స్; కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ ట్రాన్స్‌ఫర్, ఫ్లూయిడ్ డైనమిక్స్; సౌండ్ వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, సూపర్ పొజీషన్ ప్రిన్సిపల్, సింపుల్ హార్మోనిక్ మోషన్; మెకానిక్స్; మోడ్రన్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్; థర్మోడైనమిక్స్; ఎలాస్టిసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్; ఎలక్ట్రోమాగ్నటిజం.
  • ఫిజిక్స్‌లో క్లిష్టంగా భావించే అంశాలను సులభంగా ప్రిపేర్ కావడానికి: థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్‌లలో కొన్ని అంశాలు ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కామన్‌గా ఉంటాయి. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌ను దృష్టిలోని ఉంచుకుని ఈ అంశాలను ప్రిపేర్ కావడం ఉత్తమం.
  • ఆప్టిక్స్ విషయానికొస్తే.. ముందుగా వేవ్ టాపిక్స్‌ను పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే దీని పరిధి స్వల్పంగా ఉండడంతోపాటు త్వరగా పూర్తి చేయవచ్చు. తర్వాత జీయోమెట్రికల్ ఆప్టిక్స్‌ను ప్రిపేర్ కావాలి.
  • వేవ్స్‌లో ట్రాన్స్‌వర్స్ వేవ్స్, సౌండ్ వేవ్స్‌కు వెయిటేజీ సమంగా ఉంటుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫిజికల్ ఆప్టిక్స్, ఎల్‌సీ ఆసిలేషన్స్, ఏసీ సర్క్యూట్స్‌లలోని మ్యాథమెటికల్ పార్ట్ ప్రిపేర్ కావడం ఉపయుక్తం.
  • గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నటిజంలలో కూడా టాపిక్స్ కామన్‌గా ఉంటాయి. ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్‌లో కొద్దిపాటి తేడా ఉంటుంది. కూలుంబ్స్ లా.. న్యూటన్స్ గ్రా విటేషన్ లాగా మారుతుంది. గాస్ లాను గ్రావిటేషన్ ఫీల్డ్ ఎవల్యూషన్‌లోనూ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం అంశాలను ఒక్కటిగా చదువుకోవచ్చు.
  • ఫిజిక్స్‌లో సాధారణంగా ఒక అంశానికి మరొక అంశానికి సంబంధం ఉండే మిక్స్‌డ్ కాన్సెప్ట్ ప్రశ్నలను ఎక్కువగా అడుగుతుంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఒక అంశంతో సంబంధం ఉండే అన్ని అంశాలను ప్రిపేర్ కావాలి. ఇందుకు అన్ని అంశాలకు ఆధారంగా ఉండే ఒక మూలాధార సూత్రాన్ని రూపొందించుకోవాలి. దీన్ని అవసరమైన చోట్ల అన్వయం చేసుకుంటూపోవడం ప్రిపరేషన్‌లో ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు మెకానిక్స్‌లో అధిక శాతం సమస్యలు లీనియర్ మూవ్‌మెంటమ్, ఎనర్జీ, యాంగ్యులర్ మూవ్‌మెంటమ్, న్యూటన్ సెకండ్ లాకు సంబంధించినవై ఉంటాయి.
-డా॥సి.హెచ్. రామకృష్ణ,
డాక్టర్ ఆర్‌కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్.

కెమిస్ట్రీ
కెమిస్ట్రీకి సంబంధించి సిలబస్‌ను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి.. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. సిలబస్‌ను మూడు విభాగాలకు పేర్కొన్నా.. ఆ మూడు విభాగాలకు అంతర్గత సంబంధం (ఇంటర్ కనెక్టెడ్) ఉంటుంది. ఉదాహరణకు రిడాక్స్ రియాక్షన్స్ మీద పట్టు.. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రిపరేషన్, ప్రాపర్టీస్‌లో ఉపయోగపడుతుంది. గత పోటీ పరీక్షలను పరిశీలిస్తే.. ఈ మూడు విభాగాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక అంశంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం సహేతుకం కాదు.
