Skip to main content

ఇంజనీరింగ్‌లో విజయానికి 10 మెట్లు

రాష్ట్రంలో మరి కొన్ని రోజుల్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.. వివిధ పరిమితులు, పర్యవేక్షణల మధ్య ఇంటర్మీడియెట్‌లో రెండేళ్లపాటు అహర్నిశలు శ్రమించి.. ఇంజనీరింగ్ కోర్సులో అడుగు పెట్టిన విద్యార్థి.. భావి కెరీర్ కు పునాదిగా నిలిచేది.. ఈ మొదటి సంవత్సరమే.. అకడమిక్ పరిజ్ఞానంతోపాటు.. నైపుణ్యాలకు పెద్ద పీట వేస్తున్న ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే.. అందుకు తగ్గట్టుగా సన్నాహాలను కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే మొదలు పెట్టాలి.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్..

ఇంజనీరింగ్‌లో ఎందుకు చేరాం? నాలుగేళ్ల తర్వాత ఏం చేయాలి? అందుకు ఎలా సిద్ధం కావాలి? ఇప్పట్నుంచే ఎలా చదవాలి?.. ఇలా ప్రతి విద్యార్థి తనకు తాను ప్రశ్నించుకోవాలి. ఉన్నత విద్య లేదా ఉద్యోగం.. లక్ష్యమేదైనా స్పష్టంగా ఉండాలి. అది స్పష్టంగా ఉంటే తాము నాలుగేళ్ల కోర్సులో అకడమిక్‌గా చదవాల్సిన విధానంపై అవగాహన ఏర్పడుతుంది.

  1. స్వీయ ప్రిపరేషన్:
    ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రధానంగా గమనించాల్సిన అంశం.. ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్ కోర్సుల మధ్య తేడా. ఇంటర్‌లో స్పూన్ ఫీడింగ్ ఉంటుంది. లెక్చరర్లు నోట్స్ ఇస్తూ.. ఏం చదవాలి? ఏయే పుస్తకాలు రిఫర్ చేయాలి? వివరిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. కానీ ఇంజనీరింగ్‌లో దీనికి భిన్నమైన వాతావరణం ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందుకనుగుణంగా విద్యార్థి తన దృక్పథాన్ని మార్చుకోవాలి. స్వీయ ప్రిపరేషన్ (సెల్ఫ్ లెర్నింగ్ మోడ్)ను అలవర్చుకోవాలి. లెక్చరర్ అన్నీ చెప్పాలి అనే ధోరణి నుంచి బయటికి రావాలి. లెక్చరర్స్ కొంత వరకే గైడ్ చేయగలరు. కాబట్టి విద్యార్థుల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. లెక్చరర్ చెప్పిన అంశాలను ఏవిధంగా అన్వయించవచ్చో స్వతహాగా తెలుసుకోవాలి. అప్పుడే సబ్జెక్ట్‌పై పట్టు వస్తుంది. ఇంజనీరింగ్‌లో విద్యార్థి ప్రధానంగా పెంపొందించుకోవాల్సిన మరో లక్షణం.. ప్రశ్నించే తత్వం, క్రిటికల్ థింకింగ్. ఒక అంశంపై వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడూ లెక్చరర్లు, సీనియర్ల సహాయంతో నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి.
  2. 100 శాతం హాజరు:
    పతి రోజూ తరగతులకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రతి రోజు ఏడు పీరియడ్‌లు.. ఏడు సబ్జెక్ట్‌లు.. షెడ్యూల్ ఇలా రిపీట్ అవుతుంటుంది. వారాంతంలో ల్యాబ్ రికార్డు రాయాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ ఒక్క క్లాస్‌ను కూడా విస్మరించకుండా హాజరు కావడానికి ప్రయత్నించాలి. ఒక్క క్లాస్ మిస్ అయినా మరుసటి రోజు సబ్జెక్ట్ కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి 100 శాతం హాజరు ఉండేలా చూసుకోవడం ఉత్తమం. నూతన వాతావరణంలో సహజంగానే తలెత్తే బిడియం.. కొత్త స్నేహాలకు ప్రభావితమయ్యే వయసు. ఈ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు క్లాసులకు బంక్ కొట్టడానికే మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో స్నేహితులతోపాటు అకడమిక్ కార్యకలాపాలకు సమప్రాధాన్యత ఇస్తూ రెండు అంశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి.
