Skip to main content

ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్-2012

ఇంజనీరింగ్ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ కంపెనీలు, లేదంటే నిర్మాణరంగ కంపెనీల్లో ఉద్యోగాలేనా.. అంతకుమించి సవాళ్లతో కూడుకుని, అత్యున్నత గౌరవం, హోదాతో కెరీర్లో వేగంగా ఎదగడానికి అవకాశం లేదా? అంటే సమాధానం... ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్). కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో పనిచేయడానికి యూపీఎస్సీ ప్రత్యేకంగా ఐఈఎస్‌ను నిర్వహిస్తోంది. బీటెక్ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధిస్తే తక్కువ కాలంలోనే కెరీర్లో అత్యున్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంది.

మొత్తం ఖాళీలు: 560
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీటెక్/బీఈ ఉత్తీర్ణత.
వయోపరిమితి: జనవరి 1, 2012 నాటికి 21 ఏళ్లు నిండి ఉండి 30 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఉద్యోగాలిక్కడ...
  • ఇండియన్ రైల్వే సర్వీస్
  • సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్
  • ఇండియన్ డిఫెన్స్ సర్వీస్
  • ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్
  • సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్
  • నేవల్ ఆర్మమెంట్ సర్వీస్
  • జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
  • ఇండియన్ సప్లై సర్వీస్
  • ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్
  • టెలీకమ్యూనికేషన్ సర్వీస్ మొదలైనవి.
పరీక్ష విధానం:
రాత పరీక్షకు మొత్తం 1000 మార్కులుంటాయి. ఇందులో రెండు విభాగాలుంటాయి. అవి.. సెక్షన్-1, సెక్షన్-2.

సెక్షన్-1:
ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రధానంగా రెండు సెక్షన్లుంటాయి. మొదటి సెక్షన్‌లో జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్) ఉంటుంది. ఈ పరీక్షకు కాలవ్యవధి రెండు గంటలు. మార్కులు 200. ఇదేవిభాగంలో అభ్యర్థి ఎంచుకున్న ఇంజనీరింగ్ సబ్జెక్టు (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఏదొకటి నుంచి రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ఒక్కో పేపర్‌కు 200మార్కులు. ఈ విభాగంలో జరిగే అన్ని పేపర్లకు..గుర్తించిన తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. సెక్షన్-1లో కటాఫ్ మార్కులు సాధిస్తేనే.. సెక్షన్-2 ప్రశ్నపత్రం మూల్యాంకనం చేస్తారు.

సెక్షన్-2:
ఇది కన్వెన్షనల్ విభాగం. ఇందులో అభ్యర్థి ఎంచుకున్న ఇంజనీరింగ్ సబ్జెక్టు (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్)పై రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. ఒక్కో పేపర్‌కు 3 గంటల వ్యవధిలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ:
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. దీనికి 200 మార్కులుంటాయి.
పరీక్ష.. సిలబస్: అభ్యర్థులు పరీక్షకు బీటెక్ స్థాయిలో సిద్ధం కావాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్‌లో ప్రధానంగా అభ్యర్థి ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్‌లో కరెంట్ అఫైర్స్‌కుసంబంధించి, భారతదేశ చరిత్ర, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలడుగుతారు. సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులైతే వారికి ప్రధానంగా సాలిడ్ మెకానిక్స్, డిజైన్ ఆఫ్ స్టీల్‌స్ట్రక్చర్, కన్‌స్ట్రక్షన్ ప్రాక్టికల్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, హైడ్రాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మో డైనమిక్స్, ఫ్లూయిడ్ మెషినరీ, స్ట్రీమ్ జనరేటర్స్, హీట్ ట్రాన్స్‌ఫర్ అండ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనింగ్..ఎలక్ట్రికల్ బ్రాంచ్ అభ్యర్థులకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ మెటీరియల్స్, కంట్రోల్ సిస్టం, పవర్‌సిస్టం, కమ్యూనికేషన్ సిస్టం, మైక్రోప్రొసీజర్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి.

చక్కని ప్రిపరేషన్‌తో.. సులువుగా విజయం:
ఒక్కో సబ్జెక్టులో సుమారు 20 నుంచి 25 శాతం వరకు ప్రశ్నలపై పెద్దగా ప్రిపరేషన్ లేకుండానే సమాధానాలు రాయొచ్చు. 40 నుంచి 50 శాతం ప్రశ్నలకు కచ్చితంగా ప్రిపరేషన్ ఉండాలి. సంబంధిత బీటెక్/బీఈ పుస్తకాల్లో టాపిక్‌లు చదివి అర్థం చేసుకుంటే చాలు. విజయం సాధించాలంటే అత్యున్నతస్థాయి టాలెంట్ అవసరం లేదని ఈ రంగంలో విజయం సాధించిన సీనియర్లు చెబుతున్నారు. కేవలం ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ చేయడం, ఒకటికి, రెండుసార్లు గత ఐదేళ్ల పాత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేస్తే విజయం సాధించొచ్చు. ఆబ్జెక్టివ్ పేపర్లకు సంబంధించి అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే. బీటెక్ పుస్తకాలను చదివి అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తే డిప్లొమా పుస్తకాలను చదివినా మంచి మార్కులు పొందే అవకాశాలుంటాయి. జనరల్ స్టడీస్ విభాగంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు, ఏదైనా ప్రామాణిక ఇయర్‌బుక్ చదవాలి.

రిఫరెన్స్‌బుక్స్:

  • నెట్‌వర్క్ ఎనాలసిస్-వాన్ వాల్కెన్‌బర్గ్
  • ఐఈఎస్ జనరల్‌స్టడీస్-జీకె
  • ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్-కేఆర్ బాట్కర్
  • డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ డిజైన్-మోరిస్‌మనో
  • కమ్యునికేషన్ సిస్టం-ఊ.బ్రూకార్ల్‌సన్
  • ఆటోమెటిక్ కంట్రోల్ సిస్టం-బెంజ్‌మన్ సి.కౌ

ఐదంకెల వేతనాలు..అత్యుత్తమ కెరీర్:
ఆరంభంలోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా చేరితే 6వ పే కమిషన్ ప్రకారం * 36 వేల జీతం లభిస్తుంది. (బేసిక్ పే 15,600నుంచి 39,100వరకు, గ్రేడ్‌పే 5,400, డీఏ 9,180, హెచ్‌ఆర్‌ఏ 6,300, టీఏ 3,200 వరకు లభిస్తాయి.) ఆరంభంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు, నాలుగేళ్ల అనుభవంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పదోన్నతిని పొంది.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ సెలక్షన్ గ్రేడ్, చీఫ్ ఇంజనీర్ లెవెల్-2కు, 25 ఏళ్ల సర్వీసు ఉంటే చీఫ్ ఇంజనీర్ లెవెల్-1, ఇంజనీర్ ఇన్ ఛీప్ వరకు చేరుకోవచ్చు.

దరఖాస్తు విధానం:
www.upsconline.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మన రాష్ర్టంలో పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2012
పరీక్ష తేదీ: జూన్ 15, 2012

వెబ్‌సైట్: www.upsc.gov.in
Published date : 05 Apr 2012 03:46PM

Photo Stories