  • కీలక చాప్టర్లు: పీరియాడిక్ టేబుల్; కెమికల్ బాండింగ్; మోల్ కాన్సెప్ట్ (కాన్సన్‌ట్రేషన్స్ కలిపి); రిడాక్స్ రియాక్షన్స్; క్వాలిటేటివ్ అనాలిసిస్; జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ.
    ఈ చాపర్ట్‌లపై పట్టు.. మిగతా చాప్టర్లను కూలంకశంగా ప్రిపేరయ్యేందుకు దోహదపడుతుంది. కీలకమైన చాప్టర్.. పీరియాడిక్ టేబుల్. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఈ అధ్యాయం లేనప్పటికీ.. దీన్ని అవగాహన చేసుకోకుండా కెమిస్ట్రీలోని మిగతా అంశాలను అర్థం చేసుకోవడం కష్టం.
  • ఫిజికల్ కెమిస్ట్రీ: ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు, ఇచ్చిన సమస్య ప్రకారం సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్ సాగించాలి. నేర్చుకున్న సూత్రాలను నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి. వీటిని విభిన్న పద్ధతుల్లో ఏవిధంగా అన్వయం చేసుకోవచ్చో పరిశీలించాలి. ఒక టాపిక్ పూర్తయిన వెంటనే.. దానికి సంబంధించి వివిధ పుస్తకాల్లో ఉన్న విభిన్న రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టాపిక్‌కు సంబంధించి కనీసం మూడు ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీ: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగానికి సంబంధించి సులువుగా సమాధానం గుర్తించగల స్టీరియో ఐసోమరిజమ్ తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగానికి సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టుతోపాటు విస్తృత స్థాయిలో ప్రిపేర్ కావడం అనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. ఇందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్ చాలా కీలకమైంది. ఈ అంశంపై పట్టు సాధిస్తే.. మిగతా అంశాలను అవగాహన చేసుకోవడం ఏమంత కష్టం కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కీలక అంశం.. చదవడమేకాకుండా ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందులో మెరుగైన స్కోర్‌కు: చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, కావల్సిన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. రోజూ ఒక టాపిక్‌లోని కన్జర్వేషన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్‌లో సబ్జెక్టివ్ వ ర్క్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనివ్వాలి.
  • ఇనార్గానిక్ కెమిస్ట్రీ: కెమిస్ట్రీలో.. ఇనార్గానిక్ కెమిస్ట్రీ పరిధి విస్తృతం. కాబట్టి అధిక శాతం మంది విద్యార్థులు ఈ అంశాన్ని కష్టమైందిగా భావిస్తారు. వాస్తవానికి పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగం నుంచి కాన్సెప్ట్ బేస్డ్ (ప్రాథమిక భావనల ఆధారంగా), స్ట్రక్చర్స్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాకుండా కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత పెరిగింది. ఈ అంశంపై తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ నేరుగా (స్ట్రయిట్ ఫార్వర్డ్ కొశ్చన్స్)నే ఉండడం గమనించాల్సిన అంశం. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి మెటలర్జీ, ట్రాన్సిస్టన్ ఎలిమెంట్స్, ఎస్-బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కీలక అంశాలు. ఇందులో మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి: నిర్దేశించిన సిలబస్‌ను అనుసరిస్తూ.. రిప్రెజెంటేటివ్ ఎలిమెంట్స్‌కు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి. కోఆర్డినేట్ కాంపౌండ్స్‌కు ఎక్కువ సమయం వెచ్చించాలి. మెటలర్జీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్‌కు సంబంధించి ఫ్లో చార్ట్స్ రూపొందించుకోవడం మంచిది. ప్రిపరేషన్‌లో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కనీసం రోజుకు ఒక గంటైనా కేటాయించాలి.
-పి. విజయ కిశోర్,
డాక్టర్ ఆర్‌కేస్ ఐఐటీ అకాడెమీ, హైదరాబాద్.
Bavitha
Published date : 06 Feb 2014 03:06PM

Photo Stories