  3. ప్రభావవంతంగా లైబ్రరీ:
    మరో కీలక అంశం.. నోట్స్ ప్రిపరేషన్. ఈ విషయంలో లైబ్రరీని ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ప్రతి రోజూ షెడ్యూల్‌లో లైబ్రరీ కోసం కొంత సమయాన్ని తప్పకుండా వెచ్చించాలి. నోట్స్ ప్రిపరేషన్ కోసం ఆయా పుస్తకాల్లో సబ్జెక్ట్‌కు సంబంధించి మూలభావనల (కాన్సెప్ట్)ను వర్ణించిన తీరు, భాష సులభంగా ఉన్న ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావడంతో ఏయే పుస్తకాలను అధ్యయనం చేయాలి? అనే విషయంలో స్పష్టత వస్తుంది. ఆయా పుస్తకాల్లోని అంశాలను పాయింట్స్ రూపంలో నోట్ చేసుకోవాలి. ఇంటర్నెట్, ఆన్‌లైన్ బ్లాగ్స్‌ను కూడా నోట్స్ ప్రిపరేషన్‌లో ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. కొంత మంది విద్యార్థులు ఎగ్జామ్స్ సమయంలో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సిద్ధమవుతారు. అది సరికాదు. క్లాస్ పూర్తవగానే ఏ రోజు నోట్స్ ఆ రోజు ప్రిపేర్ చేసుకోవాలి.
  4. రిఫరెన్స్ ఫర్ నాలెడ్జ్:
    ఇంటర్మీడియెట్‌లో లెక్చరర్లు సూచించిన కొన్ని పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు. కానీ ఇంజనీరింగ్‌లో అలా ఉండదు. ఒక అంశానికి సంబంధించి అందుబాటులో ఉన్న సాధ్యమైనంత ఎక్కువ పుస్తకాలను రిఫర్ చేయాలి. పరీక్షల దృక్కోణంలో అయితే.. ఒక పుస్తకం సరిపోతుంది. కానీ ఇంజనీరింగ్ కోర్సును పరీక్షల దృష్ట్యా చూడడమనేది ఒక స్వల్పకాలిక లక్ష్యం (షార్ట్‌టర్మ్ గోల్) మాత్రమే. కెరీర్ దృష్ట్యా దీర్ఘకాలిక లక్ష్యాలకు (లాంగ్ టర్మ్ గోల్స్)కు ప్రాధాన్యతనివ్వాలి. కాబట్టి విస్తృత జ్ఞానాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచించాలి. ఇందుకోసం ఐదారు పుస్తకాలను రిఫర్ చేయడం మంచిది. ఒక అంశానికి సంబంధించి ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలు అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు.. ఆయా పుస్తకాలను చదువుతూ.. వాటిలో వేర్వేరుగా ఉన్న అంశాలు లేదా ఒకే సమస్యకు సంబంధించి వేర్వేరుగా ఉన్న విధానాలను నోట్స్‌లు, పాయింటర్ల రూపంలో అమర్చుకోవాలి.
  5. అండగా ఆన్‌లైన్:
    పస్తుత టెక్నాలజీ యుగంలో విస్తృత స్థాయిలో జ్ఞానార్జనకు చక్కని సాధనం ఈ-లెర్నింగ్. ఈ మాధ్యమాన్ని ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ఈక్రమంలో ఎన్‌పీటీఈఎల్ (nptel.iitm.ac.in), ఎంఐటీ ఓపెన్ కోర్‌‌స వేర్ (ocw.mit.edu) వంటి ఆన్‌లైన్ సోర్సెస్‌ను సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఐఐటీ-ఖరగ్‌పూర్ లైబ్రరీ (www. library. iitkgp.ernet.in), ఐఐటీ ప్రొఫెసర్ల లెక్చర్స్‌తో పొందు పరిచిన ఫ్రీ వీడియో లెక్చర్స్(freevideolectures.com), ఐఐటీ వీడియోస్ (iitvideos. blog. com), ఇంజనీరింగ్ ట్యూబ్ (www.engineeringtube.net), యూట్యూబ్, లెర్నర్స్‌టీవీ (www. learnerstv.com) తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న వీడియో పాఠాల ద్వారా కూడా విస్తృత స్థాయి అవగాహనను పొందొచ్చు. ఈ సదుపాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన అధ్యాపకుల బోధనలు వినే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
  6. రోజూ రెండు గంటలు:
    కాలేజీ పూర్తయిన తర్వాత ప్రతి రోజూ రెండు గంటలు ప్రిపరేషన్ కోసం తప్పకుండా కేటాయించాలి. ఎంసెట్‌లో మంచి ర్యాంకు కోసం ఇంటర్‌లో ఎలా శ్రమించారో.. ఇప్పుడు ఇంజనీరింగ్‌లో చేరాక కూడా అంతకు మించి కష్టపడాలి. కాబట్టి ఏ రోజు సబ్జెక్ట్‌ను ఆ రోజు చదవాలి. అంతేకాకుండా ఇంజనీరింగ్ నాలుగేళ్ల కోర్సులో మొదటి సంవత్సరంలోనే సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో విద్యార్థులు అధికంగా శ్రమించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇంటర్ మాదిరిగా వ్యక్తిగతంగా నేర్చుకునే పద్ధతి (ఐఛీజీఠిజీఛీఠ్చ ్ఛ్చటజీజ) సరిపోదు. ఈ విషయాన్ని గమనించి గ్రూప్ లెర్నింగ్, కంబైండ్ స్టడీస్ అలవర్చుకోవాలి.
