Skip to main content

విజయంతో.. ఆనందం ఒక్కటే రాదు!

విజయం.. మూడక్షరాల ఈ పదం.. ప్రతి వ్యక్తికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే విజయం సాధించాక.. అది వ్యక్తులపై చూపే ప్రభావం, సమస్యలు కూడా ఉంటాయి. అవన్నీ స్వయంగా చూసి.. వాటికి అక్షర రూపం ఇవ్వాలనే ఉద్దేశంతో ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పుస్తకం రాశానన్నారు తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్, టూరిజం, యూత్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పుస్తకానికి చక్కని స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో.. ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పుస్తకం రాయడానికి కారణాలు... యువత విజయానికి చేయాల్సిందేమిటి? సక్సెస్‌ను ఆస్వాదించడం.. గెలుపు అనర్థాలు.. తదితర అంశాలపై సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంతో గెస్ట్‌కాలం... ఆయన మాటల్లోనే!!
గెలుపు అనర్థాలు తెలియాలి :
సెల్ఫీ ఆఫ్ సక్సెస్ రాయడానికి ప్రధాన కారణం.. మన చుట్టూ ఉన్న పరిస్థితులే! ఒక లక్ష్యం పెట్టుకొని విజయం సాధించే క్రమంలో అడ్డదారుల్లో వెళ్లడం; మోసాలు; విజయ గర్వంతో కలిగే అనర్థాలు, విజయం దక్కలేదని ఆత్మహత్యలు, మానసిక ఒత్తిడితో కుంగిపోవడం వంటివన్నీ మనం చూస్తున్నాం. ఇప్పటివరకు అందరూ విజయం గురించి, విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి పుస్తకాలు రాశారు. కానీ, విజయం వల్ల కలిగే అనర్థాలను ఎవరూ చర్చించలేదు. అందుకే ఈ పుస్తకంలో గెలుపు అనర్థాలు విభాగం చాలా ప్రత్యేకం అని చెబుతున్నాను. ఈ సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదు. అందుకే పుస్తకం విక్రయాల ద్వారా వచ్చే డబ్బులో ప్రింటింగ్, ఇతర నిర్వహణ ఖర్చులు పోను మిగతా మొత్తాన్ని వృద్ధుల సంక్షే మానికి వినియోగించాలని అనుకున్నా.

పెద్ద లక్ష్యం నిర్దేశించుకున్నా...
కొంతమంది ఉన్నతస్థాయి లక్ష్యాలు నిర్దేశించుకొని వాటికోసం అహర్నిశలు కృషిచేస్తారు. కానీ, ప్రతికూల ఫలితాలు ఎదురైతే నిరుత్సాహంతో కుంగిపోతారు. నేను చెప్పేదేమిటంటే.. ఉన్నతస్థాయి లక్ష్యాలు నిర్దేశించుకోవడం మంచిదే. కానీ, దాన్ని చేరుకునే లోపు అందుబాటులో ఉన్న ఇతర అవకాశాలను చూడాలి. నా విషయాన్నే తీసుకుంటే..ఐఏఎస్ అనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. దానికోసం కృషిచేస్తూనే...ఇతర ప్రయత్నాలు చేశాను. 1989లోనే రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత సివిల్స్‌లో ఐఆర్‌ఎస్(కస్టమ్స్ అండ్ ఎక్సైజ్)కు ఎంపికయ్యా. తర్వాత ఐఏఎస్ సాధించా. ఇలా చేయడం వల్ల మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. మనలోని లోటుపాట్లు కూడా మనకు తెలుస్తాయి, వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్లొచ్చు.

మన ఆశలు పిల్లలపై రుద్దడం మంచిదికాదు..
ప్రస్తుతం మన దేశంలో తల్లిదండ్రులు చేస్తున్న అతిపెద్ద పొరపాటు.. తాము సాధించలేని లక్ష్యాలను పిల్లలపై రుద్దడం!! దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. పిల్లల అభిరుచికి అనుగుణంగా వారిని నడిపించాలి. పిల్లల ఆనందమే తమ లక్ష్యంగా మార్చుకోవాలి తప్ప... తాము గతంలో సాధించలేని లక్ష్యాలను పిల్లలు సాధించాలనుకోవడం అనేక దుష్ర్పభావాలకు దారితీస్తుంది.

కెరీర్ అనే కాదు.. ఇత ర అంశాల పరంగానూ మార్పులు సహజం. దీనికి అనుగుణంగా మనం కూడా మారి అప్‌డేట్ అవుతుంటేనే ఎలాంటి ఆందోళన లేకుండా ముందడుగు వేయగలం.
Published date : 31 Jul 2019 12:43PM

Photo Stories