Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఊరట.. జీతం పెరగకపోయినా ఆదాయం పెంచుకోవచ్చు! చిట్కా చెప్పిన కంపెనీ సీఎంఓ
ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పెంచడం లేదని మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించింది. సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా ఉద్యోగులకు సమాచారం అందించారు. దీనిపై కంపెనీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని కంపెనీ సీఎంఓ సూచించారు.
ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రిస్ కాపోస్సేలా ఇటీవల సందేశాలు పంపినట్లు ఫార్చూన్ పత్రిక పేర్కొంది. కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఎందుకు పెంచలేదో ఆ లేఖలో ఆయన వివరించారు. అలాగే ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని సూచించారు. కంపెనీ స్టాక్ ధర పెరిగితే.. ఉద్యోగులకు అందే పరిహారం కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుందని, ప్రతిఒక్కరూ స్టాక్ ధర పెరిగేలా పనిచేయాలని సూచించారు.
ఈ ఏడాది కంపెనీ షేరు విలువ ఇప్పటికే 33 శాతం పెరిగినట్లు ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కంపెనీని అనుకూలంగా ఉంచే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు, మానవ వనురుల పెంపు, డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడానికి కట్టుబడి ఉందని క్రిస్ కాపోస్సేలా పేర్కొన్నారు.