  7. తొలి రోజు నుంచే:
    జాబ్ మార్కెట్ ఆశిస్తున్న విధంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మొదటి సంవత్సరం తొలి రోజు నుంచే ఈ అంశాలపై దృష్టి సారించాలి. ఈ క్రమంలో గ్రూప్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి. బిడియం పోవడానికి గ్రూప్ మూవింగ్ ఓ చక్కటి ప్రత్యామ్నాయం. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ఉత్సాహంగా పాల్గొనాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం, లీడర్‌షిప్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి. గ్రూప్ డిస్కషన్, టీమ్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవచ్చు. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్పంచుకోవడం వల్ల మెదడు చురుకుదనంతోపాటు, టైమ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు కూడా ఆస్కారం లభిస్తుంది. వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. చదువుతున్న బ్రాంచ్‌లో కాలానుగుణంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. విజయంతో నిమిత్తం లేకుండా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలకు హాజరుకావాలి. తద్వారా చక్కటి పరిజ్ఞానం అలవడుతుంది.
  8. కీలకం ల్యాబ్ సెషన్స్:
    ఇంజనీరింగ్ అప్లికేషన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ఇక్కడ ఒక సూత్రాన్ని నేర్చుకుంటే దాన్ని ఏ విధంగా అన్వయించాలి? అనే అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు పెద్ద పీట వేస్తారు. కాబట్టి నిరంతరం ప్రయోగాలు చేస్తూ.. ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఈ క్రమంలో లేబొరేటరీలది కీలక పాత్ర అని చెప్పొచ్చు. కాబట్టి ల్యాబ్ సెషన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడంతోపాటు సంబంధిత బ్రాంచ్‌లో ప్రాథమిక భావనల (బేసిక్స్)ను నేర్చుకోవడానికి ఈ ల్యాబ్ సెషన్స్ ఎంతో దోహదం చేస్తాయి. సబ్జెక్ట్‌కు సంబంధించి ఒక ఫార్ములా.. ఏ విధంగా వస్తుంది? దాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి? అనే అంశాలను ఆలోచనా, సృజనాత్మకత, ఊహాత్మక శక్తి వంటి స్కిల్స్‌ను ఉపయోగించి.. థియరీ, ప్రాక్టికల్‌ను ల్యాబ్ ద్వారా కో-రిలేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నేర్చుకునే నాలెడ్జ్ ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. ఇక్కడ మరో అంశాన్ని గమనించాలి. ల్యాబ్‌లో ముగ్గురు-నలుగురు విద్యార్థులు కలిసి ఒక ప్రయోగాన్ని చేస్తారు. తద్వారా జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. తర్వాత ఇంజనీరింగ్‌లో కెరీర్‌కు ఈ నైపుణ్యం ఎంతో దోహదం చేస్తుంది.
  9. ఇంగ్లిష్ మస్ట్:
    పస్తుత జాబ్ మార్కెట్ డిమాండ్ మేరకు ఉద్యోగ సాధనలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం.. ఇంగ్లిష్ కమ్యూనికేషన్. కాబట్టి ఇంగ్లిష్‌కు సంబంధించి అకడమిక్ తరగతులను ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్ష్యం చేయకూడదు. టీచర్లు నిర్వహించే ల్యాబ్ సెషన్‌లు, అసైన్‌మెంట్స్‌ను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత లాభం పొందుతారు. చాలా కాలేజీల్లో ప్రొనౌన్సియేషన్‌కు సంబంధించి ఫొనెటిక్స్ సాఫ్ట్‌వేర్ కూడా అందుబాటులో ఉంది. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా పదాలను ఏ విధంగా పలకాలనే అంశంపై స్పష్టమైన అవగాహన పొందొచ్చు. ప్రొనౌన్సియేషన్ ప్రభావవంతంగా ఉన్నప్పుడే చక్కని ఇంగ్లిష్ మాట్లాడే అవకాశం ఏర్పడుతుంది. ఇంగ్లిష్ కమ్యూనికేషన్‌లో చదవడం, వినడం, రాయడం, మాట్లాడటం.. నాలుగు స్తంభాల వంటివి. కాబట్టి విద్యార్థులు ఈ నాలుగు అంశాలను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రముఖ ఆంగ్ల దిన, వార పత్రికలు చదవడం, ఇంగ్లిష్ న్యూస్ చానల్స్ చూస్తూ వినడం ద్వారా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు. అంతేకాకుండా కాలేజీ ఈవెంట్స్, చర్చల్లో పాల్గొంటూ.. మాట్లాడే నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నించాలి.
  10. టార్గెట్.. డిస్టింక్షన్:
    ఇంజనీరింగ్ మొదటి ఏడాది చాలా కీలకమైంది. ఎందుకంటే వచ్చే మూడేళ్లకు ఇదే పునాది. మొదటి సంవత్సరంలో ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేకుండా 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఇంజనీరింగ్ కోర్సును 40 శాతం పూర్తి చేసినట్లే. ప్రస్తుత జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేని విద్యార్థులకు మాత్రమే కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాక్‌లాగ్స్ ఉంటే.. కనీసం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో కూడా డిస్టింక్షన్ అభ్యర్థులకే అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మొదటి సంవత్సరం నుంచి ఏ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను ఆ సంవత్సరంలోనే మొదటి ప్రయత్నంలో పూర్తి చేయాలి. విద్యార్థులు కేవలం కనీస ఉత్తీర్ణత ఆలోచనకు స్వస్తి పలికి.. డిస్టింక్షన్‌లో పాస్ కావడానికి ప్రయత్నించాలి. 80 నుంచి 85 శాతం మార్కులు సాధించాలి.
విద్యార్థుల మీదే బాధ్యత ఎక్కువ
ఇంటర్మీడియెట్ వరకు కేవలం సబ్జెక్ట్ సంబంధిత విషయాలను మాత్రమే చదువుకుంటారు. ఇంజనీరింగ్‌లో మాత్రం ఆ ప్రిన్సిపల్స్‌ను ఏ విధంగా అన్వయించవచ్చు, అవి ఎప్పటి నుంచి మొదలయ్యాయి.. ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి వంటి అంశాలు ఉంటాయి. ఇంజనీరింగ్‌లో లెక్చరర్ల పాత్ర పరిమితంగా ఉంటుంది. తరగతిలో బోధనకు మాత్రమే పరిమితం అవుతారు. ఆ సబ్జెక్ట్‌పై మరింత అవగాహన కోసం లైబ్రరీ, ఇంటర్నెట్ సోర్సెస్ ద్వారా విద్యార్థులు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థుల మీదే బాధ్యత ఎక్కువ. చాలా మంది ఇంజనీరింగ్ కోర్సులో చేరగానే రిలాక్స్ అవడానికి ప్రయత్నిస్తారు. కానీ అది సరికాదు. ఇంటర్మీడియెట్ వరకు చేసిన హార్‌‌డవర్క్‌లో కనీసం 40 శాతాన్ని ఇంజనీరింగ్‌లో కొనసాగిస్తే టాపర్‌గా నిలిచే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. మరో కీలక అంశం.. ఇంగ్లిష్ కమ్యూనికేషన్. ఇంజనీరింగ్‌లో మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు ప్రభావవంతంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇంగ్లిష్‌లో స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలను సాధించే విధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఏదైనా అంశంపై స్పష్టతతో ఉండాలి. ఇందుకోసం డెసిషన్ మేకింగ్ స్కిల్స్‌పై దృష్టిసారించాలి. ఏ పనిని ఎప్పుడు పూర్తిచేయాలో పక్కా ప్రణాళికతో వ్యవహరించేలా టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ పెంచుకోవాలి.
Bavitha
Published date : 20 Sep 2013 04:00PM

Photo Stories